మీరు వదులుకోవాల్సినవి వీటినే!

20 Oct, 2013 02:25 IST|Sakshi
మీరు వదులుకోవాల్సినవి వీటినే!

 వివేకం
  మీకు గాఢమైన అనుబంధం, మీ సంపద మీద, మీ ఇంటి మీదా కాదు. మీ భార్య పట్ల, మీ భర్త పట్ల, మీ సంతానం పట్ల కూడా కాదు. మీకు ఎక్కువ అనుబంధం మీ సొంత ఆలోచనల పట్ల, మీ సొంత భావాల పట్లనే! ఎప్పటికీ అంతే. ‘అదేం కాదు! నా భార్య అంటే నాకు చాలా ఇష్టం, నా పిల్లవాడు అంటే ఇష్టం!’ అని మీరు అనవచ్చు. ఒకవేళ ఎప్పుడైనా మీ భార్య గానీ, మీ పిల్లవాడు గానీ లేక మీ చుట్టూ పరిస్థితులు గానీ, మీకు వ్యతిరేకంగా మారిపోయాయనుకోండి. మీరు అనుకున్నట్లుగానో, మీరు ఆలోచించినట్లుగానో లేవనుకోండి. ఇక వారందరూ ఎడమైపోతారు, దూరమైపోతారు. మీ సొంత ఆలోచనలు, భావనలు మాత్రమే మీతో నిలుస్తాయి.
 
 అసలు మీరు నిజంగా పోగు చేసుకున్నవి మీ ఆలోచనా విధానాలు, మీ ఉద్దేశాలు, మీ సిద్ధాంతాలు, మీ విశ్వాసాలు... ఇవే మీ చుట్టూరా అనేక విధాలుగా విస్తరిస్తాయి. అందువల్ల, మీరు వదిలిపెట్టవలసినది వీటినే. మీ ఇంటినీ, మీ బ్యాంక్ బ్యాలెన్సునీ కాదు. మీ ఆలోచనా విధానం, మీ సిద్ధాంతాలు, మీ వ్యక్తిత్వం, ఇవే వాస్తవంగా మీరు పోగు చేసుకున్నవి. మీరు పారవేయాల్సింది వీటినే. మీ భార్యనో, మీ పిల్లవాడినో, మరొకదాన్నో కాదు.
 
 ‘నాకొక అభిప్రాయం ఉంది’ అని మీరు అంటే అర్థం ఏమిటి? అది ఒక వాస్తవమో, జ్ఞానమో అని కాదు. మీకు ఒక విధమైన ఆలోచన ఉంది, ఊహ ఉంది అని అర్థం. సిద్ధాంతం అంటే ఏమిటి? ఒక క్రమబద్ధం చేయబడిన ఆలోచన. దాని వలన ఏమౌతుంది? అది మిమ్మల్ని వాస్తవానికి దూరంగా తీసుకుపోతుంది.
 
 ప్రస్తుతం మీరిక్కడ కూర్చుని ఇక్కడ లేని ఏ విషయం గురించో ఊహించుకోవటం మొదలుపెడితే, అప్పుడు ఆ ఊహ, మీ చుట్టూ ఉన్న ప్రస్తుత వాస్తవం నుంచి మిమ్మల్ని విడదీస్తుంది. ఇక ఆ ఊహ బాగా క్రమబద్ధం అయిందనుకోండి. అది మిమ్మల్ని వాస్తవం నుంచి పూర్తిగా తీసివేస్తుంది. అప్పుడు వాస్తవికతతో మీకు సంబంధమే లేకుండా పోతుంది. ఊహతో ఉన్న బంధం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది కాబట్టి, కల్పన చాలా ఆకర్షవంతంగా ఉంటుంది. అది పూర్తిగా క్రమబద్ధం అయినప్పుడు, మరీ ఆకర్షవంతం అవుతుంది. ఒకసారి దానితో మీరు మమేకం అయిపోయారంటే చాలు, అది వాస్తవికత నుంచి మిమ్మల్ని సంపూర్ణంగా విడగొడుతుంది. వాస్తవం నుండి అలా మీరు విడిపోయినప్పుడు, మీరు నిజంగా అర్థవంతమైన జీవితం జీవిస్తున్నట్లేనా? మీరు నిజంగా సత్యమైన అర్థంతో జీవిస్తున్నట్లేనా? మీరు జీవితానుభవం నిజంగా పొందుతున్నట్లేనా?
 
 జీవితాన్ని తెలుసుకునే ఒకే ఒక్క మార్గం, జీవితం ఎలా ఉందో అలాగే అవగతం చేసుకోవటం. కానీ, ఏదో ఒక సిద్ధాంతంతో మీ మనసు వక్రమైపోయిందనుకోండి. అప్పుడిక మీరు చూసేదంతా మీ సిద్ధాంతపు దృష్టికి లోబడే ఉంటుంది. అంతేకాని వాస్తవానికి దానితో ఏ సంబంధమూ లేదు.
 
 
 సమస్య - పరిష్కారం
 వయసు పైబడుతున్నకొద్దీ భయం పెరుగుతోంది. వయసు పైబడకుండా ఎప్పటికీ యుక్త వయసులో ఉండడమెలా?
 -జి.రత్నాకర్, హైదరాబాద్
 
 సద్గురు: మీరు పీల్చే గాలి, తాగే నీరు, తినే భోజనం వీటితోనే మీ శరీరం తయారైంది. ఒకసారి సేకరించిన పదార్థాన్ని అవసరం లేదని మీ శరీరం నుండి మీరు పూర్తిగా విసర్జించలేరు. అలాగే ఒకరోజు గడిచిందంటే దానిని మీ వయసులో నుంచి తీసివేయలేరు.
 
 అలాగే మీ మనసు ఎలా ఏర్పడిందో కూడా చూడండి. పుట్టినప్పటినుండి మీ చుట్టూ సమాజం మీకిచ్చిన సలహాలు, మీరు చదివిన చదువు, పొందిన అనుభవాలతో చెత్తబుట్టలా తయారైంది.
 
 అన్నింటినీ మనం ఉంచుకోవాలని ఎవరూ బలవంతపెట్టరు. ఏది విసర్జించాలో ఏది సేకరించాలో మీ చేతిలోనే ఉంది. అవసరం లేని వాటిని వదిలేసి మనసును నవీనంగా ఉంచుకునే స్వతంత్రత, వయసు పైబడనీయక ఎప్పుడూ యుక్త వయసులా ఉంచుకునే సామర్థ్యం మీకు ప్రసాదించబడింది. క్రమబద్ధంగా యోగా చేయడం వల్ల ఇది సాధ్యమౌతుంది. అవకాశం చేజారనీయకండి.
 

మరిన్ని వార్తలు