అమరావతి నాడూ అస్థిర రాజధానే!

21 Jan, 2020 00:18 IST|Sakshi

రెండో మాట

శివరామ కృష్ణన్‌ కమిటీ నూతన రాజధాని నిర్మాణంలో తీసుకోవలసిన జాగ్రత్తలను కూలంకషంగా పరిశీలించి ప్రయోజనకరమైన ప్రత్యామ్నాయాలను సిఫారసు చేస్తే, ఆ కమిటీ నివేదికను కనీసం అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండానే చంద్రబాబు తిరస్కరించారు. అమరావతి భూములపై కన్నేసి లబ్ధి పొందిన మోతుబరులకు మేలుచేసి, బలవం తపు ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా పేదరైతుల, వ్యవసాయ కార్మికుల ఉసురు తీశాడు. ఇప్పుడు ఎదురుబొంకుగా మోతుబరుల ఉద్యమాన్ని లేపాడు. మూడు... నాలుగు పంటలు పండే భూముల్లోని పంటను అర్ధరాత్రి తగలబెట్టించి పేదలపై ఎదురుకేసులు పెట్టి హింసించిన ఈ శతాబ్ది పాలకులు తెలుగుదేశం పార్టీవారే. అమరావతి మాత్రం ఎక్కడికీ పోదు. ఒక రాజధానిగా ఉంటుంది. అది ఆధారంగా దాని అభ్యుదయమూ కొనసాగుతుంది. ఇతర ప్రాంతాల బాగోగులూ తనవిగానే భావించుకుంటుంది.

‘ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనా వికేంద్రీక రణ ప్రాంతాలమధ్య అభివృద్ధి వికేంద్రీకరణ, మూడు రాజధానుల అవసరం అవశ్యమన్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదనతో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు తెలియవస్తోంది. ఈ విషయంలో ముఖ్య మంత్రి రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశాన్ని (అమరావతిలో శాసనసభ, విశాఖలో కార్యనిర్వాహక శాఖ, కర్నూలులో హైకోర్టు కేంద్రంగా మూడు రాజధానుల ఏర్పాటు) ప్రధాని నరేంద్ర మోదీకి, హోంమంత్రి అమిత్‌ షాకు, ఒకటికన్నా ఎక్కువసార్లు వివరించినట్టు విశ్వసనీయ వర్గాలు మాకు ధృవపరిచాయి’
– ‘ఎక్స్‌ప్రెస్‌ న్యూస్‌ సర్వీస్‌’ ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ పత్రిక 

‘ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనా వికేంద్రీకరణ జరిగితే దానిని బీజేపీ ఆహ్వానిస్తుంది. ఈ విషయంలో రాష్ట్రంలోని బీజేపీ నాయకులు విరు ద్ధంగా ఏమి చెప్పినా అది వారి వ్యక్తిగత అభిప్రాయంగా మాత్రమే పరిగణించాలి. పరిపాలనా వికేంద్రీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో కేంద్రం జోక్యం చేసుకోజాలదు. ఇదే బీజేపీ అధికార విధానం’
– జీవీఎల్‌ నరసింహారావు, బీజేపీ కేంద్ర అధికార ప్రతినిధి

అధికారం ఊడిన తరువాత మాజీ ముఖ్యమంత్రి హోదాలో తాడు తెగి చెంబు నూతిలో పడిన చందంగా చంద్రబాబుకి విజ్ఞత, విన్నాణం, సంస్కారం అబ్బకపోవడం విచారకరం. నేడు రాష్ట్రం ఆర్థికంగా లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో నుంచి బయ టపడటానికి నానా తంటాలు పడటానికి కారణం బాబుకి తెలుసు. అందుకు కారణం తన ప్రజా వ్యతిరేక పాలనేనని కూడా ఆయనకి తెలుసు. ఉమ్మడి రాష్ట్ర విభజనకు లోపాయికారీగా విత్తులు చల్లి, కేంద్ర కాంగ్రెస్‌తో లాలూచీపడి విభజన పత్రంపై ఆగమేఘా లపైన ఢిల్లీ వెళ్లి సంతకం పెట్టి ‘డూడూ బసవన్న’గా మారిందీ ప్రజలకు తెలుసు. టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రిగా ఎన్టీఆర్‌ను అల్లుడి హోదాలో అర్ధంతరంగా వెన్ను పోటు పొడిచి వదిలించుకున్న ‘దశమగ్రహం’గా బాబు రాష్ట్ర ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడానికి అనుసరించని కుట్ర లేదు. 

అయినా చరిత్రలో పరిపాలనకు దీటైన రాజధానిగా కాకుండా గతించిన రాజుల రాజ్య విస్తరణలో భాగంగా అమరావతి కేవలం తాత్కాలిక రాజధానిగానే ఉంటూ వచ్చింది. ఎందుకంటే ఆదినుంచీ అమరావతి ఆలయాలకు, దేవాలయాలకు కేంద్రంగానే ఉందిగానీ వ్యూహరీత్యా పకడ్బందీ పరిపాలనా కేంద్రంగా ఏనాడూ వర్ధిల్లలేదు. భారత తూర్పు కోస్తాకు దాదాపు 400 ఏళ్లపాటు ఏలికలుగా ఉన్న శాతవాహనులకు సహితం బందరు రేవుపట్నం 50–60 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున వర్తక, వాణిజ్యాల కోసం అమరావతి తాత్కా లిక రాజధానిగా కొన్నాళ్లుంది. అయితే శాతవాహనుల రాజధానులు తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్రల మధ్య వివిధ ప్రాంతాలను అను సరించి ప్రతిష్ఠాన్‌ (పైథాన్‌), ధరణికోట, జున్నార్‌ రాజధానులుగా ఉన్నాయి. శాతవాహన కాలంలో అమరావతి పేరు ధరణికోట. కృష్ణానది కరకట్టల ప్రాంతమైన అమరావతిని ఒక ‘రాజధాని’గా ప్రకటించుకుని నామకరణం చేసినవాడు 1790లలో రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడైన జమీందారు. క్రీ.పూ. 2వ శతాబ్ది, క్రీ.శ. 3వ శతాబ్దుల్లో అమరావతి స్థూప నిర్మాణం జరిగి చారిత్రక ప్రదేశంగా మాత్రమే ఉండిపోయింది గానీ పాలనా రాజధానిగా స్థిరత్వాన్ని పొందలేకపోయింది.

ఒక ప్రాచీన సంస్కృతీ వారసత్వానికి ఆల  యాలకు, దేవాలయాలకు కేంద్రమైన అమరావతి ఏ పాలకుడికీ శాశ్వత రాజధానిగా స్థిరపడ లేకపోయింది. శాతవాహనులకైనా తెలంగాణాలోని కోటి లింగాల తరువాత బందరు రేవుకు కొలది దూరంగా ఉన్నందువల్ల వర్తక వాణిజ్యాలకు దగ్గరగా ఉంటుందన్న భావనతో అమరావతి కొన్నాళ్లపాటు రెండవ రాజధానిగా ఉంది. అమరావతి, నాగార్జున కొండల్లో భారీ బౌద్ధ స్థూపాల నిర్మాణమే కాదు, గోలి, జగ్గయ్యపేట, ఘంటశాల, భట్టిప్రోలు, పర్వతం వగైరా బౌద్ధ స్థూప కేంద్రాలూ వెలిశాయి. కనుకనే కృష్ణదేవరాయలు (16వ శతాబ్ది) అమరావతిని సందర్శించాడు. అమరావతి ప్రధానంగా పాలనా కేంద్రంగా కంటే ఆలయ, దేవాలయ సంప్రదాయాలకు ప్రసిద్ధమైనందుననే వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు (అమరావతి), మల్రాజు (నరసరావుపేట), మాణిక్యరావు (రేపల్లె), మానూరు (చిల కలూరిపేట), సత్తెనపల్లికి చెందిన జమీందారులు వివిధ స్వప్రయో జనాలతో అమరావతిని ఆశ్రయించారు. 

ప్రధానంగా అమరావతి బౌద్ధ క్షేత్రం కావడంవల్లనే వాస్తు శిల్పకళా చరిత్రలోనేగాక విశ్వకళేతిహాసంలో కూడా ఖ్యాతి వహించిన ఒక ప్రాచీన కళాక్షేత్రం అయింది. అశోకుడి తొలి శాసనం ఇక్కడనే ప్రతిష్టించాడు. అలాగే క్రీ.శ. ఏడవ శతాబ్దిలో ప్రసిద్ధ చైనా యాత్రి కుడు హ్యూయాన్‌సాంగ్‌ అమరావతిని సందర్శించి, ఇక్కడ బౌద్ధ చైత్యాలతోపాటు అమరేశ్వర దేవాలయం లాంటి దేవాలయాలు కూడా విలసిల్లాయని రాశాడు. అంతేగాదు, అమరేశ్వరాలయం ఏర్పడే నాటికి అమరావతి పేరు లేదనీ, ఆంధ్రదేశంలోని పంచా రామాలలో ‘అమరారామ’ పేరిట తొలి ఆలయం వెలసినట్టు శైవుల భావన. అంతేగాదు, ‘కోట’ వంశీయులు ఇచ్చిన శాసనాల్లో ధాన్య కటకం, ధాన్య వాటి పదాలలో ఏదో ఒకటి మాత్రమే వినపడుతూం డేదికాని ‘అమరావతి’ పేరు లేదని ప్రసిద్ధ చరిత్రకారులలో ఒకరైన చీమకుర్తి శేషగిరిరావు పేర్కొన్నాడు. శాతవాహనుల కాలంలోనే తొలి సంస్కృత శాసనం అమరావతిలో లభించిందంటారు. ఆ తర్వాత ఇక్ష్వాకులు, పల్లవులు, సాలంకాయనులు ఏలికలుగా ఉన్నారు. 

