మానవ ప్రగతికి మేనిఫెస్టో!

25 Feb, 2020 01:20 IST|Sakshi

సోషలిస్టు రిపబ్లిక్‌ తప్ప, చివరికి ప్రజాస్వామ్య (డెమోక్రాట్‌) రిపబ్లిక్కులు సహితం ధనికవర్గాలకు, శ్రమజీవులకు మధ్య వైషమ్యాన్ని రద్దు చేయలేవని మార్క్స్‌–ఎంగెల్స్‌ స్పష్టం చేయడం విశేషం. ఏ దేశానికి శాశ్వత విమోచన రావాలన్నా అది కార్మిక శ్రమజీవుల నుంచే, కష్టజీవుల నుంచే సాధ్యమని, విద్యకు వెలి అయినా.. వారికి అసూయా ద్వేషాలుండవనీ, గొప్ప జాతీయ కర్తవ్యాల్ని నెరవేర్చగల శక్తియుక్తులు వారికే ఉంటాయని, వారిదే భవిష్యత్తు అనీ మార్క్స్‌–ఎంగెల్స్‌లు నిర్మలమైన మనస్సుతో ప్రకటించారు. సోషలిస్టు పేరిటనో, కమ్యూనిస్టు పార్టీల పేరిటనో పార్టీలు ఎన్ని మారినా, రాజీబేరాలతో సిద్ధాంత పదును ఎంతగా కోల్పోయి నిర్వీర్యమౌతున్నా, రెండు రెళ్లు నాలుగన్న సూత్రం మాత్రం మారదు గాక మారదు, మార్చడం కుదరదు. సర్వమానవ ప్రగతికి ఆ కమ్యూనిస్టు  మేనిఫెస్టోనే దిక్సూచి. మరో మార్గమేదీ లేదు.

250 సంవత్సరాల స్వాతంత్య్రం తర్వాత కూడా అమెరికాలో దేశాల దురాక్రమణల్లో, దేశాలపై అక్రమ యుద్ధాలు సృష్టించడంలో, ధనికవర్గ సమాజ దోపిడీ వ్యవస్థా చట్రంలో ప్రజాస్వామ్యం బోర్డు చాటున దాగిన సైనిక– పారిశ్రామిక వ్యవస్థల్లో ఏమాత్రం మార్పు లేదు. కనుకనే ఆ దోపిడీ వ్యవస్థను ఆదర్శంగా భావించి భారత ప్రజలను పీడిస్తున్న రకరకాల బ్రాండ్‌ల చాటున దాగిన సంపన్నవర్గాలకు శాస్త్రీయ సోషలిజం అన్నా శాస్త్రీయ కమ్యూనిజం అన్నా కంపరంగా ఉంటుంది. శాస్త్రీయ సోష లిజం సిద్ధాంతకర్తలైన కారల్‌ మార్క్స్, ప్రెడరిక్స్‌ ఎంగెల్స్‌ ప్రపంచ శ్రామిక వర్గ శాశ్వత విమోచన కోసం రూపొందించిన ‘కమ్యూనిస్టు మేనిఫెస్టో’కి 172 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సర్వత్రా సభలు, సమావేశాలు ప్రపంచవ్యాప్తంగా జరిగాయి. ఇప్పటికీ తరతమభేదా లతో పలు ప్రపంచ దేశాలలోని కష్టజీవులు, శ్రమజీవులు, మధ్య తరగతి ఉద్యోగవర్గాలు అనునిత్యం తమ బతుకుల్ని మెరుగుపర్చు కోవడం కోసం నిరంతర పోరాటాలు చేస్తూనే ఉన్నారు ఉద్యమాల రూపంలో, సమ్మెల రూపంలో భారతదేశంతో సహా అనేక దేశాల్లో పెద్ద ఎత్తున అవిశ్రాంతంగా కొనసాగుతూనే ఉన్నాయి.

