విజయం: గెలవడమూ, గెలిపించడమూ తెలుసు!

29 Sep, 2013 01:05 IST|Sakshi
విజయం: గెలవడమూ, గెలిపించడమూ తెలుసు!

ప్రకాష్ చంద్ర ముర్ము.. ఈ కుర్రాడికి స్కూలుకెళ్లి చదువుకోవడమే ఓ కల. అలాంటిది అతనికి చదువుతో పాటు.. లండన్‌కు వెళ్లి రగ్బీ ఆడే అవకాశం కూడా దక్కింది. స్కూలు చదువైనా పూర్తి చేస్తానా అని అనుమానమున్న సీమా హన్స్‌డా ఎంబీబీఎస్ చదువుతోంది. సౌదాగర్ హన్స్‌డా లా చేస్తున్నాడు. సంజుక్త రాణి హెంబ్రమ్ ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేయబోతోంది. వీళ్ల పేర్లు గమనిస్తే.. అందరూ గిరిజనులే అని అర్థమైపోతోంది. వీళ్లందరికీ సుదూర స్వప్నంలా కనిపించిన ‘ఉన్నత చదువు’ను చేరువ చేసిన ఉన్నతుడు డాక్టర్ అచ్యుత సమంత. పేద కుటుంబంలో పుట్టి, చదువుకోవడానికి అష్టకష్టాలు పడిన ఈ సామాన్యుడు.. దేశంలోనే ఒకానొక డీమ్డ్ యూనివర్శిటీకి అధిపతి అయ్యే స్థితికి చేరిన వైనం స్ఫూర్తిదాయకం!
 
 ఒడిషాలో ‘కిస్’ అంటే తెలియని వారుండరు. ఇందులో దురర్థమేమీ లేదు. కిస్ అనేది గిరిజనుల కోసం వెలసిన యూనివర్శిటీ. కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్‌కు సంక్షిప్త రూపమే కిస్. ఒక సక్సెస్ నుంచి మరెన్నో సక్సెస్‌లకు వేదికైన గొప్ప విద్యాలయం ఇది. దేశంలో అతి పెద్ద డీమ్డ్ యూనివర్శిటీల్లో ఇదొకటి. 25 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన ఈ యూనివర్శిటీ ఇప్పటిదాకా 20 వేల మందికి పైగా గిరిజన విద్యార్థులకు గూడునిచ్చి, కడుపు నింపి, విద్యాబుద్ధులు చెప్పి వారికి జీవితాన్నిచ్చింది. దీని వ్యవస్థాపకుడు అచ్యుత సమంత.  గిరిజనుల కోసం ఇంత చేస్తున్నాడు కాబట్టి.. సమంత కూడా గిరిజనుడే అనుకుంటే పొరబాటే. ఆయన కులం, మతం గురించి ప్రస్తావన అనవసరం. కానీ ఆయన గిరిజనుడు మాత్రం కాదు. కానీ పేదరికం గురించి మాత్రం బాగా తెలిసిన, అనుభవించిన వ్యక్తి. చిన్నప్పుడే తండ్రి చనిపోతే.. తల్లి చిన్నచిన్న పనులు చేసి అచ్యుతను చదివించింది. అతను కూడా చదువుకుంటూనే రకరకాల పనులు చేశాడు. కానీ ఏనాడూ చదువును నిర్లక్ష్యం చేయలేదు. పట్టుదలతో చదివి రసాయన శాస్త్రంలో పీజీ చేశాడు.
 
 అనంతరం పదేళ్ల పాటు వివిధ కళాశాలల్లో అధ్యాపకుడిగా పనిచేశాడు. ఐతే జీవితంలో స్థిరపడినా సమంత మనసు మాత్రం స్థిమితంగా లేదు. ఇంకా ఏదో సాధించాలని 1992లో తన దగ్గరున్న రూ.5 వేల పెట్టుబడితో రెండు గదులు అద్దెకు తీసుకుని ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్ మొదలు పెట్టాడు. గిరిజన పిల్లల్ని అందులో చేర్చుకుని వారికి శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాడు. అదే తర్వాత కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ (కేఐఐటీ)గా మారింది. తర్వాత ‘కిస్’ కూడా శ్రీకారం చుట్టుకుంది. ఐతే ఈ క్రమంలో సమంత పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తన విద్యా సంస్థల్ని తీర్చిదిద్దే క్రమంలో ఆయన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నారు. మొదట్లోనే ఆయన వడ్డీ వ్యాపారులకు రూ.15 లక్షలు బాకీ పడ్డారు. ఐతే ఓ జాతీయ బ్యాంకు ఆయనకు లోన్ ఇచ్చి ఆదుకుంది.
 
 ఈ డబ్బులతో తన విద్యా సంస్థను అభివృద్ధి చేసి తన కష్టాలన్నింటికీ చెక్ పెట్టేశారు సమంత. ప్రస్తుతం ‘కిస్’లో లేని కోర్సంటూ లేదు. కేజీ నుంచి పీజీ వరకు ఏ చదువైనా దొరుకుతుందిక్కడ. ఐతే ప్రవేశం గిరిజనులకు మాత్రమే. యూనివర్శిటీకి వెళ్లో.. లేక ఆన్‌లైన్లోనే అప్లికేషన్ సమర్పిస్తే చాలు.. వారి పరిస్థితిని బట్టి ఉచితంగా లేదా నామమాత్రపు ఫీజులతో భోజనం, వసతి కల్పించి చదువు చెప్పిస్తారు. గత పదేళ్లుగా ‘కిస్’లో డ్రాపౌట్ ఒక్కరూ లేరు. వంద శాతం ఫలితాలతో దూసుకెళ్తోంది కిస్. ఈ యూనివర్శిటీ కోసం సమంత చేసిన త్యాగాలు అసామాన్యమైనవి. ఆయన పెళ్లి కూడా చేసుకోలేదు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ ‘కిస్’కు స్వయంగా విచ్చేసి సమంతను అభినందించారు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు జవహర్‌లాల్ నెహ్రూ పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఆయన నిస్వార్థ కృషికి జాతీయంగా, అంతర్జాతీయంగా మరెన్నో అవార్డులు దక్కాయి.
 -  ప్రకాష్ చిమ్మల

మరిన్ని వార్తలు