పాలభారతం

28 May, 2017 00:53 IST|Sakshi
పాలభారతం

పుట్టినప్పుడు మొట్టమొదటిగా మన గొంతు తడిపేవి తల్లిపాలు మాత్రమే. ఎదుగుతున్న కొద్దీ ఆవుపాలు, గేదెపాలు తాగుతాం. పిల్లల ఎదుగుదలకే కాదు, రోగులు త్వరగా కోలుకోవడానికీ, వయోవృద్ధులు సత్తువ కోల్పోకుండా ఉండటానికీ పాలను మించిన పోషక పానీయమేదీ లేదు. శారీరక శక్తికి అవసరమైన అత్యంత కీలకమైన పోషక పదార్థాల్లో చాలా వరకు పాలలోనే ఉంటాయి.

పోషకాహార పదార్థాల జాబితా నుంచి పాలను మినహాయించడం సాధ్యం కాదు. శ్వేతవిప్లవం తర్వాత మన దేశం పాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించింది. ఇదొక ఘన విజయం. స్వార్థశక్తుల కారణంగా పాలు కల్తీకి లోనవుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగాలేవీ పాల కల్తీని అరికట్టలేకపోతున్నాయి. ఇదొక దారుణ వైఫల్యం. ప్రపంచ పాల దినోత్సవం (జూన్‌ 1) సందర్భంగా పాల గురించి, కల్తీ పాపాల గురించి కొన్ని సంగతులు...

సహజసిద్ధంగా దొరికే పాలు నిస్సందేహంగా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. శైశవ దశ వరకు మాత్రమే పిల్లలు తల్లిపాలపై ఆధారపడతారు. ఆ తర్వాత పిల్లలకు క్రమంగా ఆవుపాలు లేదా గేదెపాలు అలవాటు చేస్తారు. మేక, గొర్రె, ఒంటె, గుర్రం, గాడిద వంటి జంతువుల పాలు కూడా అక్కడక్కడా వాడుకలో ఉన్నా, ప్రపంచవ్యాప్తంగా విరివిగా వాడుకలో ఉన్నవి ఆవుపాలు, గేదెపాలు మాత్రమే. వివిధ రకాల పాల ఉత్పత్తులు కూడా ఆవుపాలు, గేదెపాలతోనే ఎక్కువగా తయారు చేస్తారు.

ఆవుపాలతో పోలిస్తే గేదెపాలలో ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు, కొన్ని విటమిన్లు, ఖనిజ లవణాలు కాసింత ఎక్కువగా ఉంటాయి. అయితే, ఆవుపాలు తేలికగా అరుగుతాయి. జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు గేదెపాల కంటే ఆవుపాలు తీసుకోవడమే మేలు. అలాగే, తల్లిపాలు చాలని పసిపిల్లలకు కూడా ఆవుపాలు పట్టడమే క్షేమమని నిపుణులు చెబుతారు. కండరాల ఆరోగ్యానికి, ఎముకల దారుఢ్యానికి, కంటిచూపు బాగుండటానికి, రక్తహీనత నుంచి రక్షణకు పాలు ఎంతగానో దోహదపడతాయి. ఆరోగ్యంగా ఉండటానికి అన్ని వయసుల వారికీ పాలు చాలా అవసరం.


స్వచ్ఛమైన పాలు గుక్కెడైనను చాలు...
తెల్లనివన్నీ పాలు  కాదని నానుడి. పాలన్నీ తెల్లగానే ఉంటాయి గాని తెల్లనివన్నీ పాలు కాదు. మరీ ముఖ్యంగా పాల పేరిట అందమైన ప్యాకెట్లలో మార్కెట్లను ముంచెత్తుతున్నవన్నీ స్వచ్ఛమైన పాలు కానేకాదు. ఇదివరకటి సత్తెకాలంలో పాలలో కాసిన్ని నీళ్లు కలిపితేనే జనం గగ్గోలు పెట్టేవారు. పాలను నీళ్లతో కల్తీచేసే పాడు రోజులు దాపురించాయని వాపోయేవారు. ఇప్పుడు కల్తీకాలం మరింత ముదిరింది. నీళ్లేమిటి ఖర్మ పాలలో ఏకంగా పిండి, వనస్పతి, యూరియా, డిటర్జెంట్, ఫార్మాలిన్‌ సహా నానా ప్రమాదకర రసాయనాలను ఎడాపెడా కలిపేస్తున్నారు.

