అనాలోచిత పరిష్కారం.. అర్థరహిత నిషేధం

15 Oct, 2017 01:29 IST|Sakshi

అవలోకనం

పంతొమ్మిది వందల ఎనభైల చివర్లో. తొంభైల మొదట్లో పలు సంవత్సరాల పాటూ నేను మా కుటుంబ జౌళి వ్యాపారం చేస్తుండేవాడిని. ఆ ఫ్యాక్టరీ, సూరత్‌ నుంచి దాదాపు గంట రైలు ప్రయాణం దూరంలోని అంకాలేశ్వర్‌లో ఉండేది. నేను సాధారణంగా మధ్యాహ్నం పూట ఫ్యాక్టరీకి వెళ్లి, సాయంత్రం తిరిగి వచ్చేవాణ్ణి. ఆ ఫ్యాక్టరీ టెక్స్చరైజింగ్‌ అనే ప్రక్రియ ద్వారా పాలియెస్టర్‌ దారంతో ధరించడానికి మరింత అనువుగా ఉండే ప్లాస్టికీ దారాన్ని తయారుచేసేది. ఈ ప్రక్రియ అత్యధిక వేగాలతో సాగేది కాబట్టి కూలింగ్‌ టవర్‌ ఉన్న భారీ ఎయిర్‌కండిషనింగ్‌ ప్లాంట్‌ అవసరమయ్యేది. ఆ టవర్‌కు నీటిని పంపే భారీ పైపు పగిలిపోయింది. దాని లోహపు గొట్టం అప్పడం ముక్కల్లా పెచ్చులుగా పగిలిపోయింది. అదలా ఎందుకు జరిగిందో నాకు అర్థం కాలేదు. ఆ రోజున సాయంత్రం 6.30 ప్రాంతంలో స్టేషన్‌కు పోతుండగా పూర్తి యాసిడ్‌ పొగలతో నా గొంతు నిండిపోయి, ఊపిరి సలపలేదు. 

మా ఫ్యాక్టరీకి దగ్గర్లోని మరొక ఫ్యాక్టరీ ఆ సమయంలో క్రమం తప్పకుండా దేన్నోగానీ  బయటకు వదులుతుంటుండేది. ఆ యాసిడ్‌ పొగ లోహాలను నాశనం చేయడానికి సరిపడేటంత ప్రమాదకరమైన ది. ఇక మనిషి ఊపిరితిత్తుల గురించి చెప్పనవసరమే లేదు. దేశంలోని అన్ని పారిశ్రామిక ప్రాంతాల్లోనూ ఇది తరచుగా కనిపించేదే. సూరత్‌ శివారు ప్రాంతంలోని ఉద్నా, పందేసరాలో అద్దకం, ప్రింటింగ్‌ యూనిట్లు భూగర్భ జలాలను విషపూరితం చేసేలా ధగధగలాడే రంగు లను క్రమం తప్పకుండా నేరుగా బయటకు వదిలేసేవి. 

దీపావళి పండుగ సమయంలో ఢిల్లీలో టపాసుల అమ్మకాలను సుప్రీం కోర్టు నిషేధించిందన్న వార్త చదివి ఇది రాస్తున్నాను. ఢిల్లీ ఎప్పుడూ వెళ్లి వస్తుండే నేను అక్కడి గాలి నాణ్యతలో పెద్ద తేడా ఏమీ ఉన్నట్టు గమనించలేదు. అది కలుషితం అయి ఉందంటే, దేశంలోని ఇతర నగరాలలో అంత ఎక్కువగా లేదా అంతే తక్కు వగా కలుషితమైనదే. అసలు సమస్యంతా ఉన్నది అంకాలేశ్వర్‌ వంటి పారిశ్రామిక ప్రాంతాల్లోనే. వాటితో పోలిస్తే అది కచ్చితంగా తక్కువగా కలుషితమైనది. అందు వల్లనే, ఢిల్లీలో ఒక రోజు ట్రాఫిక్‌ నిబంధనల చట్టాలు, ఇప్పుడిక టపాసుల నిషేధం వంటి చర్యలతో నిరంతరం ప్రయోగాలు చేస్తుండటం చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఒక రోజు కాల్చే టపాసులు కాలుష్యం స్థాయిలను ఎలా మార్చేస్తాయి? వాయు కాలుష్యం, కాలుష్యం మొత్తంగా దేశమంతా ఎదుర్కొం టున్న సమస్యలలో ఒకటని స్పష్టంగా తెలుస్తున్నదే. అలాంటప్పుడు ఇలాంటి అద్భుత మేధో పరిష్కారాలు కేవలం రాజధానికే పరిమితం కావడం దేనికి?

