చావాలనిపిస్తుంది...

23 Jul, 2016 22:06 IST|Sakshi
చావాలనిపిస్తుంది...

జీవన గమనం
నేను ఒక ఫైనాన్షియల్ కంపెనీలో ఉద్యోగానికి చేరాను. ఆ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనలు కూడా వస్తున్నాయి. ఆ జాబ్‌లో చేరకముందు నేను చాలా సంతోషంగా ఉండేవాణ్ని. ఇప్పుడు నేను ఏదో పోగొట్టుకున్న వాడిలా మారాను. ఈ పరిస్థితి భరించలేక రిజైన్ చేసేశాను. నేను జాబ్‌కి రిజైన్ చేయడం మా ఇంట్లో వాళ్లకు నచ్చడం లేదు. మా నాన్న రోడ్డుపక్కన బండి మీద పండ్లు అమ్ముతుంటారు. మా వాళ్లు  నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఈ పరిస్థితిలో నాకు లేనిపోని ఆలోచనలతో నిద్రపట్టడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వండి.                                                                 
- అభిరామ్, ఊరు పేరు లేదు

 
ఆఫీసు వాతావరణం నచ్చకపోయినా, చేయవలసిన పని చేతకాకపోయినా, పైఅధికారులు శాడిస్టులైనా చచ్చిపోవాలని అనిపించడం సహజం. ఒక కుర్రవాడికి ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. అది తనకి నచ్చడం లేదని, మానేస్తాననీ అన్నప్పుడు అందరూ ముక్కున వేలేసుకున్నారు. నేను మాత్రం ‘‘నువ్వు చేపవైతే. ఈదుతున్న చెరువులో నీరు నచ్చకపోతే బయటకు వచ్చి చచ్చిపో. అంతే తప్ప జీవితాంతం దుఖిస్తూ ఆ మురికిలోనే బతక్కు’’ అని సలహా ఇచ్చాను. అయితే బతుకు కొనసాగించటం కోసం తాత్కాలికంగానైనా కొన్నిసార్లు మనకి నచ్చని పనులు చెయ్యక తప్పదు.

మీ నాన్నగారు ఎండలో, వర్షంలో నిలబడి పండ్లు అమ్ముతూ ఉంటారు. వీలైనంత త్వరగా ఆయన్ని ఆ శ్రమ నుంచి తప్పించటం మీ బాధ్యత కాదా? నచ్చని పని మానేశారు సరే. ప్రస్తుతం ఏం చేస్తున్నారు? పని లేకుండా కూర్చోవటం కన్నా, ఆలోచనలతో నిద్రలేని రాత్రులు గడపటం కన్నా నికృష్టం ఇంకొకటి ఉండదు. మీరేం చెయ్యగలరో ఆలోచించండి. ఏదో ఒకటి మాత్రం చెయ్యటం మానకండి. కొంతకాలం అయ్యాక మీకు ఇష్టమైన వృత్తిలోకి మారండి. కొంతకాలం పని చేసి, ఆ తర్వాత తమకు ఇష్టమైన వృత్తిలో ప్రవేశించిన నటులు, క్రీడాకారులు, రచయితలు ఈ సూత్రమే అమలు జరిపారు.
 
నాకు బీటెక్ అంటే ఇష్టం లేదు. కానీ మా డాడీ నన్ను బలవంతంగా జాయిన్ చేశారు. నాలుగేళ్లు కంప్లీట్ చేశాను కానీ ఇప్పుడు అయిదు సబ్జెక్ట్స్ బ్యాక్‌లాగ్‌లో ఉన్నాయి. చదవాలనే ఉన్నా, ఇంటరెస్ట్ రావడం లేదు. చదువు మీద దృష్టి పెట్టలేకపోతున్నాను. డిప్రెషన్‌లో ఉండటం వల్ల సైకియాట్రిస్ట్‌ను కలిశాను. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. ఏం చేయాలో అర్థం కావడంలేదు. దయ చేసి సలహా ఇవ్వగలరు.   
- లత, పాలకొల్లు

 
సైకియాట్రిస్ట్‌ను కలిసేటంత డిప్రెషన్‌కి గురైనవారు మిగిలిపోయిన సబ్జెక్ట్స్‌ను పూర్తి చేయగలరా? ఆలోచించుకోండి. పిల్లల కెపాసిటీ, అభిరుచి తెలియకుండా కోర్సులు చదివించే పెద్దలకు మీ ఉత్తరమే సమాధానం. అయితే, జీవితాన్ని తిరిగి పునర్నిర్మించుకోండి. మీకు స్ఫూర్తిగా ఉండటం కోసం ఒక వాస్తవగాథ చెబుతాను. అరవయ్యేళ్ల కల్నల్ సాండర్స్ రిటైరైన రోజు, ఒక చెట్టు కింద కూర్చొని తను ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు వివరిస్తూ ఒక ఉత్తరం రాశాడు. అతడి అయిదో ఏట తండ్రి చనిపోయాడు.

పదహారవ ఏట స్కూలు మానేశాడు. పదేళ్లలో పదిహేను ఉద్యోగాలు మారాడు. అందులో అయిదు పని చెయ్యటం చేతకాదని వెళ్లగొట్టినవే. ఇరవయ్యో ఏట భార్య వదిలేసింది. ఒక హోటల్లో వంటింట్లో అంట్లు తోమే పనిలో చేరాడు. అరవై అయిదో ఏట రిటైర్ అయినప్పుడు 105 డాలర్ల చెక్కు వచ్చింది. జీవితంలో చివరి వరకు మిగిలింది ఇదేనా అన్న డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకోవాలని ఉత్తరం రాస్తూ ఉండగా... ఇంకేదైనా చెయ్యమని చేతిలో ఉన్న చెక్కు చెప్పింది. తెలిసింది వంట చెయ్యటం మాత్రమే. అప్పుడు నాలుగు కోళ్లు కొని రోడ్డు పక్కనే వేపుడుముక్కలు అమ్మాడు.

రెండో ప్రపంచ యుద్ధకాలంలోని సంఘటన ఇది. అంత రుచికరమైన కోడిని ఎన్నడూ తినలేదని బ్రిటిషర్లు, అమెరికన్లు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఇరవయ్యేళ్ల తర్వాత.. అంటే 85వ ఏట, సాండర్స్ తన కంపెనీని మూడు కోట్ల రూపాయలకు అమ్మాడు. అదే కేఎఫ్‌సీ.

ప్రతి మనిషిలోనూ ఏదో ఒక అంతర్గత కళ ఉంటుంది. దాన్ని గుర్తించటమే గెలుపు. వీలైతే ‘అవేకెన్ ది జైంట్ వితిన్’ అన్న పుస్తకాన్ని చదవండి. డిప్రెషన్ తగ్గుతుంది. గమ్యం తెలుస్తుంది.
- యండమూరి వీరేంద్రనాథ్

మరిన్ని వార్తలు