ఉగ్రవాదం, అల్లర్లపై నిర్వచనంలో మరీ ఇంత వివక్షా?

8 Oct, 2017 01:40 IST|Sakshi

అవలోకనం
అమెరికాలో ఇటీవల సంగీత కచ్చేరిపై జరిగిన ఘాతుక దాడి.. వ్యక్తి చేసిన కాల్పులే కానీ ఉగ్రవాద చర్య కాదని అక్కడి పోలీసులు చెప్పారు. అతడు క్రైస్తవుడు. అదే ముస్లిం అయితే పోలీసులు ఇలాగే చెప్పేవారా? ప్రముఖ భాషా శాస్త్రవేత్త, రచయిత నామ్‌ చోమ్‌స్కీ ఇలాంటి సందర్భంలోనే మాట్లాడుతూ ‘మనం చేస్తే అది ఉగ్రవాద వ్యతిరేక చర్య. వాళ్లు చేస్తే అది ఉగ్రవాదం’ అన్నారు.

అమెరికాలోని లాస్‌ వెగాస్‌ నగరంలో కొన్ని రోజుల క్రితం సంగీత కచ్చేరీకి హాజ రైన వారిపై ఒక వ్యక్తి జరిపిన కాల్పుల్లో 58 మంది మరణించారు. అతగాడు జన సమూహంపై తన మెషిన్‌గన్‌తో గంటసేపు జరిపిన కాల్పుల్లో 500పైగా జనం గాయపడ్డారు. ఇది వ్యక్తి చేసిన కాల్పులు కాబట్టి ఉగ్రవాద చర్య కాదని అమెరికన్‌ పోలీసులు చెప్పారు. హంతకుడు క్రైస్తవుడు. అతడు ముస్లిం అయితే పోలీసులు ఇలాగే చెప్పేవారా? నేనయితే అలా అనుకోవడం లేదు. ఆ వ్యక్తి గురించి, అతడి ఉద్దేశాల గురించి పెద్దగా తెలియడం లేదు కాబట్టే అతడి చర్య ఉగ్రవాదం కాదని నిర్ధారించడాన్ని, అలాగే మనం ఉగ్రవాదాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నామనే అంశాన్ని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది.

‘రాజకీయ లక్ష్యసాధన కోసం ప్రత్యేకించి పౌరులపై చట్టవిరుద్ధంగా హింసను ప్రయోగించడం, బెదిరించడమే ఉగ్రవాదం‘ అని నా పదకోశం నిర్వచిస్తోంది. దీని ప్రకారం హింసకు సంబంధించిన పలు చర్యలను ఉగ్రవాదంగా చెప్పవచ్చు. మతపరమైన హింస కూడా ఈ నిర్వచనం కిందికే వస్తుంది. మరి హింస కూడా రాజకీయ లక్ష్యసాధన కోసం పౌరులను బెదిరించే ఉద్దేశంతో జరిగే అక్రమ చర్యే కదా.

కానీ మనలో చాలామంది మతపర హింసను ఉగ్రవాదంగా పరిగణించరు. 1984లో సిక్కులపై జరిగిన మారణకాండను అల్లర్లు అని పిలిచారు. ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిన ముజఫర్‌నగర్‌ హింసను అల్లర్లు అన్నారు. బాబ్రీ మసీదును కూల్చివేసిన తర్వాత వందలాది ముస్లింలను హతమార్చిన ముంబై హింస కూడా అల్లర్లేనట. కానీ దానికి ప్రతీకారంగా జరిగిన బాంబు దాడులు మాత్రం ఉగ్రవాదమట. 2002లో అహ్మదాబాద్‌ లోని నరోడా పటియాలో 97 మంది ముస్లింలను ఊచకోత కోసిన ఘటన అల్లర్లు మాత్రమేనట. ఆ ఏడాదే అహ్మదాబాద్‌లోని అక్షరధామ్‌లో 30మంది హిందువులను చంపిన ఘటన మాత్రం ఉగ్రవాద దాడేనట.

‘పౌరులను లక్ష్యంగా చేసుకుని‘ అని ఉన్న పంక్తి మరీ చిత్రమైంది. జమ్మూకశ్మీర్లో జరుగుతున్న దాడుల్లో అనేకం సాయుధ బలగాలపైనే కానీ పౌరులను లక్ష్యంగా చేసుకున్నవి కావు. కానీ వీటిని మాత్రం మనం ఉగ్రవాద దాడులుగానే గుర్తిస్తున్నాం. రాజకీయ, సామాజిక లక్ష్య సాధన కోసం ప్రభుత్వాన్ని లేక పౌర జనాభాను, మరే ఇతర ప్రజా విభాగాన్ని కానీ బెదిరించడానికి లేదా బలవంతపెట్టడానికి చట్టవిరుద్ధంగా బలప్రయోగాన్ని, హింసను ఉపయోగించడమే ఉగ్రవాదమని అమెరికన్‌ చట్టం నిర్వచిస్తోంది. నేను ముందే చెప్పినట్లుగా లాస్‌ వెగాస్‌లో కాల్పులు జరిపిన షూటర్‌ గురించి, అతడి ఉద్దేశాల గురించి పెద్దగా తెలియదు. అతడి రాజకీయ లేక సామాజిక లక్ష్యాలు ఏంటో తెలియకున్నప్పటికీ అతడి చర్య ఉగ్రవాద దాడి కాదని ఎలా నిర్ధారించారన్నది స్పష్టం కావడం లేదు.

