అందంగా ఉండను... బయటకు వెళ్లలేను... ఎలా?

26 Jul, 2015 01:31 IST|Sakshi
అందంగా ఉండను... బయటకు వెళ్లలేను... ఎలా?

  నేనో గృహిణిని. మావారు ఆఫీసుకి, పిల్లలు స్కూలుకి వెళ్లిపోయిన తర్వాత ఇంట్లో ఖాళీగానే ఉంటాను. దాంతో ఊసుపోక అప్పుడప్పుడూ పక్కింటి వాళ్లతో కబుర్లు చెబుతుంటాను. ఈ మధ్యనే మా పక్కింట్లోకి కొత్తగా ఒక కుటుంబం వచ్చింది. ఆ ఇంటావిడే వచ్చి నన్ను పరిచయం చేసుకుంది. మంచిదానిలాగే ఉంది కదా అని స్నేహం చేశాను. కానీ ఆమె ధోరణి నాకు కాస్త ఇబ్బందిగా ఉంది. మా వ్యక్తిగత విషయాల్లో కూడా జోక్యం చేసుకుంటోంది. మాట తప్పించినా పదే పదే గుచ్చి అడుగుతుంటుంది. అలాగే వాళ్ల ఇంట్లో విషయాలూ నాకు చెబుతుంది. నాకు ఈ రెండూ ఇష్టం లేదు. అలాగని ఆమె చెడ్డదేమీ కాదు. అందుకే స్నేహం చెడగొట్టుకోలేకపోతున్నాను. ఎంతైనా ఇరుగు పొరుగు వాళ్లం కదా? ఆవిడ మనసు బాధపడకుండా ఆమెలో మార్పు ఎలా తీసుకురావాలో తెలియజేయండి.
 - కృష్ణవేణి, రేణిగుంట
 
 ఈ సమస్య మీ ఒక్కరిదే కాదు... చాలామందిది. ‘స్నేహితుల్ని ఎలా చేసుకోవాలి?’ అని డేల్ కార్నీ దగ్గర్నుంచి చాలామంది రాశారు కానీ... ‘ఎలా వదిలించుకోవాలి’ అనే పుస్తకాలు చాలా తక్కువ వచ్చాయి. తెలుగులో అయితే అస్సలు రాలేదు. ముక్తసరిగా మాట్లాడటమనేది ఒక కళ. ఆసక్తిగా వినకుండా ‘ఏదైనా పని ఉంది’ అని తప్పించుకోవచ్చు. బాధలు వినడంలో ఆసక్తి తగ్గించుకోండి. మీరొక జ్ఞానమూర్తిగా ఊహించుకుని సలహాలివ్వడం మానెయ్యండి. ఆమెలో మార్పు తీసుకురావడానికి మీరేమీ ప్రయత్నం చేయక్కర్లేదు. మీరు మారండి. వీలైనంత వరకూ స్నేహాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడి వరకూ ఉంచడానికి ప్రయత్నం చేయండి. ఆమె చెడ్డదేమీ కాదు అన్నారు. మనల్ని బాధపెట్టడానికి అవతలివారు చెడ్డవారు కానవసరం లేదు. ఇద్దరు మంచి వ్యక్తులు కూడా మంచి ఇరుగూ పొరుగూ అవ్వకపోవచ్చు.
 
  నేను నల్లగా పొట్టిగా ఉంటాను. మొహం మీద మచ్చలు. దానికి తోడు కళ్లజోడు. జుట్టు కూడా బాగా ఊడిపోతోంది. బయటకు వెళ్లాలన్నా, అందరితో మాట్లాడాలన్నా ఫ్రీగా ఉండలేకపోతున్నాను. నామీద నాకు అసహ్యం వేస్తోంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏదైనా సలహా ఇవ్వగలరా?
 - నందిత, చేబ్రోలు
 సమస్యలు రెండు రకాలు. మనం అధిగమించగలిగేవి, అధిగమించలేనివి. సమస్యల్ని మర్చిపోవాలి. అధిగమించగలిగిన ఉన్నత స్థానాల్ని చేరుకోవాలి. మీరు జాగ్రత్తగా గమనిస్తే చాలా రంగాల్లో పెద్ద పెద్ద స్థానాలు అలంకరించిన వారందరూ కాస్త అందవిహీనంగానే ఉంటారు. ఆ ఆత్మన్యూనతా భావమే బహుశా వారి వెనుక స్ఫూర్తి. మిమ్మల్ని మీరు ప్రేమించడం మొదలుపెట్టండి. అందంతో కాదు, ఏదైనా కళతో గెలవండి. సచిన్ టెండూల్కర్ పొట్టి. స్టీఫెన్ హాకింగ్ అంగవైకల్యుడు. అయినా కూడా కృషితో, పట్టుదలతో పైకొచ్చారు. అందరిచేతా గుర్తింపబడ్డారు. వారిని ప్రేరణగా తీసుకుంటే మీకంటూ ఒక ప్రపంచం ఏర్పడుతుంది. బెస్టాఫ్ లక్!
 
  ఫలానా రోజు, ఫలానా చోట, ఫలానా నదిలో మునిగితే పుణ్యం వస్తుంది అనే నమ్మకంలో తర్కం ఉందా? దీని మీద మీ అభిప్రాయం ఏమిటి?
 - ప్రహ్లాద్, హైదరాబాద్
 నమ్మకం వేరు, తర్కం వేరు. నలుగురు మనుషులు కూర్చుని ఒక చేదు ద్రవాన్ని తాగుతూ ఇదే ఆనందం అనుకోవడంలో ఏం తర్కం ఉంది? కానీ ఎంతమంది దాన్ని ఆనందిస్తున్నారో తెలుసు కదా! భక్తి కూడా అలాంటిదే. అది ఒక తదాత్మ్యత. అయితే చాలామంది దాన్ని ఆస్వాదించడం, ఆనందించడం మానేసి పాపభయంతో చేయడమే విచారకరం. ఆచారాలు మనిషికి ఏమాత్రం ఆనందాన్ని ఇవ్వవు. కానీ వాటిని పాటించకపోతే మాత్రం ఘోరమైన కష్టాల్లో పడతామనే భయం వాటిని పాటించేలా చేస్తోంది. అదే నిజం కాకపోతే పుణ్యక్షేత్రాలు దర్శించినవారు, పుణ్యనదుల్లో స్నానం చేసినవారు చాలా సంతోషంగా, ఒక రకమైన అలౌకిక ఆనందంలో ఉండాలి. కానీ ఉండరు. మొక్కు తీర్చకపోతే మాత్రం వచ్చిన ప్రతి కష్టాన్నీ దానికి ఆపాదించుకుంటారు. అంతవరకూ సరేగానీ తమ మొక్కుల కోసం పసిపిల్లల్ని కూడా ఆ కష్టాల్లో ఇరికించడం... ఆ ఒత్తిడికీ, కష్టాలకీ గురి చేయడాన్ని మాత్రం భగవంతుడనేవాడుంటే అతడు కూడా క్షమించడు.

 

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా