తెలుగువారికి చిదంబరం కొత్త ‘చిచ్చు’

27 Nov, 2018 01:20 IST|Sakshi

రెండో మాట

ఇటీవల చిదంబరం తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు ఒక విలేకరి– 2009 డిసెంబర్‌ 9న అర్ధరాత్రి ‘ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేస్తున్నట్టు చారిత్రాత్మక ప్రకటన చేయడానికి సరిగ్గా 12 గంటల ముందు తలుపులు మూసి ప్రకటించడం వెనుక అసలు జరిగిన కథేమిటో వెల్లడించగలరా?’ అన్న ప్రశ్నకు ఆయన ఓ చిరునవ్వు నవ్వి ‘అదిప్పుడు చెప్పను, ఆ రహస్యాన్ని నేను రాయబోయే స్మృతుల గ్రంథానికి భద్రపరచుకోనివ్వండి’ అని ప్రకటించాడు. నాడు కేంద్ర, రాష్ట్ర నాయకులు తెలుగు ప్రజలపై తమ పట్టు కోసం ఆడిన ప్రజా వ్యతిరేక నాటకం పూర్తిగా వెల్లడి కావటం భావి తరాలకి కూడా చాలా అవసరం.

ఒక వైపున ఇల్లు కాలుతుంటే మరొకవైపున ఆ కాలి కూలిపోతున్న ఇళ్లవద్ద బొగ్గులేరుకునే వాళ్లు ఉంటారన్నది తెలుగువారి సామెత. నిప్పంటించిన వాడే నీతులు వల్లించడం లోకవిదితమే. స్వతంత్ర భారత దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా అవతరించిన ఆంధ్రదేశం ఉమ్మడి మద్రాసు రాష్ట్రం (పరాయి పాలనలో) నుంచి విడివడి స్వపరి పాలన కొనసాగిస్తూ వచ్చింది. పరాయిపాలనలో చెట్టుకొకరు, పుట్టకొకరుగా చారిత్రక కారణాల వల్ల రెండు ప్రాంతాలుగా చెల్లాచెదరుగా ఉన్న ఆంధ్ర–తెలంగాణలను ఏకీకృత ఉమ్మడి తెలుగు రాష్ట్రంగా ఏర్పరుచుకోవాలన్న ఇరుప్రాంతాల చిరకాల వాంఛ చివరికి సువిశాల ఆంధ్రప్రదేశ్‌గా 1956లో అవతరించి మనుగడ సాగిస్తూ వచ్చింది. రాజకీయ పార్టీలు, వాటి నాయకుల స్వార్థప్రయోజనాల ఫలితంగా తెలుగుప్రజలకు ఎలాంటి కష్టనష్టాలు ఎదురవుతాయో ఉద్యమ నాయకుడు, ప్రజా కవి కాళోజీ ఏనాడో హెచ్చరించాడు. నాయకులు అమాయక ప్రజల్ని ‘గొర్రెలుగా భావించుతున్నార’ని చెప్పాడు. ముందుగానే హెచ్చరిం చాడు. ‘ఉపేక్షా భావం’ చాలా ప్రమాదకరం అని కూడా ముందస్తు దండోరా వేశాడు! ఈ గొర్రె మనస్తత్వం ఎలాంటిదో వివరిస్తూ కాళోజీ తన తరానికే కాకుండా, భావితరాలకూ ఇలా వివరించాడు: 

‘గొర్రె మనస్తత్వాన్ని ప్రజలు ఉపేక్షాభావం వల్ల ఎంతగా నమ్ము తున్నారంటే– కాడిని చేతబట్టంగానే ఎద్దు తనంతట తానే వచ్చి దాని కింద తలపెట్టుతది. అట్ల బానిసత్వానికి స్వయంగా ప్రజలు లొంగుతు న్నారు. ఇదెలాంటిదంటే గొర్రె మందల బడి మురుస్తాంది. ఆ మురిపెంతో తెగ బలుస్తాంది. కనుకనే బయళ్ల గడ్డి గొల్లన్నే మొలిపిస్తాండను కుంటాంది గొర్రె. సెలయేళ్ల నీళ్లన్నీ గొల్లన్నే ఒలికిస్తాండనుకుంటాంది గొర్రె. గొల్లన్న గొంగడిబొచ్చే తన పెయి (శరీరం) నిండా మొలిపిస్తాడనుకుంటాంది గొర్రె. కాని ఈ పరిస్థితి ఇక మారాలి!’

కానీ అలా మారకపోబట్టే కేంద్ర పాలకుల నుంచి రాష్ట్రాల పాలకుల దాకా ఆంధ్ర–తెలంగాణలు రెండింటా పాలకుల మోసపూరిత ప్రకటనల వల్లా, అక్కరకోసం ఇస్తున్న పెక్కు హామీల వల్ల 70 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా ప్రజలు దఫదఫాలుగా వంచనకు గురవుతున్నారు. తెలుగుప్రాంతంలో ఈ మోసపూరిత హామీల పరంపరను కనిపెట్టిన స్వీడిష్‌ ప్రధాని, స్వీడన్‌ ఆర్థిక మంత్రి ఆనాటి తమ ఏపీæ పర్యటనలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనలు, హామీలు విన్న తర్వాత (హైదరాబాద్‌ పత్రికా గోష్టిలో) మాట్లాడుతూ ‘‘మా స్వీడన్‌లో ఇలాంటి హామీలను ఎన్నికల ఉపన్యాసాలలో ప్రకటిస్తే, ఆ నాయకులు జైలుకు వెళతారు లేదా వారిని పిచ్చాసుపత్రికన్నా పంపుతాం’’ అని ప్రకటించాల్సి వచ్చింది! ఈ మోసాన్ని ఇప్పటికీ మన నాయకులు మానుకోలేకపోతున్నారంటే కారణం– వాళ్లు ‘ప్రజల్ని గొర్రెలుగా’ భావించబట్టేనని మర్చిపోరాదు. ఇందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను తమ స్వార్థ ప్రయోజనాల కోసం నిట్టనిలువునా విభజించి, తెలుగు ప్రజల్ని కేంద్రపాలకుల నుంచి, రాష్ట్ర పాలకుల దాకా చీల్చడమే నిదర్శనం కాగా, అది రాజకీయులు ఆడిన నాటకీయమైన వంచన.

ఉమ్మడి ఏపీ విభజనకు బీజాలు నాటి పెంచిన కేంద్రం దానితో పాటు ఉభయ ప్రాంతాల నాయకులు తిరిగి మరో సరికొత్త ‘డ్రామా’కు తెరలేపుతున్నారనిపిస్తోంది! ఏ కారణం వల్లనైతేనేమి విభజించిన వారు ఆ విభజన పట్ల ఇప్పుడు ఎన్నికల సందర్భంగా తాపీగా ఆలోచించి, నిన్నటి విభజనకు ఎవరు దోహదం చేశారన్న కొత్త మీమాంసకు కేంద్ర మాజీమంత్రి చిదంబరం తెరలేపే ప్రమాద సూచన కనిపిస్తోంది. 2009 డిసెంబర్‌ 9 అర్ధరాత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను చీల్చి రెండు తెలుగు రాష్ట్రాలుగా (ఆంధ్ర–తెలంగాణ) విభజిస్తున్నట్లు కేంద్రంలోని కాంగ్రెస్‌ పాలకుల తరఫున చిదంబరం ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించారు. 70 ఏళ్లు పైబడిన స్వతంత్ర భారత చరిత్రలో సర్వరంగాలనూ కార్పొరేట్‌ రంగ స్వేచ్ఛా దోపిడీకోసం పాలకులు ఆర్థిక వ్యవస్థ ద్వారా లను బాహాటంగా తెరిచారు. ఇందులో భాగంగానే భాషాప్రయుక్త రాష్ట్రాల స్ఫూర్తిని చెల్లాచెదురు చేసి, ప్రజల మధ్య చీలికలు పెట్టే తంపుల మారి రాజకీయ వ్యవస్థను పెంచి పోషించారు. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం మరొక తగాదాకు తెరలేపబోతున్నారా అన్న అనుమానానికి చిదంబరం దోహదపడు  తున్నారనిపిస్తుంది. 

ఇటీవల చిదంబరం తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు ఒక విలేకరి– 2009 డిసెంబర్‌ 9న అర్ధరాత్రి ‘ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేస్తున్నట్టు చారిత్రాత్మక ప్రకటన చేయడానికి సరిగ్గా 12 గంటల మందు తలుపులు మూసి ప్రకటించడం వెనుక అసలు జరిగిన కథేమిటో వెల్లడించగలరా?’ అన్న ప్రశ్నకు ఆయన (చిదంబరం) ఓ చిరునవ్వు నవ్వి ‘అదిప్పుడు చెప్పను, ఆ రహస్యాన్ని నేను రాయబోయే స్మృతుల గ్రంథానికి భద్రపరచుకోనివ్వండి’ అని ప్రకటించాడు (బయటపెట్టని కథ– December 9th story remains untold: ప్రముఖ ఆంగ్ల దినపత్రిక వార్త: 23–11–2018) నిజానికి సోనియా–చిదంబరం పెట్టిన చిచ్చును ఆనాడు ద్రవిడ నాయకుడు కరుణానిధి ఖండిస్తూ, ‘నీకు మతిపోయిందా? ఇక్కడ దక్షిణ తమిళనాడు రాష్ట్రం నుంచి విడిపోవాలంటూ ఛాందసుల ఉద్యమం సాగుతున్న దశలో తెలుగు వారి విభజనను సమర్థించడం తగునా’ అని ప్రశ్నించారు.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిననాటి సన్నివేశం అది. ఆనాటి దీక్ష వెనుక గాథకు సంబంధించిన ఆ రహస్య మేదో చిదంబరం చెబితేగానీ మనకు తెలియదు. అంటే కేంద్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నాయకులు తెలుగు ప్రజలపై తమ పట్టు కోసం ఆడిన ప్రజా వ్యతిరేక నాటకం పూర్తిగా వెల్లడికావటం భావి తరాలకి కూడా చాలా అవసరం. 

‘తెలుగుదేశం’ పార్టీ వ్యవస్థాపకుడు, ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా కుట్రపన్ని పదవినుంచి కృత్రిమంగా తప్పించి, అధికారం చేపట్టిన చంద్రబాబు తన పరిపాలన కూడా ముగిసిపోయి అవకాశం కోసం చుక్కలు లెక్కించుకుంటూ కుట్రలతో కాలక్షేపం చేస్తున్న సమయంలో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధికారం చేపట్టారు. రెండోసారి గెలిచిన కొన్ని నెలల్లోపే ఆయన హెలికాప్టర్‌ దుర్ఘటనలో అనుమానాస్పదంగా చనిపోయారు. దీంతో తమ జీవితాలను వెలిగించిన వైఎస్సార్‌ ప్రజాహిత, సంక్షేమ పథకాలు ఇక తమకు దక్కవని భావించి, బెంగటిల్లిన ఆంధ్ర–తెలంగాణలలోని వందలాది ప్రజలు ఆత్మహత్యలు చేసుకున్నారు. అప్పుడు వైఎస్‌ జగన్‌ లబ్ధిదారుల కుటుంబాలను ఓదార్చడం కోసం తలపెట్టిన ‘ఓదార్పుయాత్ర’కు సోనియా అడ్డుకట్ట వేయడమే కాకుండా, జగన్‌ భవిష్యత్‌ ప్రగతి మార్గాన్ని నిరోధించేందుకు రుజువుల్లేని కేసులలో ఇరికించి జైలుపాలు చేసింది. 

అయినా, తన కుట్ర జీవితాన్ని చంద్రబాబు కాంగ్రెస్‌తోనే ప్రారంభించి, మధ్యలో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి తిరిగి ఇప్పుడు అకస్మాత్తుగా బయల్దేరిన చోటునే (కాంగ్రెస్‌తో) చేరి చేతులు కలిపి, తన అవి నీతికి తెరగా జగన్‌పై కక్షతో పొత్తులు పెట్టుకున్నాడు. ఈమధ్య కాలంలో నాలుగున్నరేళ్లు నీతి నియమాలకు తిలోదకాలు వదిలి ఆపద్ధర్మంగా బీజేపీ–ఎన్డీఏతో అంటకాగి, ఏపీ భవిష్యత్తును తన పదవీ కాంక్షతో అంధకారంలోకి నెట్టాడు బాబు. పదవికి దూరమై ఉన్న చంద్రబాబు అయోమయ విభజనలో ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్న ఆబ కొద్దీ ప్రత్యేక ప్రతిపత్తి షరతును వదులుకుని, విభజనకు సోనియా, చిదంబరంలు ఎక్కడ పెట్టమంటే అక్కడ బేషరతుగా సంతకం చేసి వచ్చాడు. ఇదే అదనుగా పార్లమెంట్‌ తలుపులు మూసేసి బలవంతంగా కాంగ్రెస్‌–బీజేపీలు కుమ్మక్కయి తెలుగు ప్రజలను చీల్చేశారు. ఆ తరువాత బీజేపీ.. ‘మేం వస్తున్నాం. ఆ ప్రత్యేక ప్రతిపత్తిని కొత్త ఆంధ్రప్రదేశ్‌కు మేం ప్రకటిస్తామ’ని చెప్పినా తీరా మొండిచేయి చూపి, ‘ప్రత్యేక ప్యాకేజీ’ ఇస్తాంలెద్దూ అని నమ్మించి మోసగించారు. 

‘ప్రత్యేక ప్రతిపత్తి’ హోదా అన్నది వెనుకబడిన కొండ ప్రాంతాలు, గిరిజన ఏరియాలకు తప్ప మరెవరికీ కల్పించరాదన్నది జాతీయాభివృద్ధి కౌన్సిల్‌ (ఎన్‌.డి.సి.) నిర్ణయం. అసలు ఈ ఎన్‌డీసీ సమావేశం జరపా లని కూడా చంద్రబాబు కోరలేదు. తీరా ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగిన తరువాత జరిగిన పని ఏమిటంటే, ‘ప్రతిపత్తి’ని కాస్తా బాబు విస్మరించి బీజేపీ పాలనలో భాగస్వామి అయి అరకొర ప్యాకేజీ ‘క్యాబేజీ’తో సరిపెట్టుకున్నాడు. ఇక ఎప్పుడైతే వైఎస్‌ జగన్‌ పార్టీ ఏపీలో చంద్రబాబు పాలనకు బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా దూసుకుపోతూ ప్రజా సంకల్పయాత్రతో ప్రభుత్వాన్ని ఏర్పరచబోతున్న వాతావరణాన్ని రాష్ట్ర వ్యాపితంగా నిరూపించే దశకు చేరుకోవడంతో బాబు ఉన్నట్లుండి మోదీ ప్రభుత్వం నుంచి వైదొలగినట్టు కొత్త నటన మొదలెట్టేశాడు. ‘ఇటలీ దయ్యం’, ‘తక్షణం ఇటలీకి పంపించేయాలం’టూ సోనియాగాంధీని గతంలో దూషిస్తూ వచ్చిన చంద్రబాబు తాజా ‘ఊసరవెల్లి’ వేషంలో అదే సోనియా–రాహుల్‌ కాంగ్రెస్‌తో పొత్తు కలిసి ఎన్నికల బరిలోకి నిస్సిగ్గుగా దిగబోతున్నాడు! ఓటమిని చవిచూడబోతున్నాడు!


- ఏబీకే ప్రసాద్‌, సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

మరిన్ని వార్తలు