 ప్రజల ఆరోగ్యంతో యథేచ్ఛగా చెలగాటమాడుతున్నారు. పాల ఉత్పత్తిలో స్వయంసమృద్ధి కోసం ‘క్షీర విప్లవం’ చేపట్టిన మన దేశంలోనే కల్తీపాల వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. ప్రభుత్వరంగ డెయిరీ సంస్థలు స్వచ్ఛమైన పాలనే అందిస్తూ వస్తున్నా, సాక్షాత్తు పాలకులే ప్రైవేటు డెయిరీలకు కొమ్ము కాస్తుండటంతో కల్తీపాల వ్యాపారానికి అడ్డు లేకుండా పోతోంది. మనదేశంలో ప్యాకెట్లలో లభించే పాలలో ఏకంగా 68 శాతం మేరకు కల్తీ పాలేనని ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏ) గత ఏడాది చేపట్టిన అధ్యయనంలో తేలింది. ఇలాంటి పరిస్థితుల్లో స్వచ్ఛమైన పాలు గుక్కెడైనను చాలు అనుకోవాల్సి వస్తోంది.

పాల ఉత్పాదన... వినియోగం...
పాల ఉత్పాదనలో మన దేశం ముందంజలోనే ఉన్నా, తలసరి పాల వినియోగంలో మాత్రం కొంత వెనుకబడే ఉంది. వర్ఘీస్‌ కురియన్‌ తెచ్చిన క్షీర విప్లవం (వైట్‌ రివల్యూషన్‌) పుణ్యమాని పాల ఉత్పాదనలో మన దేశం పూర్తి స్వయంసమృద్ధి సాధించగలిగింది. కురియన్‌ తెచ్చిన క్షీర విప్లవం ప్రపంచంలోనే అతిపెద్ద పాడి అభివృద్ధి కార్యక్రమంగా గుర్తింపు పొందింది. స్వాతంత్య్రం వచ్చిన తొలి పాతికేళ్లలో మన దేశంలో పాలకు విపరీతమైన కొరత ఉండేది. ఆ కొరత తీర్చడానికి ప్రభుత్వం 1965లో నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డును ఏర్పాటు చేసింది. అప్పటికే గుజరాత్‌లోని ఆనంద్‌ కేంద్రంగా పాడి సహకార సంస్థ ‘అమూల్‌’ను విజయవంతం చేసిన వర్ఘీస్‌ కురియన్‌ను అప్పటి ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌గా నియమించారు. ‘అమూల్‌’ నమూనాను దేశవ్యాప్తంగా అమలు చేయాలనే లక్ష్యంతో ‘ఆపరేషన్‌ ఫ్లడ్‌’ పేరిట చేపట్టిన క్షీర విప్లవం సత్ఫలితాలను సాధించింది. దేశవ్యాప్తంగా పాల ఉత్పాదన ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. ఫలితంగా ప్రపంచ స్థాయిలోనే పాల ఉత్పత్తిలో భారత్‌ అగ్రగామిగా ఎదిగింది.

కల్తీ అనర్థాలు
పాలలో నీళ్లు కలపడం చాలాకాలం నుంచి తెలిసినదే. నీళ్లు కలిపితే పాలు పలచగా మారిపోతాయి. అలా పలచగా మారకుండా ఉండటానికి, నీళ్లు కలిపినా స్వచ్ఛమైన పాలలా భ్రమింపజేయడానికి కల్తీరాయుళ్లు నానారకాల పదార్థాలను పాలలో కలుపుతున్నారు. యూరియా, పిండి, డిటర్జెంట్, వనస్పతి, అమోనియం సల్ఫేట్, ఫార్మాలిన్, హైడ్రోజన్‌ పెరాక్సైడ్, సోడియం బైకార్బొనేట్, బోరిక్‌ ఆసిడ్‌ వంటివి ఇష్టానుసారం కలిపేస్తున్నారు. పాల ఉత్పత్తిని పెంచడానికి పాడి పశువులకు ఇష్టానుసారం ఆక్సిటోసిన్‌ ఇంజెక్షన్లు ఇస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని చాలాచోట్ల ఇలాంటి పద్ధతుల్లో కల్తీ చేసిన పాలనే పాల కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు.

