ఏ గుండె తట్టినా...

8 Jul, 2017 23:55 IST|Sakshi

మనకేదైనా కష్టమొచ్చినప్పుడు, ఇంక ముందుకు కదల్లేం అనుకున్నప్పుడు, నిస్సహాయ స్థితిలో కూరుకుపోయినప్పుడు ఆ దేవుడ్ని వేడుకుంటాం. ఆయనొక్కడే దిక్కని నమ్మేస్తాం.

దేవుడు అన్నిసార్లూ చెయ్యందించలేడు. అలాగని అందించకపోతే ఆయన దేవుడే కాదు.

అందుకే ఆ దేవుడొక నాన్నను పుట్టించాడు, ధైర్యమిస్తాడని. అమ్మను పుట్టించాడు, నమ్మకాన్ని నింపుతుందని. అక్కను, చెల్లిని, అన్నను పుట్టించాడు, తోడుంటారని. ఓ మనిషిని పుట్టించాడు, సాయముంటాడని.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి – కొన్ని కోట్ల హృదయాలకొక ‘మనిషి’. ఒక అన్న.
ఒక నాన్న. ఒక తోడు. ఒక అండ. ఒక సాయం.

వైఎస్సార్‌ 68వ జయంతి సందర్భంగా.. ‘మా శేఖరుడు’ అంటూ  ఆయనను గుర్తుచేసుకుంటోన్న 68 కథలివి. ఈ కథల్లో ఆయన ఊపిరి పీల్చుకుంటున్నాడు. ఈ కథల్లో ఆయన గుండెచప్పుడు వినిపిస్తోంది. ఏ కథలోని గుండెను తట్టినా వినిపిస్తోన్న ఒక్క పేరు.. వైఎస్‌ రాజశేఖరరెడ్డి!!

‘మనిషి ఆనందంగా బతకాలంటే ఆరోగ్యంగా ఉండాలి. ఉన్నతంగా బతకాలంటే ఉన్నత చదువులు చదవాలి. పేదవారు కూడా ఆనందంగా బతకాలి. పేదవారు కూడా ఉన్నతంగా బతకాలి’ అనేవారు వైఎస్సార్‌.

ఈ ఆలోచనల నుంచి పుట్టినవే ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్,
ఇవిగాక ఇంకెన్నో పథకాలు. ఈ పథకాలతో మారిన జీవిత చిత్రాలివి...
 


ఆయన మా దేవుడు
 నిరుపేదలం మేము. మా అమ్మాయి చంద్రనాగసుష్మకు పుట్టుక నుంచి చెవులు వినిపించేవి కావు. మాటలు కూడా రాలేదు. ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిరిగాం. వైఎస్‌ సార్‌ ఆరోగ్యశ్రీ పథకం మా పాలిట వరంలా మారింది. ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్‌ చేస్తామని హైదరాబాద్‌లోని వాసవి ఆస్పత్రి నుంచి ఫోన్‌ వచ్చింది. హైదరాబాద్‌ వెళ్లడానికి సిద్ధపడుతుండగా అదే రోజు... 2009 సెప్టెంబర్‌ 2న హెలికాప్టర్‌ ప్రమాదంలో మహానేత వైఎస్‌ మరణించినట్లు వార్తల్లో తెలుసుకున్నాం. బాధను తట్టుకోలేకపోయాం. ఏడుస్తూ అందరం ఇంట్లోనే ఉండిపోయాం. వారం తర్వాత హైదరాబాద్‌ వెళ్లాం. ఆరోగ్యశ్రీ కింద వాసవి ఆస్పత్రి డాక్టర్లు మా అమ్మాయికి ఆపరేషన్‌ చేశారు. ఆపరేషన్‌ తర్వాత మా అమ్మాయికి వినికిడి శక్తి వచ్చింది. మాట్లాడటం కూడా ప్రారంభించింది. ఇప్పుడు ఆమె ఆరో తరగతి చదువుకుంటోంది. మా ఇంట్లో దేవుళ్లతో పాటే వైఎస్‌ గారి ఫొటోకు కూడా రోజూ పూజలు చేస్తుంటాం. ఆయన మా దేవుడు.
– ధరావత్‌ నరసింహారావు, వెంగన్నపాలెం, జూలూరుపాడు, భద్రాద్రి కొత్తగూడెం

కష్టాల కడలి నుంచి బయటపడ్డాం
మా నాన్న నాగేశ్వరరావు ఇటుక బట్టీల వ్యాపారి వద్ద గుమస్తా. అమ్మ శేషమ్మ మామూలు గృహిణి.  నాన్నకు వచ్చే జీతంతో ఇల్లు గడవడమే కష్టంగా ఉండేది. కష్టాలకు ఎదురీదుతూనే నన్ను ఇంటర్‌ వరకు చదివించారు. పెద్ద చదువులు చదవాలనే కోరిక ఉన్నా తీరే పరిస్థితులు లేవు. అలాంటి పరిస్థితుల్లో ఆనాటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారు నాలాంటి పేద విద్యార్థులకు ఆశాదీపంలా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని తెచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వల్ల విజయవాడలోని ఎస్‌ఆర్‌కేఐటీ కాలేజీలో సివిల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశా. ఏటా ముప్పయి వేల చొప్పున నాలుగేళ్లకు రూ.1.20 లక్షలు రీయింబర్స్‌మెంట్‌ కింద వచ్చింది. చదువు పూర్తయ్యాక 2013లో భద్రాచలం పీఆర్‌ సబ్‌డివిజన్‌లో అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం వచ్చింది. నాకు ఉద్యోగం రావడంతో మా కుటుంబం కష్టాల కడలి నుంచి బయటపడింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లేకుంటే నేను ఈ స్థితికి చేరుకునేవాడిని కాదు.
– టి. వంశీ, మహబూబ్‌నగర్‌

ఇంజనీర్‌ను కాగలిగా
మా నాన్న వెంకటప్పయ్య గీత కార్మికుడు. అమ్మ మల్లమ్మ గృహిణి. నిరుపేద కుటుంబం మాది. నానా తంటాలు పడి నన్ను ఇంటర్‌ వరకు చదివించారు. ఎంసెట్‌ రాశాను. బీటెక్‌లో సీటు వచ్చింది. అయితే, పెద్ద చదువులకు ఖర్చు పెట్టలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకమే నన్ను ఆదుకుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఇంజనీరింగ్‌ పూర్తి చేశాను. చదువు పూర్తి కాగానే హైదరాబాద్‌లోని ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కొన్నాళ్లకే చెన్నైలోని టెక్‌ మహీంద్రా కంపెనీలో మంచి అవకాశం వస్తే, అక్కడ చేరాను. ఇప్పుడు అదే కంపెనీలో చేస్తున్నాను. నెలకు రూ.50 వేల వరకు జీతం వస్తోంది. నాకు ఉద్యోగం వచ్చాక మా కుటుంబం కష్టాలన్నీ తీరాయి. వైఎస్‌ గారి దయ వల్లే నేను ఇంజనీర్‌ కాగలిగాను.
– చామకూరి వినోద్‌కుమార్, గోళ్లపాడు, ఖమ్మం

నా బిడ్డకు ప్రాణభిక్ష పెట్టారు
మా చిన్నారి బాబు సుశాంత్‌రామ్‌కు పదహారు నెలల వయసులో జ్వరం వచ్చింది. ఖమ్మంలోని ఒక ఆస్పత్రికి తీసుకు వెళ్లాం. బాబుకు గుండెలో రంధ్రం ఏర్పడిందని డాక్టర్లు చెప్పారు. ఆపరేషన్‌ చేస్తే తప్ప బతకడన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ ఆస్పత్రిలో గుండె ఆపరేషన్‌ చేయించాం. నెల్లాళ్ల పాటు ఆస్పత్రిలోనే చికిత్స చేశారు. ఖర్చులన్నీ ఆరోగ్యశ్రీ పథకం కిందనే చెల్లించారు. ప్రస్తుతం మా బాబు సుశాంత్‌ రెండో తరగతి చదువుకుంటున్నాడు. ఇదొకటే కాదు, మా పూరిల్లు 2007లో కాలిపోయింది. మనసున్న మారాజు వైఎస్‌ గారికి గోడు చెప్పుకోవడానికి నేరుగా సీఎం క్యాంపు ఆఫీసుకు వెళ్లాను. ఆయన వెంటనే మూడువేలు ఇచ్చారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు. ఇక నా చెల్లెలు సుబ్బలక్ష్మి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ఆసరాతో ఎమ్మెస్సీ పూర్తిచేసి, ఇప్పుడు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో టెక్నికల్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తోంది. మా ఇంటి దీపాన్ని వెలిగించిన మహానేత వైఎస్‌ గారికి దేవుళ్లతో పాటు రోజూ దీపం పెట్టుకుంటాం.
– కొడుకు సుశాంత్‌రామ్, భార్య నందినితో రామకృష్ణ, మాటూరుపేట, మధిర మండలం, ఖమ్మం

నా గుండెలో కొలువైన దైవం
పదిహేనేళ్ల వయసులోనే అమ్మా నాన్నలను పోగొట్టుకుని అనాథనయ్యాను. చిన్నా చితకా పనులు చేసుకుంటూ పొట్ట పోసుకునే వాణ్ణి. కొన్నాళ్లకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఇద్దరు పిల్లలు. జీవితం సాఫీగా సాగిపోతుండగా 2007 డిసెంబర్‌లో నాకు గుండెజబ్బు వచ్చింది. సరిహద్దుకు దగ్గర్లోని బరంపురం పెద్దాస్పత్రికి వెళ్లి చూపించుకుంటే ఆపరేషన్‌ చేయాలన్నారు. ఆపరేషన్‌కు కావలసిన డబ్బు లేదు. దిక్కుతోచని స్థితిలో పడ్డాను. నా భార్యాబిడ్డలు కన్నీరు మున్నీరుగా విలపించసాగారు. అంతలోనే ఒక అపరిచితుడు దేవుడిలా తారసపడ్డాడు. ‘మీ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా ఆపరేషన్లు చేస్తారు. ప్రయత్నించండి’ అని చెప్పాడాయన. కాస్త ధైర్యం వచ్చింది. తిరిగి ఇచ్ఛాపురానికి చేరుకున్నాను. స్థానిక నేతల సాయంతో ఆరోగ్యశ్రీ కింద విశాఖలోని కేర్‌ ఆస్పత్రిలో చేరాను. అక్కడ నాకు 2008 జనవరి 2న ఆపరేషన్‌ చేశారు. పూర్తిగా కోలుకుని ఇంటికొచ్చాను. 2014 ఏప్రిల్‌ 14న అంబేడ్కర్‌ జయంతి రోజున జగనన్న నా ఇంటికొచ్చారు. ‘తమ్ముడూ! ఎలా ఉంది నీ ఆరోగ్యం... పిల్లలు బాగున్నారా?’ అంటూ ఆత్మీయంగా పలకరించినప్పుడు ఉద్వేగాన్ని తట్టుకోలేక కంటతడి పెట్టుకున్నాను. ‘తమ్ముడూ... నీ దేవుడు ప్రతి పేదవాడి గుండెల్లోనూ కొలువై ఉంటాడు’ అంటూ జగనన్న ఓదార్చారు. ఆ ఓదార్పును ఎప్పటికీ మరువలేను. నా గుండెలో కొలువైన దైవం రాజన్న.
– నీలాపు వెంకటరెడ్డి, ఇచ్ఛాపురం, శ్రీకాకుళం

మా ఇంటి దీపం నిలిపారు
మాకు ఇద్దరు అబ్బాయిలు. చిన్నబ్బాయి సాయిబాబా పుట్టినప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడేవాడు. ఐదేళ్లు వచ్చేసరికి అనారోగ్యం మరింత ఎక్కువైంది. ప్రింటింగ్‌ ప్రెస్‌లో పనిచేసే నా జీతం ఇల్లు గడవడానికే చాలేది కాదు. అబ్బాయికి మెరుగైన వైద్యం చేయించే స్థోమత లేదు. తెలిసిన వాళ్ల సాయంతో మా అబ్బాయిని పుట్టపర్తిలోని సత్యసాయి ఆస్పత్రికి తీసుకువెళ్లాను. గుండెలో రంధ్రం ఉందని, ఆపరేషన్‌ చేయకపోతే బతకడం కష్టమని డాక్టర్లు చెప్పారు. అయితే, ఎన్నాళ్లు ఎదురుచూసినా ఆస్పత్రిలో అడ్మిషన్‌ ఇవ్వలేదు. ఇక చేసేది లేక బెంగళూరులోని ఒక ఆస్పత్రికి వెళ్లాం. అక్కడి డాక్టర్లు ఆపరేషన్‌కు మూడు లక్షలవుతుందన్నారు. అంత డబ్బు లేకపోవడంతో ఆశలు వదులుకుని పులివెందులకు తిరిగి వచ్చేశాం. చుట్టుపక్కల వారి సలహా మేరకు హైదరాబాద్‌ వెళ్లి సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారిని కలుసుకున్నాం. మా గోడు విన్న ఆయన ధైర్యం చెప్పారు. వెంటనే అపోలో ఆస్పత్రికి ఫోన్‌ చేయించి, మా అబ్బాయిని అక్కడ చేర్పించారు. సీఎం సహాయ నిధి నుంచి ఆపరేషన్‌ ఖర్చులు ఇప్పించారు. ఆయన దయ వల్లనే మా అబ్బాయి పూర్తిగా కోలుకున్నాడు. మా ఇంటి దీపం నిలిపిన దైవం ఆయన.
– సావ్‌సేన్‌వల్లి, పులివెందుల, వైఎస్‌ఆర్‌ కడప

మా ప్రాణదాత
ఊళ్లో సైకిల్‌ షాపు నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నా. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు మావి. ఉన్న కష్టాలకు తోడు 2009లో నాకు గుండెజబ్బు వచ్చింది. చేతిలో పైసలు లేని పరిస్థితి. వైఎస్‌ సార్‌ తెచ్చిన ఆరోగ్యశ్రీ పథకమే ఆదుకుంది. ఆరోగ్యశ్రీ కార్డుతో ఆపరేషన్‌ చేయించుకున్నాను. ఆరోగ్యం కుదుటపడింది. ఏదోలా బతుకు వెళ్లదీస్తుంటే దురదృష్టం మళ్లీ వెంటాడింది. నా భార్య వెంకటమ్మకు క్యాన్సర్‌ సోకింది. ఆపరేషన్‌ చేయక తప్పదని డాక్టర్లు చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారానే ఆమెకు కూడా ఆపరేషన్‌ చేయించాను. ఆపరేషన్‌ తర్వాత ఆమె పూర్తిగా కోలుకుంది. మా ఇద్దరి ప్రాణాలూ నిలిచాయంటే అదంతా మా దేవుడు వైఎస్‌ సార్‌ చలవే! ఆయన మా ప్రాణదాత.
– పొదిల పుల్లయ్య, తల్లాడ, ఖమ్మం

ఆరోగ్యశ్రీ మా ప్రాణాలను కాపాడింది
మాకు ముగ్గురు ఆడపిల్లలు. మామూలు మధ్య తరగతి కుటుంబం మాది. పనీపాటా చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడిని. ఉన్నట్టుండి నాకు గుండెజబ్బు వచ్చింది. ఆపరేషన్‌ తప్పదన్నారు డాక్టర్లు. అప్పుడే వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఆపరేషన్‌ చేయించుకున్నా. ఒకవైపు నేను కోలుకుంటుండగా మరోవైపు నా భార్య వరలక్ష్మికి కిడ్నీ సమస్య వచ్చింది. ఆమెను కూడా ఆరోగ్యశ్రీ పథకమే ఆదుకుంది. ఆమెకు కూడా ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్‌ చేశారు. ఆరోగ్యశ్రీ పథకమే లేకుంటే మా ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. మా పిల్లలు అనాథలయ్యేవారు. జగన్‌ గారు, షర్మిల గారు ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడు వారికి ఈ విషయాన్నే చెప్పాను. వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారు కలలుగన్న సంక్షేమ రాజ్యం తిరిగి రావాలి.
– అడబాల కృష్ణారావు, మెట్టవలస, బొబ్బిలి మండలం, విజయనగరం

జీవితంలో నిలదొక్కుకున్నా
మాది నిరుపేద వ్యవసాయ కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు మావి. మా అమ్మ నాన్నలు నానా కష్టాలకోర్చి నన్ను పదో తరగతి వరకు చదివించారు. పదో తరగతి పూర్తయ్యాక ఇక చదివించలేమని చేతులెత్తేశారు. నేను కూడా చదువు మానేసి పొలం పనులు చేస్తూ అమ్మా నాన్నలకు చేదోడుగా ఉందామనుకున్నాను. ఆ సమయంలోనే ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఆసరాతో ఇంటర్‌లో చేరాను. తర్వాత డిగ్రీ కూడా పూర్తి చేశాను. డిగ్రీ తర్వాత ఆర్పీఎఫ్‌లో ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం విజయవాడలో ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌గా  పని చేస్తున్నాను. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం వల్లనే జీవితంలో నిలదొక్కుకున్నా. ఆ పథకమే లేకుంటే మట్టిపనుల్లో మగ్గిపోయేవాణ్ణి. ఇదంతా వైఎస్‌ సార్‌ చలవే. ఆయనను ఎన్నటికీ మరువలేను.
– రెడ్డి దామోదరరావు, ఒమ్మి గ్రామం, నెల్లిమర్ల మండలం, విజయనగరం జిల్లా

ఊపిరి ఉన్నంత వరకు మరువలేను
నేను పెయింటింగ్‌ పని చేసుకొనే రోజు కూలీని. నా భార్య కూడా ఇళ్లల్లో పనులు చేసేది. ఇద్దరి ఆదాయంతో బొటాబొటిగా ఇల్లు గడిచేది. రోజులిలా గడుస్తుంటే 2008 ఆగస్టులో నాకు గుండెనొప్పి వచ్చింది. తమిళనాడులోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి వెళితే ఆపరేషన్‌ చేయాలన్నారు. ఐదులక్షల ఖర్చు అవుతుందన్నారు. దిక్కుతోచని పరిస్థితిలో మహానుభావుడు వైఎస్‌ సార్‌ తెచ్చిన ఆరోగ్యశ్రీ గురించే మరచిపోయాం. తెలిసిన వాళ్ల సలహాతో ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని తిరుపతిలోని స్విమ్స్‌కు వెళ్లాం. అక్కడ ఉచితంగా ఆపరేషన్‌ చేశారు. పదిహేను రోజులు అక్కడే ఉంచి పూర్తిగా కోలుకునే వరకు చికిత్స చేశారు. డిశ్చార్జి చేసి ఇంటికి పంపేటప్పుడు బస్సు చార్జీలు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నా. అన్ని పనులూ చేసుకోగలుగుతున్నా. ఇదంతా వైఎస్‌ గారి చలవే. ఊపిరి ఉన్నంత వరకు ఆయనను మరువలేను.
– తిమోతి, చిత్తూరు

ఆ దేవుడు ఇచ్చిన వరం
మాది నిరుపేద వ్యవసాయ కుటుంబం. అమ్మానాన్నలు కష్టపడి నన్ను డిగ్రీ వరకు చదివించారు. పై చదువులకు ఇక స్థోమత లేదని చేతులెత్తేశారు. ఇంతలో  వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారు దేవుడిలా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు. మా అమ్మా నాన్నలకు ఈ సంగతి వివరించి, పై చదువులకు పూనుకున్నాను. 2008లో ఎంబీఏలో చేరాను. ప్రస్తుతం ఒక మల్టీనేషనల్‌ కంపెనీలో పనిచేస్తున్నాను. నెలకు రూ.50 వేల వరకు జీతం వస్తోంది. నాతో పాటు నా చెల్లెలు, నా భార్య కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ఆసరాతోనే ఉన్నత చదువులు చదువుకున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చిన అభయంతో మా కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంది. ఇదంతా ఆ దేవుడు వైఎస్‌ గారు ఇచ్చిన వరమే. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాం.
– పూజారి భాస్కర్, గొల్లపల్లి, చిత్తూరు

పెద్దాయన పుణ్యమే
మాది మామూలు మధ్యతరగతి కుటుంబం. ఈరోజు నేను ఎంటెక్‌ చేశానంటే ఇదంతా ఆ పెద్దాయన వైఎస్‌ రాజశేఖరరెడ్డిగారి పుణ్యమే. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో బీటెక్‌ పూర్తి చేశాను. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్‌ కల్పించడం వల్ల యోగి వేమన యూనివర్సిటీలో సీటు వచ్చింది. ఎంటెక్‌ పూర్తి చేసి బెంగళూరులో కోచింగ్‌ తీసుకున్నాను. ఇప్పుడు ఉద్యోగం కూడా వచ్చింది. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్‌ లేకుంటే ఎంటెక్‌ చేయడం నాకు సాధ్యమయ్యేది కాదు. నాలాంటి విద్యార్థులంతా పెద్దాయన మేలును ఎప్పటికీ మరువలేం.
– రూఫియా, కడప

ఆయన దయవల్లే ఇప్పుడిలా ఉన్నా
పదేళ్ల కిందట నా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. వెన్నుపూసకు రక్తప్రసరణ నిలిచిపోయింది. నరాలు చచ్చుబడి కదల్లేని స్థితిలో మంచానపడ్డాను. వైద్యం చేయించుకోవడానికి చేతిలో చిల్లిగవ్వలేదు. నా భార్య ధనలక్ష్మి నా పరిస్థితి చూసి తల్లడిల్లిపోయేది. మా అబ్బాయి సునీల్, అమ్మాయి దుర్గాభవాని.. నేను మంచానపడ్డ నాటికి వాళ్లిద్దరూ చాలా చిన్నపిల్లలు. ఆరునెలలు అలాగే గడిచాయి. జీవితంలో తిరిగి మామూలు మనిషిని కాగలనా లేదా అని సతమతమయ్యేవాడిని. నా కుటుంబం పరిస్థితి ఏమిటని దేవుడిని తల్చుకుంటూ ఏడ్చేవాడిని. అలాంటి సమయంలోనే వైఎస్‌ రాజశేఖరరెడ్డిగారు ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చారు. మాలాంటి పేదల కోసం ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆరోగ్యశ్రీ కార్డుతో హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చేరాను. అక్కడ ఆపరేషన్‌ చేశారు. మరో ఆరునెలలు ఆస్పత్రిలోనే ఉంచి చికిత్స చేశారు. పూర్తిగా కోలుకున్న తర్వాత డిశ్చార్జి చేశారు. ఆనాడు వైఎస్‌ గారు పెట్టిన భిక్షతోనే నేను ఇప్పుడిలా నా భార్యాపిల్లలతో సంతోషంగా ఉన్నా. బతికి ఉన్నంత కాలం ఆయనను పూజించుకుంటూనే ఉంటాం.
– కుటుంబ సభ్యులతో కొనకళ్ల మంగయ్య, పోతేపల్లి, బందరు మండలం, కృష్ణా

ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోనే విదేశాలకు...
మాది సాదాసీదా మధ్యతరగతి కుటుంబం. మా అబ్బాయి భగీరథరెడ్డిని ఎలాగోలా ఇంటర్‌ వరకు చదివించగలిగాం. మంచి మార్కులే తెచ్చుకున్నాడు. పైచదువులు ఎలా చదివించాలా అని మథనపడుతుండగా వైఎస్‌ రాజశేఖరరెడ్డిగారు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు. దాని ఆసరాతో మా అబ్బాయి చల్లపల్లి సన్‌ఫ్లవర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో చేరాడు. సివిల్‌ ఇంజనీరింగ్‌ డిగ్రీ పూర్తిచేశాడు. తర్వాత షికాగోలో ఎంఎస్‌ స్ట్రక్చరల్‌ ఇంజనీరింగ్‌ పూర్తిచేశాడు. అమెరికాలోనే గూగుల్‌ ఫైబర్‌లో ఉద్యోగం తెచ్చుకున్నాడు. అమెరికాలో ఉంటున్నా మా అబ్బాయి వైఎస్‌ గారి స్ఫూర్తితోనే ఇక్కడి పేద విద్యార్థులకు వీలైనంత మేరకు సాయం చేస్తూ వస్తున్నాడు.
– బొమ్మారెడ్డి వెంకటనరసింహారెడ్డి, ముస్తాబాద్, గన్నవరం మండలం, కృష్ణా

దారి చూపారు...
నిరుపేద కుటుంబంలో పుట్టాను. తల్లిదండ్రులు కూలిపని చేసి మమ్మల్ని పోషించారు. మా ఆర్థిక పరిస్థితి కారణంగా ఇంటర్‌తో చదువు ఆపేయాల్సిన పరిస్థితి. అయితే వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన రీయింబర్స్‌మెంట్‌ పథకం ఆర్థిక కష్టాలను అధిగమించి చదువు కొనసాగేలా చేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని సద్వినియోగం చేసుకొని డిగ్రీ పూర్తి చేశాను. డిగ్రీ ఫైనలియర్‌లో ఉండగా నా తండ్రి సత్యం చనిపోయారు. అయినా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తోడుగా ఉండడంతో డిగ్రీ పూర్తి చేశాను. ఆర్‌ఆర్‌బీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి రైల్వే డిపార్ట్‌మెంట్‌లో సిగ్నల్‌ గేట్‌ ఆపరేటర్‌గా ఉద్యోగం సాధించాను. ప్రస్తుతం అనపర్తి రైల్వే స్టేషన్‌లో పనిచేస్తున్నాను.
– కొత్తపల్లి శివప్రసాద్, చెల్లూరు, రాయవరం మండలం, తూర్పుగోదావరి

పైసా ఖర్చులేకుండా...
పేదలకు సాంకేతిక విద్యను అందించిన ఘనత వైఎస్‌ఆర్‌కే దక్కుతుంది. ఆర్థిక సమస్యల వల్ల ఏ విద్యార్థి చదువుకు దూరం కాకుండా ఉండడానికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఉపకరించింది. గ్రామీణ ప్రాంతంలో నేడు కనీసం 20 మంది విద్యార్థులైనా ఇంజనీరింగ్‌ చదువుతున్నారంటే అది వైఎస్‌ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం వల్లే. పైసా చెల్లించకుండా కృష్ణా జిల్లా నూజివీడు ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ చదివాను. ఈరోజు ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ టీసీఎస్‌లో ఉద్యోగం సాధించాను. వైఎస్‌ వల్లే ఈ స్థాయిలో ఉన్నాను.
– తలాటం కొండబాబు, కాకినాడ, తూర్పుగోదావరి

వైఎస్‌ఆర్‌ నా ఇంటి పెద్ద కొడుకు
వైఎస్‌.రాజశేఖరరెడ్డి నాకు పెద్ద కొడుకులాంటి వాడు. నేను భూమి మీద జీవిస్తున్నాను అంటే ఆయన పుణ్యమే. 2005లో మొట్టమొదటి సారిగా రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశ పెట్టినప్పుడు...ఆ పథకం ద్వారా హైదరాబాద్‌లో గుండె బైపాస్‌ సర్జరీ చేయించుకున్నాను. ఆ సౌకర్యం లేకుంటే డబ్బులు పెట్టే స్థోమత నాకు లేదు. నేను బతికేదాన్ని కాదు. నా పెద్దకొడుకు రాజశేఖరరెడ్డే  నన్ను బతికించిండు. నాకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. పెద్దాయన వైఎస్సారే. నేను, నా కుటుంబం ఆయనను ఎప్పుడూ మరవలేం. నా వయస్సు 80 ఏళ్లు దాటినా నేను ఆరోగ్యంగా ఉన్నాను.  ప్రతిరోజు రాజశేఖర్‌రెడ్డి యాదికొస్తడు.
– అంబూబాయి, మదనాపురం, వనపర్తి

