యంగ్ రిపబ్లిక్

24 Jan, 2015 23:09 IST|Sakshi
యంగ్ రిపబ్లిక్

కవర్ స్టోరీ
ఏ దేశమేగినా ఎందు కాలిడినా... భారత కీర్తి పతాకను రెపరెపలాడిస్తున్నారు ప్రవాస భారతీయులు. అనితర సాధ్యమైన ఘన విజయాలతో మాతృదేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారు. భారత సంతతికి చెందిన సుమారు 40 మంది యువ ప్రవాస భారతీయులు ముప్పయ్యేళ్ల లోపు వయసులోనే ‘ఫోర్బ్స్’ జాబితాకెక్కారు. ఇరవై రంగాలలో విజయాలు సాధించిన ముప్పయ్యేళ్ల లోపు యువతతో ‘ఫోర్బ్స్’ మ్యాగజైన్ రూపొందించిన జాబితాలో చోటు దక్కించుకున్న భారత సంతతి యువతరంగాల్లో కొందరి వివరాలు సంక్షిప్తంగా... ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా...
 
నితేశ్ బంటా (28):
రఫ్ డ్రాఫ్ట్ వెంచర్స్ సహ వ్యవస్థాపకుడు. వెంచర్ కేపిటల్ రంగంలో నితేశ్ పేరు ఒక తాజా సంచలనం. పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునే విద్యార్థులకు సొంత కంపెనీ స్థాపించుకునేందుకు రఫ్ డ్రాఫ్ట్స్ వెంచర్స్ 25 వేల డాలర్ల వరకు రుణాలు సమకూరుస్తోంది. రఫ్ డ్రాఫ్ట్స్ వెంచర్స్ స్థాపించడానికి ముందు నితేశ్ బంటా గూగుల్, జనరల్ కేటలిస్ట్ పార్టనర్స్ సంస్థల్లో పనిచేశాడు.
 
అంకుర్ జైన్ (24):
‘హమిన్’ అనే యాప్‌కు సహ వ్యవస్థాపకుడు. కాంటాక్టులు, సోషల్ నెట్‌వర్కులు, కేలండర్ల వివరాలను ఒకేచోట తేలికగా వెతుక్కొనే వీలు కల్పిస్తూ విడుదల చేసిన ‘హమిన్’... వినియోగదారుల్లో మంచి ఆదరణ పొందింది. యువ వ్యాపారవేత్తల సంస్థ ‘కైరోస్ సొసైటీ’కి, అమెరికా, చైనా, పశ్చిమాసియా దేశాల్లో కొత్త మార్కెట్ల పురోగతికి దోహదపడే ‘పంజియా’ సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా కూడా అంకుర్ సేవలందిస్తున్నాడు.
 
అవినాశ్ గాంధీ (26):
హాలీవుడ్‌లో తాజా సంచలనం అవినాశ్ గాంధీ. టాలెంట్ ఏజెన్సీ సంస్థ విలియమ్ మోరిస్ ఎండీవర్ తరఫున ఏజెంట్‌గా పనిచేస్తున్న అవినాశ్, హాలీవుడ్‌లో సంచలనాలు సృష్టిస్తున్నాడు. యేల్ వర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో బీఏ పూర్తి చేసిన అవినాశ్ గాంధీ, మీడియా, వినోద రంగాల్లో యంగ్ టాలెంట్ల వేటలో తన ప్రతిభ చాటుకుంటున్నాడు.
 
నీరజ్ అంతానీ (23):
అమెరికాలోని ఓహయో నుంచి రాష్ట్ర ప్రతినిధుల సభకు ఎన్నికయ్యాడు. ఓహయో ప్రతినిధుల సభకు ఎన్నికైన వారిలో అతి పిన్న వయస్కుడిగా ఘనత సాధించిన నీరజ్, ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి పాట్రిక్ మోరిస్ (63)పై ఘన విజయం సాధించాడు. ఓహయో స్టేట్ వర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన నీరజ్, ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ డేటన్‌లో న్యాయశాస్త్రం చదువుకుంటున్నాడు.
 
నిఖిల్ అగర్వాల్ (28):
ఎంఐటీలో ఎకనామిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్. చదువుకున్నది ఆర్థిక శాస్త్రమే అయినా, ఆరోగ్యరంగంపై ఆసక్తి ఎక్కువ. హార్వర్డ్ వర్సిటీ నుంచి ఎకనామిక్స్, మ్యాథమేటిక్స్‌లో డిగ్రీలు చేశాడు. ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ చేశాడు. వైద్యులు ఎక్కడ నివాసం ఉండాలనే అంశంపై గణిత ఆధారిత నమూనాను రూపొందించి, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నాడు. దీనికి ముందు అమెరికాపై విష పదార్థాల ప్రభావం: గర్భస్థ పిండాలు, శిశువుల ఆరోగ్య సమస్యలపై పరిశోధన సాగించాడు.
 
పార్థ ఉన్నవ (22):
బెటర్ వాక్ సీఈవో. కాలికి గాయాలైన వారు నడిచేందుకు వాడే క్రచ్‌లకు సరికొత్త రూపురేఖలు ఇచ్చాడు. భుజాలపై ఎలాంటి ఒత్తిడి లేని విధంగా వాటిని తీర్చిదిద్ది అమెరికా అధ్యక్షుడు ఒబామాను సైతం ఆకట్టుకున్నాడు. కాలు విరిగి, క్రచ్‌లతో నడిచినప్పుడు ఇబ్బందులు పడ్డ పార్థ ఉన్నవ, ఈ ఇబ్బందులను అధిగమించే రీతిలో సరికొత్త క్రచ్‌లకు రూపకల్పన చేశాడు.
 
