ఇంటింటా చాక్లెట్‌..

7 Jul, 2019 12:45 IST|Sakshi

కవర్‌ స్టోరీ

పిల్లలూ పెద్దలూ బాగా ఇష్టపడే పదార్థాల్లో చాక్లెట్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. చాక్లెట్‌ మిఠాయిలు, ఐస్‌క్రీములు, కేకులకు, పానీయాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉంది. ప్రపంచవ్యాప్తంగా స్థిరంగా పెరుగుతున్న పరిశ్రమల్లో చాక్లెట్‌ పరిశ్రమ ఒకటి. చాక్లెట్‌ పరిశ్రమ వార్షిక టర్నోవర్‌ 5 వేల కోట్ల డాలర్లకు (రూ.3.45 లక్షల కోట్లు) పైమాటే! కొకోవా గింజల నుంచి తయారయ్యే చాక్లెట్‌ మన దేశంలోకి ఆలస్యంగా అడుగుపెట్టింది. బ్రిటిష్‌ హయాం కాలంలో మాత్రమే భారతీయులు చాక్లెట్‌ను రుచి చూడగలిగారు. అజ్‌టెక్, మాయా నాగరికతల ప్రజలకు క్రీస్తుపూర్వం 1200 సంవత్సరాల నాటికే చాక్లెట్‌ తెలుసు. కొకోవా గింజతో తయారు చేసే పానీయాన్ని వారు మత వేడుకల్లో సేవించేవారు. కొకోవా సాగు మన దేశంలో స్వాతంత్య్రం వచ్చిన తర్వాతే మొదలైంది. క్యాడ్‌బరీ కంపెనీ ప్రోద్బలంతో 1965 నుంచి కేరళలో కొకోవా సాగు ప్రారంభమైంది.
నేడు ప్రపంచ చాక్లెట్‌ దినోత్సవం సందర్భంగా చాక్లెట్‌ గురించి కొన్ని ముచ్చట్లు, కొన్ని తేలికపాటి చాక్లెట్‌ రెసిపీలు మీకోసం...

ఐస్‌బాక్స్‌ కేక్‌

కావలసినవి: మీగడ – రెండు కప్పులు, పంచదార – రెండు టేబుల్‌ స్పూన్లు, చాక్లెట్‌ వేఫర్స్‌ –  ఒక ప్యాకెట్‌, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ – ఒక టీస్పూన్‌, చాక్లెట్‌ తురుము – (కావాలనుకుంటే)
తయారీ: ఒక వెడల్పాటి బౌల్‌లో మీగడ వేసుకుని మెత్తగా అయ్యేలా గిలకొట్టుకోవాలి. మీగడ మెత్తగా అయిన తర్వాత పంచదార, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ వేసుకుని మళ్లీ గిలకొట్టుకోవాలి. చాక్లెట్‌ వేఫర్స్‌ను చితగ్గొట్టి ఈ మూడొంతుల మీగడ మిశ్రమంలో వేసి, బాగా కలుపుకోవాలి. మరో వెడల్పాటి చతురస్రాకారపు పాత్రలో ఈ మిశ్రమాన్ని వేసి, పాత్ర నిండా సమంగా వచ్చేలా పరచాలి. మిశ్రమంపైన మిగిలిన మీగడను సమంగా పరచాలి. కావాలనుకున్న వారు పైన చాక్లెట్‌ తురుమును అలంకరించుకోవచ్చు. దీనిని ఫ్రిజ్‌లో ఆరు గంటలు ఉంచిన తర్వాత బయటకు తీసి, కావలసిన సైజులో ముక్కలుగా కోసుకుని తినవచ్చు.

చాక్లెట్‌ కుకీస్‌
కావలసినవి: ఓట్స్‌– మూడు కప్పులు, పీనట్‌ బటర్‌ – అర కప్పు, వెన్న– అర కప్పు, కొకోవా పౌడర్‌ – పావు కప్పు, పాలు – అర కప్పు, పంచదార – ఒకటిన్నర కప్పులు, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ – ఒక టీస్పూన్‌, ఉప్పు – పావు టీస్పూన్‌
తయారీ: మందపాటి మూకుడులో పంచదార, కొకోవా పౌడర్‌ వేసి రెండూ బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి. తర్వాత పాలు, వెన్న వేసి బాగా కలిపి, సన్నని మంట మీద ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత స్టవ్‌ మీద నుంచి దించేసుకోవాలి. వెంటనే ఈ మిశ్రమంలో ఓట్స్, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్, ఉప్పు, పీనట్‌ బటర్‌ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని టేబుల్‌ స్పూన్‌తో వ్యాక్స్‌ పేపర్‌ మీద వేసుకుని, నచ్చిన ఆకారంలో కుకీస్‌ను మలచుకోవాలి. పావుగంట సేపు వాటిని అలాగే విడిచిపెడితే, అవి గట్టిబడి కరకరలాడే చాక్లెట్‌ కుకీస్‌ రెడీ అవుతాయి.