ఆయన లేకుంటే బతికేవాణ్ని కాదు...
తీవ్ర ఆయాసంతో బాధ పడుతూ 2008లో డాక్టర్ల దగ్గరకు వెళ్లాను. గుండెలో మూడు వాల్వ్‌లు మూసుకుపోయాయని చెప్పారు. ఆపరేషన్‌కు లక్షన్నరకు  పైగా ఖర్చయితదని అన్నారు. నేను నెలకు రెండు వేలు మాత్రమే సంపాదించేవాడిని. నా భార్య చనిపోవడంతో నా ఇద్దరు కూతుళ్లను పోషించేందుకే నా సంపాదన సరిపోయేది. నా బతుకు ఇంతే అనుకున్నాను. వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టిన సంగతి నాకు డాక్టర్లు చెప్పారు. దీంతో హైదరాబాద్‌లో ఆపరేషన్‌ చేయించుకున్నా. ఆపరేషన్‌ అయ్యాక ఇప్పుడు నా ఆరోగ్యం బాగుంది. నా బిడ్డలకు పెళ్లిళ్లు చేశాను. ఆరోగ్యశ్రీ లేకుంటే  ఇప్పుడు నేను ఈ లోకంలో ఉండేవాడిని కాదేమో.
– గడ్డం వెంకటస్వామి, చౌటబెట్ల, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్‌

నా ప్రాణదాత
నాకు పునర్జన్మనిచ్చిన దేవుడు వైఎస్‌రాజశేఖరరెడ్డి. రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి మా కుటుంబానిది. వెన్నునొప్పితో బాధ పడుతున్న నేను కార్పొరేట్‌ ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేసుకోవాలంటే చిల్లి గవ్వ లేదు. ఆపరేషన్‌ చేయకపోతే ప్రమాదమని వైద్యులు చెప్పారు. ఆపరేషన్‌కు రెండు లక్షలు ఖర్చు అవుతాయని చెప్పారు. ఈ పరిస్థితుల్లో రాజీవ్‌  ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆపరేషన్‌ చేయించుకున్నాను. ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఆరోగ్యశ్రీతో వైఎస్‌ నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ప్రాణదాత అయ్యారు. వైఎస్‌ పుణ్యానే నాకు ప్రభుత్వం మూడెకరాల అసైన్డ్‌ భూమిని పట్టా చేసింది. వైఎస్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ కనిపించడం లేదనే వార్త విని ఎంతో ఏడ్చాను. ఆయన బతికిరావాలని గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో 25 టెంకాయలను కొట్టాను.
– శివారెడ్డి, శేర్నపల్లి, నారాయణపేట మండలం, మహబూబ్‌నగర్‌

నా దేవుడు వైఎస్సే..!
నేను కూలీపని చేసుకొని బతుకీడుస్తున్న. 2009ల ఓ రోజు నాకు అపెండిసైటిస్‌ వచ్చింది. చేతిలో పైసల్లేవ్‌. దవాఖానాకు పోతే వేలకు వేలు ఖర్చవుతయని చెప్పి నొప్పి మీదనే ఉన్న. నడుముకి గట్టిగ తువ్వాల కట్టి రెండు, మూడు రోజులు అట్లనే ఓపిక బట్టిన. మూడోనాడు నొప్పి ఎక్కువైతే లాభం లేదని హనుమకొండల ఓ దవాఖానల చేరిన. అపెండిసైటిస్‌ గొట్టం పగిలి, కడుపంతా విషం పాకిందని, ఆపరేషన్‌ చేయాలని చెప్పిర్రు. ఆరోగ్యశ్రీ కార్డు మీద 2లక్షల రూపాయల ఆపరేషన్‌ ఫ్రీగా అయింది. అదే లేకుండ పోతే నేను సచ్చి ఎనిమిదేండ్లు అయి ఉండెడిది. నాకు మళ్ళా జన్మనిచ్చిన దేవుడు వైఎస్‌. ఆయన ఫొటో పట్టుకొనే వార్డ్‌మెంబర్‌గా నిలబడి గెలిషిన. గిప్పుడు వార్డ్‌ మెంబర్‌ అయినంక నన్ను గెలిపించినోళ్ళకు తోడుంటున్న. నేను సచ్చేంతవరకు వైఎస్సే నా దేవుడు. ఆయనే నన్ను ముందుకు నడుపుతున్నడు.
– జన్ను సాంబయ్య, హసన్‌పర్తి, వరంగల్‌ రూరల్‌

పాప చిరునవ్వుల్లో...
మా పాప కరుణశ్రీ (9) నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడు అనారోగ్యానికి గురైంది. ఆస్పత్రిలో చూపిస్తే గుండెకు చిల్లు పడిందని చెప్పారు. 2011లో ఆరోగ్యశ్రీ పథకం కింద గుండె ఆపరేషన్‌ చేయించాం. ప్రస్తుతం పాప నాగర్‌కర్నూల్‌ సీఎన్‌ఆర్‌ పాఠశాలలో అయిదో తరగతి చదువుతుంది. పాప చిరునవ్వులో వైఎస్‌ను చూసుకుంటున్నాము.
– జయసుధ, అవురాసిపల్లి, నాగర్‌కర్నూల్‌

పునర్జన్మ ఇచ్చిన మహానుభావుడు
భార్యను ప్రాణాపాయం నుంచి కాపాడుకునేందుకు చేసిన అప్పు తీర్చడానికి లారీడ్రైవరుగా రాత్రింబవళ్లు కష్టపడ్డాను. ఈ క్రమంలో జబ్బు పడ్డాను. ఆస్పత్రిలో చూపిస్తే కిడ్నీ పాడైందని, ఆపరేషన్‌ చేయాలని అన్నారు. లక్షల రూపాయల వ్యవహారం కావడంతో చావే శరణ్యం అనుకున్నాను. భార్య, నలుగురు ఆడపిల్లలు. నేను పోతే నా భార్యాబిడ్డల పరిస్థితి ఏమిటి? అని కుమిలిపోతున్న సమయంలో వైఎస్‌ పేదల కోసం ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకం గురించి తెలిసింది. అలా వైఎస్‌ పుణ్యమా అని కిడ్నీ ఆపరేషన్‌ ఉచితంగా చేయించుకోగలిగాను. ఆరోగ్యవంతుడిగా ఇంటికి చేరాను. నా తల్లి రాములమ్మ జన్మనిస్తే వైఎస్సార్‌ పునర్జన్మ ఇచ్చారు.
– పెద్దపిరంగి అంజిలయ్య, కోస్గి, మహబూబ్‌నగర్‌


వైఎస్‌ ఆశయాలే మాకు రక్ష!
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారి ఆశయాలే మాకు శ్రీరామ రక్ష. మాదొక దిగువ మధ్యతరగతి కుటుంబం. మేము ముగ్గురం ఆడపిల్లలం. మా నాన్న పేరు సైదులు. ముగ్గురం ఆడపిల్లలమే అయినా మాకు మంచి చదువు చెప్పించాలని అనుకుంటూ ఉండేవాడు. నేను ముగ్గురిలో చివరిదాన్ని. 2010లో పదో తరగతిలో నాకు 560మార్కులు వచ్చాయి. అప్పుడే వైఎస్సార్‌ గారు పేదవాళ్ళు మంచి చదువులు చదవాలని బాసరలో స్థాపించిన ట్రిపుల్‌ఐటీలో సీట్‌ వచ్చింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ప్రభుత్వమే నా చదువుకయ్యే ఖర్చు భరించింది. అమ్మ, నాన్నల కల నెరవేర్చాలని కష్టపడి చదివి క్యాంపస్‌ సెలక్షన్స్‌లో విప్రో కంపనీలో ఉద్యోగం సాధించా. ఇప్పుడు మంచి జీతంతో పనిచేస్తున్నందుకు అందరం సంతోషంగా బతుకుతున్నాం. పేదవారికి మంచి చదువులు చెప్పిస్తేనే సమాజం బాగవుతుందని చెప్పిన వైఎస్సార్‌ మాటలంటే ఎంతో ఇష్టం. ఆయన ఆశయం వల్లే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నా. ఆయన ఆశయాలు ఎప్పటికీ బతికే ఉండాలి.
– చాపల శరణ్య, హాలియా, నల్లగొండ

మా పాప బతికుందంటే వైఎస్‌ వల్లే!
మా పాప పార్వతి పుట్టాక గుండె జబ్బు ఉందని తెలిసింది. గుండె కవాటాల్లో లోపం ఉండటంతో పాప ఆడుకుంటూ ఆడుకుంటూనే కళ్ళు తిరిగి పడిపోయేది. అలా జబ్బు పడినప్పుడల్లా హాస్పిటల్‌కు వెళ్ళడం, కొన్ని మందులు తీసుకోవడం.. ఇదే చేస్తూ వచ్చాం. ఒకసారి జబ్బు ముదిరిపోయింది. పాపకు నయమవ్వాలంటే ఆపరేషన్‌ చేసి తీరాల్సిందేనన్నారు. 2లక్షల దాకా ఖర్చవుతుందన్నారు. వంటపని చేసుకొని బతికే నాకు అంత స్థోమత లేదు. ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఇక్కడ, అక్కడా అంటూ ఓ తొమ్మిది సంవత్సరాలు పాపను భుజాన వేసుకొని తిరిగాం. కొన్ని చోట్లైతే ఆపరేషన్‌ చేసినా బతకడం కష్టమని చెప్పారు. పుట్టపర్తికి వెళ్ళినా అక్కడ 14ఏళ్ళు వచ్చాకే ఆపరేషన్‌ చేస్తామన్నారు. ఇక మాకు ఏదారీ లేని సమయంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి దేవుడిలా ఆదుకున్నాడు. గుండె జబ్బులున్న పిల్లలకు రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఉచితంగా ఆపరేషన్‌ చేస్తుందన్న విషయం తెలుసుకొని పెనమలూరులో జరిగిన క్యాంపుకు వెళ్ళాం. అక్కడి నుంచి ఆపరేషన్‌కు హైద్రాబాద్‌కు తీసుకెళ్ళారు. ఇన్నోవా హాస్పిటల్‌లో ఎనిమిది గంటల పాటు శ్రమించి డాక్టర్లు ఆపరేషన్‌ను విజయవంతం చేశారు. పాప స్పృహలోకి రాగానే మేం పడ్డ సంతోషం మాటల్లో చెప్పలేనిది. వైఎస్‌ దయవల్ల పార్వతి ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది. పాలిటెక్నిక్‌ మూడో సంవత్సరం చదువుతోంది. ప్రమాదంలో వైఎస్‌ చనిపోయారన్న వార్తను తట్టుకోలేకపోయా. 2015లో ఇడుపులపాయలో వైఎస్‌ వర్ధంతి రోజున వంటలు చేసేందుకు వెళ్ళా. అప్పుడే ఆయన సమాధిని దర్శించుకునే భాగ్యం కలిగింది. ఆరోజు ఆయన సమాధి ముందు నిలుచున్నప్పుడు కన్నీళ్ళను ఆపలేకపోయా.
– ఆరేపల్లి కనకదుర్గ ప్రసాద్, లబ్బీపేట, విజయవాడ

ఆడపిల్లల చదువు.. ఆయన పుణ్యమే!
రోల్డ్‌గోల్డ్‌ పనులు చేసుకొని బతికే ఓ పేద కుటుంబానికి ఇంటి పెద్దను నేను. పదోతరగతి వరకే చదివా. నా భార్య కూడా పెద్దగా చదువుకోలేదు. మాకు ముగ్గురు ఆడపిల్లలు. మేము చదువుకోకపోయినా పిల్లలకైనా మంచి చదువులు చెప్పించాలని కలలుగన్నా. ఇంటర్‌ వరకూ పిల్లలను చదివించడమైతే చదివించగలిగా కానీ ఆ తర్వాత నా వల్ల కాదేమో అనిపించింది. అయితే వైఎస్సార్‌ పుణ్యమా అని ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌ రావడంతో ఒక ధైర్యం వచ్చింది. పెద్దమ్మాయి రహీమా బేగం టీటీసీ చేసింది. రెండో అమ్మాయి రియాసాతా బేగం కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ చేసింది. మూడో అమ్మాయి కూడా ఇంజనీరింగ్‌ చేసింది. ప్రస్తుతం రెండో అమ్మాయి, మూడో అమ్మాయి బెంగళూరులో మంచి ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు. లక్షలు కడితే గానీ పొందలేని చదువును నా పిల్లలు ఫ్రీగా పొందారు. అదంతా వైఎస్సార్‌ వల్లనే! నాలాంటి పేదవాడి కడుపున పుట్టిన పిల్లలు, అదీ ఆడపిల్లలు ఇంత పెద్ద చదువు చదివారంటే వైఎస్సార్‌ పుణ్యమే అది.
– అబ్దుల్‌ హకీమ్, పెడన, కృష్ణా

తాతయ్య లేడనే బెంగ అలాగే మిగిలిపోయింది!
నాకు ఐదేళ్ళున్నప్పుడు జబ్బు చేస్తే గుండెకు రంధ్రాలు పడ్డాయని తెలిసిందట. ఆపరేషన్‌ చేస్తేగానీ బతకనని డాక్టర్లు అన్నారట. దానికేమో 5లక్షల దాకా ఖర్చు అవుతుందని, అంత డబ్బులు లేని పరిస్థితుల్లో అమ్మా, నాన్న చెప్పలేని కష్టాలు పడ్డారట. అప్పుడే వైఎస్‌ తాతయ్య పెట్టిన ఆరోగ్యశ్రీ గురించి తెలిసి దాని ద్వారా నా ఆపరేషన్‌ చేశారట. మాదొక నిరుపేద కుటుంబం. అమ్మా, నాన్న ఆరోజుల్లో ఏ స్థాయిలో కష్టపడి ఉంటారో ఆలోచించుకుంటేనే భయమేస్తుంటుంది. వైఎస్‌ తాతే లేకపోతే నాకు ఆపరేషన్‌ జరిగేది కాదని నాన్న చెబుతూ ఉంటారు. ఇప్పుడు నాకు 15 సంవత్సరాలు. పదవ తరగతి చదువుకుంటున్నా. నాన్న, అమ్మ, ఇద్దరు తమ్ముళ్ళు, నాన్నమ్మ, తాతయ్యలతో హ్యాపీగా ఉన్నా. వైఎస్‌ తాతయ్య గురించి నాన్న చెప్పిన నాటి నుంచే ఆయనను దేవుడిగా కొలుస్తూ వస్తున్నా. ఆయన ఇప్పుడు మనతో ఉంటే బాగుండేదనిపిస్తోంది. నాకు ప్రాణభిక్ష పెట్టిన తాతయ్య ఎందుకు వదిలేసి పోయాడో! ఆయన లేడన్న బెంగ అలాగే మిగిలిపోయింది.
– చెరుకూరి మేఘన, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి

ఆయనే లేకుంటే మా బతుకులెలా ఉండేవో!?
నేనొక చిన్న ఫొటో స్టూడియో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న. 2009లో ఒకటే ఛాతినొప్పి అనిపిస్తే ముందు హన్మకొండలో ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చేరిన. డాక్టర్లు హైద్రాబాద్‌కు రిఫర్‌ చేస్తే, మళ్ళ అక్కడ మెడిసెంటర్‌ల చేరిన. గుండెనొప్పి అని, దానికి బైపాస్‌ సర్జరీ చేయాల్సిందేనని డాక్టర్లు అన్నరు. దానికి 2లక్షలు ఖర్చయితయని చెప్పిర్రు. నా ప్రాణాలు పోతాయనుకున్న అప్పుడే. అయితే వైఎస్‌ ఆశాజ్యోతిలా ఆదుకున్నడు. ఆయన తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్‌ చేస్తమని పైసా ఖర్చు లేకుండా నన్ను బతికించిర్రు. ఆయన ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వల్లనే ఇప్పుడు నా కొడుకు బీటెక్‌ చదివి ఉద్యోగం చేస్తున్నడు. ఆయనే లేకుంటే మా ఈ బతుకులెలా ఉండేవో అనిపిస్తది.
– కుడికాల సత్యనారాయణ, పరకాల,వరంగల్‌ రూరల్‌

వైఎస్‌ లేకపోతే సివిల్స్‌ కల సాకారమయ్యేది కాదు!
మా నాన్న పేరు రమణయ్య. ఆయనొక ఆటోడ్రైవర్‌. అమ్మ సరోజిని బీడీలు కడుతూ కష్టపడేది. నేను బాగా చదువుకోవాలని అమ్మ, నాన్న కలలు కన్నారు. చిన్నప్పట్నుంచే స్కూల్లో మంచి మార్కులతో పాస్‌ అవుతూ వచ్చా. ఇంట్లో ఆర్థికపరిస్థితి చూసి పాలిటెక్నిక్‌ చదివేరోజుల్లోనే ఇక పై చదువులు చదవగలనా అన్న భయం ఉండేది. వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నాకొక ఆశాదీపంలా కనిపించింది. ఆ పథకంవల్లే బీటెక్‌ పూర్తి చేసి సివిల్స్‌కు సిద్ధమయ్యా. ఈమధ్యే వచ్చిన ఫలితాల్లో సివిల్స్‌లో 526వ ర్యాంకర్‌గా నిలిచా. వైఎస్సార్‌ పథకమే లేకపోతే పాలిటెక్నిక్‌తోనే నా చదువు ఆగిపోయేది. నా కల ఎప్పటికీ నెరవేరేది కాదేమో. ఇప్పుడు మేమందరం సంతోషంగా ఉన్నామంటే అది వైఎస్సార్‌ చలవే!
– చెన్నూరి సర్వేష్, హసన్‌పర్తి, వరంగల్‌ అర్బన్‌

పిల్లల ఉన్నత చదువు ఆయన చలవే!
టైలర్‌ పనినే జీవనాధారంగా చేసుకొని బతుకుతున్న నాకు ముగ్గురు పిల్లలు. నసురుద్దీన్, నిజాముద్దిన్, రుక్సానా. పదో తరగతి వరకు ముగ్గురూ గవర్నమెంట్‌ స్కూల్లోనే చదువుకున్నారు. పిల్లలందరూ బాగా చదువుకోవాలన్నది నా కల. వాళ్ళు కూడా స్కూల్లో మంచి మార్కులతో పాసవుతూ రావడంతో ఇంటర్‌లో ప్రైవేటు కాలేజీల్లోనే ఫ్రీగా చదువుకున్నారు. అయితే ఆ తర్వాత పిల్లల పై చదువులు ఎలా అన్నది నాకొక భయంగా ఉండేది. నసురుద్దీన్, రుక్సానాలు మెడిసిన్‌ చదవాలనుకున్నారు. నిజాముద్దిన్‌ ఇంజనీర్‌ అవ్వాలనుకున్నాడు. వీళ్ళను ఇక పై చదువులు చదివించగలనా అనుకున్న సమయంలోనే నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు. పేదరికంలో ఉన్న నేను నా పిల్లలను చదివించగలనా అన్న భయాలను తుడిచేస్తూ ఆయన తెచ్చిన ఈ పథకంతో నసురుద్దీన్‌ను కడప రిమ్స్‌లో హౌస్‌ సర్జన్‌ చదువుకొని ప్రస్తుతం కేరళలో డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. పాప రుక్సానా ఇప్పుడు హోమియోపతి చదువుతోంది. నిజాముద్దిన్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు. ఈ పేదవాడి ఇంట్లో ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఇప్పుడు ఉన్నతచదువులు చదువుకోగలిగారంటే అది వైఎస్సార్‌ గారి చలవే!
– షేక్‌ ఫయాజ్‌బాషా, బుచ్చిరెడ్డి పాలెం, నెల్లూరు

మా బిడ్డ బతికి బడి ముఖం చూసింది!
మాదొక పేద కుటుంబం. మాకు ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయి మానసకు చిన్నప్పటి నుంచే గుండె జబ్బు ఉండింది. బిడ్డ ఆరోగ్యం కోసమే ఉన్న భూములన్నీ అమ్మేసినం. అప్పులు చేసి మరీ డాక్టర్లకు చూపించినం. మానసకు గుండె జబ్బు ఉందని, ఆపరేషన్‌ చేస్తేనే నయమవుతదని డాక్టర్లు చెప్పిర్రు. మా దగ్గరిగ పైసల్లేక బిడ్డ ప్రాణాల మీద ఆశలు వదులుకున్నం. అప్పుడే వైఎస్‌. రాజశేఖరరెడ్డి దొర పెట్టిన ఆరోగ్యశ్రీ గురించి తెల్సింది. హైదరాబాద్‌లోని ఇన్నోవా ఆసుపత్రిల చేర్పిస్తే, రూపాయి తీసుకోకుండా ఖర్చంతా గవర్నమెంటే భరించి ఆపరేషన్‌ చేసింది. మందులు ఫ్రీగా ఇచ్చి, ఇంటికి పోతానికి బస్సు కిరాయిలు కూడా ఇచ్చి పంపిచ్చిర్రు. జబ్బుతో అసలు బడి ముఖమే చూడని మానస ఇప్పుడు రోజూ బడికి పోతోంది. ఆ రాజన్న దొరే లేకపోతే మా బిడ్డ బతక్కపోదువు. రోజూ ఆయన ఫోటోకు దండం పెట్టుకున్నాకే పనికి పోతం.
 – కర్రె స్వరూప, బాన్సువాడ, నిజామాబాద్‌

ఆయననెలా మరచిపోగలం!
వికలాంగులకు అండగా నిలబడాలని వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి గారు ప్రవేశపెట్టిన పింఛన్‌ పథకం కింద అప్పట్లోనే నెలనెలా 200 రూపాయలు వచ్చేవి. ముసలోళ్ళకు, భర్త చనిపోయినోళ్ళకు కూడా పింఛన్‌ వస్తోందంటే అది వైఎస్సార్‌ చలవే! వికలాంగుడిగా ప్రభుత్వం నుంచి వచ్చే పింఛన్‌ నాలో ధైర్యాన్నిచ్చింది. ఆయనను ఎప్పటికీ మరచిపోలేం!
– ఓర్సు నరసింహారావు,ముప్పాళ్ళ, గుంటూరు

పేదింట వెలుగు మా రాజన్న!
మేం పాలమ్ముకొని బతికేటోళ్ళం. మా బిడ్డ చిన్నగున్నప్పుడే బళ్ళో కరెంట్‌ షాక్‌ కొడితే చచ్చిపోయింది. ఆ బాధను మేం మరిచిపోక ముందే కొడుకు ఏమస్వామికి ఓసారి జబ్బు చేసింది. దవాఖానాకు తీసుకపోతే మందులు వాడితే తగ్గుతది అన్నరు. ఆ తర్వాత అది అట్ల పెరుగుతనే పోయి పెద్దగయింది. పదేళ్ళ పిలగాని బాధను చూసి తట్టుకోలేకపోయినం. మూడు నాలుగు చోట్ల చూపించినంక గుండెకు రంధ్రం పడ్డదని, ఆపరేషన్‌ చేయాలని చెప్పిర్రు. హైద్రాబాద్‌ తీస్కపోయి ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్‌ చేయించినం. మానించి రూపాయి తీస్కోకుండ 5లక్షల 40 వేల రూపాయలు సర్కారే కట్టింది. ఇప్పుడు ఏమస్వామి మూడో తరగతి చదువుతున్నడు. ఆడు ఇయ్యాల హుషారుగ తిరుగుతున్నడంటే అది రాజన్న దొర వల్లనే! మా పేదింట వెలుగు రాజన్న. ఆయనే లేకుంటే మా బిడ్డ బతుకు ఏమయ్యెనో!
– లక్ష్మి, వేమనపల్లి, ఆదిలాబాద్‌

వైఎస్‌ మా జీవితాల్లో వెలుగు నింపారు!
మాదొక నిరుపేద కుటుంబం. నాన్న ఎంతో కష్టపడి నన్ను చదివించాలని కలలుగన్నాడు. అయితే నేను ఇంటర్‌ చదివే రోజుల్లోనే ఓ ప్రమాదంలో నాన్న చనిపోయాడు. అమ్మ ఇంటి బాధ్యతను మీద వేస్కొని నన్ను, తమ్ముడిని చదివించింది. టైలరింగ్‌ చేస్తూ, తను మాకోసం ఎంతో కష్టపడింది. నాకు ఇంటర్‌లో 952 మార్కులు రావడంతో పాటు, ఇంజనీరింగ్‌లో 6354 ర్యాంక్‌ వచ్చింది. మంచి కాలేజీలో ఇంజనీరింగ్‌ సీట్‌ వస్తుందని తెలిసినా, అంత స్థోమత లేదని డిగ్రీ చేద్దామనుకున్నా. అదే సమయంలో అలనాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు. అదే నా జీవితాన్ని మలుపుతిప్పింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఉచితంగా ఇంజనీరింగ్‌ చేశా. టీఎస్‌పీఎస్‌సీ ఇంజనీరింగ్‌ పోస్టులు పడితే, పంచాయతీ రాజ్‌ శాఖలో ఇంజనీర్‌గా ఉద్యోగం వచ్చింది. వైఎస్సార్‌ వల్లే నాతో పాటు వేలాది మంది పై చదువులు చదువుకుంటున్నారని నిస్సందేహంగా చెప్పగలను. మా జీవితాల్లో వెలుగు నింపిన దేవుడు వైఎస్సార్‌.
– మైనంపాటి దేవేందర్‌ రెడ్డి, మిర్యాలగూడ రూరల్, నల్లగొండ

నీడ, ధైర్యాన్నిచ్చాడు వై.ఎస్‌..!
నేనొక వికలాంగురాలిని. నా భర్త చంద్రన్నకు రెండు కళ్ళూ కనిపించవు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతికీడుస్తున్న మాకు సెంటు భూమి కూడా లేదు. అలాంటి మాకు ఇందిరమ్మ ఇల్లు పథకం కింద స్థలం ఇవ్వడంతో పాటు ప్రభుత్వమే ఇల్లు కూడా కట్టించి ఇచ్చింది. వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి పుణ్యాన ఇప్పుడు మేము సొంత ఇంట్లో ఉంటున్నాం. రాజన్నే పెట్టిన పింఛన్‌ పథకం కింద కూడా నెలనెలా మా ఇద్దరికీ పింఛన్‌ వస్తోంది. పేదల మనసెరిగిన రాజు వై.ఎస్‌.ఆర్‌. ఆయన దయతోనే మాకిప్పుడు ఓ నీడ ఉంది, బతుకు మీద ధైర్యం వచ్చింది.
– తిమ్మక్క, కెంచంపల్లి, అనంతపురం

