భిన్నాభిప్రాయమే ప్రాణప్రదం

4 Oct, 2018 00:39 IST|Sakshi

రెండో మాట 

హక్కుల నేతలపై కేసులో సాక్ష్యం కరువైన సందర్భాలకు, కల్పిత ఉత్తరాలకు కొట్టొచ్చినట్టు కనిపించే ఉదాహరణ–మహారాష్ట్రతో సంబంధం లేని సుధా భరద్వాజ్‌కు మరాఠీ భాష వచ్చని భావించిన వేగులవాళ్లు మరాఠీలో ఆమె రాసిన ఒక లేఖ దొరికినట్టు అందమైన కట్టుకథ అల్లడం. అంతేగాదు, పోలీసు విచారణలో పాలుపంచుకున్న ఇద్దరు సాక్షులు కూడా పుణే మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఉద్యోగులని తేలింది. అందుకే న్యాయ ప్రయోజనాల దృష్ట్యా, ముఖ్యంగా విచారణకు సంబంధించి తీవ్ర అనుమానాలు తలెత్తినప్పుడు.. ప్రత్యేక విచారణ బృందం లేదా ప్రత్యేక దర్యాప్తు సంస్థ ఉండాల్సిందేనని జస్టిస్‌ చంద్రచూడ్‌ తన భిన్నాభిప్రాయ ప్రకటనలో స్పష్టంచేశారు.

‘భీమా–కోరేగావ్‌ హింసాత్మక ఘటనలకు సంబంధించి ఆగస్ట్‌ 28న మహారాష్ట్ర ప్రభుత్వం జరిపిన పోలీసు దాడుల సందర్భంగా ఐదు  గురు పౌరహక్కుల సామాజిక కార్యకర్తలను అరెస్టు చేసి పెట్టిన కేసు, కావాలని పెట్టిన కేసని తేలిన పక్షంలో ప్రత్యేక విచారణ బృందాన్ని (సిట్‌) సుప్రీంకోర్టు నియమించి విచారణ జరుపుతుంది.’
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా (17–9–18)

‘భీమా–కోరేగావ్‌ (మహారాష్ట్ర) కేసును విచారించాల్సింది మహారాష్ట్ర పోలీసులు కాదు, కేవలం ప్రత్యేక దర్యాప్తు సంస్థ అయిన ‘సిట్‌’ మాత్రమే. ఈ కేసులో మహారాష్ట్ర పోలీసులు నిష్పాక్షిక విచారణ జరిపారా అన్న విషయంలో మా దృష్టికి వచ్చిన పరిస్థితులు అనుమానా నికి దారితీస్తున్నాయి. కానీ, జడ్జీలతో కూడిన సుప్రీం బెంచ్‌ ప్రత్యేక సిట్‌తో కేసు దర్యాప్తు జరిపించడానికి ప్రధాన న్యాయమూర్తి సహా ఇద్దరు జడ్జీలు వ్యతిరేకించగా నేను మాత్రం మెజారిటీ తీర్పుతో ఏకీభవించ కుండా నా భిన్నాభిప్రాయం స్పష్టం చేయదలిచాను.’
 – సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ భిన్నాభిప్రాయ ప్రకటన