చాక్లెట్‌ పుడ్డింగ్‌
కావలసినవి: డార్క్‌ చాక్లెట్‌ తురుము – ఒక కప్పు, మీగడ – ఒకటిన్నర కప్పులు, వెన్న – పావు కప్పు, కొకోవా పౌడర్‌ – రెండు టేబుల్‌ స్పూన్లు, పంచదార – రెండు టేబుల్‌ స్పూన్లు, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ – ఒక టీస్పూన్‌, ఉప్పు – పావు టీస్పూన్, జీడిపప్పు ముక్కలు – అర టీస్పూన్‌
తయారీ: మందపాటి మూకుడులో మీగడను వేసుకుని, స్టవ్‌ మీద సన్నని మంటపై ఉడికించుకోవాలి. మీగడ ఉడికిన తర్వాత మూకుడును దించేసుకుని, అందులో కొకోవా పౌడర్‌ వేసుకుని బాగా గిలకొట్టాలి. ఈ మిశ్రమంలో చాక్లెట్‌ తురుము, వెన్న, పంచదార, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్, ఉప్పు వేసుకుని మిశ్రమం అంతా మెత్తగా అయ్యే వరకు మళ్లీ గిలకొట్టాలి. ఈ మిశ్రమాన్ని కప్పులలో ముప్పావు వంతు వరకు నింపుకోవాలి. పైన జీడిపప్పు ముక్కలను చల్లుకుని, ఫ్రిజ్‌లో పెట్టాలి. ఫ్రిజ్‌లో ఆరుగంటలు ఉంచిన తర్వాత చల్లచల్లని తీయతీయని నోరూరించే చాక్లెట్‌ పుడ్డింగ్‌ సిద్ధమవుతుంది.

చాక్లెట్‌ ఓట్‌మీల్‌ బార్స్‌

కావలసినవి: ఓట్స్‌ – రెండు కప్పులు, కొకోవా పౌడర్‌ – పావు కప్పు, తేనె – పావు కప్పు, పీనట్‌ బటర్‌ – పావు కప్పు, వెన్న - పావు కప్పు, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ – అర టీస్పూన్‌, ఉప్పు – పావు టీస్పూన్‌, బాదం తురుము – ఒక టీస్పూన్‌, కిస్మిస్‌ – ఒక టీస్పూన్‌, చాక్లెట్‌ చిప్స్‌ – ఒక టీస్పూన్‌
తయారీ: దాదాపు ఎనిమిది అంగుళాల చతురస్రాకారపు పాత్రను తీసుకోని, పాత్ర అడుగు భాగాన వ్యాక్స్‌ పేపర్‌ను పరుచుకోవాలి. ఒక బౌల్‌లో పీనట్‌ బటర్, వెన్న, తేనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్టవ్‌పై సన్నని మంట మీద వేడి చేసుకోవాలి. పీనట్‌ బటర్, వెన్న కరుగుతుండగా వెనీలా ఎక్స్‌ట్రాక్ట్, ఉప్పు వేసి కలుపుకోవాలి. మిశ్రమం బాగా మెత్తగా తయారయ్యాక ఓట్స్, కొకోవా పౌడర్‌ వేసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని వ్యాక్స్‌పేపర్‌ వేసి ఉంచిన చతురస్రాకారపు పాత్రలోకి వేసుకుని, సమంగా పరుచుకునేలా స్పూన్‌తో వీలైనంత గట్టిగా అదుముకోవాలి. తర్వాత ఈ మిశ్రమంపై బాదం తురుము, కిస్మిస్, చాక్లెట్‌ చిప్స్‌ చల్లుకుని, మళ్లీ గట్టిగా అదుముకోవాలి. మిశ్రమం చల్లారాక, చతురస్రాకారపు పాత్రను డీప్‌ ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత బయటకు తీసి, కోరుకున్న సైజులో బార్స్‌ కట్‌ చేసుకోవాలి. నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఈ బార్స్‌ చాలా రుచిగా ఉంటాయి.

