ఇద్దరూ ఇద్దరే

15 Feb, 2015 00:02 IST|Sakshi
ఇద్దరూ ఇద్దరే

వన్డే క్రికెట్‌లో ఎవరెస్ట్ లాంటిది ప్రపంచకప్. ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదగాలని, దాని శిఖరాగ్రాన్ని అందుకోవాలని ఏ జట్టుకైనా ఉంటుంది. క్రికెట్‌లాంటి జట్టు క్రీడలో విజయవంతం కావాలంటే సమర్థుడైన బృంద నాయకులు ప్రాణావసరం. సారథి సరిగ్గా ఉంటే విజయం దానంతట అదే వస్తుంది. ప్రపంచకప్‌లో ఈ విషయం పలువురు కెప్టెన్‌లు తమ ఆట ద్వారా, చేతల ద్వారా నిరూపించారు. భారత్ విషయానికొస్తే 1983లో కపిల్ దేవ్... 2011లో మహేంద్ర సింగ్ ధోని దీనిని నిజం చేసి చూపించారు.
 
 అన్నీ తానై....అందరిలో ఒకడై...
 అప్పటికే రెండు ప్రపంచకప్‌లు ఆడి ఒకే ఒక్క విజయంతో మూడో ప్రపంచకప్‌లో అడుగుపెట్టింది భారత్. కెప్టెన్ కపిల్, సునీల్ గవాస్కర్ మినహా మిగతా అందరికీ అది తొలి ప్రపంచకప్. ఇప్పటిలా నెలపొడవు శిక్షణా శిబిరాలు, విదేశీ కోచ్‌లు, స్ఫూర్తి నింపేందుకు మానసిక నిపుణులు, మీడియా హంగామా, విశ్లేషణలు, ఇతరత్రా అంచనాలు లేవు. జట్టులోని చాలామంది ఆటగాళ్లు ప్రపంచకప్‌ను విహారయాత్రలా భావించారు. మాల్కం మార్షల్, హోల్డింగ్, జెఫ్ థాంప్సన్, బాబ్ విల్లీస్ లాంటి అరివీర భయంకర బౌలర్లను ఎలా ఎదుర్కోవాలనే విషయాన్ని పక్కనబెట్టి... లండన్‌లోని వీధులను చుట్టేసి, ఏదో సరదాగా క్రికెట్ ఆడేసి ఇంటికెళ్లి పోదామనుకున్నారు. కానీ తొలి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌ను ఓడించి భారత్ సంచలనంతో ప్రపంచకప్‌ను మొదలుపెట్టింది. ఈ విజయం తర్వాత భారత్ తదుపరి మ్యాచ్‌లకు పక్కా ప్రణాళిక వేసిందనుకుంటారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఆటగాళ్లతో ఐదారు నిమిషాలు మాట్లాడాక చివరికి కపిల్ దేవ్ ‘షేరో... జీత్‌లో’ (సింహాల్లారా, గెలవండి) అని ముగించేవాడు. ఆటగాళ్లకు స్వేచ్ఛనివ్వడంతో వారందరూ ఎలాంటి ఒత్తిడి లేకుండా ఈ టోర్నీలోని ప్రతి మ్యాచ్‌ను ఆస్వాదించారు. వెస్టిండీస్, జింబాబ్వేలపై తొలి రెండు మ్యాచ్‌లు గెలిచాక... తర్వాతి రెండు మ్యాచుల్లో భారత్ ఓడిపోయింది.
 
  ఇక సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే భారత్ తర్వాతి రెండు మ్యాచుల్లో తప్పనిసరిగా గెలవాలి. జింబాబ్వేతో మ్యాచ్‌లో భారత్ 17 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడింది. ఈ దశలో కెప్టెన్ కపిల్ దేవ్ (138 బంతుల్లో 16 ఫోర్లు, 6 సిక్సర్లతో 175 నాటౌట్) వన్డే క్రికెట్ చరిత్రలోనే మహాద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అంతా తానై జట్టును నిలబెట్టాడు. కపిల్‌దేవ్ స్ఫూర్తిదాయక బ్యాటింగ్ కారణంగా భారత్ గౌరవప్రద స్కోరును సాధించడమే కాకుండా మ్యాచ్‌లో కూడా విజయాన్ని అందుకుంది.
 