శ్రామికవర్గ ప్రయోజనాల రక్షణే పొత్తుల భూమిక
కమ్యూనిస్టు మేనిఫెస్టో వెలువడిన 172 సంవత్సరాల తర్వాత కూడా దేశంలో అసమానతల పర్వాలకు ముగింపు రాకపోవడానికి కారణ మేమిటో స్థానిక కమ్యూనిస్టు పార్టీలు, సోషలిస్టు శక్తులూ అంత ర్మథనం చేసుకోవలసిన అవసరం ఉంది. దేశాలలోని స్థానిక ధనికవర్గ పార్టీలతో పరిస్థితులను బట్టి వ్యూహరీత్యా సోషలిస్టు, కమ్యూనిస్టు లక్ష్యాలు ప్రజాబాహుళ్యం ఉమ్మడి ప్రయోజనాల సాధన కోసం తాత్కాలికంగా చేతులు కలపడం వేరు, ఆ పేరిట శ్రామిక వర్గ ప్రయోజనాలకు విఘాతం కల్గించే పొత్తులకు ఒరగబెట్టడం వేరు. అలాగే మిలిటెంట్‌ పోరాటాలలో ఉన్నవారిని ధనిక వర్గ పాలకులు ఉగ్రవాదులంటూ ముద్రవేసి పరిమార్చడాన్ని, విచారణ జరపకుం డానే హతమార్చడాన్ని వామపక్షశక్తులు లోపాయికారీగా సమర్థిం చడమూ, శ్రమజీవుల దీర్ఘకాల ప్రయోజనాల్ని దెబ్బతీయడమే అవు తుంది. 

గత 172 సంవత్సరాలుగాను దేశదేశాలలోని శ్రమజీవులు, కష్టజీవులు తమ బతుకులను, జీవన ప్రమాణాలను మెరుగుపర్చు కునేందుకు దోపిడీవర్గ వ్యవస్థనుంచి శాశ్వత విమోచనం కోసం జరిపే పోరాటాలకు ఒక ముగింపును ఆశించడం లక్ష్యంగా శాస్త్రీయ సోష లిజం సిద్ధాంతకర్తలు తమ మేనిఫెస్టోలో కొన్ని ఆసక్తికర సూత్రీ కరణలు చేశారని మరవరాదు. వారి మాటల్లో– సంపన్నవర్గం తమ ఉనికికోసం ఒక్కొక్కప్పుడు విప్లవకరంగా ప్రవర్తించినప్పుడల్లా కమ్యూనిస్టులు ఆ వర్గంతో చేతులు కలిపి నిరంకుశ రాచరికాలకూ, భూస్వామ్య వర్గాలకూ పెట్టీబూర్జువా వర్గాలకీ వ్యతిరేకంగా పోరా డుతూ ఉంటారు. అయితే దోపిడీ వ్యవస్థకు ఆలవాలమైన సాంఘిక పరిస్థితులను మూల మట్టంగా తోసిపుచ్చడం ద్వారానే సామాజిక పరిస్థితుల్ని మౌలికంగా మార్చగలమన్న అవగాహనను మార్క్స్‌– ఎంగెల్స్‌ అందించారు.

శ్రామిక వర్గం, కార్మికవర్గం, వేతన జీవులూ ఎలాగూ దోపిడీ పాలకవర్గ వ్యవస్థ ఉనికిలో ఉన్నన్నాళ్లూ సంకెళ్లలోనే జీవితాన్ని వెళ్లమార్చుకోవలసి వస్తుంది. కాబట్టి.. తెగనివి కావయ్యా ఆ సంకెళ్లు.. తెగతెంచండయ్యా అన్న ఆ సిద్ధాంతకర్తల సందేశానికి లక్ష్యం నెరవేరేదాకా కాలం చెల్లిపోనట్లే లెక్క. కనుకనే శాస్త్రీయ సోష లిజం సిద్ధాంతకర్తలు విస్పష్టమైన భావాన్ని ఆదేశంగా మల్చారు. ధనిక(బూర్జువా) వర్గ సమాజంలో గతం వర్తమానాన్ని శాసిస్తుంది. కానీ సోషలిస్టు లేక కమ్యూనిస్టు సమాజంలో వర్తమానం గతాన్ని శాసిస్తోంది. ధనికవర్గ సమాజంలో పెట్టుబడికి మాత్రమే స్వాతం త్య్రమూ, వ్యక్తిత్వమూ ఉంటాయి కానీ ప్రాణం గల మనిషికి స్వాతం త్య్రమూ ఉండదు, వ్యక్తిత్వమూ ఉండదు. ఈ స్థితినే సోషలిజం (కమ్యూనిజం) రద్దు చేయాలంటుంది.