చాక్లెట్‌ బ్రౌనీస్‌
కావలసినవి: ఖర్జూరాల తురుము – రెండు కప్పులు, వాల్‌నట్స్‌ – రెండు కప్పులు, కొకోవా పౌడర్‌ – ముప్పావు కప్పు, చాక్లెట్‌ తురుము – వంద గ్రాములు, పీనట్‌ బటర్‌ – అర కప్పు, అటుకులు లేదా కార్న్‌ఫ్లేక్స్‌ – ఒక కప్పు, వెన్న – ఒక టేబుల్‌స్పూన్‌
తయారీ: గింజలు తొలగించి, తురుముకున్న ఖర్జూరాన్ని పదినిమిషాల సేపు నీట్లో నానబెట్టుకోవాలి. తర్వాత నీటిని పూర్తిగా వంపేయాలి. నానిన ఖర్జూరాలను, వాల్‌నట్స్‌ను మిక్సీలో వేసుకుని మెత్తగా నలిగే వరకు తిప్పుకోవాలి. మిక్సీలో ఈ మిశ్రమం తయారవగానే, అందులోనే కొకోవా పౌడర్, ఉప్పు వేసి, మళ్లీ మిక్సీని ఆన్‌ చేయాలి. అవసరమైతే ఒకటి రెండు టేబుల్‌ స్పూన్స్‌ నీళ్లు కలుపుకోవచ్చు. మిశ్రమం మరీ జారుగా కాకుండా, ఉండలా కట్టుకునేందుకు వీలుగా ఉండేలా చూసుకోవాలి. మిశ్రమం బాగా చిక్కగా, మెత్తగా తయారైన తర్వాత అడుగు భాగాన వాక్స్‌పేపర్‌ పరిచిన చతురస్రాకారపు పాత్రలోనికి వేసుకోవాలి. దీనిపై వెన్న, అటుకులు లేదా కార్న్‌ఫ్లేక్స్‌ వేసుకుని, మిశ్రమం పాత్ర అంతటా సమంగా పరుచుకునేలా గట్టిగా అద్దుకోవాలి. తర్వాత వెంటనే డీప్‌ ఫ్రీజర్‌లో పెట్టాలి. అరగంట తర్వాత బయటకు తీసుకుని, కోరుకున్న సైజుల్లో ముక్కలుగా కోసుకుంటే చాలు, నోరూరించే చాక్లెట్‌ బ్రౌనీస్‌ రెడీ.

జీబ్రాకేక్‌

కావలసినవి: చాక్లెట్‌ వేఫర్స్‌ – ఒక పెద్ద ప్యాకెట్‌, మీగడ – రెండు కప్పులు, పంచదార – ఒక టేబుల్‌స్పూన్‌, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ – ఒక టీస్పూన్‌
తయారీ: ఒక పాత్రలో మీగడ, పంచదార, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ వేసుకుని బాగా మెత్తగా అయ్యేలా గిలకొట్టుకోవాలి. శాండ్‌విచ్‌ మధ్య జామ్‌ పట్టించినట్లుగా ఈ మిశ్రమాన్ని  చాక్లెట్‌ వేఫర్స్‌ మధ్య బాగా పట్టించాలి. వేఫర్స్‌ మీగడ వరుసగా దగ్గరగా కోరుకున్న ఆకారంలో పేర్చుకుంటూ పోవాలి. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యాక మిగిలిన మీగడ మిశ్రమాన్ని వేఫర్స్‌ ఉపరితలానికి కూడా బాగా పట్టించాలి. దీనిని ఫ్రిజ్‌లో పెట్టి, పన్నెండు గంటల తర్వాత బయటకు తీస్తే, టేస్టీ జీబ్రా కేక్‌ తినడానికి సిద్ధంగా తయారవుతుంది.

చాక్లెట్‌ పాయసం
కావలసినవి: డార్క్‌ చాక్లెట్‌ తురుము – అరకప్పు, బియ్యం – అరకప్పు, పాలు – నాలుగు కప్పులు, కోవా – పావుకప్పు, పంచదార – ఒక కప్పు, చాక్లెట్‌ చిప్స్‌ (కావాలనుకుంటే) – ఒక టేబుల్‌ స్పూన్‌
తయారీ: బియ్యాన్ని ముందుగా గంటసేపు నీళ్లలో నానబెట్టుకోవాలి. నీళ్లను వంచేసి మిక్సీలో వేసి మరీ మెత్తగా కాకుండా రబ్బుకోవాలి. మందపాటి పాత్రలో పాలను మరిగించుకోవాలి. పాలు మరుగుతుండగా రుబ్బుకున్న బియ్యం ముద్దను అందులో వేసుకోవాలి. పాలు దాదాపు సగానికి సగం ఇగిరిపోయాక, కోవా, చాక్లెట్‌ తురుము, పంచదార వేసి కలుపుకుని, స్టవ్‌పై నుంచి దించేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత కావాలనుకున్న వారు పైన చాక్లెట్‌ చిప్స్‌ను అలంకరించుకోవచ్చు.

