‘జమిలి’పై కుదేలైన బీజేపీ భ్రమలు!

17 Jul, 2018 02:20 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

జమిలి ఎన్నికలకు ఇంతగా ఉవ్విళ్లూరిన బీజేపీ నాయకత్వం తక్షణమే చేపట్టవలసిన ఎన్నికల సంస్కరణల గురించి మాట్లాడటం లేదు. ఎన్నికల్లో అభ్యర్థులు, రాజకీయపక్షాలు ఎన్ని నిబంధనలున్నా అడ్డూ అదుపూ లేకుండా చేస్తున్న ప్రచార వ్యయం, ఎన్నిక ఖర్చు పేరిట సాగుతున్న అవినీతి, ధన ప్రవాహం గురించి అనేక సంవత్సరాలుగా ఎన్నికల సంఘం మొత్తుకుంటున్నా ప్రభుత్వాలు తీసుకుం టున్న చర్యలేవీ లేవు. క్షమించరాని ఉల్లంఘనలను, లొసుగుల్ని నాయకులు తొలగించకుండా ‘జమిలి’ ఎన్నికల ‘సత్ఫలితాల’పై మాట్లాడటం కూడా ప్రజల్లో భ్రమలు కల్పించడానికేనని గుర్తించాలి.

ఎన్నికల నిర్వహణ షెడ్యూల్‌ను నిర్ణయించే కేంద్ర ఎన్నికల సంఘం అధి కారాన్ని ప్రశ్నించే హక్కు ప్రతిపక్ష పార్టీలకు లేదు. ఒక దేశం, ఒకే ఎన్నిక ఉండాలి. పార్లమెంటు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరగాలి.
– ప్రధాని నరేంద్ర మోదీ (22–10–17)

భారతదేశం ఫెడరల్‌ ప్రజాస్వామ్య దేశం. ఇది రాజ్యాంగ నిబంధన. దేశ లోక్‌సభకు ఐదేళ్ల పదవీకాల పరిమితి ఉన్నా ఆ పరిమితి ముగియక ముందు కూడా సభను రద్దు చేయవచ్చన్న విషయాన్ని ఎన్నికల కమి షన్‌గాని, పాలకపక్షమైన బీజేపీ నాయకత్వంగానీ, కమిషన్‌ ప్రతిపాదించిన కార్యాచరణ పత్రంగానీ దాన్ని పరిగణనలోకి తీసుకోవలేదు. అలాంటప్పుడు కాలపరిమితి ముగియని రాష్ట్ర శాసనసభల గతి ఏమిటి? ఫెడరల్‌ వ్యవస్థలో పార్లమెంటు, అసెంబ్లీలకు ఏక కాలంలో జమిలిగా ఎన్నికలు జరపడం అనర్థ దాయకం.

– జమిలి ఎన్నికల ప్రతిపాదనకు 9 పార్టీలు మద్దతివ్వగా బీజేపీ సహా 4 పార్టీలు మాత్రమే వ్యతిరేకించాయి. 

పుట్టని బిడ్డ బారెడన్న సామెత బీజేపీ ఎన్నికల రహస్య తంత్రం. జమిలి ఎన్నికల అస్త్రం బెడిసి కొట్టింది.  కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడగట్టుకుని బీజేపీ నాయకత్వం (మోదీ–అమిత్‌ షా ద్వయం) 2017లోనే, రెండేళ్లు ముందుగానే పన్నిన మధ్యంతర వ్యూహం భగ్నమైంది. 2019 సాధారణ ఎన్నికల్లో తిరిగి తమకు మెజారిటీ సీట్లు రావనే అనుమానం బీజేపీని పీడిస్తోంది. ఆచరణలో తన విధానాలు అమలు జరుగుతున్న తీరును, పద్ధతులను ప్రజలు ఆమోదించడం లేదనే అభిప్రాయంతో బీజేపీ నాయ కత్వం జమిలి ఎన్నికల ప్రతిపాదన జనం ముందుకు తెచ్చింది. ఇది దాచినా దాగని సత్యం. ఇటీవల అనేక రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో  ఈ పార్టీ ఓటమిపా లైంది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తప్పనిసరిగా గెలవాలనే లక్ష్యంతో జమిలి ఎన్నికల  ప్రతిపాదనను పాలకపక్షం ముందుకు తెచ్చిందని ప్రజలు గ్రహిం చారనే విషయాన్ని కూడా మోదీ–షా ద్వయం పసి గట్టింది.

అందుకే 2017లోనే అటు మోదీ, ఇటు ఆరెస్సెస్, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ‘జమిలి’ వ్యూహాన్ని ముందస్తుగానే వదిలి చూశారు. అసలీ ‘జమిలి’ ప్రతిపాదనకు కీలకం ఎక్కడుందో వర్ధ మాన సమాజాల అధ్యయన కేంద్రం (సెంటర్‌ ఫర్‌ ద స్టడీ ఆఫ్‌ డెవలపింగ్‌ సొసైటీస్‌–సీఎస్‌డీఎస్‌) డైరె క్టర్‌ సంజయ్‌ కుమార్, ఏడీఆర్‌కు చెందిన జగదీప్‌ ఛోకర్‌ 1989–2014 మధ్య కాలంలో సుమారు 13 రాష్ట్రాల్లో అసెంబ్లీలకు, లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో ఓటర్ల నిర్ణయం విభిన్నంగా ఉందని తేల్చారు. ఈ వ్యత్యాసం లోక్‌సభ, అసెం బ్లీలకు వివిధ సమయాల్లో వేర్వేరుగా నిర్వహించి నప్పుడు మరింత ప్రస్ఫుటంగా వెల్లడయిందని ఈ పరిశోధకులు నిర్ధారణ చేశారు. భారత రాజ్య పాలనా నిర్వహణలో ఫెడరల్‌ ప్రజాస్వామ్య వ్యవ స్థకు జమిలి ఎన్నికలు నష్టదాయకమని, హానికర మని అనేక సర్వేల ఫలితాలు నిరూపించాయి. 

ప్రాంతీయపక్షాలకు కీడు!
జమిలి ఎన్నికలు ప్రాంతీయ పార్టీలను బలిపెట్టి, జాతీయ స్థాయి పెద్ద పార్టీల ప్రయోజనాలు కాపా డటానికి మాత్రమే దోహదం చేస్తాయని గతంలో నిరూపించాయని ఈ సర్వేలు పేర్కొన్నాయి. ఎందు కంటే, రాష్ట్రాల ప్రజల స్థానిక సాధకబాధకాలను, ప్రాంతీయ సమస్యలను, వారి తక్షణ కోర్కెలను ప్రతిబింబించడానికి ప్రయత్నించే ప్రాంతీయ పార్టీల కున్న అవకాశాలను దెబ్బదీయడం ద్వారా జనం గొంతును అణచడానికి జమిలి ఎన్నికలు ఉపయోగ  పడతాయని సంజయ్‌కుమార్‌ తన అధ్యయనంలో వివరించారు. తద్వారా జన జీవనంలో వేళ్లూనుకో వలసిన ప్రజాస్వామ్య క్రమాన్ని తిప్పికొట్టడానికి ‘జమిలి’ దోహదం చేస్తుందని కూడా ఆయన స్పష్టం చేశారు. హిమాచల్‌ ప్రదేశ్, గుజరాత్‌ శాసన సభల పదవీకాలం 2018 జనవరిలో వరుసగా 7, 22 తేదీల్లో ముగిస్తున్నాగాని మోదీ ప్రభుత్వం బీజేపీ పాలనలోని గుజరాత్‌ ఎన్నికలను వరద సహాయ కార్యక్రమాలకు సమయం కావాలనే కారణంతో హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల తర్వాత జరిపించింది.

హిమాచల్‌లో 2017 నవంబర్‌ 9న, గుజరాత్‌లో డిసెంబర్‌ 9, 14 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిం చారు. ఈ విషయంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఏకే జ్యోతీ కేంద్రంలోని బీజేపీ సర్కారు కోరుకున్నట్టే గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఆలస్యంగా ప్రకటించారనే విమర్శలు వచ్చాయి. రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను మాత్రం బీజేపీ చెప్పినట్టే డిసెంబర్‌ 18న ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిపించడానికి తాము సిద్ధమని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ అంతకు ముందు ప్రకటించిన కొద్ది రోజులకే జమిలి ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా లేమని మరో ప్రకటన విడుదల చేశారు.

ముఖ్య ఎన్నికల సంస్కరణల ఊసే లేదు!
జమిలి ఎన్నికలకు ఇంతగా ఉవ్విళ్లూరిన బీజేపీ నాయకత్వం తక్షణమే చేపట్టవలసిన ఎన్నికల సంస్కరణల గురించి మాట్లాడటం లేదు. ఎన్నికల్లో అభ్యర్థులు, రాజకీయపక్షాలు ఎన్ని నిబంధనలున్నా అడ్డూ అదుపూ లేకుండా చేస్తున్న ప్రచార వ్యయం, ఎన్నిక ఖర్చు పేరిట సాగుతున్న అవినీతి, ధన ప్రవాహం గురించి అనేక సంవత్సరాలుగా ఎన్నికల సంఘం మొత్తుకుంటున్నా ప్రభుత్వాలు తీసుకుం టున్న చర్యలేవీ లేవు. పార్లమెంటు, అసెంబ్లీలకు పోటీచేసే అభ్యర్థులు పెట్టే ఖర్చు, వారి అవినీతిపై ఎన్నో సర్వేల ద్వారా ప్రజాతంత్ర సంస్కరణల సంఘం వంటి అనధికార సంస్థలెన్నో వెల్లడించిన దిగ్భ్రాంతికరమైన విషయాలపై చర్యలు తీసుకో కుండా తప్పించుకుంటున్నారు. ప్రజల ఓటుతో సీటె క్కిన వ్యక్తులే కాటేస్తున్నప్పుడు ఏ ప్రజా ప్రతినిధిని నమ్మాలో, మరెవరిని ‘కుమ్మా’లో తెలియని పరి స్థితుల్ని ఓటర్లు ఎదుర్కొంటున్నారు. ఇక ఫిరాయిం పుల నిషేధ చట్టం అపహాస్యంగా తయారైంది.

భ్రమలు కల్పించడానికే ‘జమిలి’ ప్రతిపాదన!
ఈ క్షమించరాని ఉల్లంఘనలను, లొసుగుల్ని పాలనా పగ్గాలు చేపట్టిన నాయకులు తొలగించకుండా ‘జమిలి’ ఎన్నికల ‘సత్ఫలితాల’పై మాట్లాడటం కూడా ప్రజల్లో భ్రమలు కల్పించడానికేనని గుర్తించాలి. ఎన్ని కల్లో నల్లధనం ప్రవాహానికి అడ్డుకట్ట వేయకుండా స్వతంత్ర భారతాన్ని ఆదర్శశక్తిగా చెప్పుకోలేము. ఈ అప్రజాస్వామిక, నిరంకుశ పోకడలన్నీ కిందిస్థాయి లోని మునిసిపల్, పంచాయతీ రాజ్‌ ఎన్నికల దాకా దశాబ్దాల నాటి నుంచే విస్తరించాయి. ఇవన్నీ ప్రజా స్వామ్య పునాదుల్ని కుదిపేస్తున్నాయి. ప్రజా ప్రాతి నిధ్య చట్టం(1951)లో ఎన్ని సవరణలు తెచ్చుకున్నా పాలకులు, పెక్కు ప్రజా ప్రతినిధుల ప్రవర్తన మార లేదు. పైగా బీజేపీ పాలకుల్ని పీడిస్తున్న ‘కొత్త జబ్బు’ సెక్యులర్‌ రాజ్యాంగాన్ని మూలమట్టుగా ఎలా మార్చాలా అన్నదే.

దానికితోడు కొత్త ఆలోచన ఈ జమిలి ఎన్నికలు. 1951–52లో పార్ల మెంటు, రాష్ట్రాల శాసన సభలకు జమిలి ఎన్నికలు, ఆ తర్వాత 1957/ 1962/1967లో వరుసగా మూడుసార్లు జమిలి ఎన్ని కలు జరిగిన విషయాన్ని బీజేపీ నాయకత్వం తన ప్రతిపాదనకు అనుకూలంగా మలుచుకునే ప్రయ త్నం చేస్తోంది. రాజ్యాంగం అమలులోకి వచ్చాక వరుసగా మొదటి నాలుగు సాధారణ ఎన్నికలు లోక్‌సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి జరప డం వల్ల ప్రభుత్వాలకు ఎన్నికల నిర్వహణ వ్యయం తగ్గిందనే వాదన ముందుకు తెచ్చింది. అయితే, ఎన్నికల ఖర్చును తగ్గించడం కోసం ఇక నుంచి ‘జమిలి’ ఎన్నికలు జరిపితే తప్పేమిటన్నది దేశ ఫెడరల్‌ వ్యవస్థ స్ఫూర్తిని కాస్తా పాతిపెట్టి నిరంకుశ పాలనకు పునాదులు వేయడానికి చేసే ఆలోచనగా మాత్రమే పరిగణించాలి.

ప్రొఫెసర్‌ అశోక్‌ ప్రసన్న కుమార్‌ చెప్పినట్టుగా– పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను తోసి రాజనడానికి దేశ రాజ్యాంగాన్నే మూలమట్టుగా మార్చేయకుండా అమెరికాలో మాదిరి ‘చాపకింద నీరులా’గా ప్రెసిడెన్షియల్‌ పాలనా నమూనాలో ఏకకాలంలో జమిలి ఎన్నికల న్నవి భారతదేశంలోని ఫెడరల్‌ వ్యవస్థలో చెల్లవు. పైగా సుప్రీంకోర్టు పరిశీలనకు ఈ పద్ధతి (జమిలి) నిలబడదని నిపుణుల అంచనా. ఇదిలా ఉండగా, ఈ సందర్భంగా సుప్రసిద్ధ ‘మీడియా హౌస్‌’ ఆధ్వ ర్యంలో నరేంద్ర మోదీ ప్రధానిగా గత నాలుగేళ్లలో సాగిన పరిపాలనా ఫలితాలను ‘ఇండియాను భ్రష్టు పట్టించిన పాలన’గా పేర్కొంటూ ఒక ప్రత్యేక నివే దికను బృహత్‌ గ్రంథంగా ఈనెల 14న జరిగిన పెద్ద ఆవిష్కరణ సభలో (ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో) విడుదల చేశారు.

జాతీయ జీవనంలో అనేక రంగాల్లో సుప్రసిద్ధులైన వారి రచనలు ఇందులో ఉన్నాయి. నాలుగేళ్ల ప్రజావ్యతిరేక పాలనలో వివిధ రంగాల్లో జరిగిన రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు, అమలైన ఆశాస్త్రీయ విధానాలు, పరిణామాల గురిం చిన వివరాలున్నాయి. ప్రముఖ మేధావులు, రాజ కీయ వ్యాఖ్యాతలు రాసిన 24 వ్యాసాలతోపాటు, వాటికి దన్నుగా పెక్కు నిజనిర్ధారణ పట్టికలను ఈ నివేదికలో పొందుపరిచారు. మోదీ సర్కారు ప్రవేశ పెట్టిన పథకాల్లోని డొల్లతనాన్నీ దీనిలో బహిర్గతం చేశారు. (అందులోని మరిన్ని వివరాలు వచ్చేవారం)

 ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@ahoo.co.in 

మరిన్ని వార్తలు