పౌర గుర్తింపుల భాగోతం దేనికి?

25 Dec, 2019 00:07 IST|Sakshi

రెండో మాట

పౌరసత్వ నిరూపణకు దేశీయులకు ఒక్క ‘ఆధార్‌’ చాలదట, ఓటర్‌ కార్డు, పాస్‌పోర్టు, పుట్టిన తేదీ ధ్రువపత్రం, ఎస్‌ఎల్‌సీ సర్టిఫికెట్‌ వగైరా.. వగైరా కట్టగట్టి చూపాలట. కానీ, భారత ‘ప్రజాస్వామ్య’ వ్యవస్థ దురదృష్టమేమోగానీ సామాన్య పౌరులకు విధిస్తున్న సవాలక్ష షరతుల్లో కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా– దేశీయ సంపదను రెండు చేతులా దోచుకుని, దేశీయ పన్నుల చట్టాలను ఉల్లంఘించి కోట్లకు పడగలెత్తి, బ్యాంకులనుంచి పొందిన రుణాలను వేల, లక్షలాది కోట్లను ఎగ్గొట్టి పాలకుల లోపాయికారీ అనుమతితోనే అర్ధరాత్రి దేశం విడిచి రహస్యంగా విమానాలెక్కి విదేశాలకు ఉడాయించి వెక్కిరిస్తున్న బడా కోటీశ్వరులకు ఎందుకు వర్తింపజేయడం లేదు? ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపీల వైఖరి దొందూదొందే. 

‘‘జాతీయ పౌరచిట్టా (నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌) గురించి నా ప్రభుత్వం ఇంత వరకు కేంద్ర మంత్రిమండలిలో గానీ, పార్ల మెంటులోగానీ చర్చించనేలేదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే అస్సాంలో ఎన్నార్సీని అమలు జరిపాం. అయితే  దేశ పౌరసత్వ సవ రణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ హింసాత్మక ఆందోళనలకు కారణమైన వారు కాంగ్రెస్‌ దాని మిత్రపక్షాలు, ఇతర విపక్షాలు, నగరాల్లోని (అర్బన్‌) నక్సలైట్లు. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ నుంచి శరణార్థులుగా వచ్చే హిందువులు, సిక్కులకు భారత పౌరసత్వం కల్పించాలని గాంధీయే చెప్పారు. అందుకని మూడు పొరుగు దేశాల్లో మతపరమైన వేధింపు లకు గురై భారత్‌కు వచ్చేవారికి పౌరసత్వ హక్కులు కల్పించేందుకు ఉద్దేశించిన చట్టం ఇక్కడి వారి హక్కుల్ని గుంజేసుకునేది కాదు. శర ణార్థులు వేరు, అక్రమ వలసదార్లు వేరు.’’ – ప్రధాని నరేంద్రమోదీ: ఢిల్లీ బహిరంగ సభలో (22–12–2019)

‘‘జాతీయ స్థాయిలో పౌరుల గుర్తింపు చిట్టా (నేషనల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ సిటిజన్స్‌ – ఎన్నార్సీ) దేశమంతటా అమలులోకి వస్తుందనడంలో మాకు సందేహం లేదు. ఈ వాస్తవాన్ని అంగీకరించి తీరాలి’’ – హోంమంత్రి అమిత్‌ షా (లోక్‌సభలో 09–12–2019)

అంటే ముందు పౌరసత్వ బిల్లును పార్లమెంటు చట్టంగా రూపొం దించిన దరిమిలా, దేశ వ్యాప్తంగా పౌరులకు సంబంధించిన జాతీయ స్థాయి రిజిస్టర్‌ను పార్లమెంటు ఆమోదించబోతుందన్న వాస్తవాన్ని బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌–ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం చెప్పక చెప్పినట్ల యింది. దేశవ్యాప్తంగా విభిన్నమతాలు, భిన్న సంస్కృతులు, విభిన్న ఆచార వ్యవహారాలు, అనంతమైన సంఖ్యా బాహుళ్యం గల దళిత బహుజనులు, మైనారిటీలతో కూడిన సెక్యులర్‌ రిపబ్లిక్‌లో దేశ పౌరుల గుర్తింపునకు ఎన్నిరకాల ప్రమాణాలు కావాలి? దేశ జనా భాలో 92 శాతం పౌరులు ఇప్పటికే నమోదై ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నప్పుడు కొత్తగా నాలుగు రకాల ప్రమాణాలతో బీజేపీ పాలకులు ప్రజలలో గందరగోళ పరిస్థితిని పనిగట్టుకుని ఎందుకు సృష్టించాల్సి వచ్చింది? జాతీయ జనాభా రిజిస్టరు (ఎన్‌.పి.ఆర్‌), భారత పౌరుల జాతీయ రిజిస్టరు (ఎన్‌ఆర్‌ఐసి), పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), వీటన్నిటికి తలమానికంగా జాతీయ స్థాయిలో, జనాభా లెక్కల (సెన్సెస్‌) దండకం–– ఇలా పలు దొంతర్ల అవసరం దేనికి వచ్చింది? 

అంతే కాదు, పౌరుల రిజిస్ట్రేషన్, జాతీయ గుర్తింపు కార్డు (2003) ఉండాలని రూపొందించిన నిబంధనలూ (సిటిజన్‌షిప్‌ రూల్స్‌) ఉన్నాయి. దేశ పౌరులందరికీ ఎలాంటి మినహాయింపు లేకుండా 2003 నిబంధనలను పౌరులందరికీ వర్తింపచేశారు. కాగా, మళ్లీ జాతీయ స్థాయిలో వేరే గుర్తింపు (ఐడెంటిటీ) కార్డు ఎందుకు అనే అంశంపై బీజేపీ పాలకులు స్పష్టంగా వివరించారు. ఇక కాంగ్రెస్‌ నాయకులూ  ‘డిటో’ డిటో! బీజేపీ పాలకులు ఎంతటి రహస్య ఎజెం డాతో ప్రజాబాహుళ్యాన్ని బలవంతంగా శాసించడానికి అలవాటు పడ్డారో.. అమలులో ఉన్న జమ్మూ–కశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని (370 ప్రత్యేక నిబంధన) అర్ధరాత్రి రద్దు చేసిన తీరు బహిర్గతం చేసింది. అలాంటి ప్రత్యేక ప్రతిపత్తితోనే, రాజ్యాంగ హామీలతోనే ఉసురు నిలుపుకుంటున్న  ఈశాన్య రాష్ట్రాల ప్రజల్ని కూడా మోదీ–అమిత్‌ షాలు వంచించారు. దీంతో వారూ బీజేపీ ప్రభుత్వ పాలసీలను తీవ్రంగా శంకించాల్సి వచ్చింది. నిరంతర ఆందోళనతో ఉద్యమాలు సాగించుకోవలసి వచ్చింది. ఇప్పుడు మొత్తం కథ అంతా పని లేనివాడు పిల్లి తల గొరుగుతూ కాలక్షేపం చేయడానికి అలవాటు పడిన చందంగా పరిపాలన తయారైంది. కనుకనే మోదీ–అమిత్‌షాల మాటలు, చేతలు గమనిస్తున్నవారి దృష్టిలో నోళ్లు నవ్వాల్సిన చోట ‘చెవులు నవ్వుతున్నాయన్న’ సామెత పుట్టుకొస్తోంది. బహుశా చెవిలో పువ్వులు పెట్టడం అంటే ఇదేనేమో! జాతీయతకు, పౌరసత్వ నిరూప ణకు ఉనికిలోకి వచ్చిన ‘ఆధార్‌’ కార్డు చాలదా? 70 ఏళ్ల తర్వాత కూడా సవాలక్ష సంకెళ్ల మధ్య భారత పౌరులు తమ పౌరసత్వాన్ని అడుగడుగునా పాలకులకు నిరూపించుకోవలసిన అవసరం ఉందా? 

