లవ్ చెప్పాలా? వద్దా?

10 Apr, 2016 11:49 IST|Sakshi
లవ్ చెప్పాలా? వద్దా?

జీవన గమనం
నేను ఇంజినీరింగ్ చదువుతున్నాను. చిన్నప్పట్నుంచీ ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తున్నాను. కానీ ఆ విషయం ఎప్పుడూ తనకు చెప్పలేదు. ఇద్దరం చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. తను కూడా నాతో చాలా బాగా మాట్లాడుతుంది. కానీ నేను తనని ప్రేమించినట్టుగా తను నన్ను ప్రేమిస్తుందో లేదో మాత్రం నాకు తెలీదు. పోనీ నేనే ప్రపోజ్ చేద్దామంటే ఎలా రియాక్ట్ అవుతుందోనని భయమేస్తోంది. చేయొచ్చా లేదా అనిపిస్తుంది. ఎటూ తేల్చుకోలేక మిమ్మల్ని సలహా అడుగుతున్నాను. దయచేసి మీరు సలహా ఇవ్వండి సర్. నేను ఆ అమ్మాయికి నా ప్రేమను తెలపవచ్చా? లేక లైఫ్‌లో సెటిల్ అయ్యాక చెప్పమంటారా?  
 - జ్యోతిప్రకాశ్, మెయిల్   
                                                                                                      
 
అజ్ఞాతవాసం ముగించి ధర్మరాజు తిరిగి తన రాజ్యానికి వెళ్లబోతున్న సమయంలో, ముందు రోజు, ఒక బిచ్చగాడు బిక్షం అడిగాడట. రేపు రా! అన్నాడట ధర్మజుడు. అది విని భీముడు ఒక డప్పు తీసుకొని కొండపై కెక్కి నాలుగు దిక్కులు వినపడేలా ‘సత్యవంతుడు నా అన్నయ్య తొలిసారి అబద్ధం చెప్పాడు’ అని గట్టిగా అరిచాడట.   అతడి చాటింపు అర్థం కాని ధర్మరాజు వివరణ అడిగితే భీముడు ఇలా అన్నాడట. ‘‘అన్నా! రేపటి వరకూ ఆ బిచ్చగాడు బతికుంటాడో లేదో నీకు తెలియదు. నీవు ఉంటావో లేదో అతడికి తెలియదు. మనం వెళ్లాక రాజ్యం దక్కుతుందో లేదో మనకు తెలియదు. రాజ్యం వచ్చాక కూడా నీ మనసు ఇటువంటి దయాగుణంతో ఉంటుందో లేదో ఎవరికీ నమ్మకం లేదు. అయినా నువ్వు ఈ వాగ్దానం చేశావంటే, అది అనృతం కాక మరేమిటి?’’
    
ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే.. మీరు లైఫ్‌లో సెటిలయ్యే సరికి మీ మనసులో ఆ అమ్మాయి పట్ల ఇంకా అంత ప్రేమ ఉంటుందో లేదో మీకు తెలియదు. మీరు పూలదండ పట్టుకు వెళ్లేసరికి అప్పటికింకా ఆ అమ్మాయి అవివాహితగానే ఉంటుందో లేదో ఆమెకు తెలియదు. ఇంకో కుర్రాడి ప్రేమలో పడకుండా ఉంటుందో లేదో మనకు నమ్మకం లేదు. కాబట్టి, మీరు మీ ప్రేమ భావాన్ని వెంటనే వెళ్లి ఆ అమ్మాయికి చెప్పండి. అయితే దానికి ముందు మీరు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేసుకోండి:
    
మీ పెద్దలు, ఆమె పెద్దలు మీ వివాహానికి ఒప్పుకుంటారా? ఒప్పుకోక పోయినా మీరు వివాహం చేసుకునే ఆలోచనలో ఉన్నారా? అలా చేసుకుంటే ఇంజినీరింగ్ చదివే మీకు, సంసారం నిలబెట్టేటంత ఆర్థిక స్తోమత ఉందా? లేక మీ కాళ్ల మీద నిలబడే వరకు తల్లిదండ్రుల మీద ఆధారపడి తిని, ప్రేమ విషయం రహస్యంగా ఉంచి, ఆ తర్వాత వాళ్లు కాదంటే, ఎదిరించి వెళ్లి పోదామని అనుకుంటున్నారా? అది అన్నింటికన్నా నీచమైనది.

నేను ఓ గవర్నమెంట్ స్కూల్లో టీచర్‌గా చేసి రిటైరయ్యాను. మావారు పోయారు. కొడుకు, కోడలు ఉద్యోగాలు చేస్తున్నారు. మూడేళ్ల మనవడిని నేనే చూసుకోవాలి. అది నాకు ఆనందమే. కానీ పిల్లాడిని రోజంతా నేను చూస్తున్నాను కదా అని కోడలు తను వచ్చాకయినా వాడి బాధ్యత తీసుకోదు. పైగా పొద్దున్న నేనే వంట చేసి ఇద్దరికీ బాక్సులు పెట్టాలి. సాయంత్రం వచ్చేసరికి వంట చేసివుంచాలి. ఇదంతా చాలా కష్టంగా అనిపిస్తోంది. కొడుకుతో చెబుదామంటే చాడీలు చెబుతున్నాను అనుకుంటా డేమోనని భయం. నేనేం చేయాలి?
 - రాజ్యలక్ష్మి, సికింద్రాబాద్

 
ఇదే సమస్య మీ కోడలు ముందు ఉంచితే ఆమె ఏమని వాదిస్తుందో మీకు తెలుసా?.. ఆఫీసులో రెక్కలు ముక్కలు చేసుకొని వస్తాం, ఆవిడగారు ఇంట్లోనే ఉంటుంది కదా, పొద్దున్నే కాస్త బాక్సులు సర్దిచ్చి, సాయంత్రం వచ్చేసరికి వంట చేసి ఉంచితే అలిసిపోతుందా అంటుంది. ఉమ్మడి కుటుంబాల్లో వచ్చే సమస్యలే ఇవి. ఒకరి బాధ్యతను మరొకరు వెసులుబాటుగా చూస్తారు. ఒకరి ఆనందాన్ని మరొకరు ‘కోల్పో తున్న హక్కు’ గా భావిస్తారు. మీరు మీ సమస్య గురించి మీ అబ్బాయితో చెబితే ‘చాడీలు చెబు తున్నారని’ అనుకోకపోవచ్చు, మీ బాధ అర్థం చేసుకోవచ్చు.

మీరెలా ఫీల్ అవుతున్నారో తన భార్యతో చెప్పొచ్చు. కానీ దానికి ఆమె రియాక్షన్ మాత్రం తప్పకుండా నెగిటివ్‌గానే ఉంటుంది. ఒకవేళ మీరు ఆమెతోనే డెరైక్ట్‌గా మాట్లాడినా, ఫలితం పైన చెప్పిన విధంగానే ఉండొచ్చు. మీరు రెండు విషయాలు ముందు తేల్చుకోండి. మీకు వస్తున్న పెన్షన్ ఏం చేస్తున్నారు? మీ మనవడిని వదిలి మీరు కొంతకాలం ఉండ గలరా? తీర్థయాత్రల నెపంతోనో, బంధువుల దగ్గరికి వెళ్తున్నాననో కొన్ని రోజులు వాళ్లకు దూరంగా ఉండండి.

బాధ పడుతూ ఒక ఇంట్లో ఉండటం కన్నా, దూరంగా ఉండటం మేలు కదా! అలా అని శాశ్వతంగా దూరంగా ఉండ మనటం లేదు. చిన్నవాళ్లకు వాళ్ల బాధ్యత తెలిసొచ్చేలా చేయమంటున్నాను. ఇంకొన్నాళ్లు పోతే మీ మనవడు కూడా స్కూల్‌కు వెళ్లడం మొదలు పెడతాడు. అప్పుడు మీకు మరింత తీరిక దొరకవచ్చు. ముందు మీరు మీ సమస్యని విశ్లేషించుకోండి. మీ సమస్య ఓపిక లేకపోవటమా? లేక ఇంట్లో చాకిరి అంతా నేనే చేస్తున్నానన్న ఫీలింగా?
- యండమూరి వీరేంద్రనాథ్

మరిన్ని వార్తలు