హక్కుల పరిరక్షణ చట్టాలను నీరుగార్చొద్దు!

25 Mar, 2018 01:37 IST|Sakshi

అవలోకనం

శిక్షల రేటు తక్కువగా ఉన్నదన్న కారణంతో ఒక చట్టం దుర్వినియోగమవుతున్నదని నిర్ధారించడం సబబు కాదు. అపహరణలు, ఫోర్జరీ, మోసం, బలవంతపు వసూళ్ల కేసుల్లో శిక్షల శాతం తక్కువగా ఉంటున్నది. కనుక ఆ చట్టాలు దుర్వినియోగమవుతున్నట్లేనా? దుర్బల వర్గాల పరిరక్షణకు ఉద్దేశించిన చట్టాలు మాత్రమే దురుపయోగమవుతున్నాయని నిర్ణయించడం సబబేనా?

చట్టాల ‘దుర్వినియోగానికి’ వ్యతిరేకంగా మన సుప్రీంకోర్టు తీసుకుంటున్న చర్యలు ఇంకా సాగుతూనే ఉన్నాయి. ఈమధ్యే జస్టిస్‌ ఏకే గోయెల్, జస్టిస్‌ యు యు లలిత్‌ల నేతృత్వంలోని ధర్మాసనం ఎస్సీ, ఎస్టీ(అత్యాచారాల నిరోధక) చట్టం ‘అడ్డూ ఆపూ లేకుండా దుర్వినియోగం’ అవుతున్నదని చెప్పి దాన్ని నిరోధించడం కోసం మార్గదర్శకాలు జారీచేసింది. వీటి ఫలితంగా...దళితులు, ఆదివాసీల హక్కుల పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్న చట్టం కాస్తా బలహీనపడుతుంది. తీర్పులో చాలాభాగం నిష్పాక్షిక విచారణ జరగాలని కోరడానికి నిందితులకుగల హక్కును కాపాడటానికి ఉద్దేశించిందే.
కానీ ఈ తీర్పు విచిత్రమైన తర్కం చేసింది. 

కొన్ని హైకోర్టుల తీర్పుల్ని, జాతీయ క్రైం రికార్డుల బ్యూరో గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటూ ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం ‘దోపిడీ, అణచివేత’ శాసనంగా మారిందన్న నిర్ణయానికొచ్చింది. ఇది ‘బ్లాక్‌మెయిల్‌ చేయడానికి, వ్యక్తిగత ప్రతీకారాన్ని తీర్చు కోవడానికి’ ఉపయోగపడటంతో పాటు కులతత్వాన్ని శాశ్వతీకరిస్తున్నదని భావిం చింది. వాటికి విరుగుడుగా అనేక మార్గదర్శకాలిచ్చింది. అందులో అన్నిటికన్నా విధ్వంసకరమైనది కుల వివక్షకు సంబంధించి వచ్చిన ఫిర్యాదు విషయంలో ఎఫ్‌ఐ ఆర్‌ దాఖలు చేసే ముందు ‘ప్రాథమిక విచారణ’ను తప్పనిసరి చేయడం. 

ఈ న్యాయమూర్తులిద్దరూ పరిరక్షణ చట్టాల దుర్వినియోగంపై ఆదేశాలివ్వడం ఇది తొలిసారి కాదు. గత జూలైలో భారత శిక్షాస్మృతిలోని 498ఏ సెక్షన్‌ (వరకట్న వేధింపుల నిరోధక చట్టం) ‘దుర్వినియోగం’ కాకుండా ఆదేశాలిచ్చారు. వరకట్న వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులొచ్చినప్పుడు వాటిని పరిశీలించడానికి ‘కుటుంబ సంక్షేమ సంఘాలు’ ఏర్పాటు చేయాలని, ఆ తర్వాతే నిందితులను అరెస్టు చేయాలని ఆదేశించారు. 

