నేటి ధ్వజస్తంభం కన్నడిగుల కానుక

29 Sep, 2019 04:16 IST|Sakshi

తిరుపతి వెంకన్న సన్నిధిలోకి ప్రవేశించగానే ఎంతటి అధికారి అయినా సరే, ముందుగా ధ్వజస్తంభానికి సాష్టాంగ ప్రణామం చేయడం ఆనవాయితీ. ఎందుకంటే అది కూడా స్వామి రూపమే. లోపలుండే మూలవిరాట్టుకు ఉత్సవమూర్తి ఎలాగో ఇది కూడా అటువంటిదే. ధ్వజస్తంభానికి నమస్కార ప్రదక్షిణాలు పూర్తిచేసిన తరువాతే భగవద్దర్శనం కోసం లోపలికి ప్రవేశించడం ఆచారం. ఆలయంలో ఏవయినా ఉత్సవాలు ప్రారంభించేటప్పుడు ధ్వజారోహణం చేస్తారు. అంటే జయపతాకను కట్టి పై దాకా ఎగురవేస్తారు. పతాకం చూడగానే దూరాన ఉన్నవారు కూడా ఉత్సవాలు ప్రారంభం అయ్యాయనే విషయాన్ని తెలుసుకుంటారు. తిరుమల ఆలయంలో నూతన ధ్వజ స్తంభ పునః ప్రతిష్ఠ వెనుక ఆసక్తికర అంశాలున్నాయి.

తిరుమల శ్రీవారి ఆలయంలో నేల నుంచి 50 అడుగుల ఎత్తుండే ధ్వజస్తంభానికి పై భాగాన గంటల వంటి అలంకరణలుంటాయి. 1982లో టీటీడీ ఇంజినీర్లు ధ్వజస్తంభానికి మరమ్మతులు చేపడుతున్న సమయంలో స్తంభంలో పుచ్చు కనిపించింది. వెంటనే ఆ విషయాన్ని అప్పటి కార్యనిర్వహణాధికారి పి.వి.ఆర్‌.కె.ప్రసాద్‌కు తెలియజేశారు. ఆయన పతాక భాగాన అలంకరణలను తొలగించి చూశారు. కింది భాగాన ఉండాల్సిన మాను పూర్తిగా లేదు. ధ్వజస్తంభం చుట్టూ ఏర్పాటుచేసిన బంగారు రేకు మాత్రం బయటకు కనిపిస్తోంది. లోపలి భాగం చాలావరకు పుచ్చిపోయింది. ఈవో వేదపండితులు, ఆగమ నిపుణులతో చర్చించారు. ధ్వజస్తంభాన్ని పునః ప్రతిష్ఠ చేయాలని నిర్ణయించారు. ఆగమ శాస్త్రం ప్రకారం ధ్వజస్తంభానికి వాడే మానుకు ఎలాంటి తొర్రలు, కొమ్మలు, పగుళ్లు ఉండకూడదు. వంకర లేకుండా దాదాపు 75 అడుగుల ఎత్తు ఉండాలి.

కర్ణాటక రాష్ట్రం దండేరి అడవుల్లో కనీసం 300 సంవత్సరాల వయసున్న చెట్టు ఇందుకు అనుకూలంగా ఉంటుందని ఓ భక్తుడి ద్వారా తెలుసుకున్నారు.కన్నడిగుల కానుకఅప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి గుండూరావు తిరుమల దర్శనానికి వచ్చారు. ధ్వజ స్తంభ పునః ప్రతిష్ఠ విషయాన్ని ఆయనకు తెలియజేశారు పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌. ఆయన కన్నడిగుల కానుకగా ధ్వజస్తంభ పునః ప్రతిష్ఠకు తమ ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. టీటీడీ అధికారులు, కర్ణాటక అటవీశాఖ అధికారులు దండేరి అడవుల్లో వెదుకులాట ప్రారంభించారు. దాదాపు 16 టేకు చెట్లను గుర్తించారు. ధ్వజస్తంభానికి ఉపయోగపడే మానును సిద్ధంచేశారు. దాన్ని ఆ అడవుల నుంచి తరలించేందుకు పేపరు మిల్లు కార్మికులు ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి భారీ ట్రాలీలో ఎక్కించారు. ఘాట్‌ రోడ్డు దాటించారు. కర్ణాటక ముఖ్యమంత్రి దగ్గరుండి జెండా వూపి తిరుమలకు సాగనంపారు. అదే తరహాలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఎట్టకేలకు ఆ భారీ వాహనం తిరుపతి అలిపిరి నుంచి ఘాట్‌ రోడ్డులో తిరుమల చేరుకుంది. మొత్తం మీద అప్పటి టీటీడీ కార్యనిర్వహణాధికారి చొరవ, ఇంజినీరింగ్‌ అధికారుల నైపుణ్యంతో ధ్వజస్తంభం తయారైంది. వేద మంత్రోచ్చారణల మధ్య 1982వ సంవత్సరం జూ¯Œ  10న తిరుమల ఆలయంలో నూతన ధ్వజస్తంభాన్ని వైభవంగా ప్రతిష్టించారు.
– యెండ్లూరి మోహ¯Œ , సాక్షి, తిరుపతి

మరిన్ని వార్తలు