నన్ను క్రికెటర్‌ని చేసిందే ప్రపంచకప్

14 Feb, 2015 23:19 IST|Sakshi
నన్ను క్రికెటర్‌ని చేసిందే ప్రపంచకప్

 సచిన్ రమేశ్ టెండూల్కర్ తన కెరీర్‌లో 1992 నుంచి 2011 వరకు ఆరు ప్రపంచకప్‌లు ఆడాడు. ఈసారి తను రిటైర్ అయినా ప్రపంచకప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు.  ఈ సందర్భంగా తన ప్రపంచకప్ అనుభవాలతో సచిన్ రాసిన కాలమ్!
 
 కెరీర్ ప్రారంభించినప్పుడు వంద సెంచరీలు చేస్తానని అనుకోలేదు. 30,000 పరుగులు చేయాలనే లక్ష్యం అసలే లేదు. ఆట ప్రారంభించినప్పటి నుంచి ప్రపంచకప్ గెలవడం ఒక్కటే  నా కల. సుదీర్ఘ కెరీర్ తర్వాత 2011లో అది సాకారమైంది. ఆ క్షణాలను
 నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేను
 
 1983, జూన్ 25... భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్ గెలిచిన రోజు. ట్రోఫీని సగర్వంగా అందుకున్న దృశ్యాలు యావత్ జాతిలో స్ఫూర్తి నింపాయి. అప్పుడు నాకు పదేళ్లు. వేడుక చేసుకునేందుకు  అర్ధరాత్రి వరకు నా తల్లిదండ్రులు నాకు అనుమతినిచ్చారు. ఓ విధంగా ఆ విజయమే నేను క్రికెట్ ఆడేందుకు కారణమైంది.
 
 ప్రపంచకప్‌లో నన్ను నేను తొలిసారిగా చూసుకుంది 1987లో. భారత్, పాకిస్తాన్‌లు ఉమ్మడిగా నిర్వహించిన ఆ టోర్నీలో ముంబైలో జరిగిన మ్యాచులకు నేను బాల్ బాయ్‌గా పనిచేశాను. బౌండరీ లైన్ దగ్గర నిలుచుని మైదానంలోని భారత దిగ్గజాలను దగ్గరనుంచి చూసేవాడిని. నాకు వాళ్లలా క్రికెటర్‌ను కావాలని అప్పుడే అనిపించింది.
 1992 ప్రపంచకప్‌లో ఆటగాడిగా బరిలోకి దిగాను. పెర్త్‌లో ఇంగ్లండ్‌తో తొలి మ్యాచ్ ఆడాను. గత వరల్డ్‌కప్‌లకు ఈ టోర్నీ భిన్నమైంది. తొలిసారిగా ఆటగాళ్లు రంగుదుస్తులతో ఆడారు. తెలుపు బంతులు, నలుపు రంగు సైట్‌స్క్రీన్లను ప్రవేశపెట్టారు. ఇంకా ఫ్లడ్‌లైట్ల వెలుతురులో మ్యాచులు జరిగిన ప్రపంచకప్ కూడా ఇదే. మేం ఆడిన తొలి మ్యాచ్‌లో నేను 10 ఓవర్ల కోటా పూర్తిచేసినా... వికెట్లు మాత్రం లభించలేదు. బ్యాటింగ్‌లో 35 పరుగులు చేసిన నేను రవిశాస్త్రితో కలిసి మూడో వికెట్‌కు 63 పరుగులు జోడించాను. కానీ ఈ మ్యాచ్‌లో లక్ష్యదూరానికి మా జట్టు 9 పరుగుల దూరంలో నిలిచి ఓడిపోయింది.
 
  భారత్ నాకౌట్ దశకు అర్హత సాధించడంలో విఫలమైంది. పాకిస్తాన్‌పై గెలవడం ఒక్కటే ఊరట. ప్రపంచకప్‌లో నేను తొలిసారి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నది ఈ మ్యాచ్‌లోనే. ఈ వరల్డ్‌కప్‌లో నేను తొలి శతకం సాధించా. తదుపరి ప్రపంచకప్(1996)లో శ్రీలంకతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో కూడా సెంచరీ చేశాను. సెమీస్‌లో లంక చేతిలో ఎదురైన పరాజయంతో ఫైనల్ మ్యాచ్‌కు ప్రేక్షకులమయ్యాం. ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించిన శ్రీలంక విశ్వవిజేతగా నిలిచింది. అరవింద డిసిల్వా, అర్జున రణతుంగ అద్భుత భాగస్వామ్యాన్ని ఓ ప్రేక్షకుడిగానే అస్వాదించాను.
 
 1999 ప్రపంచకప్ నాకు వ్యక్తిగతంగా క్లిష్టమైన అనుభవాన్నిచ్చింది. టోర్నీ మధ్యలోనే తండ్రిని కోల్పోయాను. ఆటపై దృష్టిపెట్టేందుకు కష్టపడాల్సివచ్చింది. చాన్నాళ్ల తర్వాత మళ్లీ 2003 ప్రపంచకప్‌లో ఫైనల్ దాకా వెళ్లాం. కానీ తుదిమెట్టుపై భారీ తేడాతో ఓడటం నిరాశపరిచింది. ఈ మెగా ఈవెంట్‌లో నేను 11 మ్యాచ్‌లాడి 673 పరుగులతో వరల్డ్‌కప్ చరిత్రలోనే అత్యధిక వ్యకిగత పరుగుల రికార్డును నెలకొల్పాను.
 
 2007లో వెస్టిండీస్‌లో ఘోరంగా లీగ్ దశలోనే ఇంటిదారి పట్టడం మరచిపోలేను. మంచి జట్టుగా బరిలోకి దిగి భంగపడ్డాం. దీంతో నా వరల్డ్‌కప్ విజయాన్వేషణ కొనసాగుతూ వచ్చింది. 2009లో నేను మీడియాతో మాట్లాడుతూ 2011 ప్రపంచకప్ లక్ష్యంగా సాగుతున్నామని చెప్పాను. 2011 టోర్నీ సాగుతుండగా లీగ్ దశలో అభిమానులు ఆందోళన పడ్డా క్వార్టర్ ఫైనల్ చేరడంతో కాస్త కుదుటపడ్డారు.
 
 నాకౌట్‌లో వరుసగా మేటి పోటీ జట్లయిన ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌లను తదుపరి ఫైనల్లో శ్రీలంకను ఓడించి సొంతగడ్డపై వన్డే చాంపియన్లమయ్యాం. ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడినైనందుకు నా కల సాకారమైంది. జాతి గర్వించేలా చేసిన ఈ విజయం... మొత్తం నా కెరీర్‌లోనే అమూల్యమైనది.
 

మరిన్ని వార్తలు