మహారాష్ట్ర ప్రభుత్వం ఆ కేసులో అరెస్ట్‌ చేసిన ఐదుగురు పౌరహక్కుల కార్యకర్తలు సుధా భరద్వాజ్, వర్నన్‌ గాన్‌జాల్వెజ్, అరుణ్‌ ఫెరీరా, వరవరరావు, గౌతమ్‌ నవలఖా, మాజా దారూవాలా. ఈ కేసులో గమ్మత్తేమంటే అరెస్టయిన కార్యకర్తల్ని రెండు సార్లు గృహనిర్బంధం వరకే ఆదేశించిన సుప్రీంకోర్టు ఆఖరికి సిట్‌ విచారణకు నిరాకరించి, ట్రయల్‌ కోర్టుకు పోయి అడగాలని చెప్పడం! అదే సమయంలో సిట్‌ విచారణకు అనుమతించని మెజారిటీ తీర్పు సామాజిక కార్యకర్తలను క్రిమినల్స్‌గా భావించరాదని అస్పష్టంగానైనా చెప్పగలగడం! ఈ మెజా రిటీ తీర్పుతో అదే బెంచ్‌లోని మూడో జడ్జి డీవై చంద్రచూడ్‌ విభేదిస్తూ భిన్నాభిప్రాయాన్ని స్పష్టంగా ప్రకటించారు. ‘భిన్నాభిప్రాయం ప్రజా స్వామ్యానికి ప్రాణం’ అని ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా కూడా ప్రకటించారు. జస్టిస్‌ చంద్రచూడ్‌ తన భిన్నాభిప్రాయ ప్రకటనలో, ‘‘ఏవో ఊహాగానాల మీద ఆధారపడి పౌర స్వేచ్ఛను బలిచేయడానికి వీల్లేదు. సత్యాన్ని తారుమారు చేయడానికి పోలీసులు స్వేచ్ఛగా వ్యవ హరిస్తున్నారు. ఇందుకు సామాజిక కార్యకర్తల గౌరవ ప్రతిష్టలను అవమానిస్తున్నారు,’’ అని చెప్పారు. 

అలాంటి పరిస్థితుల్లో స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా సమస్యను విచారించడానికి పోలీసులకున్న  శక్తి అనుమానించదగినదని ప్రసిద్ధ చరిత్రకారులు, ఆర్థికవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు, మానవ హక్కుల కార్యకర్తలైన రొమీలా థాపర్, ప్రభాత్‌ పట్నాయక్, దేవకీ జైన్, సతీశ్‌ దేశ్‌పాండే తరఫున రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసిన ప్రముఖ లాయర్‌ బృందా గ్రోవర్‌ ప్రకటించారు. రెండొందల ఏళ్ల క్రితం బ్రిటిష్‌ ఈస్టిండియా కంపెనీ రాజ్యవిస్తరణలో భాగంగా పుణే సమీపంలో యుద్ధానికి కారణమైంది. ఇక్కడ జరిగిన పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ భీమా–కోరేగావ్‌లో సభ నిర్వహించారు. ఈ సభ సుప్రీం రిటైర్డ్‌ జడ్జి పీబీ సావంత్, బొంబాయి హైకోర్టు మాజీ జడ్జి బీజీ కోల్సే పాటిల్‌ ఆధ్వర్యంలో జరిగిందన్న సంగతి మరచి పోరాదు. కోరేగావ్‌ ఘటనతో సంబంధం లేని ఇతర రాష్ట్రాలకు చెందిన ఐదుగురు పౌరహక్కుల నేతలను అరెసు ్టచేయడం ఎంత వరకు సబబని అనేక మంది లాయర్లు, మాజీ జడ్జీలు ప్రశ్నిస్తున్నారు.

కట్టుకథల ప్రచారం!
దేశ ప్రధానిని హత్య చేయడానికి పన్నిన కుట్ర ఫలితంగా ఈ అరెస్టులు జరిగినట్టు అల్లిన కట్టుకథలు పోలీసుల ద్వారానే వ్యాప్తికావడం దేశ ప్రజలు ఎంత మాత్రం సహించలేని పరిణామం. విచిత్రమేమంటే, అరెస్టయిన ఈ ఐదుగురు పౌరహక్కుల నాయకుల విషయమై విచారణ జరిగినట్టే ఇంత వరకూ తెలియకపోవడం. అంతేకాదు, ఓ వ్యక్తిని అరెస్టు చేస్తున్నప్పుడు ఒక స్వతంత్రుడైన వ్యక్తి సాక్ష్యం తప్పని సరి అని కూడా సీఆర్‌పీసీ 41–బీ సెక్షన్‌ స్పష్టం చేస్తోందని న్యాయనిపుణులు చెబు తున్నారు. సాక్ష్యం కరువైన సందర్భాలకు, కల్పిత ఉత్తరాలకు కొట్టొ చ్చినట్టు కనిపించే ఉదాహరణ–మహారాష్ట్రకు సంబంధం లేని సుధా భరద్వాజ్‌కు మరాఠీ భాష వచ్చని భావించిన వేగులవాళ్లు మరాఠీలో ఆమె రాసిన ఒక లేఖ దొరికినట్టు అందమైన కట్టుకథ అల్లడం. అంతే గాదు, పోలీసు విచారణలో పాలుపంచుకున్న ఇద్దరు సాక్షులు కూడా పుణే మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఉద్యోగులని, వారు సామాజిక కార్యకర్తలను అరెస్ట్‌ చేసిన పోలీసు బృందంలో సభ్యులుగానే ప్రయాణం చేశారని కూడా తేలింది.