ప్రస్తుత హిందూ జాతీయవాద వాతావరణంలో (అది కూడా విషపూరితమై నదే).. సుప్రీం కోర్టు తీర్పు ముస్లింలపై దాడికి ఉపయోగపడే మరో అస్త్రంగా మారింది. ఇక దీని తర్వాత హిందువులు శవదహనాన్ని తిరస్కరించాలని కోర తారా? అని ఓ బీజేపీ గవర్నర్‌ ప్రశ్నించారు. ఏ భారత న్యాయస్థానమైనా మేక లను వధించడాన్ని నిషేధించ సాహసిస్తుందా? అని చేతన్‌ భగత్‌ అడిగాడు. టపాసులను నిషేధించమని ముస్లింలు కోరారా? వారిని ఇందులోకి ఈడ్చడం ఎందుకు? తమ ఆదేశాలను మతపరమైనవిగా మెలితిప్పడం దురదృష్టకరమని సుప్రీం కోర్టే పేర్కొంది. అయితే అది తాను పనిచేస్తున్న వాతావరణాన్ని అర్థం చేసుకోవాల్సింది.

ఢిల్లీలో అమ్మకానికి సిద్ధంచేసిన 50 లక్షల కిలోల టపాసులు ఉన్నాయని వార్త. ఈ పండుగ సీజన్లో తమ కొద్దిపాటి ఆదాయాలకు అదనంగా మరికాస్త సంపాదించుకుందామని ఆశించే వేలాది మంది ప్రజల జీవనోపాధిని ఈ నిషేధం ప్రభావితం చేస్తుంది. నాలాగే, దీపావళి పండుగ సంబరాలతో సంతోషించే లక్ష లాది బాలలను, పెద్దలను కూడా ప్రభావితం చేస్తుంది. ప్రపంచంలోని అత్యంత పేద భాగాలలో ఒకటైన మనలాంటి దేశంలో, ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని అణచివేయడం ఉత్పాదకమైనదేనా? అని మనల్ని మనం ప్రశించుకోవాలి. వసంత కాలపు పండుగ బసంత్‌ సందర్భంగా లాహోర్‌లో గాలిపటాలు ఎగ రేయడంపై నిషేధం విధించి పాకిస్తాన్‌ ఇదే తప్పు చేసింది. అక్కడి న్యాయ మూర్తులు తరచుగా గాలిపటాలు ఎగరేయడాన్ని ‘ఇస్లాంకు ఇతరమైన’ అలవా టుగా విశ్వసిస్తుంటారు. అందువల్ల ప్రజలకు దాన్ని నిరాకరించారు. పక్షులు, మనుషుల భద్రతను ఆ నిషేధానికి సాకుగా ఉపయోగించుకున్నారు. కానీ నిజ మైన ఉద్దేశం మాత్రం మతపరమైన అత్యుత్సాహమే. 

గాలిపటాలు ఎగరేయడం గాయపడటానికి, కొన్ని సందర్భాల్లో మరణానికి కూడా దారి తీస్తుంటుంది. అలాంటివి ఇతరత్రా చాలా పనుల వల్ల కూడా జరుగు తుంటాయి. మనను సురక్షితంగా ఉంచలేదన్న ఏకైక కారణంతోనే దేనిపైనైనా నిషేధం విధించాలని ఆలోచించ కూడదు, ఆలోచించడానికి వీల్లేదు. టపాసుల నిషేధం బహుశా అలాంటి భక్తిప్రపత్తులతో విధించినది కాదు. కానీ ఒక్క దెబ్బకు మార్పును తెచ్చేయాలనే కోరికతో విధించినది కావచ్చు. ఇదో అసమంజసమైన విశ్వాసం. సర్వసాధారణంగా అది ఫలితాలను ఇవ్వదు. లవ్‌ జిహాద్, జాతీయ గీతం వంటి విషయాల్లో సుప్రీం కోర్టు ప్రదర్శిస్తున్న ఆసక్తి దృష్ట్యా... అది దేశ రాజధానిలోని వాయు నాణ్యతను మెరుగు పరచడంలో వేలు పెట్టే ప్రయత్నం చేయడం ఆశ్చర్యం కలిగించదు (అమెరికా వంటి ఇతర పెద్ద ప్రజాస్వామ్య దేశా ల్లోని సుప్రీం కోర్టులు ఏ అంశాలను విచారణకు తీసుకుంటాయి, వేటిని తిరస్క రిస్తాయి అనే దాన్ని మన సుప్రీం కోర్టు గమనించడం ఉపయోగకరం).  

వాయు కాలుష్యం, అంతకంటే పెద్దది, మానవాళి ఉనికినే ప్రశ్నార్థకం చేసేదైన వాతావరణ మార్పు వంటివి అతి తీవ్ర సమస్యలు. అనాలోచితంగా, ఏదో తంతుగా వాటికి అర్థర హితమైన పరిష్కారం చూపడం... ఆ సమస్యల వల్ల తలెత్తే ప్రమాద తీవ్రతను తగ్గించి చూపుతుంది. ఇలాంటి విషయాలలో తాము ఎంత సమంజసంగా, అర్థవంతంగా ఉంటున్నామని విశ్వసిస్తున్నా, మన కోర్టులు ఇలాంటి ఆదేశాలను జారీ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

ఆకార్‌ పటేల్‌
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com

>
మరిన్ని వార్తలు