ప్రకృతి ‘ప్రేమలేఖలు’ వ్యాసరేఖలైన వేళ!

13 Nov, 2018 00:38 IST|Sakshi
కాండ్రేగుల నాగేశ్వరరావు

రెండో మాట

మొదటి  సంపుటిలో  కళాసృష్టికి  దోహదం చేసిన పలువురు ప్రాచ్య, పాశ్చాత్య  చిత్ర కళా నిర్మాతల కృషి  గురించే గాక, కొంతమంది దేశీయ కళాకారులైన రాజారవివర్మ, నందలాల్‌ బోస్, పట్నాయక్,  రాజన్‌ బాబు,  పూసపాటి పరమేశ్వర రాజు, కొండపల్లి శేషగిరిరావు, కథాకళాశిల్పి రావిశాస్త్రి, కేశవరెడ్డి, జనపదాల కాపు– కాపు రాజయ్యల గురించిన అందమైన లోతైన సమీక్షలు, వర్ణచిత్రాలు ఉన్నాయి.  ప్రసిద్ధ చిత్రకారులు, ఛాయాగ్రాహకులు, నవలాకారులు, శిల్ప, నగ్న చిత్రకళల్లో పరసీమలు చూచిన ప్రముఖులను సాధికారికంగా సమీక్షించి మన్ననలందుకున్న కాండ్రేగుల నాగేశ్వరరావు–తన మనోమందిరమూ, నివాసగృహమైన ‘దుల్హన్‌’ను రసాత్మకంగానే తీర్చిదిద్దుకున్నాడు.

‘‘అమ్మ వేసే ముగ్గులు, అక్క పాడే శాస్త్రీయగీతాలు హరి
విల్లును  భూ మార్గం పట్టించే దసరా, దీపావళి పండుగ కోలాహలం, గణపతి చతుర్థి నాటి కోలాటాలు, నవరాత్రి పండుగల్లో వేడుక చేసే నాటి కళావంతులు మేళా, బుర్రకథలు, హరికథలు, నాటకాలు, నాట్యాలు, రికార్డింగ్‌  డ్యాన్స్‌లు, ఇంటిముందు జరిగే సుబ్రమణ్యేశ్వరస్వామి షష్ఠి తీర్ధం–చిన్నతనం నుంచి నన్ను రసమయ జగత్తులోకి నడిపించాయి.’’

అలా నడక ప్రారంభించిన ఓ కళాభిమాని ప్రకృతి  సోయగంతో అమరధామంలా విలసిల్లిన అమలాపురం వాస్తవ్యుడు,  కొలది రోజుల నాడు భౌతిక ప్రపంచాన్ని  వీడి  వెళ్లిన బహుముఖీన మేథావి కాండ్రేగుల నాగేశ్వరావు. ఉస్మానియా కళాశాల విద్యార్ధిగా విశ్వ విద్యాలయం నుంచి ‘లా’లో ఉత్తమ శ్రేణిలో నిలిచిన  రెండవ పట్టభద్రుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సివిల్‌ సర్వీస్‌  గ్రూప్‌వన్‌ పరీక్షలో టాపర్, రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ జాయింట్‌ కమిషనర్‌గా ప్రసిద్ధుడైన ఆయన సాహిత్య,  కళారంగాల అభిమానిగానేగాక, ఆ రెండింటా తలమున్కలుగా  సైద్ధాంతిక అభినివేశం  ఉన్న అరుదైన ఉన్నతోద్యోగుల్లో ఒక ప్రసిద్ధునిగా  గణనలోకి వచ్చారు.

ఆయన కళాశాల జీవితంలో ఒక సరికొత్త నేపధ్యంలో ఎదిగి వచ్చినవాడు. ఒక ఆకు కదిలినా, ఒక పువ్వు విచ్చినా ’’  అదంతా తనకోసమే  నన్న  ఒక మౌన స్పందన ఆయనలోని మనసును పలకరించి పులకరింతలు పెట్టించినవే. అందుకే ఆయనలో ప్రకృతి పరిసరాలు తనలో కలిగించిన గిలిగింతలనే ‘‘నాకు నేను రాసుకున్న ప్రేమలేఖ’’లని సారస్వత కళా  సాంస్కృతిక పరమైన  వర్ణరోచిస్సుల ‘‘సప్తపర్ణి’’ పేరిట  ఈ రంగాలలోని  పలుశాఖల్లో  శతాబ్దాల, దశాబ్దాల తరబడిగా జాలువారిన  దేశీయ, పాశ్చాత్య ఉద్దండులైన అగ్రగామి చిత్ర, వర్ణచిత్రా సినీరంగ శ్రేష్టుల జీవిత కాలపు మహోన్నత  కృషికి  ఎంతో శ్రమతో నాగేశ్వరావు సమర్పించిన సువర్ణకలశమే –రెండు ఉత్తమ సంపుటాలు. ఒక ప్రసిద్ధ ఫొటోగ్రాఫర్‌గా, కళా సంస్కృతుల ఆరాధకునిగా తన భావాలతోనే  ప్రేక్షకుల మనస్సులను కొల్లగొట్టుకోగల విధంగా తన గ్రం«థానికి రూప (డిజైన్‌) కర్తగా పలువురి కళాభిమానాలు మనసుల్ని  దోచుకున్నవాడాయన!

అయన కలాన్ని ‘‘నర్మగర్భమైన లియోనార్డో డావించి కళాఖండమైన మోనాలిసా చిరునవ్వు నుంచి గగుర్పాటు కలిగించే  పికాసో కళాఖండం గుయెర్నికా’’వరకు నడిపించడంలో  తొలి స్ఫూర్తి  ప్రసిద్ధ చిత్రకారుడు, సాహితీ కళారంగ  సాధికార  విమర్శకుడైన సూర్యదేవర  సంజీవదేవ కాగా, మలి స్ఫూర్తి  ప్రసిద్ధ  బౌద్ధ వాంగ్మయ తాత్వికుడు, ప్రముఖ  మాసపత్రిక  ‘‘మిసిమి’’  గౌరవ సంపాదకుడైన  అన్నపురెడ్డి  వెంకటేశ్వర రెడ్డి  అందించిన  ఉత్సాహ, ప్రోత్సాహకాలే!  అందుకే  నాగేశ్వరరావు ఇలా చెప్పుకున్నాడు: ‘‘కళ యావత్తూ  ఉత్తమ పురుషైక వచనం. ఒక  కళాకారుని కృషి వెనుక  చెవియొగ్గి వినగల్గితే అతని స్వీయ ఘోష  వినపడుతుంది. కవి ‘నే’నంటే అర్థం ‘మేమ’ని  అంటాడు. ఆ వాక్యం  కళాకారులందరికీ  వర్తిస్తుందని చెబుతూ  తన ‘‘సప్తపర్ణి ’’  కళార్చన  రెండు సంపుటాలలో  పేర్కొన్న  ఒక్కో  కళాకారుడు  ఒక హిమశిఖరం. అందుకే కళ అనేది అనుభవైక  వేద్యం. భాష కందని మధుర  భావనలవి.  

కళలో దాగి ఉన్న క్లిష్టతను సమీక్ష ద్వారా  సరళీకరించగల్గితే  ఆ మధురిమను  మరింతగా  ఆస్వాదించవచ్చన్నది  నాగేశ్వరరావు భావన. ఒక్క చిత్ర కళారంగమే  కాదు. ప్రజా కళలలో  భాగమైన  చలన చిత్ర ప్రపంచంలోని  తెలుగు  సహా పలు భాషా చిత్ర  సమీక్షలు కూడా  ఎన్నింటినో  ఈయన  çస్పృశించారు. ఈ సమీక్షలపైన వ్యాఖ్యానించిన ప్రముఖ పాత్రికేయుడు ‘‘నాగేశ్వర్రావుగారికొక  విలక్షణమైన దృక్ప«థం  ఉండటం’’ విశేషం  అని ప్రశంసించాడు. ఇంకా  వెలువడవలసి  ఉన్నది ‘‘సప్తపర్ణి’’ రెండవ సంపుటి. మొదటి  సంపుటిలో  కళాసృష్టికి  దోహదం చేసిన పలువురి ప్రాచ్య, పాశ్చాత్య  చిత్ర కళా నిర్మాతాల  కృషి  గురించే గాక, కొంతమంది దేశీయ కళా కారులైన రాజారవివర్మ, నందలాల్‌బోస్, పట్నాయక్,  రాజన్‌ బాబు,  పూసపాటి పరమేశ్వర రాజు, కొండపల్లి శేషగిరిరావు, కథాకళాశిల్పి రావిశాస్త్రి, కేశవరెడ్డి, జనపదాల కాపు– కాపు రాజయ్యల గురించిన అందమైన లోతైన సమీక్షలు, వర్ణచిత్రాలు ఉన్నాయి.

