'టక్కు'టమారం

9 Oct, 2016 03:23 IST|Sakshi
'టక్కు'టమారం

పరమ స్టైలిష్‌గా కనిపించడానికి ప్రత్యేకంగా చొక్కాను ప్యాంటులోకి దోపే ట్రెండును టక్కు అంటారన్నది తెలిసిందే. ఈ టక్కుటమార విద్యను ప్రధానంగా అమ్మాయిలను ఆకర్షించడం కోసమే అంటారు అనుభవజ్ఞులు. అందుకే టక్కరులు ప్రదర్శించే ఫ్యాషను కాబట్టి దీనికి టక్కు అని పేరొచ్చిందని వ్యుత్పత్తిని బట్టి భాషావేత్తలు చెబుతుంటారు. టక్కులు పెక్కురకాలు. హృదయటక్కు. మీడియం టక్కు. లోబ్యాక్ టక్కు. బెల్‌బాటమ్స్ టైమ్‌లో గుండెకు ఇంచుమించు దగ్గరగా ఉండేది టక్కు. దీన్ని హృదయటక్కు అని పిలుచుకునేవారు. సాధన మీద ధ్యానం మూలాధారం నుంచి పైకి ప్రవహించినట్లే...

ఏ సాధనా లేకుండానే టక్కు కిందికి జారింది. హృదయ టక్కు కొన్నాళ్లకు పొట్ట చేరి... ఇప్పుడు క్రమంగా నడుముకు జారింది. నడుము టక్కు లేదా లోబ్యాక్ టక్కు అన్నది ప్యాంటు నడుము కిందికి చాలా లోతుల్లోకి జారిపోతూ ఎక్కడో పాతాళంలో వేసినట్టుంది. అంతకంటే మరి కిందికి జారనివ్వవద్దని ఫ్యాషనేతరులు ఫ్యాషన్ ప్రియులను కోరుతున్నారు. బిక్కుబిక్కుమంటూ లో-వెయిస్టు టక్కరులను కోరుతున్నారు.
 
అంతకు ముందు స్కూలు యూనీఫామ్ రూపంలో వేసే టక్కు కంటే టీనేజీలోకి వచ్చాక ఈ వయసులో టక్కుకు ఉండే ప్రాధాన్యం వేరు. ఆ దృష్టి వేరు. అందుకే ఇలాంటి బీటరులైన (బీటు కొట్టేవారైన) టక్కిస్టులు ప్రదర్శించే ట్రిక్కుటమార ఫ్యాషను కాబట్టి దీన్ని అనుసరించే వారిని టక్కరి అని పిలవవచ్చా అనేది ఒక హేతుబద్ధమైన సందేహం.  
 
నిజజీవితంలో అలాంటివారిని మనం ఎప్పుడూ చూడం గానీ... పాత సినిమాల్లో లెక్కలు చూసే గుమస్తాలు... ఒకనాటి మూవీలలోని ప్లీడర్లు చక్కగా పంచెకట్టుకుని మరీ టక్కువేసి... ఆ పంచె మీద బెల్టు కట్టేవారు. అంతకు ముందు అలవాటు లేకుండా కొత్తగా టక్కు మొదలు పెట్టినవారు కాస్త ఇబ్బంది ఇబ్బందిగా కదుల్తుంటారు. అస్తమానం టక్కు సర్దుకుంటుంటారు. ఇక టక్కుకు పునాదిలాంటి పొట్ట మరీ లోతుకుపోయినా కష్టమే. ముందుకు పొడుచుకువచ్చినా కష్టమే.

కాబట్టి టక్కు అందరూ అనుకుంటున్నంత వీజీ కాదని విజ్ఞులు గ్రహించాలి. అయినా మితిమీరి మెక్కడం టక్కుకు చేటు తీసుకొస్తుందని ఫ్యాషనేతరులూ తెలుసుకోవాలి. వివాహానికి ముందు వేసిన టక్కును పెళ్లి తర్వాత కూడా కొనసాగించక తప్పదు. ఎందుకంటే ఇంతి లేని ఇల్లు... ఇన్‌షర్టు లేని డ్రస్సు చూడటానికి అంత బాగుండవని సామెత.
 
