ఆవిష్కరణం: జిప్పర్ !

10 Apr, 2017 12:23 IST|Sakshi
ఆవిష్కరణం: జిప్పర్ !

కొన్ని కొన్ని విషయాలు మనకసలు స్ఫురించనే స్ఫురించవు. అరె కరెంటు లేకపోతే ఎంత పనయ్యేది, టీవీ లేకుంటే ఏమైపోయేవారం అనుకుంటాం గాని ఏ రోజైనా... జిప్పర్ (జిప్పు) లేకపోతే ఎలా అని ఆలోచించామా... అది ఒక ఇన్వెన్షన్ అనే మనకనిపించదు. కానీ, నేటి కాలంలో అయితే దాని అవసరం మనకెంతో ఉంది. కేవలం మనం వేసుకునే దుస్తుల్లోనే కాకుండా అనేక ఇతర వస్తువుల్లో దాని వాడకం బాగా ఎక్కువగా ఉంటుంది. అయితే... ఈ ప్రపంచంలో దాని ఆవిష్కరణకు దక్కిన ప్రాధాన్యం తక్కువ.. సైకిల్‌ని కనిపెట్టిన వారు, రేడియోని కనిపెట్టిన వారు తెలుసుగాని ఈ జిప్పును కనిపెట్టిందెవరో తెలియదు. ప్రస్తుతం మనం వాడుతున్న సౌకర్యవంతమైన జిప్పర్‌ను కనుక్కోవడానికి జిప్పర్ కనిపెట్టాక 80 సంవత్సరాలు పట్టింది.
 
  జిప్పర్‌కు మొట్టమొదట పేటెంట్ పొందిన వ్యక్తి ఎలియాస్ హౌవే. (కుట్టు మిషను కనిపెట్టినది కూడా ఈయనే). 1851 లో అతను దీనికి పేటెంట్ పొందారు. దాన్ని ‘ఆటోమేటిక్ కంటిన్యూయస్ క్లోతింగ్ క్లోజర్’ అని పిలుచుకున్నాడు. కానీ దాన్ని అతను పెద్దగా మార్కెట్ చేసుకోలేదు. దానికి విట్‌కాంబ్  జడ్సన్ మార్పులు చేసి ‘క్లాస్ప్ లాకర్’గా పేరు పెట్టారు. దీన్ని 1893 చికాగో ప్రపంచ ప్రదర్శనలో ప్రదర్శించారు. జడ్సన్ ఆధ్వర్యంలోని టాలోన్ కంపెనీ డిజైనర్ హెడ్ గిడియాన్ సండ్‌బాక్  జిప్పర్‌కు కొన్ని హంగులు కల్పించి మార్పులు చేసి జనామోదనీయంగా రూపొందించారు. అలా జిప్ కనిపెట్టిన ఎంతో కాలం తర్వాత కానీ అది పూర్తి స్థాయిలో ఉపయోగపడలేదు. అంటే... ఈ లెక్కన జిప్పర్ వయసు వందేళ్ల లోపే!

మరిన్ని వార్తలు