ఎందుకు ఈ కుట్రలు?

19 Jan, 2020 00:06 IST|Sakshi

జనతంత్రం

సందేహం లేదు. ఏదో కుట్ర జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక భారీ రాజకీయ కుట్ర వ్యూహ దశను దాటు కొని ఆచరణ దశలోకి అడుగు వేసినట్టు ఇప్పుడు స్పష్టంగా కనబడుతున్నది. నిన్న మొన్నటి వరకు తోలు బొమ్మలాటలోని బొమ్మల్లాగా ఛాయా మాత్రంగా కని పించిన ఈ కుట్రలోని పాత్రలు ఇప్పుడు వెండితెరపై త్రీడీ బొమ్మల్లాగా అన్ని కోణాల్లోంచి కనబడుతున్నాయి. ఆ పాత్రల ముఖ కవళికల్లో దాగిన క్రోధం, అసహనం తెలిసిపోతున్నది. వాటి భుగ్నభ్రుకుటి భీకరంగా కనబడుతున్నది. విప్పార్చిన ఆ కళ్లల్లో ఎగరేసిన ఎర్ర జెండాలు కనబడుతున్నవి. పారిజాతాపహరణం కావ్యంలో నంది తిమ్మన చేసిన సత్యభామాదేవి ఆగ్రహ వర్ణన అంతా ఈ పాత్రలకు అతికినట్టు సరిపోతుంది. తోలుబొమ్మలు త్రీడీ దృశ్యాలుగా పరావర్తనం చెంద డానికి కారణమైన ట్రిగ్గర్‌ పాయింట్‌ మూడు రాజధా నుల ప్రతిపాదన. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి వికేం ద్రీకరణ–పరిపాలనా వికేంద్రీకరణ లక్ష్యాలతో మూడు రాజధానుల ప్రతిపాదన ముందుకు తెచ్చిన తర్వాత, కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఒక విస్తృత స్థాయి సర్వేను నిర్వహించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం అన్ని ప్రాంతాల్లోనూ మూడు రాజధానులవైపే జనం మొగ్గుచూపారు.

వికేంద్రీకరణకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని సాధారణంగా అందరూ భావించే కృష్ణా–గుంటూరు జిల్లాల్లో కూడా ఈ సర్వేలో ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చా యట. ఈ జిల్లాల్లో 50 నుంచి 55 శాతం వరకు ప్రజలు వికేంద్రీకరణకు సై అంటే 45 శాతం వరకు మాత్రమే ససేమిరా అన్నారట. అనంతపురం జిల్లా స్పందన కూడా ఇంచుమించు ఇదే మోతాదులో వున్నదట. మిగిలిన పది జిల్లాల్లో వికేంద్రీకణకు అనుకూలంగా ప్రజలు పెద్ద సంఖ్యలో స్పందించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఒక బలమైన శక్తిగా వున్న సిండికేట్‌కు ఈ సర్వే ఫలితాలు కలవరం కలిగించాయి. రాజకీయాల నుంచి మీడియా, సినిమా, వ్యాపారం, రియల్‌ ఎస్టేట్‌ రంగాలు మొదలుకొని అన్ని రాజ్యాంగ వ్యవస్థలనూ అల్లుకొనిపోయిన శక్తిమంతమైన సిండికేట్‌ కనుక నిఘా సంస్థల సర్వే వివరాలను వెంటనే తెలుసుకోగలగడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఈ సిండికేట్‌లోని ప్రముఖులం దరూ దాదాపుగా ‘ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌’ లబ్ధిదారులేనన్న వివరాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. బినామీ పేర్లలో వీళ్లంతా పెద్దఎత్తున అక్కడ భూములు కారు చౌకగా కొనేసినట్టు తెలుస్తున్నది. భవిష్యత్తులో ఆ భూముల్లో కాసుల పంటను కోసుకుందామని ఎదురు చూస్తున్న సిండికేట్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

వారు కంచుకోటగా భావించుకునే హైదరాబాద్‌ సమీపంలోని ఓ గురుకులానికి ప్రముఖులంతా హుటాహుటిన చేరు కున్నారట. వీరిలో మీడియా మొగల్స్, మీడియా లోఢీస్, మీడియా తుగ్లక్స్, మీడియా అసఫ్‌ జాహీస్‌ వగైరా వివిధ శ్రేణుల మీడియా ప్రముఖులతో పాటు వ్యాపార, కాంట్రాక్టు రంగాల ప్రముఖులు కూడా ఉన్నారు. కేంద్ర నిఘాసంస్థ సర్వేలో వెల్లడైన ప్రజాభిప్రాయం పట్ల అసహనం వ్యక్తమైంది. ప్రజాభిప్రాయాన్ని సరికొత్తగా ‘పునరుత్పత్తి’ చేయాలని సంకల్పించారు. మీడియా రంగం ప్రజాభిప్రాయాన్ని రూపొందించే అంశంపై అమెరికన్‌ తత్వవేత్త నోమ్‌ చామ్‌స్కీ సిద్ధాంతీకరించిన ‘మాన్యుఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ కన్సెంట్‌’ను కొత్తపుంతలు తొక్కించిన అనుభవం ఎల్లో సిండికేట్‌ మీడియాకు ఉండనే ఉంది. సమావేశంలో నిర్ణయించిన విధంగా ప్రజాభిప్రాయ పునరుత్పత్తి కార్యక్రమం పేజీల నిండా, బుల్లి తెరలనిండా ఇప్పటికే ప్రారంభించారు. అదే విధంగా ఎట్టి పరిస్థితుల్లో రాజధాని విభజన జరగ డానికి వీల్లేదనీ, అందుకోసం ఎన్నివేల కోట్లు ఖర్చ యినా సరే, ఎటువంటి ఘర్షణకైనా సరే సిద్ధపడాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది.

ఈ కీలక సమావేశం తర్వాతనే, ఒకరిద్దరు బీజేపీ ముఖ్యనాయకులకు కంచుకోట ఆహ్వానం అందింది. అక్కడ వారికి చందన తాంబూలాది సత్కారాలతోపాటు ఒక ‘సెన్సిటైజ్‌’ ప్రవచనం కూడా లభించిందని భోగట్టా. ఈ కార్యక్రమానికి కొనసాగింపుగానే బీజేపీ–జనసేనల భావజాల ఏకీకరణ కూడా జరిగిపోయింది. ఏకీకరణ కోసం జనసైనికుల మెదళ్లలోంచి చేగువేరా–భగత్‌సిం గ్‌ల అన్‌లోడింగ్, శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ లోడింగ్‌ ఏకకాలంలో జరిగిపోయింది. ఈ ప్రక్రియ నిర్వహించడా నికి వాడిన టెక్నాలజీ విషయంలో మాత్రం ఇంకా గోప్యత కొనసాగుతున్నది. కమలం పువ్వు కక్ష్యలో పరిభ్రమిస్తూ క్రమంగా అందులో దిగిపోయే విధంగా జనసేన ఉపగ్రహాన్ని టీడీపీ గురుకులం ప్రయోగిం చింది. మిషన్‌ అమరావతి లక్ష్యంగానే ఈ ఉపగ్రహం పని చేస్తుంది. మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతి రేకంగా టీడీపీ చేపట్టిన ఆందోళనకు బీజేపీ నైతిక మద్దతును సంపాదించటం ఈ మిషన్‌ తొలి లక్ష్యం. అయితే రాష్ట్ర రాజధాని ఏర్పాటు అనేది పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశం కావడం, ఇప్పటికే కేంద్రం తెప్పిం చుకున్న నివేదిక ప్రకారం ప్రజాభిప్రాయం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికే అనుకూలంగా ఉన్న నేపథ్యంలో టీడీపీ ఆందోళనకు కేంద్ర బీజేపీ మద్దతు లభించడ మనేది అడియాసే కావచ్చు. కానీ, ఏ ప్రయత్నాన్ని వద లకూడదన్న అభిప్రాయంతోనే టీడీపీ సిండికేట్‌ ఈ ఉపగ్రహ ప్రయోగాన్ని నిర్వహించి ఉంటుంది.

మామూలుగానైతే కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన ప్పుడు ఒక ఆరు మాసాలో లేదా ఏడాది పాటో ప్రతి పక్షాలు వేచి చూస్తాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల నుంచే ప్రతిపక్ష పార్టీ దాని గురుకుల సిండికేట్‌ అసహనం ప్రదర్శించడం మొదలుపెట్టాయి. కుట్రలకు తెరతీయడం అప్పటినుంచే ప్రారంభించారు. ఇసుక తుఫాను సృష్టించాలని ప్రయత్నించి విఫలమయ్యారు. తెలుగుభాషా సెంటిమెంట్‌ను రగిలించాలని చూసి బొక్కబోర్లా పడ్డారు. ఇక మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని ఎలాగైనా కూలదోయాలన్న కసి సిండికేట్‌లో కనిపిస్తున్నది. అందు కోసం ఎంత మూల్యమైనా చెల్లించాలనే తెగింపు కని పిస్తున్నది. ఏడున్నర నెలల ప్రభుత్వంపై ఎందుకింత అసహనం, ఎందుకు ఇన్ని కుట్రలు! ఈ ఏడు మాసాల్లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేయకూడని పని ఏమి చేసింది? అధికారంలోకి రాగానే ఎన్నికల మేనిఫెస్టోను భగ వద్గీతగానూ, ఖురాన్‌గానూ, బైబిల్‌గానూ పరిగణిస్తు న్నట్టు ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటికి టైమ్‌ షెడ్యూల్‌ ప్రకటించి ఒకదాని తర్వాత ఒకటి వెంటవెంటనే అమలు చేయడం ప్రారంభించారు.

పేదింటి బిడ్డలు చదువుకు దూరం కాకూడదనీ, పాఠశాల స్థాయిలోనే ఆ చదువు ఆగి పోకూడదనీ, బిడ్డ చదువు అమ్మకు భారం కాకూడదని అమ్మ ఒడి పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. సుమారు 43 లక్షల మంది పేదింటి తల్లుల బ్యాంకు ఖాతాల్లో బిడ్డల చదువు కోసం రూ. 15 వేలు చొప్పున ఇప్పటికే పడిపోయాయి. అమ్మ కళ్లలో ఒక ఆశారేఖ. విపక్షం కళ్లలో మాత్రం నిప్పులు. కనీస వసతులకు నోచుకోకుండా శిథిలమైపోతూ కంప చెట్లు మొలుస్తున్న సర్కారు బడులను సంస్కరించి తీర్చిదిద్దడం కోసం ‘నాడు–నేడు’ కార్యక్రమాన్ని చేపట్టి తొలిదశగా ఇప్పటికే 15 వేల బడుల్లో పనులు ప్రారంభించడం ప్రతిపక్షం దృష్టిలో ఈ ప్రభుత్వం చేసిన మహాపరాధం. ప్రైవేటు పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమంలో చదివే పిల్లలతో పోటీ పడలేని సర్కారు బడిపిల్లల తల్లిదండ్రులు ప్రైవేటు బడిలో చదువు ‘కొనలేని’ తమ దైన్యాన్ని, బిడ్డల దుస్థితిని తలుచుకొని కుమిలిపోయే అధ్యాయానికి చరమగీతం పాడాలనుకోవడం ఈ ప్రభుత్వం చేసిన నేరంగా టీడీపీ సిండికేట్‌ పరిగణించింది. వ్యవసాయ సీజన్‌ ప్రారంభం కాగానే అప్పు కోసం ఎక్కే గడప–దిగే గడప అన్నట్టుగా అవస్థలు పడే రైతన్నకు నేనున్నానని పెట్టుబడి నిధిని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అందజేసింది.

కౌలు రైతునూ కనికరించింది. అమ్మబోతే అడవి అనే దుస్థితి తలెత్తకూడదని రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది. విపత్తు ఎదురైతే ఆదుకోవడానికి 4 వేల కోట్లు కేటా యించింది. స్వయంగా సీఎం అధ్యక్షతనే అగ్రిమిషన్‌ను ఏర్పాటు చేసింది. వర్షాలు కూడా తోడవడంతో సాగు విస్తీర్ణం పెరిగింది. పైరు నవ్వింది. ప్రతిపక్షం ఏడ్చింది.వైఎస్సార్‌ పరిపాలన కాలంలో పేదల పాలిటి ఆపద్బాంధవిగా ప్రాణాలుపోసిన ఆరోగ్యశ్రీ అనంతర కాలంలో నిర్వీర్యమైంది. ప్రస్తుత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఆ పథకాన్ని పునరుజ్జీవింపజేసి, మరింత విస్తృతం చేసి 90 శాతం మంది ప్రజలను ఈ గొడుగు కిందకు తెచ్చింది. రెండొందల జబ్బులను అదనంగా చేర్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలో వెయ్యి జబ్బులను అదనంగా చేర్చి పైలట్‌ ప్రాజెక్టును చేపట్టారు. క్రమంగా అన్ని జిల్లాలకు విస్తరించడం జరుగుతుందని ప్రభుత్వం ప్రక టించింది. వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే చాలు ఇప్పుడు ఆరోగ్యశ్రీని ఆశ్రయించవచ్చు. చికిత్స పూర్తయిన తర్వాత పూర్తి స్వస్థత చేకూరేంత వరకు ఇంటి దగ్గర విశ్రాంతి అవసరమని వైద్యులు సూచిస్తే, అవ సరాన్ని బట్టి రూ. 5 వేల వరకు సాంత్వన నిధిని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పూర్తి జవసత్వాలతో తొణి కిసలాడుతున్న ఆరోగ్యశ్రీని అమలులోకి తెచ్చిన కార ణంగా ఈ ప్రభుత్వంపై కుట్రలు చేయవలసిన అవసరం ప్రతిపక్షానికి కలిగినట్లు కనిపిస్తున్నది.

గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యమని బాపూజీ కన్న కలలను సాకారం చేస్తూ ఏర్పాటు చేసిన గ్రామ సచివా లయ వ్యవస్థ పాలనా సంస్కరణల్లో అతిపెద్ద మలుపు. 536  రకాల ప్రభుత్వ సేవలు గ్రామ సచివాలయంలోనే లభించే విధంగా ఈ వ్యవస్థను రూపొందించారు. అంటే, ప్రతి పౌరునికి తన కళ్ల ఎదుటనే ప్రభుత్వం కని పిస్తున్నది. కొన్ని ప్రభుత్వ సేవలను డోర్‌ డెలివరీ చేయడం కోసం వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటైంది. ఇంటి గడపలోకి ప్రభుత్వం నడిచి వస్తున్నది. ఈ వ్యవస్థను నడిపించడం కోసం నాలుగు లక్షల ఉద్యోగాలు సృష్టించి రెండునెలల వ్యవధిలోనే వాటిని భర్తీ చేయడం దేశంలో ఒక సరికొత్త రికార్డు. ఇటువంటి విప్లవాత్మక సంస్కర ణల ద్వారా మొత్తం సమాజాన్ని మరింత ప్రజాస్వామ్యీ కరించడానికి పూనుకోవడం వల్ల సహజంగానే ఈ ప్రభు త్వంపై కుట్ర చేయవలసిన అవసరం ప్రతిపక్షానికి ఏర్పడినట్టున్నది. ప్రతిపక్షం క్షమించలేని ఇటువంటి మరెన్నో ‘నేరాలను’ ప్రభుత్వం చేసింది. మూడు రాజధానుల ప్రతిపాదనపై తీవ్రస్థాయి విష ప్రచారానికి టీడీపీ సిండికేట్‌ తెరలేపింది. తమ సొంత మీడియాలో పుంఖానుపుంఖాలుగా వండి వార్చ డంతోపాటు, జాతీయస్థాయి మీడియాకు తప్పుడు సమాచారాన్ని అందజేయడం ద్వారా పక్కదారి పట్టిం చడానికి ప్రత్యేకంగా ఒక బృందాన్ని నియమించారు.