అక్కడి నుంచి వివిధ బ్రాండ్ల పేర్లతో ప్యాకెట్లలో కల్తీ పాలు మార్కెట్‌లోకి వచ్చిపడుతున్నాయి. గత్యంతరం లేని జనాలు ఈ పాలనే తాగుతూ రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. కేవలం పాలను మాత్రమే కాదు, పాల ఉత్పత్తులను కూడా కల్తీరాయుళ్లు యథాశక్తి కల్తీ చేసి పారేస్తున్నారు. పెరుగు, వెన్న, నెయ్యి, కోవా, పనీర్, రబ్డీ వంటి పాల ఉత్పత్తుల్లో పిండి, వనస్పతి, బ్లాటింగ్‌ పేపర్, కృత్రిమ రంగులు కలుపుతున్నారు.

 అధికారులు అప్పుడప్పుడూ దాడులు చేస్తూ కల్తీరాయుళ్లను పట్టుకుంటున్నా, పాల కల్తీని పూర్తిగా కట్టడి చేయడంలో మాత్రం విఫలమవుతున్నారు. సహజసిద్ధమైన పాలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో, కల్తీ పాలు ఆరోగ్యానికి అంతకు రెట్టింపు చేటు చేస్తాయి. కల్తీ పాల వల్ల జీర్ణకోశ సమస్యలు, కిడ్నీ వ్యాధులు, గుండెజబ్బులు తలెత్తుతాయి. చక్కెర జబ్బు, అధిక రక్తపోటు ఉన్న రోగులు ఇలాంటి కల్తీ పాలు తాగితే వారి పరిస్థితి మరింత విషమించే ప్రమాదం కూడా లేకపోలేదు.

ప్రైవేటు పా‘పాలు’
మన దేశంలో కల్తీపాలు మార్కెట్‌ను ముంచెత్తడానికి ప్రైవేటు డెయిరీ సంస్థలే ప్రధాన కారణం. లాభార్జనే ధ్యేయంగా గల ప్రైవేటు డెయిరీ సంస్థలు నానారకాల ప్రమాదకర రసాయనాలతో పాలను కల్తీ చేయడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు. తెలుగు రాష్ట్రాలనే నమూనాగా తీసుకుంటే పాల కల్తీ పరిస్థితి అర్థమవుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1994లో ప్రభుత్వరంగ సంస్థగా ఆంధ్రప్రదేశ్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ‘విజయ’ బ్రాండ్‌తో పాల ప్యాకెట్లను మార్కెట్‌లోకి తెచ్చింది. తర్వాత క్రమంగా ప్రైవేట్‌ డెయిరీ సంస్థలు రంగప్రవేశం చేశాయి. ‘విజయ’ డెయిరీ నాణ్యత గల పాలను అందిస్తుండగా, ప్రైవేటు సంస్థలు ఉత్పత్తిని పెంచుకోవడానికి నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలిచ్చేశాయి.

 ముఖ్యంగా ‘హెరిటేజ్‌’ సంస్థ డెయిరీ రంగంలోకి అడుగుపెట్టాక ‘విజయ’ వెనుకబడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సంస్థ అయిన ‘హెరిటేజ్‌’కు లాభాల పంట పండించాలనే లక్ష్యంతోనే అప్పటి ప్రభుత్వం ‘విజయ’ డెయిరీని ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం వివిధ డెయిరీ సంస్థలకు చెందిన పాల నమూనాలను నిర్వహించగా, హెరిటేజ్‌ సహా పదకొండు ప్రైవేటు డెయిరీ సంస్థలు సరఫరా చేస్తున్న పాలలో డిటర్జెంట్, ఇతర రసాయనాలు ఉన్నట్లు తేలింది. చిన్నా చితకా స్థాయిలో కల్తీలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటున్న అధికార యంత్రాంగం కల్తీలకు పాల్పడుతున్న బడా డెయిరీ సంస్థలపై చర్యలు తీసుకున్న దాఖలాలు ఇప్పటి వరకు లేవు.

పాల కోసం మనుషులు పశువులను పెంచడం పదివేల ఏళ్ల కిందటే మొదలైంది. పలు ప్రాచీన నాగరికతలు పాలను పవిత్ర పానీయంగా భావించేవి. వివిధ దేశాల పౌరాణిక సాహిత్యంలో పాలకు సంబంధించిన ప్రస్తావనలు ఉన్నాయి.