ఉగ్ర బీభత్సానికి వ్యతిరేకంగా భారత్‌ తీసుకొచ్చిన చట్టాన్ని ఉగ్రవాద నిరోధక చట్టం (పొటా) అంటున్నారు. దీనికి 2002లో వాజ్‌పేయి ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది. దేశంలోని అనేక చట్టాల్లాగే పొటాను కూడా పేలవమైన భాషలో రూపొందించారు. భారత సమైక్యత, సమగ్రత లేక సార్వభౌమత్వాన్ని ప్రమాదంలోకి నెట్టే ఉద్దేశంతో లేదా బాంబులను, డైనమైట్లను, ఇతర పేలుడు పదార్థాలను, మండే వస్తువులను, తుపాకులను, ఇతర మారణాయుధాలను, లేదా విషాన్ని, విషపూరిత వాయువులను, విష రసాయనాలను మరే ఇతర (జీవరసాయనిక లేక మరే ఇతర పదార్థాలనైనా) ఉపయోగించడం ద్వారా ప్రజలను, ఏ ఇతర ప్రజావిభాగాన్నయినా భయపెట్టడానికి చేసే దాడులను ఉగ్రవాదమని పొటా నిర్వచించింది. ఇలాంటి దాడుల ద్వారా ఏ వ్యక్తినైనా, వ్యక్తులనైనా చంపడానికి లేదా గాయపర్చడానికి; ఆస్తి నష్టం, విధ్వంసం కలిగించడానికి, వివిధ సామాజిక బృందాల జీవితానికి అవసరమైన అత్యవసర వస్తువుల సరఫరాను దెబ్బతీయడానికి చేసే ప్రయత్నాలన్నీ ఉగ్రవాదం కిందికే వస్తాయని పొటా పేర్కొంది.

భారత దేశ రక్షణకు భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు వాటి అవసరాల కోసం ఉపయోగించే సామగ్రి, లేదా ఆస్తిని నష్టపరిచే, ధ్వంసం చేసే చర్యలు కూడా ఉగ్రవాదం కిందికే వస్తాయని తెలిపింది. ప్రభుత్వాన్ని లేక మరే ఇతర వ్యక్తినైనా లోబర్చుకోవడానికి, ఎవరినైనా గాయపర్చడానికి, చంపడానికి లేదా నిర్బంధించడానికి పూనుకునే చర్యలన్నీ ఉగ్రవాదం కిందికే వస్తాయని పొటా నిర్వచించింది. ఈ మొత్తం పేరాలో ‘సమైక్యత, సమగ్రత, భద్రత, సార్వభౌమాధికారం‘ అనేవి కీలక పదాలు. భారతదేశ విచ్ఛిన్నత అనే భయం (ఇది ఎక్కడా కనిపించని భయం) ప్రాతిపదికన మనం పెంచుకున్న ఆందోళనే ఉగ్రవాదం పట్ల మన నిర్వచనాన్ని ప్రాథమికంగా నిర్దేశిస్తోంది. ఉగ్రవాదులు ఎన్నడూ ఉపయోగించని డైనమైట్లు వంటి విచిత్రమైన పదాలను ఈ నిర్వచనంలోకి తీసుకొచ్చారు. అదే సమయంలో ఆర్డీఎక్స్, సి14 లేదా ఇతర అధునాతన పేలుడు పదార్థాల ఊసే దీంట్లో లేకపోవడం గమనార్హం. ఉగ్రవాద చట్టాన్ని రూపొందించిన ప్రభుత్వ బ్యూరోక్రాట్‌ బహుశా బాలీవుడ్‌ సినిమాలు చూస్తూ పేలుడు పదార్థాలు అంటే ఇవే అనే ఎరుకను కలిగి ఉండవచ్చు.

మొత్తంమీద చూస్తే, పెద్దగా ఆలోచించకుండానే ఈ చట్టాన్ని రూపొందించినట్లుంది. దేశంలో అనేక చట్టాలను ఇలాగే పేలవంగా తయారు చేసి సమర్పించారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఇలాంటివి ఉన్నాయి. చట్టవ్యతిరేక పదార్థాల రూపకర్తలు, మాదక ద్రవ్యాల తయారీదారులు, గూండాలు, మానవ అక్రమ రవాణాదారులు, ఇసుక మాఫియా, లైంగిక నేరస్తులు, వీడియో చౌర్యం చేసేవారు తదితరులను నిరోధించే చట్టం కింద తమిళనాడులో మిమ్మల్ని ఏడాది పాటు విచారణ లేకుం డానే నిర్బంధించవచ్చు. మీరు ఏ నేరమూ చేయనవసరం లేదు. భవిష్యత్తులో మీరు నేరం చేస్తారని, చేయవచ్చని అనుమానిస్తే చాలు.. ప్రభుత్వం మిమ్మల్ని ఏడాది పాటు జైలులో పెట్టవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా అమెరికా అత్యాచారాల గురించి ప్రముఖ భాషా శాస్త్రవేత్త, రచయిత నామ్‌ చోమ్‌స్కీ మాట్లాడుతూ ‘మనం చేస్తే అది ఉగ్రవాద వ్యతిరేక చర్య. వాళ్లు చేస్తే అది ఉగ్రవాదం‘ అన్నారు. అదే మన విషయంలోకి వస్తే, అవి అల్లర్లు లేక వ్యక్తులు చేసిన పని. అదే ముస్లింలు కనుక చేస్తే కచ్చితంగా ఉగ్రవాదమే.

ఆకార్ పటేల్
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com

మరిన్ని వార్తలు