మన దేశంలోనూ, విదేశాల్లోనూ 15–16 దేశాల్లో పరిపాలనా సౌలభ్యం కోసం వికేంద్రీకరణలో ప్రాంతీయ అసమానతల పరిష్కా రంలో భాగంగా రెండేసి, మూడేసి రాజధాని నగరాలు ప్రజల సౌలభ్యం కోసం వెలి సాయని మరవరాదు. ఆమాటకొస్తే విష్ణుకుండి నులకు వేములవాడ, నాగార్జునకొండ ప్రాంతం కూడా రాజధాను లుగా ఉన్నాయని మరచి పోరాదు. చివరికి, కాలక్రమంలో పాలకుల అశ్రద్ధవల్ల ఏ మచిలీ పట్నం (బందరు) ఓడరేవు అనంతర కాలంలో చైతన్యం కోల్పోయిందో ఆ రేవునే వినియోగించుకుని శాతవాహ నులు అమరావతి తాత్కాలిక రాజధానిగా ఉన్నంతలోనే వర్తక, వాణి జ్యాలు సజావుగా సాగించిన దాఖలాలు చరిత్రకు తెలుసు. కానీ అనంతర కాలంలో 19వ శతాబ్ది ఆఖరి దశలోనూ, 20వ శతాబ్ది చివరిదశలోనూ వేలాదిమందిని నిమిషాలలోనే బందరు, దివిసీమ రాక్షస ఉప్పెనలు మింగేశాయని మరచిపోరాదు. అలాగే అమరావతి కరకట్టలను భీకరంగా తట్టి అపార ప్రాణనష్టానికి కారణమైన ఆ పెను ఉప్పెనలకు సాటిగా దరిదాపుల్లోకి ఇటీవల అమరావతి ప్రాంతాలను భయభ్రాంతులకు గురి చేయడం ప్రజల అనుభవం.

అందుకే విభజన సమయంలో కేంద్రం నియమించిన అత్యున్నత స్థాయి నిపుణుల కమిటీని శివరామ కృష్ణన్‌ అధ్యక్షతన నియమించగా నూతన రాజధాని నిర్మాణంలో తీసుకోవలసిన అని వార్యమైన జాగ్రత్తలను కూలంకషంగా పరిశీలించి ప్రయోజనకర మైన ప్రత్యామ్నాయాలను సిఫారసు చేస్తే, ఆ కమిటీ నివేదికను కనీసం అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండానే చంద్రబాబు తిరస్కరించారు. దాని స్థానే ప్రయివేటు కళాశాలల అధిపతి, రాజధాని నిర్మాణ ప్రక్రి యలో అనుభవ శూన్యుడు, లాభాల వేటలో భాగంగా కళాశాలలు స్థాపించి, విద్యార్థులను దోచుకుతినడం మరిగిన ఒక విద్యావ్యాపారి నివేదిక ఆసరాగా బాబు బినామీ భూకబ్జా దారుల ద్వారా అమ రావతి పేదసాదల భూములకు పంటల విధ్వంసానికి ఏతామెత్తి కూర్చు న్నారు. తన వల్ల అమరావతి భూములపై కన్నేసి లబ్ధి పొందిన మోతుబరులకు ప్రయోజనం కల్పించి, బలవంతపు ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా పేదరైతుల, వ్యవసాయ కార్మికుల ఉసురు తీశాడు బాబు.

అందుకు ఇప్పుడు ఎదురుబొంకుగా మోతుబరుల ఉద్య మాన్ని లేపాడు. బహుశా మూడు.. నాలుగు పంటలు పండే భూము ల్లోని పంటను అర్థరాత్రి తగలబెట్టించి పేదలపై ఎదురుకేసులు పెట్టి హింసించిన ఈ శతాబ్ది పాలకులు తెలుగుదేశం పార్టీవారే. ఆఖరికి విదూషకుడి ఆత్మహత్యతోనే కథ సుఖాంతమవుతుందేమో వేచి చూడాలి. అమరావతి మాత్రం ఎక్కడికీ పోదు. ఒక రాజధానిగా ఉంటుంది. అది ఆధారంగా దాని అభ్యుదయమూ కొనసాగుతుంది. ఇతర ప్రాంతాల బాగోగులూ తనవిగానే భావించుకుంటుంది.

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు

మరిన్ని వార్తలు