భావాల క్లుప్తీకరణ  ఒక కళ అయితే, కొండంత భావానికి  ఉండంత కళా రూపమిచ్చి చూపరిని ఆకట్టుకోవడమే కళా లక్ష్యం.  కాదేది కవిత కనర్హం అయితే  కాదేది కుంచెకు అనర్హం’’అయితే  కళకు చిత్ర కళకు స్వకీయమైన భాష ఉంటుంది. అందుకే జార్జి బ్రాక్‌ అనే కళాకారుడు ‘‘చిత్రకళ ఒక నఖ (గోటితో గీసే) రేఖలాంటిది. ఆ గోటితో గీసే గీటును నా మనోభావాలకు తగినట్టుగా తీర్చిదిద్దడం నా కిష్టం అన్నాడు. చరిత్రకు  అందని ప్రాచీన  కాలం నుంచి  బొమ్మగీయడం అనే కళలో  ప్రాథమికంగా  పెద్ద తేడాపాడాలు  లేవు. మనిషిని  ప్రపంచాన్ని  దగ్గరగా  చేర్చడమే  బొమ్మకళామర్మం, అదే  ‘గీత’  రహస్యమని  సుప్రసిద్ధ కళాకారుడు కీత్‌ హారింగ్‌ అన్నాడు. ఎన్నివాదాలు ఈ లౌకిక ప్రపంచంలో  ప్రబలితమవుతున్నాయో అన్ని నాదాలు, నాదస్వరాలు, అసంఖ్యాక కళారూపాలు,  చిత్రకళా వైవిధ్యాలు  ఉన్నాయి. అంతేకాదు, ఈ రూపా రూపాలకు, కళారంగ వైవిధ్యాలకు విభిన్న సిద్ధాంతాలు, సైద్ధాంతిక సిద్ధాంతులు పుట్టుకొచ్చారు! ఇంతవరకూ ప్రపంచ కళారంగ చరిత్రలో 30 రకాల కళా సిద్ధాంతాలు, 50 రకాల భావాలు ముప్పెర గొన్నాయని రసజ్ఞుల అభిప్రాయం! ఏది ఏమైనా సంక్లిష్ట భావాలను అర్థమయ్యే విధంగానే కళారూపం ఉండాలన్నది మార్క్‌ రాత్కో అభిప్రాయపడగా, కళాకారుడు గీసే బొమ్మలకు వ్యాఖ్యాత ప్రత్యేకంగా ఉండకూడదు, చిత్రమే తన ఉనికిని తాను చాటుకోగలగాలి కానీ మరొక వ్యాఖ్యాతంటూ ఉండకూడదన్నాడు బార్నెట్‌ న్యూమాన్‌ అనే కళావిమర్శకుడు. ఈ వాద ప్రతివాదాలకు నిదర్శనంగానే కళారంగ చరిత్రలో ఇంప్రెషనిజం, ఫాడిజం, క్యూబిజమ్, ఫ్యూచరిజం,  ఎక్స్‌ప్రెషనిజం, సర్రియలిజం,

అబ్‌స్ట్రాక్, డాడాయిజం వగైరా కళారూపాలు, సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. అయితే ఈ రూపారూపాలకు చెందిన సకలవాదాలు సమన్వయం చేసుకుంటూ మొత్తం కళా స్వరూపంలోని, ప్రధాన లక్షణాన్ని సుప్రసిద్ధత చిత్రకారుడూ, చారిత్రక నవలాకారుడు అయిన అడవి బాపిరాజు ‘‘ఆంధ్రశిల్పం’’ రచనలో ఇలా పేర్కొన్నాడు. ‘‘ఒక దృశ్యం, ఒక రూపం, ఒక జీవితం, ఒక భావం, కళాశక్తి కలిగిన రసజ్ఞులకి గోచరించినపుడు తనలో ఉండే కళాశక్తి పైకి ఒక స్వరూపంగా జన్మించాలని ఆవేదన పొందడం చేతనే కళా స్వరూపం ఉద్భవించటం, ఆ సృష్టి భాషా స్వరూపమైతే కవిత్వమూ, భవన స్వరూపమైతే ఆలయమూ,  అవుతుంది’’. ఇన్ని రూపారూపాల ప్రాచ్య, పాశ్చాత్య (తెలుగు కళాకారుల, సినీ మహాకళాకారులు సహా) కళాకారుల, చిత్రకారుల వైభవోన్నతిని తీర్చిదిద్దిన కళానిలయమే ‘‘సప్తపర్ణి’’ అపురూప సంపుటాలు. రెండవ సంపుటి త్వరలో వెలువడనుంది. సూర్యుణ్ణి కుంచెగా మార్చి, సూర్య కిరణాలు ఏడు వర్ణాలుగా తనకు ఎలా కనిపించాయో, జగత్తు అనే చిత్రపటాన్ని తీర్చి దిద్దడానికి ‘‘సూర్యుడనే చిత్రకారుడు’’ సిద్ధమయ్యాడని శ్రీనాథ మహాకవి వర్ణించాడు, అలా చిత్రకారునిగా మారిన సూర్యుని చేతిలో ‘‘తూర్పు దిక్కు’’ అనే అందమైన అమ్మాయి మనకు  చూపించిన చిత్రకారుడు సూర్యుడు! మొదటి సంపుటిలో మొత్తం 66 మంది ప్రపంచ తెలుగు కళారంగ ఉద్ధండుల గురించిన అంచనాలను నాగేశ్వరరావు అందించగా, రెండవ సంపుటిలో దామెర్ల రామారావు, బాపు, గిరిధర్‌ గౌడ్, శీలా వీర్రాజు ప్రభృతులు సహా మరికొంతమంది పాశ్చాత్య, ఆంధ్ర చిత్రకళా, సినీ ప్రపంచ ప్రముఖుల దాకా విమర్శనాత్మక, సమన్వయపూర్వక, విజ్ఞానదాయకమైన అంచనాలను నాగేశ్వరరావు పొందుపరచగలిగారు.

సప్తస్వరాల విశ్వసమ్మేళనం, సప్తవర్ణాలతో నిండిన ‘‘పర్ణశాల’’గా ఈ సంపుటాలు రూపుదిద్దుకున్నాయి. అందుకే ప్రసిద్ధ ప్రకృతి దృశ్య చిత్రకారుడైన సంజీవ దేవ్‌ అని ఉంటాడు: ‘‘ప్రకృతి శోభనుచూస్తుంటే అనిపిస్తుంది–యీ రంగులు, యీ రూపాలు, యీ వెలుగులు, యీ నీడలు, యీ బింబాలు అన్నీ కూడా అన్నీ కూడా నాదమాధురి లోకి మారి ఆ దృశ్యమంతా శ్రవ్యంగా వినిపిస్తే, అహా! ఎంత ఆనందంగా ఉంటుందో, అని! ‘చూడటం’ అనేది ‘వినటం’ లోకి పరివర్తిస్తే, గ్రుడ్డితనం వచ్చినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. చెవుడు మాత్రం రాకుండా కాపాడుకోవాలి’’! ఇంతమంది ప్రసిద్ధ చిత్రకారులు, ఛాయాగ్రాహకులు, నవలాకారులు, శిల్ప, నగ్న చిత్రకళల్లో పరసీమలు చూచిన ప్రముఖులనూ సాధికారికంగ సమీక్షించి మన్ననలందుకున్న కాండ్రేగుల నాగేశ్వరరావు– తన మనోమందిరమూ, తన నివాసగృహమైన ‘దుల్హన్‌’ను కూడా రసాత్మకంగానే తీర్చిదిద్దుకున్నాడు. లోలోపల ఎటు చూచినా, ప్రతి గదీ కుడ్యచిత్రాలతో లేదా అందమైన భారీప్యానెల్స్‌తో నిండి ఉంటాయి లేదా పురావస్తు సంచయం మౌనముద్రల్లో మనల్ని పలకరిస్తుంటాయి. మనల్ని సజీవ చిత్రాలుగా భ్రమింపజేసే, శయనించే పోజులో చలువరాతితో చెక్కిన స్త్రీ భారీ విగ్రహం ఒక చోట, దర్జాగా కాలు మీద కాలు వేసుకుని వచ్చిన ఆగంతుకుడ్ని ‘నీ వేమిటి, నీ కధేమిటీ’ అని ప్రశ్నిస్తున్న ఫోజులో దర్జాగా ఒక మగధీరుని విగ్రహం, మరొక తట్టున మనల్ని పలకరించబోతాయి. గులాబీ రేకు ఎక్కడికి చేరి, ఎక్కడ శాశ్వత నిద్రలో సేద తీర్చుకుంటున్నా దాని అజ్ఞాత గుబాళింపు మాత్రం కాలావధులకు అతీతం.

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు

మరిన్ని వార్తలు