ప్రజా సమస్యలపై ఆందోళనలు దేశంలో తలెత్తినప్పుడల్లా పాల కపక్షాలు ఇరుగుపొరుగుతో ‘సరిహద్దు ఘర్షణలు’, ఉల్లంఘనలు, మెరుపుదాడులు (సర్జికల్‌ స్ట్రైక్స్‌) తీయటం, దేశ రక్షణకు అపురూ పమైన సైనికులు ప్రాణాలు కోల్పోవడం కాంగ్రెస్, బీజేపీ పాలనా కాలంలో ఒక ప్రత్యేక నైపుణ్యంగా అమలు చేస్తూ వస్తున్నారు. వీటి ఆధారంగా ఎన్నికలలో విజయావకాశాలను మెరుగు పర్చుకోవడా నికి ప్రయత్నించడం చాలా కాలంగా ఒక రివాజుగా మారింది. ఈ పరస్పర ‘హరికిరి’ బాగోతంలో చివరికి దేశ పౌరుడి బతుకును విలువ కోల్పోయిన, రూపు చెడిన రూపాయి కింద దిగ జార్చారు పాలకులు. పౌరసత్వ నిరూపణకు దేశీయులకు ఒక్క ‘ఆధార్‌’ చాల దట, ఓటర్‌ కార్డు, పాస్‌పోర్టు, పుట్టిన తేదీ ధ్రువపత్రం, ఎస్‌ఎల్‌సీ సర్టిఫికెట్‌ వగైరా.. వగైరా కట్టగట్టి చూపాలట. కానీ, భారత ‘ప్రజా స్వామ్య’ వ్యవస్థ దురదృష్టమేమోగానీ సామాన్య పౌరులకు  విధి స్తున్న సవాలక్ష షరతుల్లో కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా బడా బాబులకు ఎందుకు వర్తించవు? దేశీయ సంపదను రెండు చేతులా దోచుకుని, దేశీయ పన్నుల చట్టాలను ఉల్లంఘించి కోట్లకు పడగ లెత్తి, బ్యాంకులనుంచి పొందిన రుణాలను వేల, లక్షలాది కోట్లను ఎగ్గొట్టి పాలకుల లోపాయకారీ అనుమతితోనే అర్ధరాత్రి దేశం విడిచి విదేశాలకు ఉడాయిస్తున్నవారికి ఎందుకు వర్తించటం లేదు? 

అలాంటి ప్రశ్నకు సమాధానాన్నే చికాగో సర్వమత సమ్మేళనంలో మహో త్తమ మానవతా సందేశాన్ని ధర్మాన్ని, ధార్మిక దార్శనికతను ప్రవచించి వివేకానందుడు ప్రపంచ దేశాలకు భారత ప్రజా బాహు ళ్యానికీ బోధించాడు. కానీ ధార్మిక దృష్టికి భారతీయులు దూరమై నట్టు ‘హిందూత్వ’ అనే కొత్త చీలుబాట్లకు సావర్కార్, గోల్వాల్కర్‌ దారులు వేశారు. కాగా మతాతీతంగా అన్ని ధర్మాలకు సమాన పాయలో దివిటీలు పట్టి జీవితమంతా నిలిచిన కబీరు, రూమీ, గాంధీ, మౌలానా ఆజాద్, ఠాగూర్, నిజాముద్దీన్‌ అవులియా మనకు విద్యా బోధకులుగా, గాయపడిన మనస్సులకు ప్రేమానురాగాలతో ఓదార్పు కల్గించిన మహనీయులు. ఈ దృష్టితోనే వీరంతా సవాళ్లను ఎదిరించి నిలబడటమే జీవశక్తి. ఆ శక్తి నుంచే వీరు ‘హిందూ’ శబ్దానికి అర్థం ‘ధర్మం’ అనీ, ధర్మమే సాధనమనీ చాటారు. కాగా, ‘హిందూత్వ’ అనే శబ్దం ఒక ఇనుప గొలుసు అనీ, అదొక ‘పంజరం’ అనీ, ఈ పంజరాన్ని, ఈ గొలుసును బద్ధలు కొట్టుకుని బయట పడగలవాడే అసలైన హిందువు అనీ, మూఢత్వాన్ని వదిలించుకున్న వాడే మానవుడనీ సోషియాలజీ ప్రొఫెసర్‌ అవిజిత్‌ పాఠక్‌ వివేచన. ఆ ‘పంజరం’లోని తొలి పెద్ద చిలుకలు సావర్కార్, గోల్వాల్కర్‌లు. 

భారతదేశంలో హిందూ–ముస్లిం ఐక్యతను పెంపొందించ కుండా స్వరాజ్యం లేదన్నాడు గాంధీజీ. ఇందుకు నిదర్శనం భారత స్వాతంత్య్రోద్యమం హిందూ, ముస్లిం సమైక్య పోరాటాల, త్యాగాల ఫలితమన్నాడు గాంధీ. ఎందుకంటే, ఆయనకు ఒకరు కాదు, పెక్కు మంది ముస్లిం యోధులు ఆయన సహచరులూ, అనుచరులూ. 1892 నుంచీ ఆ తర్వాత భారత స్వాతంత్య్రోద్యమానికి లోకమాన్య తిలక్, గాంధీ నాయకత్వం వహించినప్పటి నుంచీ గాంధీకి మార్గ దర్శకులుగా నేటాల్‌ ఇండియన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా అబ్దుల్లా, కార్యదర్శిగా గాంధీ పనిచేసినవారే. ఇమాం సాహెబ్‌ అబూదీల్‌కాదిర్‌ బవాజీర్, గాంధీ తొలి ఉద్యమ స్థానం చంపారన్‌ సత్యాగ్రహానికి ఉద్దీపన కల్గించిన వినతిపత్రం రచయిత పీర్‌ మహ్మద్‌ అన్సారీ మునీస్‌. బ్రిటీష్‌ వైస్రాయ్‌ లార్డ్‌ ఇర్విన్, పర్యటనలో ఉన్న గాంధీజీని, ఆయన సహచరులను విందుకు పిలుస్తున్నామని చెప్పి, అతిథికి (గాంధీకి) అందించే ఆహారంలో విషం కలపమని తన వంట మని షిగా ఉన్న బతక్‌మియా అన్సారీకి బాధ్యత పురమాయించాడు. ఆ దుర్మార్గం మనస్కరించని అన్సారీ. ఇర్విన్‌ తలపెట్టిన హత్యాయత్నం నుంచి గాంధీని రక్షించినవాడు. తొలి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్‌ ఈ విషయం తెలిపేవరకు అన్సారీ చరిత్రా తెలియరాలేదు. ఇలా గాంధీజీ సహచరులు ఎందరెందరో ముస్లిం సోదరులు, సోదరీమణులూ ఉన్నారు. అయినా సరే గోల్వాల్కర్‌ భారతదేశంలోని ‘హిందూయే తరులు హిందూ సంస్కృతికి, భాషకు అలవాటుపడాలి, హిందూ మతాన్ని అనుసరించితీరాలి, హిందూ జాతిని, సంస్కృతిని కీర్తిం చాలి. ముస్లింలు హిందూ జాతికి జీ హుకుం అనాలి, ఇంతకు తక్కువ ప్రవర్తన ఏదైనా వారు పౌర హక్కులకు అర్హులుకారు’’ అని సిద్ధాంతీ కరించాడు. ఈ సిద్ధాంతం పర్యవసానమే నేటి భారత రిపబ్లికన్‌ రాజ్యాంగానికి క్రమంగా పడుతున్న వరుస తూట్లు అని మరవరాదు.

ఏబీకే ప్రసాద్‌, సీనియర్‌ సంపాదకులు 
abkprasad2006@yahoo.co.in

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా