యువతరం కదిలింది.. ఊరంతా కలిసొచ్చింది

9 Aug, 2014 23:54 IST|Sakshi
యువతరం కదిలింది.. ఊరంతా కలిసొచ్చింది

పంచ భూతాలు... మనిషి జీవనాన్ని శాసిస్తాయి. వాటిలో ఏది లేకున్నా ఒక్క క్షణం కూడా ఈ భూమిపై ప్రాణి బతకలేదు. ఈ విషయం తెలిసి కూడా వాటిని ప్రత్యక్షంగా, పరోక్షంగా నాశనం చేస్తున్నాం. అయితే వాటిని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్న వారూ ఉన్నారు. ఏ అధికారులు చెప్పకుండానే, ఎవరూ నిధులు ఇవ్వకుండానే, ఏ ప్రభుత్వం సాయం లేకుండానే...
 కనుమరుగవుతున్న ఓ చెరువుకు జీవం పోస్తున్న కొందరు మంచి మనుషుల కథ ఇది.
 
అది తమిళనాడులోని మావడిపట్టి గ్రామం. పక్కనే 143 ఎకరాల సువిశాలమైన చెరువు. కొన్నేళ్ల క్రితం వరకు ఎపుడూ కళకళలాడుతూ ఉండేది. ఆ చెరువులో నీరుండటం అంటే పంటలు పండించే రైతులకు మాత్రమే ఆనందం కాదు. దాహంతో ఉన్న పశువులకు ఆనందం. గేలంతో సరదాగా చేపల వేటకు వెళ్లే పిల్లలకు ఆనందం. జలకాలాడే యువకులకు ఆనందం. ఊరికి అందాన్ని తెచ్చే పక్షులకు ఆనందం... మొత్తం ఊరికే ఓ అందం.
 
అయితే తిరుచ్చి సమీపంలోని మావడిపట్టి గ్రామానికి కొన్నేళ్లుగా ఈ ఆనందాలు లేవు. ఎందుకంటే ఆ విశాలమైన చెరువు కుంచించుకుపోయింది. మురికి గుంటగా మారింది. దాంతో గతంలో ఆ చెరువులో చేరే నీటిలో పదో వంతు కూడా నీరు చేరడం లేదు. ఇది ఆ ఊరిలో ఎందరిని కదిలించిందో తెలియదు గాని పక్కనే ఉన్న తిరుచ్చి నగరంలో కొందరు యువకులను మాత్రం కదిలించింది.

తిరుచ్చి పట్టణ ప్రజలకు ఆ చెరువు ఒక లీజర్ స్పాట్. మరి అలాంటి వాతావరణం ఒకటి లేకపోవడాన్ని కొందరు యువకులు అస్సలు ఊహించుకోలేకపోయారు. అలాంటి వారికి వినోద్‌రాజ్ శేషన్ నాయకత్వం వహించారు. వారంతా కలిసి మావడిపట్టు గ్రామ ప్రజల్లో చైతన్యం తెచ్చారు. ఇది మన చెరువు. ఇది మన ఆస్తి. దీన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఆ ఊరి గురించి పక్క ఊరి వారికే ఆసక్తి ఉన్నపుడు ఊరిలోని వారికి ఉండదా? ఊరంతా కదిలింది.
 
ముందు చెరువులో ఉన్న చెత్తను ఏరివేసే పని మొదలుపెట్టారు. ఎవరికి ఏది తోస్తే అది చేయకుండా ఒక పద్ధతిని ఎంచుకున్నారు. ‘తన్నీరు’ (తమిళంలో నీరు) అనే పేరుతో వాలంటరీ కమిటీ ఏర్పాటుచేశారు. చెరువు పునరుద్ధరణ పనులకు వచ్చే వారంతా ఇందులో సభ్యులుగా చేరాలి. ప్రతి ఆదివారం చెరువులో పూడికతీత/పునరుద్ధరణ పనులుంటాయి. ఏ వైపు ఎక్కడ ఎవరు ఏ పనిచేయాలి అన్నదానిని ప్రతి ఆదివారం ఉదయాన్నే అరగంట చర్చించుకుని పనిమొదలుపెడతారు.  ఆ రోజంతా పది గంటల పాటు సాయంత్రం ఐదు వరకు పని కొనసాగుతుంది. 2013 జులై 14న ప్రారంభమైన ఈ స్వచ్ఛంద పునరుద్ధరణ పనులకు ఇతర ప్రాంతాల ప్రజల నుంచి కూడా అభినందనలు వచ్చాయి.
 
వార్తల్లో చూసి ఇందులో స్వయంగా పాలుపంచుకున్న వాలంటీర్లు కూడా ఉన్నారు. మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న తిరుచ్చి జిల్లా కలెక్టర్ మురళీధరన్ జయశ్రీ స్వయంగా చెరువు వద్దకు వచ్చారు. నడుం బిగించి కేవలం పది నిమిషాల విరామంతో ఏకధాటిగా నాలుగ్గంటలు మట్టిని తవ్వి, మోసి వెళ్లారు. వలంటీర్లలో ఉత్సాహం నింపడానికి, ప్రజల్లో ఆసక్తిని పెంచడానికి ఆమె ఈ చొరవ తీసుకున్నారు. అంతేకాదు, సంబంధిత విభాగాల వారందరికీ ఈ కార్యక్రమానికి పూర్తిగా సహకరించాలని ఆదేశాలు జారీచేశారు. ఇప్పటికి ఏడాది గడిచింది. ఇంకా పనులు కొనసాగుతున్నాయి. చాలా మంచి స్పందన వస్తోంది.
 
‘తన్నీరు’ స్ఫూర్తితో తిరుచ్చి సమీపంలో ఇతర ప్రాంతాల్లోనూ  కదలిక వస్తోంది. తిరుచ్చిలోనైతే పూడిక తీత కార్యక్రమాలు చేపట్టి జలవనరుల సంరక్షణకు ముందుకు వస్తున్న యవకుల ప్రయత్నానికి సహకరిస్తూ అక్కడి అధికారులు ఆ చెరువులోని ఆక్రమణలన్నీ తొలగించేశారు. పలు కాలేజీలు తమ ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాంను ఈ చెరువులో చేయించి సహకరిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు