ఆదిలోనే హంసపాదు...

11 May, 2014 04:05 IST|Sakshi
ఆదిలోనే హంసపాదు...

నివృత్తం

దేవాలయాల్లో ఉత్సవాలు జరిగేటప్పుడు ... ఉత్సవ మూర్తులను వివిధ వాహనాలపై ఊరేగిస్తారు. ఆ సమయంలో కొందరు భక్తులు ఉత్సవ వాహనాన్ని తమ భుజాలపై మోస్తారు. ఉత్సవం జరుగుతున్నంతసేపూ దాన్ని మోయడమంటే తేలిక కాదు. కాబట్టి... మధ్యమధ్యలో వాహనాన్ని భుజాల మీది నుంచి దించే వెసులుబాటును కల్పించారు. అయితే వాహనాన్ని కింద పెట్టకూడదు. అందుకే దాని కోసం ఆంగ్ల అక్షరం ‘వై’ ఆకారంలో ఉండే కర్రలను ఏర్పరిచారు. వీటినే హంసపాదులంటాం. వాహనాన్ని హంసపాదుపై పెట్టడమంటే... ఆ కాసేపూ ఊరేగింపునకు విఘ్నం ఏర్పడినట్టే కదా! అందుకే ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు విఘ్నం ఏర్పడితే... ఆదిలోనే హంసపాదు అంటూ ఉంటారు.
 
 దేవుడి ముందు దీపం ఎందుకు వెలిగిస్తారు?

 దీపంజ్యోతి పరబ్రహ్మ అన్నారు.  దీపం జ్ఞానానికి, వెలుగుకు ప్రతీక. వెలిగే ప్రతిచోటా కాంతిని పంచే దీపం, హృదయంలో ఉన్న ఆజ్ఞానాన్ని పారద్రోలి అక్కడ కూడా వెలుగును నింపేలా చూడమని వేడుకుంటూ దేవుడికి దీపారాధన చేస్తారు. అంతేకాదు... దీపాన్ని లక్ష్మీస్వరూపంగా కూడా పేర్కొంటున్నాయి శాస్త్రాలు. అందుకే ‘దీపము వెలిగిన ఇంటను దాపున శ్రీ లక్ష్మీదేవి ధనములనిచ్చును’ అంటూంటారు పెద్దలు. కాబట్టి  ఎన్ని రకాల ఉపాచారాలు చేసినా, దీపారాధన చేయకుండా ఉండిపోకూడదు. అది చేయకపోతే పూజ సంపూర్ణం కానట్టే!

మరిన్ని వార్తలు