క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల నాటికి ప్రాచీన ఈజిప్షియన్లు భారీ స్థాయిలో పాడి పశువులను పెంచేవారు. విరివిగా పాలను వినియోగించేవారు.

పాలను తోడుబెట్టి పెరుగు తయారు చేయడం, వెన్న సేకరించడం వంటి ప్రక్రియలు క్రీస్తుపూర్వం 5000 సంవత్స రాల నాటికే మానవులకు తెలుసు. ప్రాచీనకాలంలోనే భారతీయులు పాలతో రకరకాల వంటకాలను తయారు చేసేవారు.

ప్రాచీన రోమన్, ఈజిప్షియన్‌ మహిళలు గాడిద పాలను సౌందర్య సాధనంగా వాడేవారు. క్లియోపాత్రా, నీరో చక్రవర్తి భార్య స్పోరస్‌ ఏకంగా గాడిద పాలతో స్నానం చేసేవారు.

సోయాగింజలతో కృత్రిమ పాలను తయారు చేసే ప్రక్రియ చైనాలో క్రీస్తుపూర్వం రెండో శతాబ్ది కాలంలో మొదలైంది. చాలాకాలం వరకు మిగిలిన ప్రపంచానికి సోయాపాల గురించి తెలియదు. అమెరికన్‌ మార్కెట్‌లో మొదటిసారిగా 1979లో సోయాపాలు అందుబాటులోకి వచ్చాయి. కొందరు శుద్ధ శాకాహారులు పాడిపశువుల నుంచి సేకరించిన సహజమైన పాల బదులు సోయాపాలు తాగడం ఫ్యాషన్‌గా కూడా మారింది.

ఫ్రెంచి శాస్త్రవేత్త లూయీ పాశ్చర్‌ 1863లో పాశ్చరైజేషన్‌ ప్రక్రియను కనిపెట్టిన తర్వాత పాలలోని సూక్ష్మజీవులను నాశనం చేసి, పాలను సురక్షితంగా సరఫరా చేసే అవకాశం అందుబాటులోకి వచ్చింది.

పారిశ్రామికీకరణ తర్వాత ప్రపంచవ్యాప్తంగా పాలకు గిరాకీ పెరగడమే కాదు, పాల ఉత్పాదన కూడా గణనీయంగా పెరిగింది. ప్రపంచంలోనే తొలి డెయిరీ సంస్థ న్యూయార్క్‌ డెయిరీ కంపెనీ 1877లో మొదలైంది. అప్పట్లో ఈ సంస్థ గాజు సీసాల్లో పాలను ప్యాక్‌చేసి సరఫరా చేసేది.

పాలకు ప్రత్యామ్నాయాలు
ఆవుపాలు, గేదెపాలలో ఉండే ల్యాక్టోజ్‌ కొందరికి సరిపడదు. అలాంటి వాళ్లకు పాలలోని పోషకాలు అందాలంటే వారికి తగిన ప్రత్యామ్నాయం సోయాపాలు. సోయా గింజలను నానబెట్టి, బాగా నీరు చేర్చి రుబ్బి సోయాపాలు తయారు చేస్తారు. పాడి పశువుల పాలకు దీటుగా సోయాపాలలోనూ ప్రొటీన్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పాడి పశువుల పాలు సరిపడని వారు మాత్రమే కాదు, జంతు సంబంధ ఆహారానికి పూర్తిగా దూరంగా ఉండే శుద్ధ శాకాహారులు (వీగన్స్‌) కూడా పాడి పశువుల పాలకు బదులుగా సోయాపాలు, సోయాపాల ఉత్పత్తులను విరివిగా వాడుతున్నారు. ఆవుపాలు, గేదెపాలతో తయారయ్యే పనీర్‌ బదులుగా సోయాపాలతో తయారయ్యే తోఫుతో కూడా రకరకాల వంటకాలను ఆస్వాదిస్తున్నారు. పాడి పశువుల పాలకు బదులుగా కొందరు కొబ్బరి పాలు, బాదంగింజల పాలు వంటివి కూడా విరివిగా వాడుతున్నారు.

మరిన్ని వార్తలు