టీవీక్షణం: రోజంతా ఘుమఘుమలే!

23 Nov, 2013 23:51 IST|Sakshi
టీవీక్షణం: రోజంతా ఘుమఘుమలే!

మహిళలకు వంట చేయడమంటే ఎంత ఇష్టమో, వంటల కార్యక్రమాలు చూడటమన్నా అంతే ఇష్టం. అందుకే ప్రతి చానెల్లోనూ ఏదో ఒక సమయంలో వంటల కార్యక్రమాలు వచ్చేలా చూసుకుంటారు నిర్వాహకులు. ఆ సమయానికల్లా అన్ని పనులూ మానేసుకుని టీవీల ముందు హాజరైపోతారు ఇల్లాళ్లు. మరి ఆ సమయానికి కరెంటు పోతే? ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే? ఆ కార్యక్రమాలు మిస్ అవ్వాల్సిందేనా? ఈ టెన్షన్ లేకుండా ఉండాలనే... ఖానా ఖజానా చానెల్‌ను తెచ్చారు ‘జీ’వారు.
 
 
  ఒకప్పుడు సూపర్ హిట్టయిన సంజీవ్ కపూర్ కుకరీ షో పేరునే ఈ చానెల్‌కు పెట్టారు. మన దేశంలో ఇదే తొలి 24 గంటల వంటల చానెల్. ఇందులో వరల్డ్ ఆఫ్ ఫుడ్ అంటూ విదేశీ వంటలను పరిచయం చేస్తున్నారు. సింప్లీ సౌత్‌లో దక్షిణాది వంటకాల రుచి చూపిస్తున్నారు. చెఫ్ స్పెషల్ అంటూ దేశంలోని ప్రముఖ చెఫ్‌లు తమ స్పెషల్ రెసిపీలను నేర్పుతున్నారు. బ్రేక్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో టిఫిన్లు, స్నాక్ అటాక్‌లో వైవిధ్యభరితమైన స్నాక్స్ గురించి చెబుతున్నారు. కోస్టల్ కర్రీలో సీఫుడ్ వెరైటీలు, హౌ సే వావ్ తక్‌లో వంటల చిట్కాలు, బచ్చా పార్టీలో పిల్లల కోసం ప్రత్యేక వంటకాలు, ఫిల్మీ రసోయీలో సినీ తారల ఫేవరేట్ డిష్‌లు... చూడాలే కానీ బోలెడు!
 
 ‘అబ్ హర్ కోయీ చెఫ్’ పేరుతో సాధారణ గృహిణులకు కూడా తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. వంట బాగా చేయగలిగిన ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ప్రాంతంతో సంబంధం లేదు. కాకపోతే హిందీ చానెల్ కాబట్టి హిందీ వచ్చి ఉండాలి. ఇలా వంట నేర్చుకోవడానికి, వంట నైపుణ్యాన్ని ప్రదర్శించడానికీ కూడా అవకాశం కల్పించడం వల్లే... ఖానా ఖజానా వీక్షకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది!

>
మరిన్ని వార్తలు