అందుకే న్యాయ ప్రయోజనాల దృష్ట్యా, ముఖ్యంగా విచారణపై తీవ్ర అనుమానాలు తలెత్తినప్పుడు–సదరు న్యాయానికి వ్యతిరేకంగా రాజీపడకుండా ఉండాలంటే ప్రత్యేక విచారణ బృందం లేదా  దర్యాప్తు సంస్థ ఉండాల్సిందేనని జస్టిస్‌ చంద్రచూడ్‌ తన భిన్నాభిప్రాయ ప్రకటనలో స్పష్టంచేశారు.పైగా, ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా(పిల్‌) కోర్టు ముందుకొచ్చిన ప్రస్తుత కేసు దాఖలు చేసిన పిటిషనర్లు అనామకులు కాదని గుర్తించాలని చంద్రచూడ్‌ పేర్కొ నాల్సివచ్చింది. ఏదో స్వలాభం ఆశించో లేదా రాజకీయ ప్రయోజనాల దృష్ట్యానో పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారన్న వాదన కూడా ఇక్కడ నిలవదని ఆయన చెప్పారు. పైగా, మానవహక్కుల్ని వ్యక్తి హుందాతనాన్ని దెబ్బతీయడమేనని, అందుకు చెల్లించే పరిహారం కూడా ఎందుకూ పనికిరాదనీ, ఆ లోటును పూడ్చలేదనీ జస్టిస్‌ చంద్రచూడ్‌ తన భిన్నాభిప్రాయంలో వివరించారు. అందుకే కూలంకషంగా ఈ కేసులో విచారణను కాదనకుండానే, ప్రత్యేక దర్యాప్తుæబృదం(సిట్‌) నియామ కానికి ఈ కేసు తగినదని జస్టిస్‌ చంద్రచూడ్‌ నిర్ధారించవలసి వచ్చింది. 

న్యాయవ్యవస్థ వెనుకంజ ఎందుకు?
ఇక్కడో సత్యాన్ని దాచగూడదు. నేరమయ రాజకీయాల్ని నిరోధించ డానికి పార్లమెంటే ప్రత్యేక చట్టం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇంతటి బాధ్యతను కేంద్ర చట్టసభలకే సర్వోన్నత న్యాయస్థానం అప్ప గించాల్సిన పరిస్థితి వచ్చింది. 125 కోట్ల భారత ప్రజానీకానికి ప్రాతినిధ్యం వహించే పార్లమెంటు.. సుప్రీంకోర్టు చెప్పినట్టు ఈ విష యంలో తగిన చొరవ తీసుకుంటుందా? ప్రజాబాహుళ్యం ఆకాంక్షలకు అనుగుణంగా అవినీతి రహిత గణతంత్ర రాజ్యం మనుగడను భారత పార్లమెంటు తీర్చిదిద్దగలుగుతుందా? అనే ప్రశ్నలకు జవాబులు అవ సరం. వందలాది మంది పార్లమెంటు, అసెంబ్లీల సభ్యులు సివిల్, క్రిమి నల్‌ నేరాల్లో పాల్గొని శిక్షలు పడకుండా తప్పించుకుంటున్నారు. ఇంత వరకూ దేశ ప్రజలు పొరపాటుగానో గ్రహపాటుగానో ఆశలు పెట్టుకున్న ప్రజాస్వామిక వ్యవస్థలు కూడా క్రమంగా కునారిల్లిపోతున్నాయి. ఈ తరుణంలో దింపుడు కళ్లం ఆశగా వారికి మిగిలిన ఆఖరి వ్యవస్థ అయిన న్యాయ వ్యవస్థ కూడా ఏమీ చేయలేకపోతోంది.

పాలకులను, శాసన వేది కలను నియంత్రించగల శక్తి ఉన్నా ఆచరణలో అది నిర్వీర్యమౌతూనే ఉందని ప్రజలు భావిస్తున్నారు. సెక్యులర్‌ రాజ్యాంగం కల్పించిన ఎన్నో అవకాశాలకు, రక్షణలకు విలువ లేకుండా చేస్తూ అన్ని రాజకీయపక్షాల నేతలూ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. చట్టాలకు స్వతంత్ర భాష్యం ద్వారా శాసన వేదికలకు దిశానిర్దేశం చేసే అవకాశం, అధికారం న్యాయ వ్యవస్థకు ఉన్నాయి. ఈ ఆంశంలో న్యాయ వ్యవస్థ క్రియాశీలకంగా వ్యవ హరించాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. చివరికి ఎన్నికల కమిషన్‌ సహా అన్ని రాజ్యాంగ సంస్థలను సకాలంలో రక్షించుకోవాలి. రాజ్యాం గం ఆశించిన విధంగా దేశ ఆర్థిక, సామాజిక రంగాల్లో దళిత, పేద, మధ్య తరగతి ప్రజాబాహుళ్యం ప్రయోజనాలు  కాపాడలేకపోతే, వాటికి పరిపూర్ణ రక్షణ లేకపోతే రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ హెచ్చ రించినట్టు జరిగే ప్రమాదం ఉంది. ‘‘ఆర్థిక, సామాజిక జీవనంలో సమా నత్వం లేకుండా ఎన్నాళ్లు ఇలా ముందుకు ప్రయాణిస్తాం? దీర్ఘకాలం పాటు సమానత్వం లేకుండా ఇదే పరిస్థితి కొనసాగితే మన రాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో పడుతుంది. ఈ వైరుధ్యాన్ని వీలైనంత త్వరగా మనం తొలగించక పోతే–అసమానత్వం వల్ల బాధపడే జనం రాజ్యాంగ పరిషత్తు కష్టపడి నిర్మించిన రాజకీయ ప్రజాతంత్ర వ్యవస్థను కూల్చివేస్తారు,’’ అని 1949 నవంబర్‌ 25న రాజ్యాంగ సభలో చేసిన ప్రసంగం చివరిలో అంబేడ్కర్‌ హెచ్చరించారు. 

ఈ సామాజిక వైరుధ్యాలను గమనించి మనం మెలగాలి. గుణ పాఠాలు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రజల త్యాగాల నుంచి, అపారమైన అనుభవాల నుంచి, జీవిక రక్షణలో నిరంతర వేదన నుంచి, పోరాటాల నుంచీ వస్తాయి. గాంధీజీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగానైనా సామాజిక వైరుధ్యాలను తొలగించాలనే స్పృహ పెరగాలి. ప్రపంచం నలు మూలల నుంచీ వీచే మంచి గాలినే కాదు, భావనా స్రవంతిని కూడా నిత్యం ఆహ్వానించుకుందామన్న పూర్వ వైదిక సూక్తిని గుర్తు చేసుకుందాం. నిజమైన దేశ భక్తుడు అనుక్షణం తన దేశాన్ని రక్షించుకునేందుకు, పాలకుల తప్పిదాలను ఎండగట్టేందుకు సిద్ధంగా ఉండాలన్న సూక్తిని మరచిపోరాదు. అందుకే, గతంలో సామ్రాజ్యవాదానికి, పెట్టుబడిదారీ విస్తరణవాదానికి బలి అవుతూ వస్తున్న ప్రజల త్యాగాలను గుర్తు చేసుకున్న ప్రసిద్ధ అమెరికన్‌ రచయిత డాక్టర్‌ డేవిడ్‌ గ్రిఫిన్‌ భావి తరాలను, వర్తమాన తరాలను హెచ్చరిస్తూ, ‘‘గతానుభవాలూ, త్యాగాలూ చచ్చిపోలేదు– నిద్రపోతున్న వాళ్లు తప్ప,’’ అన్న మాటలు ఎప్పుడూ గుర్తుండిపోవాలి.

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు 
abkprasad2006@ahoo.co.in

మరిన్ని వార్తలు