వాస్తవానికి రాష్ట్ర విభజన అనంతరం కేంద్రం ఏర్పా టుచేసిన శివరామకృష్ణన్‌ కమిషన్‌ ఈ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు సరికాదని స్పష్టంగా చెప్పింది. శివ రామకృష్ణన్‌ కమిషన్‌ అలా చెప్పలేదని ఇప్పుడు టీడీపీ బృందం బుకాయించడానికి ప్రయత్నిస్తున్నది. రాజధా నిగా అమరావతిని ఎంపికచేసిన తర్వాత ఈ నిర్ణయాన్ని దుయ్యబడుతూ హిందూ పత్రికలో శివరామకృష్ణన్‌ ఒక వ్యాసాన్ని కూడా రాశారు. కానీ, రాజధాని వ్యవహారాన్ని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంగా మార్చి బంగారు గనిని తవ్వుకోవాలని ప్రణాళిక రచించుకున్న ఈ బృందానికి హితోక్తులు చెవికెక్కలేదు. తాజాగా రాజధాని సెల్ఫ్‌ ఫైనాన్స్‌తోనే అభివృద్ధి చెందుతుందని, లక్షకోట్లు ఖర్చు చేయవలసిన అవసరం లేదని కాకమ్మ కథను వ్యాప్తిలో పెట్టారు. పదివేల ఎకరాల భూములు చేతిలో వున్న సిఆర్‌డీఏ డెవలపర్లను రంగంలోకి దించితే వాళ్లు ఆ భూమిని అభివృద్ధిచేసి అమ్ముకోవడం ద్వారా వచ్చే డబ్బుల్ని కొంత సీఆర్‌డీఏకు ఇస్తారట. భారతీయ రియల్‌ ఎస్టేట్‌ రంగంపై రెండు రోజుల కిందనే వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌లో ఒక పరిశోధనాత్మక కథనం వచ్చింది.

ఢిల్లీ, ముంబై, బెంగళూరు తదితర నగరాల్లో ఐదు లక్షల ఫ్లాట్ల నిర్మాణం గత మూడేళ్లుగా పూర్తి కాకుండా మధ్యలో ఆగిపోయిందనీ, కొనుగోలుదారులు లేక, ఇటు రుణాలిచ్చిన ఆర్థిక సంస్థలకు తిరిగి చెల్లించలేక త్రిశంకు స్వర్గంలో ఉన్నారని ఆ పత్రిక కథనం. ఈ బిల్డర్లు రుణాలు తీర్చలేకపోవడంతో ఆర్థిక సంస్థల పరిస్థితి కూడా ఆందోళనకరంగా తయారైందని పత్రిక కథనం. ఉపాధి అవకాశాలు ఇబ్బడిముబ్బడిగా లభించే ఈ మహానగరాల పరిస్థితే ఇలా ఉంటే, ఇక తాడూబొంగరం లేని అమరావతి రియల్‌ ఎస్టేట్‌పై వీరు చెబుతున్న కాకమ్మ కథకు ఏపాటి విశ్వసనీయత ఉందో ప్రజలే తేల్చు కోవాల్సిన అవసరం ఉంది. చదువుకున్నవారు, ఉద్యోగులు, వ్యాపారులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు, అభ్యుదయ వాదులు జరుగుతున్న పరిణామాలను నిశితంగా అధ్య యనం చేయాలి. ప్రచార హోరులో కొట్టుకొనిపోకుండా ప్రపంచవ్యాప్తంగా గ్రీన్‌ఫీల్డ్‌ నగరాల అనుభవాలేమిటో శోధించాలి. అమరావతిపై టీడీపీ సిండికేట్‌ ప్రేమ వెనుక దాగివున్న రహస్యమేమిటో స్వతంత్ర అధ్యయనం ద్వారా తేల్చుకోవాలి. నీళ్లేవో, పాలేవో స్వయంగా నిర్ధా రించుకోవాలి. అంతేకాదు, అభ్యుదయ శక్తులకు అండగా నిలవాలి. అప్పుడే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి పథంలో పయనిస్తుంది.

- వర్ధెల్లి మురళి

మరిన్ని వార్తలు