అమన్ అద్వానీ (26):
ఫ్యాషన్ రిటైల్ రంగంలో అమన్ అద్వానీ అసాధారణమైన విజయాలు సాధిస్తున్నాడు. ‘మినిస్ట్రీ ఆఫ్ సప్లై’ పేరిట అమన్ తన స్నేహితులతో కలసి స్థాపించిన కంపెనీ...  ‘నాసా’ అంతరిక్ష పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని, ఉష్ణోగ్రతను, తేమను నియంత్రించగల షర్టులకు రూపకల్పన చేసింది. ఈ షర్టులు అంతర్జాతీయ ఫ్యాషన్ రంగంలో అద్భుత విజయాన్ని సాధించాయి.
 
విజయ్ చూడాసమా (28):
లండన్ వర్సిటీ నుంచి రసాయనిక శాస్త్రంలో పీహెచ్‌డీ చేసిన ఈ యువ శాస్త్రవేత్త కొత్తతరం ఔషధాల రూపకల్పన కోసం జరుగుతున్న పరిశోధనల్లో పాల్గొంటున్నాడు. యాంటీబాడీస్‌తో అనుసంధానం చేసిన ఔషధాల తయారీ, ప్రొటీన్ మోడిఫికేషన్, గ్రీన్ కెమిస్ట్రీ వంటి అంశాల్లో పరిశోధనలు సాగిస్తున్నాడు.
 
రాహుల్ రేఖి (23):
ఇంగ్లండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్‌కు సలహాదారుగా విలువైన సేవలందిస్తున్న రాహుల్ రేఖి, ప్రస్తుతం యాంటీ బయోటిక్ రెసిస్టెన్స్ పాలసీపై ఐక్యరాజ్య సమితి స్థాయి ఒడంబడికకు రూపకల్పన చేసే పని కొనసాగిస్తున్నాడు. మరోవైపు, హెల్త్ ఎకనామిక్స్‌పై ప్రపంచబ్యాంకుకు సలహాదారుగా సేవలందిస్తున్నాడు.
 
వినీత్ మిశ్రా (27):
ఐబీఎం అనుబంధ సంస్థ వాట్సన్ గ్రూపులో పరిశోధకుడు. ఈ సంస్థ రూపొందించిన షెఫ్ వాట్సన్ మెషిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో కొత్త వంటకాలు చేసేందుకు ఉపయోగపడుతుంది. స్టాన్‌ఫోర్డ్ వర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ చేస్తూనే, వాట్సన్ గ్రూపులో పరిశోధకుడుగా చేరిన వినీత్, షెఫ్ మెషిన్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించాడు.
 
దీపికా కురుప్ (16):
చౌకగా నీటిని శుద్ధిచేసే ప్రక్రియను కనుగొన్న దీపిక బాల శాస్త్రవేత్తగా మన్ననలు అందుకుంది. టిటానియం డయాక్సైడ్, సిల్వర్ నైట్రేట్‌లను ఉపయోగించి, సౌరశక్తి సాయంతో నీటిని శుద్ధిచేసే ప్రక్రియకుగానూ 25 వేల డాలర్ల ‘డిస్కవరీ’ యంగ్ సైంటిస్ట్ అవార్డును అందుకుంది. ప్రస్తుతం అమెరికాలో న్యూహాంప్‌షైర్‌లోని నషువా హైస్కూల్‌లో 11వ తరగతి చదువుతోంది.
 
విక్రమ్ అయ్యర్ (29):
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కొలువులో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అమెరికా వాణిజ్యశాఖ మేధాసంపత్తి వ్యవహారాల అండర్ సెక్రటరీ వద్ద డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా కొనసాగుతున్న విక్రమ్ కాలిఫోర్నియా వర్సిటీ పట్టభద్రుడు. గతంలో సెనేటర్ ఎడ్ మార్కీ, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా మేయర్ ఆడ్రియన్ ఫెంటీలకు కమ్యూనికేషన్స్ సలహాదారుగా పనిచేశాడు.
 
 
వివేక్ రవిశంకర్ (27):
తిరుచ్చి ఎన్‌ఐటీ నుంచి కంప్యూటర్ సైన్స్ పట్టభద్రుడైన వివేక్, తొలుత అమెజాన్ కంపెనీలోని కిండ్లే బృందంలో డెవలపర్. ఏడాది తర్వాత అమెజాన్‌ను విడిచిపెట్టి, మాక్ ఇంటర్వ్యూలను నిర్వహించే ఆన్‌లైన్ వేదిక ‘ఇంటర్వ్యూ స్ట్రీట్’ను ప్రారంభించాడు. ఇది పెద్దగా ఫలితాలనివ్వకపోవడంతో కొంత కాలానికి మిత్రులతో కలసి హ్యాకర్ ర్యాంకర్‌ను ప్రారంభించాడు.
 
ఇష్వీన్ ఆనంద్ (29):
ఓపెన్ స్పాన్సర్‌షిప్ వ్యవస్థాపకురాలు. ప్రముఖ బ్రాండ్లను, వివిధ క్రీడల జట్ల యాజమాన్యాలను అనుసంధానం చేసే ఆన్‌లైన్ వేదికగా రూపొందించిన ఓపెన్ స్పాన్సర్‌షిప్‌లో భారత క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ వంటి క్రీడాకారులతో పాటు ఫోర్స్ ఇండియా ఎఫ్ 1 వంటి జట్లు సభ్యత్వం కలిగి ఉన్నాయి. ఓపెన్ స్పాన్సర్‌షిప్ కంటే ముందే స్నానానికి ఉపయోగించే హ్యాండ్‌మేడ్ ఉత్పత్తులతో ‘న్యాసా’ బ్రాండ్‌ను ప్రారంభించింది ఇష్వీన్.

మరిన్ని వార్తలు