మా ఇంట్ల పెద్ద కొడుకు వైఎస్సారే!
వ్యవసాయమొక్కటే మాకు తెలిసిన పని. ఉన్న మూడెకరాల్ల బోరుబావులు ఎండిపోయి ఒక్క ఎకరం కూడ సక్కగ సాగయ్యేది కాదు. అయినా అదే పని చేస్కుంట బతుకుత వచ్చినం. మాకు ఇద్దరు ఆడపిల్లలు. ‘మగపిల్లలు లేకపాయే.. ఉన్న ఇద్దరూ ఆడపిల్లలేనాయే’ అని చానామంది అంటుండే! ఆడపిల్లలైనా ఆళ్ళను బాగా సదివించాలని బలంగ అనుకున్నం. పెద్దమ్మాయి రాధిక చిన్నప్పటి సంది ఫస్ట్‌ వచ్చేది. పదో తరగతిలో మంచి మార్కులు తెచ్చుకుంటే బాసర ట్రిపుల్‌ఐటీల ఫ్రీ సీట్‌ వచ్చింది. వైఎస్సార్‌ దయ వల్ల రాధిక ట్రిపుల్‌ఐటీలనే ఇంజనీరింగ్‌ చదివింది. మా బంధువుల్లో ఫస్ట్‌ ఇంజనీరింగ్‌ దాంక చదివింది రాధికే! ఇట్ల సదువు అయిపోంగనే గవర్నమెంట్‌ ఇంజనీర్‌గా జాబొచ్చింది. మిడ్‌మానేరు ప్రాజెక్టు ఏఈఈగా పనిచేస్తుందిప్పుడు. వైఎస్సార్‌ ఫ్రీగా చదివించాలనే అనుకోకుంటె మా ఇంట్ల ఇంజనీర్‌ పుట్టేది కాదు. మగపిల్లలు లేని మా ఇంట్ల వైఎస్సారే పెద్ద కొడుకై చెల్లెళ్ళను చదివించిండని చెప్పుకుంటూంటా. పేదల మనసెరిగిన మనసున్న మారాజు వైఎస్సార్‌.
– దేవేంద్ర, ముస్తాబాద్, కరీంనగర్‌

వైఎస్సార్‌ వల్లే బాబు బతికాడు!
మా అబ్బాయి శ్రీనుకు చిన్నతనంలోనే గుండె జబ్బు వచ్చింది. ఆరో తరగతి చదివే రోజుల్లో తరచూ ఆయాసంతో ఇబ్బంది పడేవాడు. పెదాలంతా నీలం రంగులోకి మారేవి. నడవలేక ఇబ్బంది పడేవాడు. ఆస్పత్రిలో చూయిస్తే గుండెకు రంధ్రాలు పడ్డాయని, ఆపరేషన్‌ చేస్తేనే బతుకుతాడని, దానికి 2లక్షల దాకా ఖర్చవుతుందని చెప్పారు. రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు మావి. ఏమీ చేయలేమని చెప్పి వదిలేశాం. ఒకటిరెండు సార్లు పుట్టపర్తికి తీసుకెళ్ళినా అక్కడా ఆపరేషన్‌ చేయలేదు. ఇక చేసేదేం లేక బాబుకు జబ్బు చేసి నీరసపడ్డప్పుడల్లా మందులు వాడేవాళ్ళం. వాడి అవస్థ చూసి చెప్పుకోలేనంత బాధపడేవాళ్ళం. 2011లో ఉమబాల అనే ఓ టీచర్‌ వైఎస్సార్‌ గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ గురించి చెప్పి విశాఖలోని అపోలో ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అక్కడ పైసా ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ ద్వారా బాబుకు నయం చేశారు. ఇప్పుడు శ్రీను ఇంటర్‌ చదువుకుంటున్నాడు. ఇప్పుడు వాడు ఆరోగ్యంగా నవ్వుతూ ఉంటే వైఎస్సారే గుర్తొస్తారు. ఆయన ఆరోగ్యశ్రీ వల్లే బాబు బతికాడు.
 – సూరాకాసుల అనురాధ, పాయకరావు పేట, విశాఖపట్నం

బతికినన్ని రోజులు ఆయనను గుండెల్లో పెట్టుకుంటా!
నేను నాగళ్ళు, మంచాలు, తలుపులు చేసుకుంటూ వడ్లపనితో నా కుటుంబాన్ని పోషించుకుంటున్న వాడిని. 2008లో ఓరోజు పని చేస్తుండగా ఒక్కసారిగా గుండెనొప్పి వచ్చింది. నిలబడ్డ కాడనే కింద పడిపోయిన. చుట్టూ ఉన్నోళ్ళు చూసి దవాఖానాల చేర్పిచ్చిర్రు. హైద్రాబాద్‌కి తీస్కపోవాలి తప్పదు అంటే దుర్గాభాయ్‌ దేశ్‌ముఖ్‌ హాస్పిటల్‌ల చేర్పిచ్చిర్రు. డాక్టర్లు మందులిస్తే రెండు రోజులు బానే కోలుకున్న. ఆపరేషన్‌ చేస్తెనె సెట్‌ అయితది లేదంటే ప్రాణాలే పోవొచ్చు అన్నరు. అక్కడ ఇక్కడ అడుక్కొచ్చిన పైసలు గుడ అప్పటికే అయిపోయినయి. ప్రాణాలు పోతయనే అనుకున్న. అప్పుడే ఓ పెద్దమనిషి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పథకం ఆరోగ్యశ్రీ గురించి చెప్పిండు. కానీ మాకప్పటికి ఆ కార్డు లేదు. ఏమైన కానీ అని రాజశేఖరరెడ్డి సార్‌ ఉండె క్యాంప్‌ అఫీస్‌కు పోయినం. నా బాధంతా చెప్పుకొని ఆయన కాళ్ళ మీద పడబోతుంటే, ఆయన నన్ను లేపి, ‘‘ఏం కాదు. నేను చూస్కుంటా! కార్డు లేకున్నా ఆరోగ్యశ్రీ పథకం కింద నీకు ఆపరేషన్‌ చేయించే బాధ్యత నాది’’ అన్నరు. అధికారులకు చెప్పించి నా ఆపరేషన్‌ చేయించిర్రు. 15రోజులు హాస్పిటల్‌లనే ఉంచుకున్నరు. నాతోని వచ్చినోళ్ళకు కూడ అన్నం పెట్టిర్రు. పోయేరోజు దారి ఖర్చులు కూడ ఇచ్చిర్రు. ఆ దేవుడు వైఎస్సారే లేకపోతే నేను ఆపరేషన్‌ చేయించుకునేటోన్ని కాదు. బతికేటోడ్ని కూడా కాదు. నన్ను బతికించి, ఆయన పోయాడు. నేను బతికినన్ని రోజులు ఆయనను గుండెల్లో పెట్టుకుంటా.
– వెయిగండ్ల సుధాకర్, జన్నారం, ఆదిలాబాద్‌

వైఎస్‌ పథకం వల్లే డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ కాగలిగా!
మాకున్న చిన్న పొలంలో ఏటా ఒక్క పంటే పండేది. దాంతోనే కష్టపడి అమ్మా, నాన్నా వ్యవసాయం చేస్తూ నన్ను చదివిస్తూ వచ్చారు. ఇంటర్‌ తర్వాత పై చదువులు చదవాలన్న ఆలోచన ఉన్నా, అందుకు ఆర్థిక పరిస్థితి సహకరించదని అనుకుంటూ ఉండేవాడ్ని. అదే సమయంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారు ‘ఫీ వైవర్‌’ పేరుతో పేద విద్యార్థుల చదువుల కోసం ఒక పథకం ప్రారంభించారు. ఎంసెట్‌లో మంచి ర్యాంకు రావడంతో ఆ పథకం కింద నాకు బీ ఫార్మసీ ఫ్రీ సీట్‌ వచ్చింది. ఇక ఆ తర్వాతి సంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పేరుతో అందరికీ వర్తించేలా పథకం చేపట్టడంతో నా చదువంతా సాఫీగా సాగిపోయింది. ఆ తర్వాత చండీఘడ్‌లో ఎంఫార్మసీ చదువుతున్న రోజుల్లోనే డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం రాజమహేంద్రవరంలో బాధ్యతలు నిర్వహిస్తున్నా. వైఎస్‌ లాంటి ఆలోచనలున్న నాయకుడు ఉంటే ఉన్నత చదువులు పేదవాడికీ సాధ్యమే! నాతోపాటు ఎంతో మందికి ఉన్నత విద్యను అందించిన వైఎస్‌ గారికి థ్యాంక్స్‌ ఎంత చెప్పినా తక్కువే!
– బి.గోపాలకృష్ణ, తెనాలి, గుంటూరు

రాజన్నే లేకపోతే నా కుటుంబం అనాథగా మిగిలేది!!
నేనొక చేనేత కార్మికుడిని. శాయంపేటలో మాకు పెద్దగ పనుల్లేకుంటే భీవండి వలస వెళ్ళిన. ఆ తర్వాత అట్లనే వలస పోయి అక్కడక్కడ పనిచేసిన. మళ్ళా అక్కడుంటే ఇంటికి దూరమైన అనిపించి ఊరికి దగ్గర్లనే ఓ కోళ్ల ఫారంల పనికి చేరిన. 2011ల ఓరోజు పనిల ఉన్నప్పుడె గుండెపోటు వచ్చింది. హైద్రాబాద్‌ల కేర్‌ హాస్పిటల్‌ల చేర్పిచ్చిర్రు. ఆరోగ్యశ్రీ కింద రూపాయి ఖర్చు లేకుండ ఆపరేషన్‌ చేసి పంపిచ్చిర్రు. ఆ రోజు రాజన్నే లేకపోతే నా కుటుంబం అనా«థగ మిగిలేది. వైఎస్‌ ఉన్న రోజుల్లోనే నాకు ఇందిరమ్మ ఇల్లు గూడ మంజూరు చేసిర్రు కానీ ఆయన పోయినంక అది సగంలనే ఆగిపోయింది. ఇప్పుడైతే బీడీలు కట్టుకుంట పిల్లలను సాదుతున్న. వైఎస్‌ వల్లనే బతికి బట్ట గట్టిన అని చెప్పి ఆయనను దేవుడుగ కొలుసుకుంటున్న.
– సామల మల్లేశం, వరంగల్‌రూరల్

నా బిడ్డను బతికించింది ఆయనే!
మాది నిరుపేద కుటుంబం. బతుకు గడవడమే కష్టంగా ఉన్న రోజుల్లో నా బిడ్డ శ్రీదేవి చెవికి ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయమైంది. కాకినాడ గవర్నమెంట్‌ ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ డాక్టర్లు మావల్ల కాదని చెప్పేశారు. హైద్రాబాద్‌కు పోవాలంటే అంత డబ్బు లేదు. బిడ్డకేమో చెవి నుంచి చీము కారుతూ వచ్చింది. పూర్తిగా జబ్బు చేసింది. అప్పుడే వైఎస్సార్‌ గారు ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ గురించి తెలిసి హైద్రాబాద్‌లోని నిమ్స్‌లో అమ్మాయిని జాయిన్‌ చేశాం. ఒక్కరూపాయి తీసుకోకుండా ఆపరేషన్‌ చేసి నయం చేశారు. ఇప్పుడు శ్రీదేవి తనంతట తానుగా ఓ షాపులో పనిచేసుకొని అరోగ్యంగా బతుకుతోంది. నా బిడ్డను బతికించిన వైఎస్సార్‌ను ఎప్పటికీ మరచిపోలేము.
– బాదిరెడ్డి గోవిందు, బిక్కవోలు, తూర్పు గోదావరి

మా ఇంటి పేరు వైఎస్‌ రాజశేఖరరెడ్డి
మాది నిరుపేద కుటుంబం. సొంత ఇల్లు కూడా లేదు.  ఏ తల్లిదండ్రులకైనా తమ పిల్లలు ఎంతో  ఎత్తుకు ఎదగాలని, ఉన్నతంగా స్థిరపడాలి అనే కోరిక ఉంటుంది. కాని  ఆర్థిక కష్టాలు ఈ కోరిక మీద నీళ్లు చల్లుతాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలించక, చదువును మధ్యలోనే ఆపేసి తమ పెద్దలు చేసే వృత్తిలోనే స్థిరపడి రాజీపడుతున్న పేదింటి పిల్లలకు వైఎస్‌గారు ఉన్నత జీవితాలను ప్రసాదించారు. ఆయన ప్రవేశ పెట్టిన ఫీజు రీయింబర్సుమెంట్‌ పథకం ద్వారా 2008–12 విద్యాసంవత్సరంలో బీ.టెక్‌ పూర్తిచేసుకున్న నేను ఈరోజు బెంగుళూరులో హెచ్‌పీ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్‌ కంపెనీలో సంవత్సరానికి 7 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం చేస్తున్నాను. మా అమ్మ కృష్ణవేణి కోరిక ప్రకారం సొంత ఇల్లు కట్టుకొని, దానికి ఇంతటి జీవితాన్ని ఇచ్చిన ‘డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నిలయం’గా పేరు పెట్టుకుంటాం.
– దొమ్మేటి సతీష్, ద్రాక్షారామం, రామచంద్రపురం, తూర్పుగోదావరి

రాజన్న చలువతోనే మా ఇంట ప్రభుత్వ ఉద్యోగి!
మాదొక పేద కుటుంబం. మా వంశంలో ప్రభుత్వ ఉద్యోగులెవ్వరూ లేరు. అందరం వ్యవసాయం చేసుకొనే బతుకుతున్న వాళ్ళం. 2004లో ఓ రోడ్డు ప్రమాదంలో మా అన్న చనిపోయాడు. దాంతో ఆయన కొడుకు మహమ్మద్‌ రఫీని చదివించే బాధ్యతను తీసుకున్నాం. ఇంటర్‌ వరకూ ఎలాగోలా చదివించినా, పై చదువులకు వచ్చేసరికి మావల్ల కాదేమో అనిపించింది. ఉమ్మడి కుటుంబం సమస్యలు ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు. అప్పుడే వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో రఫీ ఉచితంగానే ఇంజనీరింగ్‌ చేశాడు. ఆ తర్వాత 2011లో ఎస్‌ఐ జాబ్‌కు కూడా ఎంపికయ్యాడు. ముస్లిం రిజర్వేషన్‌ వల్లే రఫీకి ఎస్‌ఐ ఉద్యోగం వచ్చింది. ఈ పేద కుటుంబంలో ఇప్పుడొక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడంటే అది వైఎస్‌ చలవే! ఆయన మేలును జీవితంలో మరిచిపోలేము. పేదవాడికి అన్నం పెట్టే ఆలోచనలున్న వై.ఎస్‌. లాంటి నాయకుడే రాష్ట్రానికి అవసరం.
–  సలీం బాషా, పాలకుర్తి, కర్నూలు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వల్లే ఉన్నత చదువులు చదివాం!
మాదొక సాధారణ మధ్య తరగతి కుటుంబం. మేము ముగ్గురం అక్కా చెల్లెళ్ళం. మేమంతా బాగా చదువుకొని మంచి స్థాయికి రావాలని అమ్మ, నాన్నలు ఎంతో కష్టపడి చదివిస్తూ వచ్చారు. చిన్న హోటల్‌ నడుపుకుంటూ మా ముగ్గురికీ ఏ లోటూ రాకుండా అమ్మా నాన్న చూసుకుంటూ వచ్చినా, పెద్ద దానినైన నేను పై చదువులకు వచ్చేసరికి స్థోమత సరిపోలేదు. తప్పని పరిస్థితుల్లో చదువు మానేద్దామనే ఆలోచనకు వెళ్ళిపోయా. అప్పుడే నాటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి గారు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని తీసుకొచ్చారు. చదువు ఆపేద్దామనుకున్న నాకు వైఎస్సార్‌ నిర్ణయంతో ఉత్సాహం వచ్చింది. ప్రభుత్వ ఖర్చులతో ఉచితంగా ఎంఫార్మసీ వరకు చదివా. వెంటనే నాట్కో కంపెనీలో పెద్ద ఉద్యోగం వచ్చింది. నాకు ఉద్యోగం రావడంతో ఇప్పుడు అమ్మా నాన్నలకు అండగా నిలబడుతున్నా. అదేవిధంగా చెల్లెళ్లిద్దరూ కూడా ఉన్నత చదువులు చదువుతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వల్లే మేము ఉన్నత చదువులు చదవగలిగాం.
– బండారు భాగ్యశ్రీ,త్రిపురారం, నల్లగొండ


వైఎస్‌ లేకపోతే బాబు మాట్లాడేవాడే కాదు!
నేను బార్బర్‌గా పని చేసుకుంటూ బతుకీడుస్తున్న వాడిని. నాకు ఇద్దరు కూతుళ్ళు, ఒక కొడుకు. కొడుకు నరేంద్రబాబు పుట్టుకతోనే చెవిటి, మూగ. రెండేళ్ళ తర్వాత ఈ విషయం తెలుసుకున్న మేము అప్పట్లో కర్నూలులో డాక్టర్లకు చూపిస్తే బెంగళూరు పంపించారు. బెంగళూరులో కాదని స్పీచ్‌ థెరపీ కోసం హైదరాబాద్‌ పంపించారు. హైదరాబాద్‌లో వాడికోసం రెండేళ్ళున్నాం. ఈ రెండేళ్ళలో బాబులో కొద్దిగా మార్పొచ్చింది. మెల్లి మెల్లిగా మాట్లాడ్డం మొదలుపెట్టాడు. ఇక అదే టైమ్‌కు ఆరోగ్యశ్రీ కింద బాబుకు నయం అవ్వడానికి ఫ్రీగా ఆపరేషన్‌ చేస్తారని తెలిసింది. అయితే మా వాడికి ఆరేళ్ళు నిండడంతో ఆరోగ్యశ్రీ వర్తించదు అన్నారు. మేము వెళ్ళి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారిని కలిస్తే, ఆయన సాయం చేస్తామన్నారు. ఆ తర్వాత 2009లో ఈ ఆపరేషన్‌ మా వాడికి కూడా చేసేలా ఆరోగ్యశ్రీలో మార్పులు చేశారు. 8 లక్షల వరకూ ఖర్చయ్యే ఆపరేషన్‌ ఉచితంగా జరిగింది. ఇప్పుడు బాబు చక్కగా మాట్లాడుతున్నాడు. ఇంటర్‌ చదువుతున్నాడు. వైఎస్‌ స్పందించకపోయి ఉంటే మా బాబు మాట్లాడేవాడే కాదు!
– నాగరాజు, కర్నూలు

ఆయన మేలు మరవలేము...
నేను గాంధీ చౌక్‌లో మోటార్‌ రిపేరింగ్‌ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వస్తున్నా. సత్యమణిదీప్‌ మా ఏకైక సంతానం. మా వాడికి చిన్నతనం నుంచే వినికిడి లోపం ఉండడంతో మాట్లాడలేకపోయేవాడు. వాడికి నయం చేయాలని చాలా ఆసుపత్రులు తిప్పాం కానీ మా దగ్గర అంత డబ్బు లేక ఇక వదిలేశాం. అప్పుడే వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ గురించి తెలిసి ఆపరేషన్‌ చేయిద్దామని హైదరాబాద్‌కు వచ్చాం. అయితే ఆ ఆపరేషన్‌కు 6లక్షల దాకా ఖర్చవుతుందని, ఆరోగ్యశ్రీ కింద అంత మొత్తం ప్రభుత్వం ఇవ్వదని డాక్టర్లు చెప్పారు. దీంతో మేమే స్వయంగా వెళ్ళి వైఎస్సార్‌ను కలసి మా గురించి చెప్పాం. ఆరోగ్యశ్రీ ద్వారా వచ్చే మొత్తానికి ఇంకెంత ఎక్కువ ఖర్చు అయినా సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి ఇస్తామని ధైర్యమిచ్చారు. దాంతో ఆపరేషన్‌ జరిగి బాబుకు నయం అయింది. ఇప్పుడు వాడు ఆరోగ్యంగా ఉండడంతో పాటు ఓ ప్రైవేటు కాలేజీలో ఉద్యోగం కూడా చేస్తున్నాడు. మా వాడికి నయం చేయడంతో పాటు, వాడు స్థిరపడేలా చేసిన వైఎస్సార్‌ను ఎప్పటికీ మరచిపోలేము. ౖవైఎస్సార్‌ తనయుడు వైఎస్‌ జగన్‌ను కలసి కృతజ్ఞతలు చెప్పాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నా.    
– ఘంటశాల సూర్యనారాయణ, సామర్లకోట, తూర్పు గోదావరి

ప్రతిరోజూ ఆ దేవుడ్ని కొలుస్తూంటా!
నేను రోజూవారీ కూలీ పని చేసుకొని బతికే పేదవాడిని. ఆ వచ్చే ఎంతో కొంత డబ్బుతోనే కుటుంబాన్ని పోషిస్తూ వచ్చా. 2008లో ఓసారి నాకు జబ్బు చేసింది. ఆసుపత్రిలో చేరితే కొన్ని మందులిచ్చి తగ్గిపోతుందన్నారు. ఏడాది పాటు ఆ మందులు వాడా. జబ్బు తగ్గకపోగా ఎక్కువైపోయింది. అప్పుడే ఓ పెద్దాసుపత్రికి వెళితే, గుండెలో రంధ్రాలు పడ్డాయని, అన్ని ఖర్చులు కలిపి 5 లక్షలు అవుతాయని చెప్పారు. నా దగ్గర అంత డబ్బు ఉండే అవకాశమే లేదు. ఇక ప్రాణాల మీద ఆశ వదులుకున్నా. అప్పుడే వైఎస్‌ రాజశేఖరరెడ్డి పథకం ఆరోగ్యశ్రీ గురించి తెలిసింది. ప్రాణం మీద మళ్ళీ ఆశ పుట్టింది. వెంటనే అపోలో ఆసుపత్రిలో చేరా. ఆరోగ్యశ్రీ ద్వారానే మొత్తం ఆపరేషన్‌ జరిగిపోయింది. సంవత్సరానికి సరిపడా మందులు కూడా ఉచితంగా ఇచ్చారు. ఆసుపత్రి నుంచి వెళ్ళేరోజు ఆటో ఖర్చులు కూడా ఇచ్చి పంపడం ఇప్పటికీ మర్చిపోలేను. ఆ దేవుడు వైఎస్సే లేకపోతే నేను ఆరోజే ప్రాణాలు వదిలేవాడిని. ఇప్పుడు నా కొడుకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా చదువుకొని, ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. వైఎస్‌ ఇప్పుడు మన మధ్య లేకపోవడం తీర్చలేని లోటు. ప్రతిరోజూ ఉదయాన్నే ఆయనను తలుచుకున్నాకే రోజు మొదలుపెడతా.
  – ఉరిటి మనోహర్, ఆరిలోవ, విశాఖపట్నం

నన్ను బతికించిన వైఎస్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటా!
నేను టైలరింగ్‌ చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నా. మాకు ముగ్గురు ఆడపిల్లలు. ఉన్నంతలో వాళ్ళను చదివించుకుంటా, కుటుంబాన్ని నెట్టు కొస్తున్న నాకు 2008లో ఓరోజు గుండెపోటు వచ్చింది. బతుకుతననే నమ్మకం కూడ లేకుండే. ఆపరేషన్‌ చేస్తనే బతుకుతనన్నరు. చేతిల చిల్లిగవ్వ లేకుంటే ప్రాణం మీద ఆశలొదిలేసుకున్న. అప్పుడే వైఎస్‌ రాజశేఖరరెడ్డి పెట్టిన ఆరోగ్యశ్రీ గురించి తెల్సింది. ఫ్రీగ ఆపరేషన్‌ చేస్తరని విని హైద్రాబాద్‌ల గ్లోబల్‌ హాస్పిటల్‌ల చేరిన. ఆపరేషన్‌ చేసి పదకొండు రోజులు హాస్పిటల్‌లనే ఉంచుకున్నరు. నయమయినంక రూపాయి తీసుకోకుండ ఇంటికి పంపిచ్చిర్రు. వైఎస్సే లేకుంటే నేనేమౌనో!? నా ముగ్గురు ఆడపిల్లల పరిస్థితి ఎట్లుండునో!? నన్ను బతికించిన ఆ దేవుడికి ఎప్పటికీ రుణపడి ఉంటా!
  – ఎండీ జహంగీర్, రాజ్‌పల్లి, మెదక్‌

మా ఇద్దరి ప్రాణాలూ ఆయనవల్లే నిలిచాయ్‌!
ఆరేళ్ళ క్రితం నేనొక రోడ్డు ప్రమాదానికి గురయ్యా. అదే సమయంలో అక్కడే ఉన్న ఎవరో 108కు కాల్‌ చేయగా కొద్దిసేపట్లోనే అంబులెన్స్‌ వచ్చింది. అప్పటికే చాలా రక్తమే పోయినా, అంబులెన్స్‌లో ఏమాత్రం ఆలస్యం చేయకుండా విజయవాడలోని పెద్దాసుపత్రికి తీసుకెళ్ళారు. సమయానికి తీసుకురావడంతో ప్రాణాలతో కాపాడగలిగామని డాక్టర్లు చెప్పినపుడు 108 ఎంతగా ఉపయోగపడిందో అర్థమైంది. వైఎస్సార్‌ తీసుకొచ్చిన 108 నా ప్రాణాలు నిలబెడితే నా భార్య సీతమ్మ ప్రాణాన్ని ఆరోగ్యశ్రీ నిలబెట్టింది. 2.50 లక్షల విలువ చేసే వైద్యాన్ని సీతమ్మకు ఉచితంగా అందించారు. వైఎస్సార్‌ పథకాల వల్లే మా ఇద్దరి ప్రాణాలు నిలిచాయ్‌! ఇదంతా ఆయన చలవే!!
  – చవడం నాగేశ్వరరావు, నందిగామ, విజయవాడ

వైఎస్‌ వల్లే ఈ స్థాయికొచ్చా!
మాదొక పేద రైతు కుటుంబం. నాన్న వ్యవసాయ కూలీగా పనిచేస్తూ నన్ను చదివించారు. ఇంటర్‌ తర్వాత పైచదువులు మావల్ల కాదనుకున్న సమయంలోనే నాటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం అండగా నిలబడింది. ఉచితంగా ఉన్నత చదువులు పూర్తి చేసుకున్న నేను, చదువవ్వగానే కెనరా బ్యాంకులో ఉద్యోగం సంపాదించా. ప్రస్తుతం నల్లగొండ జిల్లా కెనరా బ్యాంకు శాఖలో పీవోగా పనిచేస్తున్నా. వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకమే లేకపోతే, ఉన్నత చదువు చదివి ఉద్యోగం సాధించేవాడిని కాదేమో. మాలాంటి ఎందరో పేద విద్యార్థులకు దారి చూపిన నాయకుడు వైఎస్సార్‌.  
– కట్టా సునీల్, బోడవాడ, వీరులపాడు మండలం, కృష్ణా

నిలువనీడ ఇచ్చారు
మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారి దయవల్లనే మాకు నిలువనీడ దొరికింది. ఆయన ముఖ్యమంత్రి అయిన రెండేళ్లకే సొంత ఇల్లు వచ్చింది. నా భర్త చనిపోయినా ధైర్యంగా బతుకు సాగిస్తున్నానంటే దానికి కారణం ఈ ఇల్లే. ఆయన ఈ ఇల్లు ఇవ్వకుంటే నేను, నా పిల్లలు ఎలా బతికేవాళ్లమో తలచుకుంటేనే భయమేస్తుంది. ఈ రోజుల్లో ఇల్లు కట్టుకోవాలంటే నాలాంటి పేదలకు కష్టమే. దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న మాకు నిలువనీడ కల్పించిన వైఎస్‌ గారికి నేను, నా పిల్లలు ఎల్లవేళలా రుణపడి ఉంటాం.
–  కొడుకుతో నాగమల్లి రేణుక,  వెంకటాపురం పంచాయతీ, ఏలూరు రూరల్‌ మండలం, పశ్చిమగోదావరి

ఆ పథకాలు మా కుటుంబాన్ని నిలబెట్టాయి
సామాన్య కుటుంబం మాది. నా ఆదాయంతో ఇల్లు గడవడమే కష్టంగా ఉండేది. అలాంటి సమయంలో నాకు గుండెపోటు వచ్చింది. హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి వెళితే స్టెంట్‌ వేయాలని చెప్పారు. దానికి లక్షన్నర వరకు ఖర్చవుతుందన్నారు. అంత డబ్బు ఎక్కడ తేవాలో అర్థం కాలేదు. మా బంధుమిత్రులెవరూ అంత డబ్బు ఇవ్వగలిగిన స్థితిలో లేరు. ఎప్పుడు ఏమవుతుందోనని దినదినగండంగా కాలం వెళ్లదీసేవాణ్ని. ఈలోగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆరోగ్యశ్రీ కార్డు దొరికాక హైదరాబాద్‌లోని నిమ్స్‌కు వెళ్లాను. అక్కడి డాక్టర్లు వెంటనే నన్ను చేర్చుకుని స్టెంట్‌ వేశారు. కోలుకునే వరకు ఉచితంగా చికిత్స చేశారు. మందులు కూడా ఉచితంగా ఇచ్చారు. నేను పూర్తిగా కోలుకుని కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నాను. ఇక వైఎస్‌ గారు ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం పుణ్యాన నా కొడుకు సత్యనారాయణ ఇంజనీరింగ్‌ చదువుకోగలిగాడు. ఇప్పుడు తను హైటెక్‌ సిటీలో ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటున్నాడు. వైఎస్‌ గారి పథకాలు మా కుటుంబాన్ని నిలబెట్టాయి.
– బోయిని ఈశ్వర్, ఖస్బకోహీర్, జహీరాబాద్‌ మండలం, సంగారెడ్డి

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వల్లే నిలదొక్కుకున్నా!
రజక కుల వృత్తినే నమ్ముకున్న కుటుంబం మాది. రెండు ఎకరాల భూమి ఉన్నా అది వ్యవసాయానికి పనికొచ్చేది కాకపోవడంతో కులవృత్తిపైనే ఆధారపడి నాన్న నన్ను చదివించాడు. డిగ్రీ వరకు స్కాలర్‌షిప్స్‌తో చదువుకుంటూ వచ్చినా, బీఈడీ చేసేందుకు మాత్రం ఆర్థిక పరిస్థితి సహకరించలేదు. దీంతో బీఈడీ చదవాలన్న నా కోరికను పక్కనపెట్టేశా. అప్పుడే నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టడంతో బీఈడీ చదువుకున్నా. ఆ తర్వాత 2006లో డీఎస్సీ రాసి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించా. ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన నేను ఇప్పుడొక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఎదిగానంటే అదంతా వైఎస్సార్‌ వల్లే!
–  వర్సుపల్లి నర్సింలు, వెల్దుర్తి, మెదక్‌

అవ్వతోడు..ఆరోగ్యశ్రీ లేకుంటే బతికేటోన్నే కాదు!
ఇప్పుడు నేనిట్ల బతికి బట్టకట్టి మాట్లాడుతున్ననంటే ఆ పుణ్యం రాజశేఖరయ్యదే! నేను, మా రాజవ్వ కలిసి కూలీ పనిచేస్కొని బతికేటోళ్లం. ఉన్న ఒక్క బిడ్డకు పెండ్లి జేసినం. సెంటు భూమి లేదు మాకాడ. ఉన్నంతల మా పనేదో మేం చేస్కొని బతికే నాకు ఓ ఐదేళ్ల కింద గుండెపోటొచ్చింది. అంబులెన్స్‌కి ఫోన్‌ చేసి ఊళ్లోళ్లు కరీంనగర్‌ దవాఖానాకు తీస్కపోయిర్రు. అక్కడ మా వల్ల కాదని డాక్టర్లు అంటే హైదరాబాద్‌కు తీస్కపోయిర్రు. అపోలో హాస్పిటల్‌ల గుండె ఆపరేషన్‌ చేసి మాకానించి రూపాయి కూడ తీస్కోలేదు. రాజశేఖరయ్య పెట్టిన ఆ ఆరోగ్యశ్రీ వల్లనే రెండు లక్షల ఆపరేషన్‌ ఫ్రీగ అయింది. అదే లేకపోతే నేనిప్పుడు బతికి ఉండేటోణ్ని కాదు. నేను బతికుండి రెండు ముద్దలు తింటున్ననంటే అదంతా ఆయన పుణ్యమే!
– సందరగిరి భూమయ్య, అనంతపల్లి, సిరిసిల్ల

వైఎస్‌ వల్లే మా ఇంట్లో ముగ్గురు డాక్టర్లు!
మాదొక దిగువ మధ్యతరగతి కుటుంబం. నా భర్త సమీర్‌ ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. 2003లో ఆయనకు ఆరోగ్యం పాడైంది. ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఇక అప్పటినుంచి ఉద్యోగం మానేశారు. మాకు ముగ్గురూ ఆడపిల్లలే. ఒక్క మగబిడ్డ కూడా లేడు. ఆయన పరిస్థితి చూసి పిల్లలంతా భయపడ్డారు. వాళ్లందరికీ డాక్టర్‌ అవ్వాలన్నది కల. ఇంట్లో పరిస్థితులేమో వారిని డాక్టర్‌ చదువుల వరకూ తీసుకెళతాయా అన్నట్లు ఉండేది. మా అమ్మా, నాన్నల సాయంతో ఇంటర్‌ వరకూ బాగానే చదివించా. ఆ తర్వాత మెడిసిన్‌ సీటు సంపాదించగలరా అన్న భయం ఉండేది. అదే సమయంలో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారు ప్రవేశపెట్టిన ముస్లిం మైనారిటీ రిజర్వేషన్‌ మా పిల్లలకు ఓ వరమైంది. ముగ్గురూ తమ తమ ప్రతిభతో, రిజర్వేషన్‌ కూడా తోడవ్వడంతో డాక్టర్‌ చదువులు చదివారు. పెద్దమ్మాయి జేబా అక్తర్, రెండో అమ్మాయి సమీర ఎంబీబీఎస్‌ పూర్తి చేసి పీజీ కోసం చదువుతున్నారు. మూడో అమ్మాయి ఆస్మా కౌసర్‌ ఇప్పుడు ఎంబీబీఎస్‌ చదువుతోంది. కర్నూలులోనే ఒక హాస్పిటల్‌ కట్టి సేవ చేయాలన్నది వారి కల. వైఎస్‌ వరంతోనే వాళ్ల చదువులు సాధ్యమయ్యాయి. ఇప్పుడు మా ఇంట్లో ముగ్గురు డాక్టర్లు ఉన్నారంటే అది ఆయన వరం ఫలమే!
– షేక్‌ ఖుర్షిద్, కొత్తపేట, కర్నూలు

ఆరోగ్యశ్రీ వల్లే బతికాను
సామాన్య కుటుంబం మాది. ఏదోలా సంసారం నెట్టుకొస్తుంటే 2008లో గుండెజబ్బు వచ్చింది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారి దయవల్ల ఆరోగ్యశ్రీ కార్డు ఉండటంతో రాజమండ్రిలోని బొల్లినేని ఆస్పత్రిలో గుండె ఆపరేషన్‌ చేయించుకున్నాను. ఆపరేషన్‌ తర్వాత ఏడాదికి సరిపడా మందులు ఉచితంగా ఇచ్చారు. పూర్తిగా కోలుకుని, కుటుంబంతో సంతోషంగా జీవిస్తున్నా. ఇటీవల ఒంట్లో నలతగా ఉండి, కాళ్లకు వాపులు వచ్చాయి. తిరిగి గుండె ఆపరేషన్‌ చేయించుకున్న ఆస్పత్రికే వెళ్లి చూపించుకున్నాను. ఈసారి డాక్టర్లు సరిగా చూడలేదు.
– పాలూరి నాగేశ్వరరావు, గూటాల, పోలవరం మండలం, పశ్చిమగోదావరి

 వై.ఎస్‌. చలవ వల్లే మాటలొచ్చాయ్‌!
మా అబ్బాయి అక్షయ్‌ పుట్టినప్పుడు ఎంతో సంబరపడ్డం. అయితే రెండేళ్లైనా మాటలు రాకుండ, సైగలు చేస్తూండేసరికి వాడికి వినపడదని, మాట్లాడడం రాదని అర్థమైంది. అప్పటికే కొన్ని ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఆపరేషన్‌కు లక్షలు ఖర్చు అయితదని వదిలేసినం. అయితే 2005ల అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారు పిల్లల ఆపరేషన్‌ చేసేందుకు ముందుకొచ్చినరని తెలిసి ఆయన్ను కలిసినం. అక్షయ్‌ను చూసి ‘ముచ్చటగా ఉన్నాడు పిల్లాడు. వీడికి ఆపరేషన్‌ చేయించే బాధ్యత నాది’ అని వైఎస్‌ మాటిచ్చిర్రు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి 6లక్షల దాకా ఇచ్చి బాబుకు నయం చేశిర్రు. ఇప్పుడు వాడు మంచిగ వినగలుగుతున్నడు. మాట్లాడుతున్నడు. చిన్నప్పట్నించి స్కూల్లో ప్రతీ క్లాస్‌లో ఫస్ట్‌ వస్తూ ఉన్నడు. అసలు మాటలే రావనుకుంటే మా బాబు ఇప్పుడు మంచిగ అన్నింట్ల ముందుంటున్నడంటే అది ఆ రాజన్న దయవల్లే! అక్షయ్‌ చెవికి పెట్టిన మెషీన్‌ నడపడానికి సంవత్సరానికి 30వేల దాకా ఖర్చయితుంది. దాన్ని గవర్నమెంట్‌ భరిస్తే బాగుంటది!
– తూముల మమత, పెద్దపల్లి


వైఎస్సార్‌ పుణ్యమే...
నిరుపేద కుటుంబంలో పుట్టాను. ఉండేందుకు చిన్న గూడు కూడా లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటూ మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు బాసర ట్రిపుల్‌ ఐటీలో అవకాశం కల్పించారు వైఎస్‌ రాజశేఖరరెడ్డి. ఆ అవకాశంతో నాకు పూలపాన్పు వేసినట్లయింది. నాకు సీటు దక్కింది. అక్కడే అయిదేళ్ల పాటు ట్రిపుల్‌ ఐటీ పూర్తి చేశాను. నాలుగేళ్ల క్రితం క్యాంపస్‌ సెలెక్షన్‌లో సెలకై్ట  హైదరాబాద్‌లోని ఇన్ఫోసిస్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను.
– దామెర్ల శివ, పెన్‌పహాడ్, సూర్యాపేట్‌

ఆయన సాయం వల్లే నాలుగు మెతుకులు తింటున్నాం!
మాది నిరుపేద కుటుంబం. రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు. ఆటో తోలుకుంటూ పిల్లల్ని పోషిస్తూ ఆళ్లకు మంచి చదువులు చెప్పియ్యాలని కష్టపడుతున్న. ఇంతలో ఓరోజు గుండెజబ్బు వచ్చి మంచాన పడ్డ. ప్రైవేటు హాస్పిటల్‌ల చేరితే ఆపరేషన్‌కు 5 లక్షల దాక ఖర్చయితదని చెప్పిర్రు. ఆటో తోలుకొని బతికే నాకు అన్ని లక్షలు ఏడ నుంచొస్తయని బతుకు మీద ఆశలు ఒదిలేసుకున్నా. నా భార్య, పిల్లలు ఏమైతరని దిగులు పట్టుకుంది. అప్పుడే వైఎస్సార్‌ మొదలుపెట్టిన ఆరోగ్యశ్రీ కింద నా జబ్బుని ఫ్రీగ నయం చేస్తరని తెలిసింది. ఆరోగ్యశ్రీ కిందనే పైసా తీసుకోకుండా ఆపరేషన్‌ చేసి నాకు నయం చేశారు. ఇయ్యాల నేను బతికి నాలుగు మెతుకులు తింటున్నా, నా పిల్లలకు నేనున్నానన్న అది ఆ దేవుడి వల్లే! మేము తినే ప్రతి ముద్దకూ ఆ సారును తలుసుకుంటూనే ఉంటం.
– బండి అంజిరెడ్డి, తిరుమలగిరి, నల్లగొండ

పేదోళ్ల పాలిట దేవుడు!
చిన్నపాటి కిరాణాకొట్టు పెట్టి బతుకుతున్నాను. చిన్న చిన్న  జబ్బులు వస్తేనే తట్టుకోలేని జీవితాలు మావి. అలాంటిది పెద్ద జబ్బులు వస్తే? ఆ బాధను మాటల్లో చెప్పాలేము. నాకు ఇలాంటి పరిస్థితే వచ్చింది. 2010లో గుండెజబ్బుకు ఆపరేషన్‌ చేసుకోవాల్సి వచ్చింది. అయితే పేదోళ్ల పాలిట దేవుడిగా వచ్చిన రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ‘ఆరోగ్యశ్రీ’ పథకం ద్వారా గుండెజబ్బు ఆపరేషన్‌ చేయించుకున్నాను. ఒక సంవత్సరం ఉచితంగా మందులు ఇచ్చారు. నాకు ఆపరేషన్‌ జరగకుంటే చచ్చిపోయేవాడిని. ‘ఆరోగ్యశ్రీ’ పథకం లేకుంటే మా కుటుంబం దిక్కులేనిదయ్యేది.
– కటంగూరి సత్యనారాయణ, హుస్నాబాద్, సిద్ధిపేట

ఏ లోకాన ఉన్నడో...
రాజన్న ఏ లోకాన ఉన్నాడో గానీ ఆయన పెట్టిన ఆరోగ్యశ్రీ కింద నాకు నిండు నూరేళ్లు ఆయుష్షు పోసిండు బాంచెన్‌. సుట్టాల ఊరికి బోతుండగా రోడ్డు ప్రమాదంల నా పక్కటెముకలు, చెయ్యి విరిగిపోయి కోమాలకు బోయిన. మా సుట్టాలు, వాళ్లూ వీళ్లూ నేను బత్కనని సాలిచ్చుకున్నరు. గటువంటి పరిస్థితులల్ల నాకు కూడా పానం మీద నమ్మకం లేకుండే. ఆరోగ్యశ్రీ కింద పట్నం దావఖానల శేరిఖ్‌ జేసిండ్రు. రెక్కాడితేగానీ డొక్కలు నిండని పరిస్థితిలో ఉన్న నేను, పైస ఖర్చు లేకుండా రాజన్న దయ వల్ల ఇప్పుడు మంచిగైన. మా అసంటోళ్లకు ప్రాణం పోసిన రాజన్న కుటుంబం సల్లగుండాలే.
– నిమ్మల లక్ష్మి, పోతారం, దుబ్బాక మండలం, సిద్దిపేట

నా చదువు ఆగిపోయేది
మాది చాలా నిరుపేద కుటుంబం. అమ్మ పద్మ, నాన్న విజయకుమార్‌ పచ్చళ్లు, అప్పడాలు తయారు చేసి అమ్ముతుంటారు. వచ్చిన ఆదాయం ఇల్లు గడవడానికే చాలేది కాదు. నానా కష్టాలు పడి అమ్మానాన్నలు నన్ను ఇంటర్‌ వరకు చదివించారు. పై చదువులు చదవాలనే ఆశ ఉన్నా, అమ్మానాన్నలకు నన్ను చదివించే పరిస్థితి లేదు. ఇక నా చదువు ఆగిపోతుందనే అనుకున్నాను. ఈలోగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారు మాలాంటి పేద విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సాయంతో నేను ఇంజనీరింగ్, ఎంబీఏ పూర్తి చేయగలిగాను. చదువు పూర్తయ్యాక హైదరాబాద్‌లోని ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం పొందాను. ఇప్పుడు ఈ స్థితికి చేరానంటే అదంతా వైఎస్‌గారి చలవే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకమే లేకుంటే నా చదువు ఆగిపోయేది.
–  వీరమాచనేని కావ్య, దండేపల్లి, మంచిర్యాల

ఆరోగ్యశ్రీ ఆయుష్షు నిలిపింది
పాన్‌షాపు నడుపుకుంటూ పొట్ట పోసుకునేవాణ్ని. నలుగురు మనుషులున్న కుటుంబం నాది. వచ్చే ఆదాయంతో రోజు గడవడమే కష్టంగా ఉండే పరిస్థితుల్లో 2012లో గుండెపోటు వచ్చింది. చాలా ఆస్పత్రుల్లో చూపించుకున్నా. డాక్టర్లు రకరకాల పరీక్షలు చేశారు. వీలైనంత తొందరగా ఆపరేషన్‌ చేయించుకోవాలని, లేకపోతే ప్రాణం దక్కడం కష్టమని చెప్పారు. అప్పటికే అందినకాడికల్లా లక్షన్నర వరకు అప్పులు చేశాను. ఈలోగా ఆరోగ్యశ్రీ పథకం గురించి తెలుసుకుని హైదరాబాద్‌లోని నాంపల్లి కేర్‌ ఆస్పత్రిలో చేరాను. అక్కడే నాకు ఉచితంగా గుండె ఆపరేషన్‌ చేశారు. కోలుకునేంత వరకు ఉచితంగా చికిత్స చేశారు. మందులు ఉచితంగానే ఇచ్చారు. రాకపోకల చార్జీలు కూడా చెల్లించారు. మహానుభావుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకమే నా ఆయుష్షు నిలిపింది.
– జె.వెంకటేశ్వరరావు, ఇల్లెందు, భద్రాద్రి కొత్తగూడెం

రోజూ ఆయన ఫొటోకు దండం పెట్టుకుంటా...
నేను 2009లో అనారోగ్యానికి గురయ్యాను. గుండె ఆపరేషన్‌ చేసి రెండు వాల్వులు అమర్చాలని డాక్టర్లు చెప్పారు. గుండె ఆపరేషన్‌కు రెండు లక్షలు ఖర్చు అవుతుందని చెప్పడంతో నాకున్న రెండెకరాల పొలం అమ్మాలని నిర్ణయించాం. ఆపద్భాంధవుడైన ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం నాకు వర్తిస్తుందని డాక్టర్లు చెప్పారు. మరోవారం రోజుల్లో ఆపరేషన్‌ చేస్తారు అనగా స్వయంగా ముఖ్యమంత్రిగారే నా భుజం మీద చేయి వేసి  ‘‘నీ ఆరోగ్యానికి ఏమీ డోకా లేదు. ఎంత ఖర్చయినా ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం చేయిస్తా’’ అని భరోసా ఇచ్చారు. ఆ దేవుని దయ వల్ల ఈరోజు బతికి బట్ట కట్టాను. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ఆయన ఫొటోకు దండం పెట్టుకుంటాను. ఆయన మా ఇంటి ఇలవేల్పు.
–నారగాని మట్టయ్యగౌడ్, మునగాల, సూర్యాపేట్‌

నా గుండెలో బతికే ఉన్నాడు!
ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని సాదుకుంటున్నాను. గుండె సంబంధమైన సమస్యతో ఆస్పత్రిలో చేరితే... ఆపరేషన్‌ చేయాలన్నారు డాక్టర్లు. రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న నేను ఇది విని షాకయ్యాను. లక్షల రూపాయలతో కూడిన వ్యవహారం కావడంతో దిక్కుతోచలేదు. ఇలాంటి కష్టకాలంలో ఆరోగ్యశ్రీ వల్ల పైసా ఖర్చు లేకుండా ఆపరేషన్‌ చేయించుకోగలిగాను. ఇప్పుడు నా జీవితాన్ని మళ్లీ ప్రారంభించిన. నాకు భార్య, చిన్న వయసులో ఉన్న పాప, బాబు ఉన్నారు. ఆరోగ్యశ్రీ లేకుంటే నా కుటుంబ పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకుంటే భయంగా ఉంది. ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చిన వైఎస్సార్‌ నా గుండెలో బతికే ఉన్నాడు.
– ఎండీ.షాబుద్దీన్, మైలారం, బొమ్మలరామారం మండలం, యాదాద్రి భువనగిరి

మా పాలిట దేవుడు వైఎస్‌ తాతయ్య
నాలాగే గుండె జబ్బుతో బాధపడే ఎంతోమంది చిన్నారులకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చికిత్స చేయించారు వైఎస్‌ తాతయ్య. మా తల్లిదండ్రులు తాతయ్యను ఎప్పుడూ తలుచుకుంటారు. నాకు ఆపరేషన్‌ చేయించేందుకు తగిన ఆర్థికస్థోమత లేక వారు పడిన బాధలు నాకు ఇప్పటికీ చెబుతుంటారు. ఆ సమయంలో తాతయ్య ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ నా ప్రాణాలను కాపాడింది.
– కంభం ఉదయ్‌కిరణ్, కోదాడ, సూర్యాపేట

ఆయనే మా ఇంటి దైవం
నిరుపేద కూలీని నేను. పెద్దాయన వైఎస్‌ రాజశేఖరరెడ్డిగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలు నా ఇద్దరు కొడుకులకు బతుకునిచ్చాయి. పెద్దబ్బాయి యోగానందబాబుకు గుండెలో రంధ్రం పడింది. ఆపరేషన్‌ చేయకపోతే ఎక్కువ రోజులు బతకడని డాక్టర్లు చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం కింద గుండె ఆపరేషన్లు కూడా చేస్తారని తెలుసుకుని మేదరమెట్లలో జరిగిన కార్యక్రమానికి నా కొడుకును తీసుకెళ్లాను. ఆ కార్యక్రమానికి వైఎస్‌తో పాటు పెద్దపెద్ద డాక్టర్లంతా వచ్చారు. ఆ డాక్టర్లు నా కొడుకును పరీక్షించి నెల్లూరులోని బొల్లినేని ఆస్పత్రికి పంపించారు. పైసా ఖర్చు లేకుండా ఆపరేషన్‌ చేసి బతికించారు. పెద్దబ్బాయి అనారోగ్యం వల్ల ఏడో తరగతితోనే చదువు ఆపేశాడు. ఇప్పుడు నాతో పాటే కూలి పనులకు వస్తూ మా కుటుంబానికి చేదోడుగా ఉంటున్నాడు. చిన్న కొడుకు వేణు సాయికుమార్‌ను బాగా చదివించాలనుకున్నాం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పుణ్యమా అని అతణ్ని బీటెక్‌ చదివించాం. ఇప్పుడు అతడు బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా పని చేస్తున్నాడు. నా ఇంటి దీపాల బతుకుల్లో వెలుగులు నింపిన మహానేత వై.ఎస్‌... ఆయనే మా ఇంటి దైవం.
– మద్దెల వెంకటేశ్వర్లు, నాగాంజలిదేవి దంపతులు,పెద్ద కొడుకు యోగానందబాబు, సింగరాయకొండ, ప్రకాశం

ఇలా ఉన్నామంటే ఆయన చలవే!
మాది మధ్య తరగతి కుటుంబం. చిన్నపాటి చిల్లర దుకాణంతో వచ్చే ఆదాయంతోనే ఏడుగురు మనుషులు బతకాలి. అనుకోకుండా గుండెనొప్పి రావడంతో ఆస్పత్రికి వెళ్లాను. ఆపరేషన్‌ చేయించుకోవాలని డాక్టర్లు చెప్పారు. మూడున్నర లక్షలు ఖర్చవుతుందన్నారు. మహానుభావుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారి చలవతో అప్పటికే ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని ఉండటంతో కార్పొరేట్‌ ఆస్పత్రిలో గుండె ఆపరేషన్‌ చేయించుకోగలిగా. ఆపరేషన్‌ తర్వాత ఇంటికి తిరిగి వెళ్లడానికి అయ్యే చార్జీలను కూడా ఆస్పత్రి వారే చెల్లించారు. ఏడాది పాటు ఉచితంగా మందులు కూడా ఇచ్చారు. ఇదొక్కటే కాదు, వైఎస్‌ గారు ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం వల్ల మా అబ్బాయి నాగకుమార్‌ బీటెక్‌ పూర్తిచేసి, దుగ్గిరాలలోని సీసీఎల్‌ కంపెనీలో ఉద్యోగం తెచ్చుకున్నాడు. మా నలుగురు అమ్మాయిల పెళ్లిళ్లకు అతడి ఉద్యోగమే ఆధారమైంది. వైఎస్‌ గారి పథకాలే లేకుంటే మా కుటుంబం అప్పుల పాలై, నిలువనీడ లేని స్థితిలో ఉండేది. ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా హాయిగా ఉన్నామంటే అదంతా ఆయన చలవే! మా ఇంట దీపం వెలిగించిన దేవుడాయన.
– పెనుమల్లి శివసత్యనారాయణ,  మంగళగిరి, గుంటూరు

108 లేకపోతే ప్రాణం పోయేదే!  
నేను నలభై ఏళ్ల క్రితం కేరళ నుంచి ఇక్కడికొచ్చి హోటల్‌ నిర్వహిస్తూ జీవిస్తున్నా. ఓ రోజు బైక్‌ యాక్సిడెంట్‌లో నా తలకు, కాలికి పెద్ద గాయాలయ్యాయి. ఆ సమయంలో నేను పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోగా, అక్కడి స్థానికులు 108 అంబులెన్స్‌లో నన్ను విజయవాడకు తరలించారట. టైమ్‌కి హాస్పిటల్‌కి తీసుకెళ్లడం, 108లోనే ప్రాథమిక చికిత్సనందించడం వల్ల ప్రాణాలతో బయటపడగలిగానని డాక్టర్లు చెప్పారు. వైఎస్సార్‌ ఆలోచన నుంచి పుట్టిన 108 గొప్పదనం గురించి ఎంత చెప్పినా తక్కువే! ఆయన రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది.
–  పరంబత్‌ ఇబ్రహీం, కంకిపాడు, కృష్ణా
 

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మెరిసేందుకు మెరుగులు

అందాల సోయగం

చంద్రుడిపై కుందేలు ఎలా ఉంది?

వెరైటీ వంటకాలు.. కమ్మనైన రుచులు

పండితుడి గర్వభంగం

టారో-వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

ఫస్ట్‌ టైమ్‌ రాబరీ..!

నాకు ఆ సమస్య ఉంది

వాసన లేని పువ్వు

ఓహో! అదా విషయం!

సన్యాసికి లోకమంతా ఇల్లే

రావిచెట్టుకు రక్తం కారుతోంది..!

కీచైన్‌ ఉద్యమం

తెల్లదొరలను వణికించిన తెలుగు పాట

కుక్క కాటుకు పప్పు దెబ్బ..!

వచ్చిన వాడు ఫల్గుణుడే...

4జి ఉంటేనే సినిమా ఒప్పుకుంటా: ఇషా

ఇంటింటా చాక్లెట్‌..

సాయంత్రం సరదాగా స్నాక్స్‌తో..

టారో-వారఫలాలు (జూలై 7 నుంచి 13 వరకు)

వారఫలాలు (జూలై 7 నుంచి 13 వరకు)

శంకర విజయం-4

బంగారు కల

స్థితప్రజ్ఞారాముడు

జనాభాలో మనమే నంబర్‌ వన్‌!

ఆత్మహత్య కానే కాదు...

దాని గురించి నాకు ఏమీ తెలియదు

ద్రౌపది..

ఐదు పైసలు వరదక్షిణ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పెళ్లి అయ్యాకే తెలుస్తుంది : విద్యాబాలన్‌

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

నటి అమలాపాల్‌పై ఫిర్యాదు

కోలీవుడ్‌లో కేరాఫ్‌ కంచరపాలెం రీమేక్‌

ఆయన మూడో కన్ను తెరిపించాడు!

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమలో పడలేదు..!