ఎలాంటి చట్టాలు దుర్వినియోగమవుతున్నాయని ఫిర్యాదులొస్తాయో ఆలో చించండి. వాటిలో–లైంగిక వేధింపుల నిరోధక చట్టం (పని స్థలాల్లో మహిళల పరి రక్షణకు ఉద్దేశించిన చట్టం), వరకట్న నిరోధక చట్టం (వివాహితల పరిరక్షణకోసం వచ్చిన చట్టం), కుల వివక్షనూ, అఘాయిత్యాలనూ నిరోధించే చట్టం ( దళితులు, ఆదివాసీలకు ఉద్దేశించింది) ఉన్నాయి. చిత్రమేమంటే దుర్బల వర్గాల పరిరక్షణకు ఉద్దేశించిన చట్టాల విషయంలోనే దుర్వినియోగం ఆరోపణలు వస్తాయి. ఇంత క్రితం ప్రస్తావించిన రెండు తీర్పుల విషయంలో నాకు రెండు ప్రశ్నలున్నాయి. ఒకటి–ఇతర చట్టాలకంటే ఇవే దుర్వినియోగానికి అనువుగా ఉన్నాయా? రెండు– ధర్మాసనం సూచించిన చర్యలు నిష్పాక్షిక విచారణకు దోహదపడేవేనా? 

మొదటి ప్రశ్నలోకి వద్దాం. ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టానికి సంబంధించిన తీర్పులో ధర్మాసనం ఉటంకించిన గణాంకాలు చూద్దాం. 2015 జాతీయ క్రైం రికా ర్డుల బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) ప్రకారం ఎస్సీ కేసుల్లో 5,347, ఎస్టీ కేసుల్లో 912 తప్పుడు కేసులని నిర్ధారణ అయింది. దళిత సంఘాలు చెబుతున్న ప్రకారం ఆధి పత్య కులాలకు చెందిన పోలీసు సిబ్బంది దళితుల ఫిర్యాదులను స్వీకరించడానికి విముఖంగా ఉంటారు. అది తప్పుడు ఫిర్యాదని అప్పటికప్పుడే తేల్చేస్తారు. 2016 నాటి ఎన్‌సీఆర్‌బీ నివేదికలోని గణాంకాలను పరిశీలిద్దాం. ఆ ఏడాది మొత్తంగా ఎస్సీలకు సంబంధించి 56,299, ఎస్టీలకు సంబంధించి 9,096 ఫిర్యాదులు రావ డమో, దర్యాప్తు పెండింగ్‌లో ఉండటమో జరిగిందని ఆ నివేదిక తెలిపింది. అంటే మొత్తం కేసుల్లో 10 శాతం లేదా ప్రతి పది కేసుల్లో ఒకటి తప్పుడు కేసు అని అను కోవచ్చు. దానర్థం పదిలో తొమ్మిది నిజమైన కేసులేనన్నమాట! దీన్ని ‘అడ్డూ ఆపూ లేకుండా దుర్వినియోగం’ అవుతున్నట్టు భావించడం సబబేనా? 

ఈ గణాంకాలను ఇతర నేరాలతో పోల్చి చూద్దాం. కిడ్నాపింగ్‌ కేసుల్లో 9 శాతం, ఫోర్జరీ కేసుల్లో 12 శాతం తప్పుడువని పోలీసులు చెబుతున్నారు. అంత మాత్రాన కిడ్నాపింగ్, ఫోర్జరీల నిరోధానికి ఉద్దేశించిన చట్టాలను రద్దు చేయాలని ఎవరైనా అంటారా? 2015లో న్యాయస్థానాలు మొత్తం 15,638 కేసుల్లో తీర్పునిస్తే అందులో 11,024 కేసుల్లో నిందితులు నిర్దోషులని తీర్పులొచ్చాయని, 495 కేసుల్ని ఉపసంహరించుకున్నారని, 4,119 కేసుల్లో శిక్షలు పడ్డాయని సుప్రీంకోర్టు ధర్మా సనం ఉటంకించింది. సుప్రీంకోర్టు తాజా తీర్పు ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం కేసుల్లో ‘కేవలం’ 26 శాతం కేసుల్లో మాత్రమే శిక్షపడిన సంగతిని గుర్తు చేసింది. వాటి ఆధారంగా ఆ చట్టం దుర్వినియోగమవుతున్నదని అభిప్రాయపడింది. 

