నికార్సయిన చట్టం ‘దిశ’

18 Dec, 2019 00:17 IST|Sakshi

రెండో మాట 

ఏళ్లూ పూళ్లూగా తీర్పులు వాయిదా పడుతూ పోవడం వల్ల అత్యాచార బాధిత కుటుంబాల ఆవేదన చల్లారదు. అందుకే తీర్పు ఆలస్యమైన కొద్దీ న్యాయం ఆలస్యమైనట్టే కాదు, న్యాయాన్నే బాధితులకు దూరం చేసినట్లుగా భావించాలని రాజ్యాంగమూ, న్యాయ వ్యవస్థ సూత్రాలు కూడా నిర్ద్వంద్వంగా చెప్పడమూ జరిగింది. కనుకనే ఆలస్యమైన న్యాయం అక్కరకు రాని న్యాయంగా భావించిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల దిశ దారుణ హత్యోదంతం పట్ల చలించి, దేశంలో అలాంటి ఘటనలు ఎక్కడా పునరావృతం కాకూడదని ప్రకటించారు. దానికి కొనసాగింపుగా అత్యాచార ఘటనల నివారణకు రెండు ప్రత్యేక బిల్లులను, కేంద్ర నేర నిరోధక చట్టాలకు రెండు సవరణ బిల్లులకు శాసనసభ ఆమోదం లభించింది.

రాజకీయాలకు, నైతిక సూత్రాలకు, నైతికతకూ ఎలాంటి పొత్తూ పొంతనా కుదరదన్నది ఇటాలియన్‌ చాణక్యుడు మాకియవెల్లీ సూత్రం! కానీ ఆ సూత్రీకరణ అబద్ధమనీ, నైతిక సూత్రాలకు, నైతి కతకు బద్ధమై దేశ దిశాగతిని నిర్ణయించి ఆచరించే రాజకీయమే సిసలైన రాజకీయం. అలాంటి పాలకుడే నిజమైన ప్రజాసేవకుడని  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిరూపించారు. ప్రజా బాహుళ్యాన్ని వేధిస్తున్న అనేక సమస్యల సత్వర పరిష్కారం కోసం ఆగమేఘాలపై తీసుకుంటున్న నిర్ణయాలు, వాటిని ఆచరిస్తున్న తీరు ఇందుకు నిదర్శనం. దేశంలో రాజ్యాంగ బద్ధత పేరిట గడచిన డెబ్భైఏళ్లలో వివిధ ప్రభుత్వాలు క్రిమినల్, పౌర సమస్యలపై రకరకాల చట్టాలు తీసుకొచ్చాయి. వాటికి విలువైన భాష్యాలను సుప్రీంకోర్టు పొందుపర్చి, అమలుకు సిద్ధం కావడమూ మనకు తెలుసు.

కానీ పెక్కు సందర్భాల్లో నాటి పెట్టుబడి దోపిడీ వ్యవస్థలో వివిధ స్థాయిల్లో అధికార పీఠాలు అలంకరించిన రాజకీయ పాలక శక్తులు తమ లేదా తమ అనుయాయుల, వందిమాగధుల స్వార్థపూ రిత ప్రయోజనాల దృష్ట్యా వేలు, లక్షలాది మంది బాధిత కుటుం బాలకు న్యాయం అనేది పెక్కు సందర్భాలలో ఆలస్యం కావడమో లేదా దూరం కావడమో జరుగుతోంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి బాబ్డే అన్యాయాలకు గురైనవారు, అత్యాచారాలకు, హత్య లకు బలైనవారి కుటుంబాలు సత్వర న్యాయాన్ని అప్పటికప్పుడు ఆశించలేరని న్యాయశాస్త్రపరిశీలనా పరిధుల దృష్ట్యా చెప్పి ఉండ వచ్చు. కానీ ఏళ్లూ పూళ్లూగా తీర్పులు వాయిదా పడుతూ పోవడం వల్ల బాధిత కుటుంబాల ఆవేదన చల్లారదు. అందుకే రాజ్యంగమూ, న్యాయ వ్యవస్థ సూత్రాలు కూడా తీర్పు ఆలస్యమైన కొద్దీ న్యాయం ఆలస్యమైనట్టే కాదు, న్యాయాన్నే బాధితులకు దూరం చేసినట్లుగా భావించాలని నిర్ద్వంద్వంగా చెప్పడమూ జరిగింది.

