ఆవిష్కరణం: ఆడవాళ్ల సౌకర్యం కోసమట!

24 Nov, 2013 06:05 IST|Sakshi
ఆవిష్కరణం: ఆడవాళ్ల సౌకర్యం కోసమట!

రిస్ట్‌వాచ్‌ను కట్టుకోవడంలోనూ, దాంతో టైమ్ చూసుకోవడంలోనూ ఆడవాళ్లకూ, మగవాళ్లకూ ప్రత్యేకమైన స్టైల్ ఉంది. సంప్రదాయం ఉంది. ‘యూని సెక్స్ థియరీ’ పాపులర్ అయిన నేటి రోజుల్లో కూడా వాచ్‌ల విషయంలో ఇంత వైరుధ్యాలు ఉండటానికి కారణం మూలాల్లోనే ఉంది! అసలు ప్రపంచంలో తొలిసారి రిస్ట్ వాచ్ రూపొందించింది ఒక మహిళ కోసమేనట. అంత వరకూ ‘టైమ్ కీపింగ్ డివైజ్’లను జేబులో వేసుకొని తిరిగే సంప్రదాయం ఉండేది. అయితే 1868లో  పటెక్ ఫిలిప్పీ అనే స్విస్ వాచ్ మ్యానుఫ్యాక్చరర్ హంగేరీకి చెందిన కొస్కోవిజ్ అనే మహిళ కోసం తొలిసారిగా రిస్ట్‌వాచ్‌ను రూపొందించినట్టు తెలుస్తోంది. చరిత్రలో ఇదే తొలి రిస్ట్‌వాచ్ అని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేర్కొన్నారు. అది ఆమెకు చాలా బాగా నచ్చడంతో వాచ్ మహిళల ఆభరణంలో ఒకటైంది. అంత వరకూ బ్రాస్‌లైన్‌ను చేతికి ధరించే మహిళలు దానికి ప్రత్యామ్నాయంగా వాచ్‌లను ధరించడం మొదలైంది. అలా మహిళలకే పరిమితం అయిన రిస్ట్‌వాచ్ బ్రెజిల్‌కు చెందిన అల్బర్టో శాంటోస్ అనే పరిశోధకుడి పుణ్యామా అని పురుషులకు కూడా అలవాటుగా మారింది.
 
  20 శతాబ్దం వాడైన శాంటోస్ తన పరిశోధనల్లో భాగంగా అనుక్షణం టైమ్ చూసుకోవాల్సి వచ్చేది. దీంతో తన కోసం చేతికి కట్టుకొనేలా ఒక వాచ్‌ను రూపొందించాలని శాంటోస్ తన స్నేహితుడైన లూయిస్ కార్టియర్ అనే పరిశోధకుడిని కోరాడట. అతడు తన స్నేహితుడి కోసం ఒక ప్రత్యేకమైన డిజైన్‌తో రిస్ట్‌వాచ్‌ను రూపొందించాడు. దీంతో రిస్ట్‌వాచ్‌లు పురుషులకు, మహిళలకు అంటూ భిన్నమైనవిగా మారాయి. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో పురుషులు వాచ్‌లను మణికట్టుకు కట్టుకోవడం మొదలైంది. అలా సైనికులతో మొదలైన ఈ రిస్ట్‌వాచ్ ధారణ క్రమంగా విస్తృతమైంది.

మరిన్ని వార్తలు