టీవీక్షణం: సీరియల్స్‌ని ఎప్పటికీ వదలను!

18 Aug, 2013 01:03 IST|Sakshi
టీవీక్షణం: సీరియల్స్‌ని ఎప్పటికీ వదలను!

టెలివిజన్ సీరియళ్లలో నటించినవాళ్లను సినిమా ఇండస్ట్రీ చిన్నచూపు చూస్తుంది అంటారు కొందరు. టీవీ వాళ్లు సినిమాలకు సరిపోరు అంటారు ఇంకొందరు. ఇలాంటి కామెంట్లన్నింటికీ ఒకే ఒక్క సమాధానం... ప్రాచీ దేశాయ్. ‘కసమ్‌సే’ సీరియల్‌లో మెరిసి, ఆ ఒక్క సీరియల్‌తోనే సినిమాల్లో చాన్స్ కొట్టేసిన ప్రాచీ చెప్పిన కబుర్లివి...
     మాది సూరత్ (గుజరాత్). తొమ్మిదో తరగతి వరకూ అక్కడే చదివాను. తర్వాత చదువంతా పుణెలో సాగింది. కాలేజీ రోజుల్లోనే మోడలింగ్‌లో అడుగుపెట్టాను. అవకాశాలు అంది వచ్చాయి. బాగా బిజీ అయిపోవడంతో చదువుకు స్వస్తి చెప్పేశాను.
     అది 2006. అప్పుడు నాకు పదిహేడేళ్లు. ఓరోజు అనుకోకుండా బాలాజీ టెలిఫిల్మ్స్ నుంచి ‘కసమ్‌సే’ సీరియల్‌లో నటించమని పిలుపు వచ్చింది. ఏక్తాకపూర్ బ్యానర్లో చాన్స్ రావడమనేది అదృష్టం కదా! అందుకే వెంటనే ఓకే చెప్పేశాను. ‘బానీ’ పాత్ర నన్ను పాపులర్ చేసింది. చాలా అవార్డులు అందుకున్నాను.
     2007లో ప్రముఖ డ్యాన్స్ షో ‘ఝలక్ దిఖ్‌లాజా’ రెండో సిరీస్‌లో పాల్గొని, గెలవడం మర్చిపోలేని అనుభూతి. అంతవరకూ సీరియల్ పాత్ర పేరుతో ‘బానీ’ అని పిలిచినవారంతా ‘ప్రాచీ’ అని పిలవడం మొదలుపెట్టారు.
     రెండేళ్ల పాటు ‘కసమ్‌సే’లో నటించాక  ‘రాక్ ఆన్’ చిత్రంలో నటించే చాన్స్ వచ్చింది.  ఫర్హాన్ అక్తర్ భార్యగా నా నటనకు మంచి మార్కులు పడ్డాయి. దాంతో అవకాశాలు వరుసగా రావడం మొదలైంది. లైఫ్ పార్ట్‌నర్, ఒన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై, తేరీ మేరీ కహానీ, బోల్ బచ్చన్, ఐ మి ఔర్ హమ్, పోలీస్‌గిరి... ఇలా వరుసగా చేసుకుంటూ పోతున్నాను.
     నిజానికి సినిమాల వైపు వెళ్లాలని నేనేమీ అనుకోలేదు. అలాగని వచ్చిన అవకాశాన్ని వదులుకోవడమూ ఇష్టం లేదు. అందుకే  వచ్చిన చాన్‌‌సని ఉపయోగించుకున్నాను. అయితే టీవీని పూర్తిగా వదిలేయలేదు. ప్రాచీ అంటే ఎవరో అందరికీ తెలిసింది సీరియళ్ల వల్లనే. అందుకే నేనెప్పుడూ వాటిని వదులుకోను. మంచి సీరియల్ చేయడానికి ఎప్పుడూ రెడీగానే ఉంటాను.
     నాకు తెలిసి టీవీకి పని చేయడమే ఎక్కువ కష్టం. వరుస షెడ్యూళ్లు, కొన్ని గంటలపాటు అలుపు లేకుండా నటించాలి, ఎమోషన్స్ ఎక్కువగా ప్రదర్శించాలి. అదే సినిమా అయితే పరిమిత సమయాలు, గంటలపాటు షూటింగ్ జరగడమనేది ఎప్పుడో కానీ ఉండదు, క్యారెక్టర్‌కి కూడా పరిమితి ఉంటుంది.  
     అందరూ అనుకునేదేమిటంటే, బుల్లితెర నటీనటులు వెండితెర మీద వెలగలేరని. అది ఎంతమాత్రం నిజం కాదు. నటన తెలిసినవారికి సినిమా రంగమైనా, టెలివిజన్ రంగమైనా ఒకటే. ఆ పాత్రను ఎంత బాగా ఓన్ చేసుకున్నాం, దానికి ఎంతవరకూ న్యాయం చేయగలం అన్నదాన్నిబట్టే ఉంటుంది సక్సెస్!
     నేను చాలా కూల్‌గా ఉంటాను. నాకుగా ఎవరి జోలికీ పోను. ఎవరైనా నా జోలికొచ్చినా తప్పుకు పోతాను. ఇండస్ట్రీలో ఇది చాలా అవసరం. టాలెంట్ ఉంటే చాలదు. ప్రవర్తనను కూడా కాచుకుని ఉండాలి. అందరి కళ్లూ మనమీదే ఉంటాయి. ఏ చిన్న తప్పుటడుగు వేసినా, పెద్ద మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుందిక్కడ!
     నా పెళ్లి గురించి చాలామంది టెన్షన్ పడుతున్నారు. నిజానికి నాకు పెళ్లి ఆలోచన లేదు. అస్సలు చేసుకోనని కాదు గానీ, ఇప్పుడు మాత్రం చేసుకోను. ఒంటరిగా ఉండటం బాగుంది. ఇప్పుడు తోడు కోసం కంగారు పడాల్సిన అవసరం కనిపించడం లేదు. కాబట్టి నేనసలు పెళ్లి గురించి టెన్షన్ పడట్లా!
     {పస్తుతం ‘రాక్ ఆన్’ సీక్వెల్‌లో నటిస్తున్నాను. ఇంకా కొన్ని ఆఫర్స్ కూడా చేతిలో ఉన్నాయి. లైఫ్ ప్రశాంతంగా సాగిపోతోంది. చెప్పుకోదగ్గ విశేషాలూ లేవు. కుమిలిపోయేంత కష్టాలూ లేవు. నా జీవితం ఇలా సాగిపోయినా చాలు నాకు!

మరిన్ని వార్తలు