అందుకే అత్యు న్నత న్యాయసూత్రాలు ఆధారంగా నిర్దేశించిన ఆలస్యమైన న్యాయం అక్కరకు రాని న్యాయంగా భావించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇటీవల దిశ దారుణ హత్యోదంతంపట్ల చలించి,  ఇలాంటి ఘటనలు ఇకమీదట ఎక్కడా పునరావృతం కాకూడదని సంకల్పించారు. ఆ వెంటనే ఏపీ శాసనసభ ఆమోదానికి అత్యాచార ఘటనల నివారణకు రెండు ప్రత్యేక బిల్లులను ప్రవేశపెట్టారు. అలాగే కేంద్ర నేర నిరోధక చట్టాలకు రెండు సవరణ బిల్లులను చట్టాలుగా ప్రవేశపెట్టి ఆమోదించాల్సి వచ్చింది.ఈ బిల్లులకు దేశవ్యాపితంగా మద్దతు రావడానికి కారణం శిక్షా కాల పరిమితిని బాగా తగ్గించి, బాధితులకు తక్షణ న్యాయం  సకాలంలో దక్కేలా చూడటం, అత్యాచారాలకు తలపడే వారిని నిరోధించగల న్యాయ యంత్రాంగాన్ని, పోలీసు యంత్రాంగాన్ని జిల్లా స్థాయి వరకు ఏర్పాటు చేసి సత్వర శిక్షలకు రంగాన్ని సిద్ధం చేయడం. ఇప్పటికే ఢిల్లీ, ఒడిశా ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్‌ చొరవను హర్షించాయి.

తెలంగాణలో దిశ హత్యోదంతం తర్వాత ఏపీతో సహా ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఘటనలు కొనసాగడంవల్ల దిశ చట్టానికి ప్రాంతీయ హద్దులు చెరిగిపోయాయి. ఈ విస్తృతికి ప్రధాన కారణం.. దిశ ఘటనకు ఏమాత్రం తీసిపోని ‘నిర్భయ’ దారుణో దంతం 2012లో జరిగి నేటికి ఏడేళ్లయినా.. విచారణ ముగిసి, మరణ శిక్షలు పడినా, ఈరోజుదాకా కోర్టు తీర్పు ఆచరణలో అమలులోకి రాకపోవడమే. కాగా, ఆంధ్రప్రదేశ్‌ తాజా చట్టం మహిళలు, చిన్నా రులపట్ల వేధింపులు, అత్యాచార ఘటనలను తక్షణం పరిగణనలోకి తీసుకుని, అంత వేగంగానూ వాటిని విచారించి, శిక్షలు విధించేం దుకు ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు జిల్లా స్థాయిలో ఎక్కడి కక్కడ తక్షణం ఏర్పాటు చేసి న్యాయం చేకూర్చడం ఆంధ్రప్రదేశ్‌ నూతన చట్టం ప్రత్యేకత. 

అయితే ఈ ప్రక్రియ అంతా రాజ్యాంగంలోని 21వ అధికరణ ప్రకారమే జరిగిందా అన్న ప్రశ్నకు ఆ అధికరణలో సమాధానం ఉంది: ‘ఏ పౌరుడిని జీవించే హక్కుకు, వ్యక్తిగత స్వేచ్ఛకు దూరం చేయకూడదు’ అని ఆ అధికరణం చెబుతున్నా ఆ వెంటనే అదే అధిక రణలో ‘చట్టం నిర్దేశించిన విధి విధానాలకు లోబడి మాత్రమే’ అని కూడా ఉన్నందున, జగన్‌ ప్రభుత్వం ఆ గేటు దాటకుండానే దేశ దిశా గతికి త్వరితగతిన ‘దిశ చట్టం’ రూపొందించింది. అలాగని ఆంధ్ర ప్రదేశ్‌ చట్టం, వలస పాలనావశేషంగా మిగిలిపోయిన చట్టబద్ధ విచారణతో నిమిత్తం లేకుండా పోలీసులు జరిపే బూటకపు ఎన్‌ కౌంటర్ల (ఫేక్‌)ను మాత్రం అనుమతించదు. ఎందుకంటే, ‘ప్రకాష్‌ కడం వర్సెస్‌ రాంప్రసాద్‌ విశ్వనాథ్‌ గుప్తా’ కేసులో సుప్రీంకోర్టు ‘ఎదురు కాల్పుల్లో చనిపోయారన్న పేరిట పోలీసులు జరిపే బూట కపు ఎన్‌కౌంటర్లు పచ్చి హత్యలు తప్ప మరొకటి కావ’ని అలాంటి బూటకపు హత్యలకు పాల్పడే పోలీసులకు మరణశిక్షలు విధించాలని, అలాంటి వాటిని ‘అసాధారణ కేసులలో అతి అసాధారణం’గా పేర్కొనాలని తీర్పు చెప్పింది.

అంతేగాదు, గతంలో అలహాబాద్‌ హైకోర్టు విశిష్ట న్యాయమూర్తిగా పేరొందిన జస్టిస్‌ ఎ.ఎన్‌.ముల్లా భారతదేశంలోని పోలీసులంత అరాచక శక్తులు, నేరస్తులు మరెవరూ ఉండరని చెప్పారు. ఆ మాటకొస్తే హైదరాబాద్‌లో ‘దిశ ఘోర హత్యా ఘటన’ సందర్భంలో కూడా నలుగురు నిందితులను విచారణకు పంపకుండా పోలీసు కస్టడీలో ఉన్న నిందితుల్ని హతమార్చడం కూడా ‘ఫేక్‌ ఎన్‌కౌంటర్‌’గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ మార్కండేయ కట్జూ భావించారు (8.12.2019). అంతేగాదు, వ్యవస్థ ఇంత అధ్వానమైన దశకు చేరుకోవడానికి కారణం ఇటు పోలీసు శాఖల్లోనూ, అటు న్యాయ వ్యవస్థలోనూ తగినంత సిబ్బంది లేకపోవడమేనని ఇదే అనేక అరాచకాలకు కారణమవుతోందని ‘ఇండియా జస్టిస్‌ రిపోర్ట్‌’ (2019) తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. 

ఇక నేర న్యాయ వ్యవస్థపై వెచ్చించే బడ్జెట్‌ కేటాయింపులు హీనాతిహీనం. ఉదాహరణకు 2017 దాకా పోలీసింగ్‌ నిర్వహణకు అఖిల భారత స్థాయిలో తలసరి వెచ్చిస్తున్న ఖర్చు కేవలం రూ. 820. సరిగ్గా ఈ అస్తు బిస్తు పరిస్థితుల్లోనే నేర న్యాయ వ్యవస్థ క్రమంగా పోలీసు న్యాయ వ్యవస్థగా దిగజారుతోందని ‘సెంటర్‌ ఫర్‌ క్రిమి నాలజీ అండ్‌ జస్టిస్‌’ సంస్థకు చెందిన ‘ప్రయాస్‌’ ప్రాజెక్టు డైరెక్టర్‌ అయిన డాక్టర్‌ విజయ రాఘవన్‌ అభిప్రాయపడుతున్నారు. ఈ దారుణ పరిస్థితుల మధ్యనే.. దూసుకువచ్చిన జగన్‌ ప్రభుత్వ ‘దిశ చట్టం’ ‘నిర్భయ’ కేసు నిందితులపై శిక్ష ఖరారై అమలు జరపడంలో ఏడేళ్ల తర్వాతనైనా ఇప్పటికి సుప్రీంకోర్టు, ప్రభుత్వమూ వెంటనే కదలబారడానికి కారణమైందని మరవరాదు. అంతేగాదు, ఉత్తర ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో జరిగిన యువతి దారుణ లైంగిక హత్యోదంతంలో కూడా బీజేపీ ఎమ్మెల్యేకి శిక్ష ఆగమేఘాలపై ఖరారు కావడానికి కూడా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ‘దిశ చట్టమే’ ఉద్దీపన శక్తిగా దివిటీ పట్టింది.

ఈ సందర్భంగా మన వ్యవస్థలో ఉన్న మౌలిక సత్యాలను విజయ రాఘవన్‌ దాచుకోకుండా ఇలా వ్యక్తం చేశారు: ‘‘రానురానూ మన దేశంలోని సామాజిక వ్యవస్థా చట్రం కనుసన్నల్లో సామాన్య ప్రజలు సమాజంలో వర్గ, కుల, స్త్రీ పురుష వివక్ష, అసమానతల కారణంగా కునారిల్లిపోతున్నారు. ఇలా మన స్త్రీ–పురుషుల మధ్య వివక్ష చూపుతూ అసమ దృష్టితో వ్యవహరించినంత కాలం, స్త్రీలను భౌతికంగా కేవలం లైంగిక దృష్టితో చూసి, వేధించి వివక్షతో జరిపే హింసాకాండ ఒక అంటురోగంగా మనల్ని పీడిస్తూనే ఉంటుంది. కుల, వర్గ, అసమానతలు గొడ్డలి పెట్టుగా మారినందున హింసా ప్రవృత్తి మరింత పాశవిక రూపం దాల్చుతుంది. ఈ బెడదను తప్పించుకోవాలంటే శాశ్వత పరిష్కారంగా మరింత ఆదర్శవంత మైన సమ సమాజ వ్యవస్థను నిర్మించుకోగల సామాజిక సమీకరణ వైపుగా దృష్టి పెట్టాలి’’ అని హితవు పలుకుతున్నారు. అందుకే, అలాంటి ఉత్తమ సమాజ వ్యవస్థావతరణ వైపుగా పరిపూర్ణ బ్రతు కిచ్చే దిశగా కవి కుమారుడు సరికొత్త గీతా రచనను ఉద్దీపనగా అందించాడు:
‘‘ఓ! కూలీ, మాలీ, రైతూ
గుడిసెలలో బతికేవాడా
గంజినీళ్లతోనే కాలం గడిపేవాడా
ఆకలికన్నూ! మానవుడా,
తిరగబడేవాడా, ప్రశ్నించేవాడా
అన్యాయాలకు ఆహుతి కావడానికైనా జంకనివాడా
ఖైదీ, రౌడీ, ఖూనీకోర్, బేబీ– మానవుడా, ఓ మానవుడా!’’

వాడే! వాడే! ఆ ‘జగన్నా’ధ రథచక్రాల కోసం ఎదురుచూస్తున్న మానవుడు!!

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు

abkprasad2006@yahoo.co.in

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా