మీ భవిష్యత్‌.. మాకు వర్తమానం!

17 Dec, 2017 00:00 IST|Sakshi

సీన్‌ మాది – టైటిల్‌ మీది

ప్రొఫెసర్‌ ఇల్లు. కిషోర్‌ తన గ్యాంగ్‌ మొత్తాన్నీ వెంటేసుకొని వచ్చి గేటు బయట నిలబడ్డాడు. కిషోర్‌తో సహా గ్యాంగ్‌ అంతా పిల్లలే! ‘‘ఇదే ప్రొఫెసర్‌ గారిల్లు. గేట్‌ మూసుందే!?’’ అంటూ అందరినీ గేటెక్కమన్నట్టు సైగ చేశాడు కిషోర్‌. పిల్లలంతా గేటెక్కి అక్కణ్నుంచి ఇంట్లోకి దూకారు. లోపలకొచ్చి ఓ పెద్ద మెషీన్‌ వంక చూస్తూ నోరెళ్లబెట్టారు. ఒక చిన్నపాటి గదంత పెద్దగా ఉంది ఆ మెషీన్‌. కనిపించిన బటన్స్‌ అన్నీ నొక్కేస్తున్నారు. లైట్లు వెలుగుతున్నాయి. పెద్ద శబ్దాలు వినిపిస్తున్నాయి. పిల్లలు ఆ శబ్దం ఏమై ఉంటుందా అని జోక్స్‌ చేసుకుంటున్నారు. వీడియో గేమ్స్‌ ఆడుకున్నట్లు అక్కడున్నకంప్యూటర్స్‌తో ఆడుకుంటున్నారంతా. మెల్లిగా ఆ మెషీన్‌ డోర్‌ మూసుకుపోయింది. పిల్లలు భయపడిపోతున్నారు. ఈలోపే కృష్ణకుమార్‌కు పిల్లలంతా ప్రొఫెసర్‌ ఇంటికి వెళ్లారన్న విషయం తెలిసింది. అప్పటికి కృష్ణకుమార్‌ కూడా ప్రొఫెసర్‌ ఇంట్లోనే ఉన్నాడు. పరుగెత్తుకుంటూ వెళ్లి పిల్లలందరినీ ఆ మెషీన్‌ నుంచి బయటపడేశాడు. కృష్ణకు తోడుగా అతడి గర్ల్‌ఫ్రెండ్‌ హేమ కూడా పిల్లల్ని కాపాడుతూ ఓ చెయ్యందించింది. పిల్లలందరూ బయటపడ్డారు. లైట్లు మళ్లీ వెలిగాయి. శబ్దం మరింత పెరిగింది. హేమ కళ్లు తిరిగి పడిపోయింది. అయోమయంలో ఏదో బటన్‌ నొక్కింది. డోర్‌ మూసుకుంది. మెషీన్‌ పనిచేయడం మొదలుపెట్టింది. అది టైమ్‌ మెషీన్‌. గతంలోనికైనా, భవిష్యత్‌లోకైనా తీసుకెళ్లగలిగే మెషీన్‌. కృష్ణకుమార్, హేమ మాత్రమే చిక్కుకుపోయారా మెషీన్‌లో. గతంలోకి వెళుతోందా మెషీన్‌. సంవత్సరాలు సంవత్సరాలు వెనక్కి.. 

అలా సంవత్సరాలు సంవత్సరాలు వెనక్కి వెళుతోన్న టైమ్‌ మెషీన్‌ సరిగ్గా 1526వ సంవత్సరంలోకి వెళ్లి ఆగిపోయింది. డోర్‌ తెరుచుకుంది. కృష్ణకుమార్, హేమ ఇద్దరూ ఆ మెషీన్‌ నుంచి బయటపడ్డారు. కృష్ణ అప్పటికే హేమ వాళ్ల నాన్నను తిడుతున్నాడు. హేమ తండ్రే టైమ్‌ మెషీన్‌ను తయారు చేసిన ప్రొఫెసర్‌. చుట్టూ గమనించారిద్దరూ. అంతా కొత్తగా ఉంది. ఎక్కడ చూసినా చెట్లే. అడవి. ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని మెల్లిగా నడుస్తూ ముందుకు వెళుతున్నారు. ‘‘ఇదంతా అడవిలా ఉంది కృష్ణా!’’ అంది హేమ.‘‘అసలిది ఏ దేశమో.. ఏ కాలమో..’’‘‘తిరిగి వెళ్లిపోదామా?’’ అనుకుంటూ ఇద్దరూ వెనక్కి తిరగ్గానే ఏవో శబ్దాలు వినిపించాయి. అటు దిక్కుగా చూస్తే ఎవరో మనుషులు. అక్కడి మనుషులు, వ్యవహారం చూసి ఇదేదో రాజుల కాలంలా ఉందన్న నిశ్చయానికి వచ్చారిద్దరూ.  కృష్ణ, హేమ.. వాళ్లను అలా గమనిస్తూండగానే ఏదో పెద్ద గొడవ మొదలైంది. ఎవరో దుండగులు ఒక యువతిపై దాడి చేస్తున్నారు. కృష్ణ ఒక్క క్షణంలో వారిమీద విరుచుకుపడ్డాడు. అందరినీ చితకబాది ఆ యువతిని కాపాడాడు. ‘‘నా మానప్రాణములను కాపాడిన యువ కిషోరమునకు కృతజ్ఞతలు..’’ అంది ఆ యువతి గట్టిగా ఊపిరి పీల్చుకొని. ‘‘మీరూ?’’ అడిగాడు కృష్ణ. ఆ యువతి నవ్వుతూ.. ‘‘నేను రాజనర్తకిని. సింహనందిని నా నామధేయము. రాయలవారి ఆస్థానమున నర్తించుట నా వృత్తి..’’ అంది. ‘‘రాయలవారంటే?’’  ‘‘శ్రీకృష్ణదేవరాయ ప్రభువులు..’’

కృష్ణ, హేమ ఒక్కసారే ఆశ్చర్యానికి లోనయ్యారు. ‘‘ఓ మై గాడ్‌! మనం శ్రీకృష్ణదేవరాయల కాలానికి వచ్చామా?’’ అంది హేమ, సంతోషంతో!సింహనందినికి కృష్ణ, హేమ కొత్తగా కనిపించారు. వాళ్లు వేసుకున్న బట్టలు, వారి భాష.. అంతా కొత్తగా ఉంది. వారిపై ప్రశ్నల వర్షం కురిపించింది. ‘‘మేము మీకంటే ఐదు వందల సంవత్సరాల ముందు వాళ్లం!’’ అన్నాడు కృష్ణ, సింహనందిని వరుస ప్రశ్నలకు, చూపులకు సమాధానంగా. ‘‘నాకేమీయూ అవగతం కాకున్నది..’’ అంది సింహనందిని, అమాయకంగా.కృష్ణకుమార్, హేమ ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూ నిలబడ్డారు. మళ్లీ సింహనందినే మాట్లాడుతూ, ‘‘నాతో రండి! ప్రభువులను కలసి.. నన్ను కాపాడినందులకు బహుమతులు అందుకొందురు..’’ అంది. ∙∙ కృష్ణ, హేమ శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానానికి విచ్చేశారు. ప్రభువులు సభకు విచ్చేస్తున్నారంటూ అక్కడివారంతా సందడి చేస్తున్నారు. ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోయారు. కృష్ణ అందరినీ చూస్తూ కూర్చున్నాడు. హేమ ‘వీళ్లెవరూ? వీళ్లెవరూ?’ అంటూ అమాయకంగా ప్రశ్నలడుగుతోంది. వాళ్లిద్దరి మాటలలా కొనసాగుతుండగానే, వైభవంగా సభకు విచ్చేశాడు కృష్ణదేవరాయలు. ఆయన వస్తూంటే సభలో కూర్చున్నవారంతా గౌరవంగా లేచి నిలబడి నమస్కరించారు. ప్రభువు తన పీఠంపై కూర్చోగానే అందరూ కూర్చున్నారు. తమ పెద్దలకు అంజలి ఘటించి సభను మొదలుపెట్టాడు కృష్ణదేవరాయలు.

సభ జరుగుతుండగానే, కృష్ణ, కృష్ణదేవరాయల కంట పడ్డాడు. ‘‘ఎవరీ పరదేశీయుడు?’’ కృష్ణదేవరాయల ప్రశ్నకు..సింహనందిని లేచి, అడవిలో దుండగుల బారినుంచి తనను కాపాడారని చెప్పింది. ‘‘ఓ! అలాగా!! వీరకుమారా? మీరు ఏ దేశ వాసులు?’’ అనడిగాడు కృష్ణదేవరాయలు. ‘‘మేము తెలుగు వారమే మహారాజా?’’ అని సమాధానమిచ్చాడు కృష్ణ. కృష్ణదేవరాయలు వరుసగా ప్రశ్నలు కురిపిస్తూనే ఉన్నారు. ‘‘మహారాజా! మీ భవిష్యత్‌ కాలం.. మాకు వర్తమాన కాలం. మేం భవిష్యత్‌ నుంచి వచ్చిన వాళ్లం.’’కృష్ణదేవరాయలకు కృష్ణ చెప్పేది ఏదీ అర్థం కాలేదు. ‘‘అంటే?’’ అనడిగాడు. ‘‘మేము 20వ శతాబ్దకాలం వాళ్లం. మీకంటే 500 సంవత్సరాలు ముందు వాళ్లం. అందుకే మీ విషయాలన్నీ మాకు తెలుసు..’’ నవ్వుతూ సమాధనమిచ్చాడు కృష్ణ. ‘‘వీరి నాన్నగారు..’’ హేమను చూపిస్తూ.. ‘‘కాలంలో ప్రయాణం చేసే యంత్రాన్ని కనిపెట్టారు. అదెక్కి మేము మీ కాలానికి రావడం తటస్థించింది..’’ కృష్ణ చెప్తూ వెళ్తున్నాడు. కృష్ణదేవరాయలకు ఇదంతా కొత్తగా కనిపిస్తూ ఉంటే, అలా వింటూ ఉన్నాడు. 
 

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు