బరువులు ఎత్తి.. కీర్తి చాటి!

15 Jun, 2020 13:31 IST|Sakshi
తమిళనాడులో జరిగిన ఆలిండియా యూనివర్సిటీ పోటీల్లో మెడల్‌ అందుకుంటున్న సింధూ

వెయిట్‌ లిఫ్టింగ్‌లో మెరిసిన జిల్లా ఆణిముత్యం

రాష్ట్ర, జాతీయస్థాయిల్లో రాణిస్తున్న సింధూ

27 నేషనల్‌ పోటీల్లో 19 పతకాలు

ఇటీవలే స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగం

మహబూబ్‌నగర్‌ క్రీడలు: వనపర్తి జిల్లా కొన్నూర్‌లోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన గంటల సింధూ వెయిట్‌ లిఫ్టింగ్‌లో మెరుగైన నైపుణ్యం ప్రదర్శిస్తూ జిల్లా, రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. 2007లో స్పోర్ట్స్‌ స్కూల్‌ సెలెక్షన్స్‌లో సింధూ ప్రతిభ కనబరిచి 4వ తరగతిలో హైదరాబాద్‌ హకీంపేట స్పోర్ట్స్‌ హాస్టల్‌లో ప్రవేశం పొందింది. రెండేళ్లపాటు కండీషన్‌ ట్రైనింగ్‌ అనంతరం సింధూ వెయిట్‌ లిఫ్టింగ్‌కు ఎంపికైంది. అప్పటి నుంచి వెయిట్‌ లిఫ్టింగ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటూ అనతి కాలంలోనే రాష్ట్ర, జాతీయస్థాయిలో సత్తాచాటింది. 2018లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో వనపర్తి జిల్లా ఉత్తమ క్రీడాకారిణిగా మంత్రి నిరంజన్‌రెడ్డి చేతులమీదుగా అవార్డు అందుకుంది.

27 నేషనల్‌ పోటీల్లో 19 పతకాలు
సింధూ ఇప్పటివరకు 30 జాతీయస్థాయి వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో 19 పతకాలు సాధించింది. మొదటగా 2010 హర్యానాలో జరిగిన జాతీయస్థాయి వెయిట్‌ లిఫ్టింగ్‌లో 48 కిలోల విభాగంలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించింది. అదే ఏడాది మహారాష్ట్ర (సాంగ్లీ)లో జరిగిన పోటీల్లో 53కిలోల విభాగంలో బంగారు పతకం పొందింది. చత్తీస్‌ఘడ్‌ (రాయ్‌పూర్‌)లో జరిగిన పోటీల్లో 53 విభాగంలో బంగారు పతకం సాధించింది. 2013లో అస్సాం (గౌహతి)లో జరిగిన వెయిట్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో 58 కిలోల విభాగంలో కాంస్య పతకం, 2015 హర్యానాలో 58 కిలోల విభాగంలో రజతం, 2016 పంజాబ్‌లో జరిగిన ఆలిండియా యూనివర్సిటీలో 55కిలోల విభాగంలో రజతం పతకాలు సాధించింది. 2017లో బెంగళూర్‌లో జరిగిన సీనియర్‌ నేషనల్‌ పోటీల్లో, 2018లో నాగార్జున యూనివర్సిటీలో జరిగిన ఆలిండియా యూనివర్సిటీ, వైజాగ్‌లో జరిగిన సీనియర్‌ నేషనల్‌ పోటీల్లో పాల్గొంది. గత ఏడాది డిసెంబర్‌లో తమిళనాడులోని ఎంఎస్‌యూ యూనివర్సిటీలో జరిగిన ఆలిండియా యూనివర్సిటీలో 55 కిలోల విభాగంలో రజత పతకం సాధించింది. ఈ ఏడాది ఫిబ్రవరి కోల్‌కత్తాలో జరిగిన సీనియర్‌ నేషనల్‌ పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటింది. వెయిట్‌లిఫ్టింగ్‌లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న సింధూ కోల్‌కత్తా ఇన్‌కంటాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ఈ ఏడాది మార్చిలో స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగం సంపాదించింది.

దేశానికి ప్రాతినిధ్యం వహించడమే లక్ష్యం
వెయిట్‌ లిఫ్టింగ్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించడమే నా లక్ష్యం. అందుకోసం తీవ్రంగా కష్టపడతా. స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగం వచ్చినందుకు సంతోషంగా ఉంది. పాలమూరురెడ్డి సేవా సమితి వారు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. మధ్యతరగతి అనే భావనను వీడి కష్టపడితే క్రీడల్లో ఉన్నతస్థాయికి చేరుకోవచ్చు.    – సింధూ, వెయిట్‌లిఫ్టర్‌

2018లో.. ప్రస్తుత మంత్రి నిరంజన్‌రెడ్డి చేతులమీదుగా  ఉత్తమ క్రీడాకారిణిగా అవార్డు అందుకుంటున్న సింధూ

మరిన్ని వార్తలు