దర్యాప్తు, విచారణల్లో చోటు చేసుకుంటున్న జాప్యం.. బాధితులు, సాక్షుల వేధింపు.. దళితులకు, ఆదివాసీలకు న్యాయం లభించడానికి ఎదురవుతున్న వ్యవ స్థాపరమైన అడ్డంకులు... ఫలితంగా తగ్గుతున్న శిక్షల రేటు గురించి కాసేపు మరిచి పోదాం. వీటిని ‘దుర్వినియోగానికి’ ప్రమాణంగా తీసుకోదల్చుకుంటే ఎన్‌సీఆర్‌బీ తాజా గణాంకాల ప్రకారం మోసం కేసుల్లో 20 శాతం, బలవంతపు వసూళ్లలో 19 శాతం, దహనకాండల్లో 16 శాతం మేరకు మాత్రమే శిక్షలు పడుతున్నాయి. ఈ చట్టాలు దుర్వినియోగమవుతున్నాయని ఎవరూ చెప్పినట్టు లేదు. కానీ కేవలం కొన్ని చట్టాల పనితీరుపైనే దృష్టిపెట్టి అవి మాత్రమే దుర్వినియోగమవుతున్నాయ నడం సబబేనా. 

ఇక న్యాయబద్ధమైన విచారణ కోసం ధర్మాసనం జారీచేసిన మార్గ దర్శకాలను పరిశీలిద్దాం. మన దేశంలో బాధితులు లేదా సాక్షుల పరిరక్షణకు సంబంధించిన విధానమేదీ లేదు. కనుక ఇలాంటివారు నిందితుల నుంచి వేధిం పులు, బెదిరింపులు ఎదుర్కొంటారు. దీనికితోడు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు సిద్ధపడరు. ఇలాంటి స్థితిలో కుటుంబ సంక్షేమ సంఘాల ఏర్పాటు, ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు ముందు ‘ప్రాథమిక విచారణ’ ఇప్పుడున్న పలురకాల అడ్డంకులకు అదనంగా వచ్చి చేరతాయి. నిరుడు ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌ ఆదివాసీలు వంద మంది ఎదుర్కొన్న సమస్యను ఉదహరిస్తాను. కొన్ని ప్రైవేటు సంస్థలు ఏజెంట్ల ద్వారా బెదిరించి తమ భూములు కబ్జా చేయడంపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద వారు ఫిర్యాదు చేశారు. 

రాయ్‌గఢ్‌ పోలీసులు ఆ ఫిర్యాదు తీసుకుని ‘ప్రాథమిక దర్యాప్తు’ పేరిట జాప్యం చేసి కొన్ని వారాల తర్వాత ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు నిరాకరించారు. తప్పుడు కేసుల నుంచి రక్షణకు మన చట్టాల్లో ఇప్పటికే పలు ఏర్పాట్లున్నాయి. ఎవరికైనా హాని కలిగించే ఉద్దేశంతో తప్పుడు కేసులు పెట్టిన వ్యక్తికి ఏడేళ్ల వరకూ జైలు శిక్ష విధించవచ్చు. తప్పుడు సాక్ష్యాలు, వాటిని తారుమారు చేయడం నేర పూరిత చర్యలు. వీటిని పోలీసులు, న్యాయవ్యవస్థ సమర్థవంతంగా ఎదుర్కొంటే తప్పుడు ఫిర్యాదులు ఆగిపోతాయి. దుర్బల వర్గాల కోసం పార్లమెంటు చేసిన చట్టా లను మొద్దు బార్చే మరిన్ని తీర్పులు మనకు అవసరం లేదు.
 

- ఆకార్‌ పటేల్‌
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ‘ aakar.patel@icloud.com

 

మరిన్ని వార్తలు