మరో ఎనిమిదేళ్లలో..

7 Jul, 2019 10:19 IST|Sakshi

జూలై 11 ప్రపంచ జనాభా దినోత్సవం

మరో ఎనిమిదేళ్లు పూర్తయ్యే సరికి జనాభాలో అతిపెద్దదేశంగా భారత్‌ అవతరించనుంది. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి ఇటీవలే ప్రకటించింది. ప్రస్తుతానికి ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా చైనా కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోంది. త్వరలోనే భారత జనాభా చైనాను అధిగమించనుంది.
ప్రస్తుతం చైనా జనాభా: 138.6 కోట్లు
భారత జనాభా:    125.6 కోట్లు

రెండు దేశాల్లోనూ జననాల వృద్ధి రేటు అంచనాల ప్రకారం 2028 నాటికి రెండు దేశాల జనాభా చెరో 145 కోట్ల మేరకు చేరుకుంటుందని, జననాల వృద్ధి రేటు చైనాలో తక్కువగా ఉన్నందున జనాభాలో భారత్‌ అగ్రస్థానానికి చేరుకుంటుందని ఐక్యరాజ్య సమితి అంచనా. గడచిన కొన్ని దశాబ్దాలుగా చైనా, భారత్‌లలో జనాభా పెరుగుదల గణనీయంగా నమోదైంది. జనాభా నియంత్రణ కోసం చైనా కఠినమైన నిబంధనలను అమలు చేయడంతో, కొన్నేళ్లుగా చైనాలో జననాల వృద్ధిరేటు నెమ్మదించింది.

1950లో...
చైనా జనాభా: 54.4 కోట్లు
భారత జనాభా:37.6 కోట్లు

1950 నాటితో పోలిస్తే, చైనా జనాభా రెండున్నర రెట్లకు పైగా పెరిగింది. భారత జనాభా మూడు రెట్లకు పైగానే పెరిగింది. ఈ లెక్కల ప్రకారం చైనా కంటే భారత్‌లోనే జననాల వృద్ధిరేటు ఎక్కువగా నమోదవుతున్నట్లు స్పష్టమవుతోంది. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం 2013 నాటికి ప్రపంచ జనాభా 720 కోట్లకు చేరుకుంది. 2025 నాటికి ఈ సంఖ్య 810 కోట్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని, 2050 నాటికి 960 కోట్లకు, 2100 నాటికి ప్రపంచ జనాభా 1090 కోట్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని ఐక్యరాజ్య సమితి అంచనా.

మరిన్ని వార్తలు