కొందరు ఎప్పుడూ టక్కుతోనే కనిపిస్తారు. కర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్లుగా వీళ్లసలు టక్కుతోనే పుట్టారేమోనని డౌటొచ్చేలా ఉంటారు. వీళ్లను టక్కు లేకుండా గుర్తుపట్టలేం. వాళ్లు కూడా మనం గుర్తు పట్టేందుకు వీలుగా మన సౌలభ్యం కోసమే టక్ చేస్తారు. వీళ్లను నిత్యటక్కరులని అనుకోవచ్చు. టక్కు నాగరకతకు సూచన. కానీ మేధావులకు టక్కు నుంచి మినహాయింపు ఉంటుంది. వాళ్లు మాత్రం టక్కు వేయరు. ఈ టక్కు నిరసనకారులు కేవలం జీన్స్ మాత్రం తొడిగి దానిపై పొడవుగా, కాస్తంత ముతగ్గా ఉండే లాల్చీ వేస్తారు. లాల్చీ ముతకదనం అతడి మేధావి తనానికి అనులోమానుపాతంగా ఉంటుంది.

అనగా... లాల్చి ఎంత ముతకదైతే అంత మేధావి అన్నమాట. ఇప్పుడంటే ఒకింత తగ్గిందిగానీ... గతంలో ఒక చేతి సంచీ కూడా ఈ అవతారానికి తోడయ్యేది. వీళ్లు టక్కును ఆహార్యపరంగా నిరసిస్తారు. టక్కు వేసిన వారి కంటే ఇలాంటి వారిని ‘టక్కు’న గుర్తుపట్టవచ్చు. టక్ టక్ మని తలుపు కొట్టి మాత్రమే లోపలికి ప్రవేశించాలన్నది జంటిల్‌మేన్ రూల్. కాబట్టి టక్ వేసుకోవడం కూడా జంటిల్‌మేన్ రూల్స్‌లో ఒకటిగా మారింది.
 
టక్కుతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ప్యాంటులోపలికి దోపుతాం కాబట్టి... అలా లోపలికి పోయే షర్టు భాగంలో ఎక్కడైనా రంధ్రం ఉన్నా, ఒకట్రెండు చిరుగులు ఉన్నా  పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. షర్టు కింది అంచు కుట్లు ఊడిపోయినా ఆ చొక్కాను ఉపయోగంలోకి తేవచ్చు. ఇది టక్కుకు ఉన్న సౌలభ్యం. కాకపోతే మనమైనా... ఇతరులైనా టక్కు పీకేయకుండా జాగ్రత్త పడాలి.
 
అయితే టక్కుకు కొన్ని పరిమితులున్నాయి. కొన్ని జనరల్ రూల్స్ ఉన్నాయి. బనియన్‌కు టక్కు తప్పదు. లుంగీ మీద టక్కు నప్పదు. టక్కుకు షూ ఉండటం మేలు. చెప్పులైనా పర్లేదు. మనలో మన మాట చెప్పుల మీద టక్కు అంత ప్రభావపూర్వకంగా ఉండదు. అందుకే కొందరు షూ లేకపోవడం అనే కారణంగా టక్కు వేసుకోరు. ఇక టీ షర్టుకు, మామూలు ప్యాంటుకు టక్కు ఎంతమాత్రమూ కుదరదు. బెల్టుకూ ఇంచుమించూ ఇదే సూత్రం వర్తిస్తుంది. ఇవన్నీ ఎవరూ రాయని జనరల్ రూల్స్. కానీ ఎవరికి వారు అర్థం చేసుకొని అందరూ పాటిస్తూ ఉంటారు.
 
ఏది ఏమైనా టక్కు అంటే బంగారపు ఉంగరంలో పొదిగిన వజ్రంలాంటి ప్రెషియస్ స్టోన్ లాంటిది. వజ్రసంకల్పంతో టక్కు వేసేవారు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదీ... పడిశెం పట్టే ముక్కు ఉన్నంత కాలం ఫ్యాషన్‌లో టక్కు ఉంటుంది.
- యాసీన్

మరిన్ని వార్తలు