బాబు ‘ఫెడరల్‌ స్ఫూర్తి’ ఇదేనా?

20 Nov, 2018 00:43 IST|Sakshi

రెండో మాట

ఉన్నట్లుండి చంద్రబాబుకి ఫెడరల్‌ వ్యవస్థ రక్షణ ఎందుకు గుర్తుకొచ్చింది? నాలుగున్నరేళ్లుగా మోదీతో స్నేహాన్ని కాపాడుకుంటూనే, ప్రత్యేకహోదా కంటే రాష్ట్రానికి ‘ప్యాకేజీ మూట’ చాలునని చెప్పి ఏపీ ప్రయోజనాలను స్వార్థ రాజకీయానికి బలిచేసినంతకాలం బాబుకు ఫెడరల్‌ స్ఫూర్తి గుర్తుకు రాలేదు. తన పాలనలో అడ్డంగా బలిసిన బినామీ అక్రమ వ్యాపారులపై కేంద్ర నిఘా సంస్థల దాడి సూచనలు రాగానే చంద్రబాబుకు దేశ, సమాఖ్య రక్షణ గుర్తుకొచ్చేశాయి. అవినీతి కేసుల్లో రాష్ట్రాలకు ప్రత్యేక సార్వభౌమాధికారం ఉండదనేది అందుకే. ఈ క్రమంలో టీడీపీని సైతం రద్దుచేసినంత పని చేసి కాంగ్రెస్‌తో అంటకాగడానికి బాబు స్వచర్మ రక్షణే అసలు కారణం.
‘చంద్రబాబునాయుడి టీడీపీ ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అవినీతిలో నంబర్‌ వన్‌ స్థానంలో ఉంది, అభివృద్ధి పథంలో అట్టడుగు స్థానానికి చేరుకోబోతోంది. రాష్ట్రంలో 80 శాతం పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారు. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో వర్షపాతం 30 శాతం లోటు తేలింది. కోట్లాది రూపాయల విలువైన వ్యవసాయ పనిముట్లను ఈ ప్రభుత్వం దిగుమతి చేస్తోంది. కాగా మరోవైపున అమరావతిలో ప్రభుత్వ సచివాలయం పేరిట చదరపు అడుగుకు ఒక్కంటికి రూ. 11,000 చెల్లించింది, గత నాలుగేళ్లలోనూ ఒకే ఒక్క మీడియా (ప్రచురణ) సంస్థకు రూ. 700 కోట్ల ప్రజాధనాన్ని ధారాదత్తం చేసింది. రాష్ట్రంలోని 13 జిల్లాలనుంచీ తెచ్చి మేట వేసుకున్న సంపదను గుజరాత్, కర్నాటక, తెలంగాణా ఎన్నికలలో ఇప్పుడు ఖర్చు చేస్తోంది. ఇక పుష్కరాల పేరిట, ప్రత్యేక విమాన ప్రయాణాల కోసం, క్యాంపు ఆఫీసుల నిర్వహణ కోసం వేలాది కోట్ల రూపాయలు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తోంది’.
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్‌ కల్లామ్‌ ప్రకటన (18–11–2018)

చంద్రబాబు తన పాలనా నిర్వహణల భాగోతాన్ని కప్పిపెట్టుకోవడానికే భారత ఫెడరల్‌ (సమాఖ్య) వ్యవస్థ రక్షణ కోసమే కొత్తగా తాని ప్పుడు ఉద్యమిస్తున్నట్లు, ఆ భారాన్ని తన భుజస్కంధాలపై మోయవలసి వచ్చినందుకే కేంద్ర సీబీఐ లాంటి విచారణ సంస్థలూ, ఆదాయపన్ను నిఘా శాఖలూ ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించడానికి వీల్లేదని సరికొత్త ఉత్తర్వును (నం. 176: 08–11–2018) జారీ చేశారు. ఈ ఆకస్మిక ఉత్తర్వును జారీ చేయడానికి ఏ పరిస్థితులూ, కేంద్రంలో ఏ పరిణామాలు బాబును ప్రోద్బలపరిచి ఉంటాయి? మోదీ (బీజేపీ) ప్రభుత్వ అతి జోక్యం ఫలితంగా, అన్ని రాజ్యాంగ సంస్థల ఉనికిని దెబ్బతీసే చొరవ మూలంగా, కేంద్ర నేర నిఘా సంస్థల్లో కూడా చిచ్చుపెట్టడానికి చేసిన ప్రయత్నంవల్ల సీబీఐ ఉనికే ప్రశ్నార్థకంలో పడింది. ఈ నేపథ్యంలోనే ఇటు చంద్రబాబుకు అన్నివిధాలా అండదండలందిస్తున్న పలువురు పార్టీ నేతల బినామీ అక్రమ వ్యావార లావాదేవీల బండారం బయటపడి విచారణ సంస్థలు రాష్ట్రంలో శరవేగంతో దూసుకువచ్చి దాడులు నిర్వహిస్తున్న విషయం కూడా మరచిపోరాదు! ఈ దాడులు గనుక లేకపోతే లేదా నాలుగున్నరేళ్లుగా మోదీతో స్నేహాన్ని కాపాడుకుంటూనే, ప్రత్యేకహోదా మిషపైన రాష్ట్రానికి ‘ప్యాకేజీ మూట’ చాలునని చెప్పి రాష్ట్ర ప్రయోజనాలను కాస్తా తన స్వార్థ రాజకీయానికి బలిచేసిన బాబు మరికొన్నాళ్లపాటు బీజేపీతో చెట్టపట్టాలు కట్టేవాడేనని మరవరాదు.

ఈ రాజకీయ వ్యభిచారమే టీడీపీని చివరకు బాబు రద్దు చేసుకుని.. కాంగ్రెస్‌ నీడలో ఎదిగి, మధ్యలో మామ ఎన్టీఆర్‌ను నిలువునా ముంచేసి తిరిగి మళ్లీ కాంగ్రెస్‌తో చేతులు కలిపేలా చేసింది. బహుశా తెలుగుదేశం పార్టీని మరణశయ్య మీదికి బాబు చేర్చనున్న ఆఖరి దశ ఇది. ఎందుకంటే అటు కాంగ్రెస్‌ ఇటు బీజేపీ పాలకులు పాక్షిక ప్రయోజనాలతో రాజ్యాంగ నిబంధనలకు, రాజ్యాంగానికి క్రమంగా తిలోదకాలు ఇచ్చి అన్ని రాజ్యాంగ వ్యవస్థల స్వరూప స్వభావాలనే తమ స్వార్థ ప్రయోజనాలకు, ప్రతిపక్షాలపై దమనకాండకు వినియోగిస్తూ వచ్చిన దాని ఫలితంగానే, సీబీఐ తదితర ఆర్థిక నేరాల విచారణ సంస్థలు అంతంతమాత్రంగా ఉన్న తమ ఉనికిని దిగజార్చుకుంటున్నాయి.

ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా నాలుగేళ్లు కాపురం వెలగబెట్టిన చంద్రబాబుకు కూడా తన చాపకిందికి నీళ్లు పారేదాక సీబీఐతో అంటకాగినవాడే. పైగా ఎన్టీఆర్‌ను సీఎం పదవినుంచి కుట్ర ద్వారా సాగనంపి అధికారంలోకి వచ్చిన బాబు ఆధారపడింది ఎవరిపైన? నాడు సీబీఐ డైరెక్టరుగా ఉండి రిటైర్‌ అవుతున్న దశలో విజయ రామారావును క్యాబినెట్‌ మంత్రిని చేసి, తనకింద సీబీఐ జాయింట్‌ డైరెక్టరుగా పనిచేస్తున్న లక్ష్మీనారాయణను రాష్ట్రంలోకి దించాడు బాబు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి కనుమరుగు అయ్యాక, ఆయన హయాంలో అవినీతి జరిగిందని తప్పుడు ఆరోపణలకు దిగి, అందులో జగన్‌ పేరుకూడా ఇరికించి, సీబీఐ అధికారులను రాష్ట్రానికి రప్పించింది చంద్రబాబేనని జనం మరువరు. 

ఆ ‘క్విడ్‌ ప్రోకో’ సూత్రం ఆధారంగా జగన్‌ను అరెస్టు చేయించి, 16 మాసాలు జైల్లో నిర్బంధింపజేసి, విడుదలైన తర్వాత కూడా కేసుల పరంపరను సీబీఐ స్పెషల్‌ కోర్టుల్లో కొనసాగించింది కూడా బాబేనని మరవరాదు. కానీ ఎనిమిది–తొమ్మిదేళ్లుగా సాగిన కేసుల విచారణలో అనేకసార్లు సీబీఐ స్పెషల్‌ కోర్టు ‘ఏదీ మీ నిర్దిష్ట సాక్ష్యాలు, రోజులు గడుç స్తున్నా ఆ సాక్ష్యాలు ఎక్కడున్నాయి’ అంటూ ప్రశ్నిస్తూ వచ్చినా సీబీఐకి ఉలుకూ, పలుకూ లేదు. ఈ లోగా ఏ కంపెనీలు జగన్‌ కంపెనీల్లో ‘క్విడ్‌ ప్రోకో’ అజ్ఞాత సూత్రం కింద పెట్టుబడులు పెట్టాయని బాబు ఆరోపించి అరెస్టులు చేయించాక, దాదాపుగా వాళ్లందరికీ కోర్టు బెయిల్‌ ఇచ్చి విడుదల చేసిందో– వారి ఊసుగానీ, విచారణ కొనసాగింపుగానీ మనం ఇంతవరకూ ఎరగం.

అయినా, ‘సిగ్గుకు సిగ్గులేదన్న’ట్టుగా నాడు సీబీఐని జగన్‌పైకి ఉసికొల్పిన చంద్రబాబు ఈ రోజున తన హయాంలో బలిసిపోయి కోటికి పడగలెత్తినవారి అక్రమ సంపాదనలను పసిగట్టి దాడులు నిర్వహిస్తున్న అదే సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టంరేట్‌లను ఆంధ్రప్రదేశ్‌లోకి రానివ్వనని హుకుం జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేకుం డానే కేంద్ర విచారణ సంస్థలు సరాసరి దర్యాప్తు జరపవచ్చునన్న, 1946 నాటి ఢిల్లీ పోలీసు చట్టం (సెక్షన్‌ 5) ఏపీలో ఇకమీదట చెల్లబోదని బాబు తాజా ఉత్తర్వు జారీ చేశాడు. విచిత్రమేమంటే ఈ ఉత్తర్వు వెలువడిన వెంటనే దానికి మద్దతుగానా అన్నట్టు హైదరాబాద్‌లోని సీబీఐ కౌన్సిల్‌ శ్రీనివాసరాజు కూడా ‘ప్రస్తుతం విచారణలో ఉన్న కేసుల్ని మాత్రం’ సీబీఐ విచారించడానికి అభ్యంతరం ఉండదని ఒక ముక్తాయింపు పలికారు. అంటే, ఏతావాతా జగన్‌పై కొలిక్కిరాని కేసులు సీబీఐ విచారణలోనే కొనసాగుతుంటాయని చెప్పక చెప్పటం. 

కాగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ మాత్రం ‘దొంగ సంపాదనాపరులు, కోట్లాది సంపదను కూడబెట్టుకున్న’ పాలకులు, వాణిజ్యవేత్తలు మాత్రమే సీబీఐ అంటే బయపడతార’ని చెబుతూ బాబు ఉత్తర్వును అపహాస్యం చేశారు. ఇక బాబు ఉత్తర్వును బలపర్చింది ఎవరు? గతంలో బీజేపీతో జోడుకూడి బాబుతోపాటు తోడు రాగం పాడుతూ వచ్చిన మమత, కేజ్రీవాల్, కెప్టెన్‌ సింగ్‌ (పంజాబ్‌)లు. అయితే ఫెడరలిజాన్నీ, ఫెడరల్‌ వ్యవస్థనూ ఆపద్ధర్మంగా చాటు చేసుకుని, ఏపీని ముక్కలు చేసిన కాంగ్రెస్‌ నాయకురాలు సోనియాను, రాహుల్‌ను ‘ఇటలీ దెయ్యాలు’గా దూషించిన బాబు అదే కాంగ్రెస్‌తో ఇప్పుడు చేతులు కలపడం– మునిగిపోతున్న టీడీపీ పడవను కాపాడుకునే ఆఖ రియత్నం తప్ప మరొకటి కాదు. అంతగా ‘ఫెడరల్‌ స్ఫూర్తి’ కలిగిన బాబు, నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ పంచాయతీరాజ్‌ వ్యవస్థల్ని పటిష్టం చేయడానికి తెచ్చిన 74–75 రాజ్యాంగ సవరణలను గ్రామ స్థాయిలో ‘జన్మభూమి’ కమిటీలను ‘దేశం’ పార్టీ కార్యకర్తల్ని మేపడానికి తప్ప పంచాయతీ వ్యవస్థ పటిష్టతకు ఎందుకు ఉపయోగించరో చెప్పాలి. 

చివరికి, మన ‘ప్రజాస్వామ్య’ విలువలు ఏ స్థాయికి చేరాయో సుప్రీంకోర్టు ప్రసిద్ధ న్యాయమూర్తి (రిటైర్డ్‌) జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి ఇలా మొత్తుకోవలసి వచ్చింది: ‘‘70 ఏళ్లుగా నిర్మించుకున్న వ్యవస్థలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా కుప్పకూలి భారత రాజ్యాంగమే అపహాస్యం పాలవుతోంది. వక్రబుద్ధితో ఆలోచించే నేతల చేతుల్లో చిక్కుబడిపోయిన వ్యవస్థలో సత్యం మాట్లాడలేని పరిస్థితి నెలకొంది. వ్యవస్థను ప్రజాస్వామ్య పద్ధతుల్లో నడపడం సాధ్యపడని నేతలు నిట్టనిలువునా చీల్చేస్తున్నారని’’ (18.11.2018) హెచ్చరించారు. తనపైన, తన అనుచరులపైన ముంచుకొస్తున్న అవినీతి కేసుల్ని పక్కతోవలు తొక్కించడానికి రాష్ట్రంలో సీబీఐ తాజా దాడుల్ని వ్యతిరేకించడానికి ఉత్తర్వు ఇస్తూనే, జగన్‌పై కేసుల కొనసాగింపునకు వీలుగా సీబీఐ లోగడ ప్రారంభించిన విచారణ మాత్రం కొనసాగడానికి బాబు వీలూ, వాలూ చూసుకున్నట్టు స్పష్టమవుతోంది. ఇది మునిగిపోతున్న బోటు మల్లయ్య ఆఖరి శ్వాస. అవి నీతి కేసుల్లో రాష్ట్రాలకు ప్రత్యేక సార్వభౌమాధికారం ఉండదనేది అందుకే. 

ఈ దోపిడీ వ్యవస్థ పెంచిన నాయకుల్లో ఒకరు చంద్రబాబు. ఇదెలాంటి వ్యవస్థ? సత్యవాదులైన న్యాయవాదుల్ని, న్యాయమూర్తుల్ని కూడా సత్యానికి దూరం చేయగల వ్యవస్థ. సానాబాబు, రమేష్‌ లేకుండా తీతువు పిట్టల్లాంటి శివాజీ ‘గరుడ పక్షులు’ పుట్టరు. వీళ్లు లేకుండా సీబీఐలో ‘ఆస్థానా’ లాంటి స్పెషల్‌ డైరెక్టర్లూ ఉండరు, లక్ష్మీనారాయణ లాంటి జేడీలు ఉండలేరు. జనాభాలో కేవలం ఒక్కశాతం వర్గమే– 1922లో ప్రారంభమైన నాటినుంచీ ఈనాటి దాకా నమోదైన పన్నుల రికార్డుల ప్రకారం భారత జాతీయాదాయాన్ని స్పష్టంగా అనుభవిస్తున్నారని సుప్రసిద్ధ ఫ్రెంచి ఆర్థికవేత్త ప్రపంచ ప్రజా బాహుళ్యం దారిద్య్రాన్ని అంచనా వేస్తూ చెప్పారు. ఇలా పరాన్నభుక్కు పెట్టుబడిదారీ వ్యవస్థే జాతీయ జీవనంలోని ప్రతి విభాగంలోకి చొరబడుతోందని మరచిపోరాదనీ ముంబై ‘ఫైనాన్షియల్‌ టైమ్స్‌’ ప్రసిద్ధ విలేకరి, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ జేమ్స్‌ కాబ్‌ట్రీ సాధికారిక అంచనా (2018).

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

మరిన్ని వార్తలు