 ఆ తర్వాతి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించి టీమిండియా సెమీఫైనల్‌కు చేరుకుంది. సెమీస్‌లో అందరూ కలిసికట్టుగా ఆడటంతో ఇంగ్లండ్‌ను ఓడించిన భారత్ ఎవ్వరూ ఊహించని విధంగా ఫైనల్‌కు చేరింది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న వెస్టిండీస్‌ను అంతిమ సమరంలో మట్టికరిపించిన కపిల్ డెవిల్స్ విశ్వవిజేతగా అవతరించి క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచారు.
 ఏదో సరదాగా ఇంగ్లండ్‌కు వచ్చిన ఆటగాళ్లలో విజయస్ఫూర్తిని రగిలించి... అంచనాల్లేని జట్టులో ఆశ రేకెత్తించి... తనవంతుగా రాణించి... మిగతా అందరికీ ఆదర్శంగా నిలిచి... నాయకుడంటే ఇలా ఉండాలని నిర్వచనం చెప్పిన కపిల్ దేవ్... 1983లో ప్రపంచకప్‌ను అందించి భారత క్రికెట్‌లో మహాధ్యాయానికి శ్రీకారం చుట్టాడు.
 
 సమన్వయంతో స్వప్నం సాకారం...
 కపిల్ డెవిల్స్ 1983 ప్రపంచకప్‌లో అద్వితీయ విజయం సాధించాక... అలాంటి ఘట్టమే మరోసారి ఆవిష్కృతం కావడానికి భారత జట్టుకు 28 ఏళ్లు పట్టింది. శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో కలిసి సంయుక్త ఆతిథ్యం ఇచ్చిన 2011 ప్రపంచకప్‌లో భారత్ రెండోసారి విశ్వ కిరీటాన్ని సొంతం చేసుకుంది. నాడు కపిల్ దేవ్ పోషించిన పాత్రను ఈసారి మహేంద్ర సింగ్ ధోని తలకెత్తుకున్నాడు. భారీ అంచనాలను తట్టుకొని... తీవ్రమైన ఒత్తిడిని అధిగమించి... సీనియర్లతో సమన్వయం చేసుకొని... యువ ఆటగాళ్లకు సరైన అవకాశాలు ఇచ్చి... సమయోచిత ఆటతీరుతో... సందర్భోచిత నిర్ణయాలతో.. ధోని భారత్‌కు మరోసారి ప్రపంచకప్ దక్కడంలో కీలకపాత్ర పోషించాడు. 2007 ప్రపంచకప్‌లో లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న ధోని... 2011లో మాత్రం విజేత జట్టుకు నాయకుడుగా ఉన్నాడు. ‘ఇంకెప్పుడు’ అని ఆశగా ఉన్న అభిమానుల అంచనాలను స్వదేశంలో నిజం చేశాడు. దిగ్గజం సచిన్ టెండూల్కర్ కెరీర్‌లో అందని ద్రాక్షగా ఉన్న ‘ప్రపంచకప్’ను చేరేలా చేశాడు. కపిల్‌తో పోలిస్తే ధోనికి చాలా అనుకూలతలు కలిసొచ్చాయి. సొంతగడ్డపై కొట్టిన పిండిలా ఉన్న పిచ్‌లు... వెన్నంటే ఉన్న అభిమానుల మద్దతు... మెగా ఈవెంట్‌కు పకడ్బందీ సన్నాహాలు... గ్యారీ కిర్‌స్టెన్ రూపంలో విదేశీ కోచ్... సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్‌లాంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు... అన్నీ కలగలిపి ధోని చేతుల మీదుగా అద్భుతం జరిగేందుకు తోడ్పడ్డాయి.
 
  ఫైనల్ వరకు బ్యాట్‌తో పెద్దగా రాణించని ధోని టైటిల్ పోరులో మాత్రం తడాఖా చూపించాడు. సెహ్వాగ్, సచిన్ తొందరగా అవుటవ్వడం... నిలదొక్కుకున్న కోహ్లి వెనుదిరిగిన నేపథ్యంలో భీకరమైన ఫామ్‌లో ఉన్న యువరాజ్ సింగ్‌ను కాదని ధోని స్వయంగా తానే క్రీజ్‌లోకి వచ్చాడు. గంభీర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. భారత్‌ను అపూర్వ విజయానికి సమీపంలోకి తెచ్చాడు. గంభీర్ అవుటయ్యాక మరింత జోరు పెంచిన ఈ జార్ఖండ్ యోధుడు చివరకు కులశేఖర బౌలింగ్‌లో లాంగ్  ఆన్ మీదుగా భారీ సిక్సర్ సంధించి అంబరాన్నంటే సంబరాలకు తెరలేపాడు.
 - కరణం నారాయణ
 

మరిన్ని వార్తలు