చాక్లెట్‌ కోకోనట్‌ బార్స్‌

కావలసినవి: చాక్లెట్‌ చిప్స్‌  – ఒక కప్పు, ఎండు కొబ్బరి తురుము –  ఒకటిన్నర కప్పులు, పంచదార – మూడు టేబుల్‌స్పూన్లు, కొబ్బరినూనె – ఆరున్నర టేబుల్‌స్పూన్లు
తయారీ: మందపాటి మూకుడులో పంచదార, కొబ్బరి నూనె వేసుకుని, స్టవ్‌మీద సన్నని మంటపై వేడి చేసుకోవాలి. పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేసుకుని, పంచదార కరిగిన కొబ్బరినూనెలో కొబ్బరి తురుము వేసి, బాగా కలుపుకోవాలి. చతురస్రాకారపు పాత్ర అడుగున వ్యాక్స్‌ పేపర్‌ పరిచి, అందులో ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. చాక్లెట్‌ చిప్స్‌ను వేరే మూకుడులో వేసుకుని, సన్నని మంటపై అవి పూర్తిగా కరిగిపోయే వరకు వేడి చేసుకోవాలి. కరిగిన చాక్లెట్‌ మిశ్రమాన్ని కొబ్బరి మిశ్రమం ఉన్న పాత్రలోకి వంపుకోవాలి. పాత్ర అన్ని వైపులా ఈ మిశ్రమం బాగా పట్టేలా స్పూన్‌తో సర్దుకోవాలి. తర్వాత దీనిని చల్లారనిచ్చి, డీప్‌ఫ్రిజ్‌లో ఇరవై నిమిషాలు ఉంచి బయటకు తీసి, కావలసిన సైజులో కట్‌చేసుకుంటే చాలు.

చాక్లెట్‌ మిల్క్‌షేక్‌
కావలసినవి: కొకోవా పౌడర్‌ – మూడు టేబుల్‌స్పూన్లు, గోరువెచ్చని నీరు – పావు కప్పు, చల్లని పాలు – రెండున్నర కప్పులు ఐస్‌క్యూబ్స్‌ – ఆరు, చాక్లెట్‌ సాస్‌ – రెండు టేబుల్‌స్పూన్లు, పంచదార – పావు కప్పు
ఐస్‌క్రీమ్‌ (కావాలనుకుంటే) – రెండు స్కూప్స్‌
తయారీ: ఒక బౌల్‌లో గోరువెచ్చని నీరు తీసుకుని, ఆ నీట్లో కొకోవా పౌడర్‌ వేసి, బాగా కరిగేలా కలుపుకోవాలి. ఇందులోనే చక్కెర వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బ్లెండర్‌లో వేసుకుని, అందులో ఐస్‌క్యూబ్స్, పాలు కూడా వేసుకుని బ్లెండ్‌ చేయాలి. బాగా బ్లెండ్‌ అయిన మిల్క్‌షేక్‌ని గ్లాసుల్లో పోసుకుని, దానిపై చాక్లెట్‌ సాస్‌ వేసుకుంటే చాలు, చల్లచల్లని చాక్లెట్‌ మిల్క్‌షేక్‌ రెడీ. కావాలనుకున్న వారు ఐస్‌క్రీమ్‌ని కూడా వేసుకోవచ్చు.

చాక్లెట్‌ దోశ
కావలసినవి: మైదాపిండి – అరకప్పు, పాలు – పావుకప్పు, డార్క్‌చాక్లెట్‌ తురుము – పావుకప్పు, నీరు– రెండు టేబుల్‌ స్పూన్లు, వెన్న– రెండు టేబుల్‌ స్పూన్లు, బేకింగ్‌ సోడా – చిటికెడు
తయారీ: వెడల్పాటి పాత్రలో మైదాపిండి, పాలు, డార్క్‌చాక్లెట్‌ తురుము, వెన్న, నీరు వేసుకుని జారుగా కలుపుకోవాలి. తర్వాత చిటికెడు సోడా వేసి మళ్లీ కలుపుకోవాలి. పావుగంట సేపు ఈ మిశ్రమాన్ని అలాగే వదిలేయాలి. తర్వాత ఈ మిశ్రమంతో పెనం మీద దోశలు పోసుకోవాలి. వేడి వేడి చాక్లెట్‌ దోశలు రెడీ. చాక్లెట్‌ సాస్‌లో ముంచుకుని తింటే ఇవి భలే రుచిగా ఉంటాయి.

మరిన్ని వార్తలు