భార్య కార్మికురాలు.. భర్త బూర్జువా!
అయితే ఈ రద్దు చేయడాన్ని వ్యక్తిత్వాన్ని రద్దు చేయడం గానూ, స్వేచ్ఛను రద్దు చేయడంగానూ సంపన్నవర్గాలు భావిస్తాయి. ధనికవర్గ వ్యవస్థలో ఉత్పత్తి, స్వేచ్ఛ అంటే వ్యాపారానికి స్వేచ్ఛ, వస్తువుల క్రయవిక్రయాలకు మాత్రమే స్వేచ్ఛ. సోషలిజం/కమ్యూనిజం ఏ వ్యక్తికీ సమాజ ఉత్పత్తి పరికరాలను (ఉత్పాదితాలు) సొంతం చేసు కునే హక్కు లేకుండా చేయదు. అలా సొంతం చేసుకోవడం ద్వారా ఇతరులను కూలివాళ్లుగా మార్చే హక్కును మాత్రమే తొలగిస్తోంది అని స్పష్టం చేశారు.

అందుకే ధనికవర్గ వ్యవస్థలో చివరికి భార్యా– భర్తల మధ్య సంబంధాల తీరును కూడా పరామర్శిస్తూ శాస్త్రీయ సోషలిజం సిద్ధాంతకర్తలు దోపిడీ వ్యవస్థలో భార్యను ప్రొలిటేరియట్‌ గానూ, భర్తను బూర్జువా గానూ వర్గస్వభావాన్ని వివరించడం కోసం ఎంగెల్స్‌ వర్ణించక తప్పలేదు. మహిళా లోకం ఆందోళనకు ప్రతి బింబంగా వచ్చిన నేటి మీటూ ఉద్యమం కూడా దోపిడీ వ్యవస్థకు మరో నిరసన రూపమే! అలాగే, సోషలిస్టు రిపబ్లిక్‌ తప్ప, చివరికి ప్రజాస్వామ్య (డెమోక్రాట్‌) రిపబ్లిక్కులు సహితం ధనికవర్గాలకు, శ్రమజీవులకు మధ్య వైషమ్యాన్ని రద్దు చేయలేవని కూడా  మార్క్స్‌– ఎంగెల్స్‌ స్పష్టం చేయడం విశేషం. 

ఏ దేశానికి శాశ్వత విమోచన రావాలన్నా అది కార్మిక శ్రమజీవుల నుంచే, కష్టజీవుల నుంచే, చివరికి విద్యకు వెలి అయినాసరే.. వారికి అసూయా ద్వేషాలుండవనీ, గొప్ప జాతీయ కర్తవ్యాల్ని నెరవేర్చగల శక్తియుక్తులు వారికే ఉంటాయని వారిదే భవిష్యత్తు అనీ మార్క్స్‌– ఎంగెల్స్‌లు నిర్మలమైన మనస్సుతో ప్రకటించారు. అంతేగాదు, దేశా భివృద్ధికి బాసటగా నిలబడాల్సిన పారిశ్రామిక నాగరికతను కాస్తా స్టాక్‌ మార్కెట్లకు తార్చి కూర్చున్నారని ఎంగెల్స్‌ శపిస్తూ, స్టాక్‌ ఎక్చేంజ్‌ అనేది ధనికవర్గ సమాజానికి అత్యంత విలువైన పండు అనీ అదే సమాజానికి విషఫలమనీ, అలాంటి సమాజాల్లో నిస్సందేహంగా ఆవి ష్కరించుకునే అవినీతికి స్టాక్‌ ఎక్చేంజీలు ఉదాహరణ అనీ వర్ణించాడు. ఏతావాతా ఎవరి మాట ఎలా ఉన్నా ఆశయాలు సంఘర్షించే వేళ సైద్ధాంతిక ఆయుధమూ పదును కోల్పోదు గాక కోల్పోదు. సోషలిస్టు పేరిటనో, కమ్యూనిస్టు పార్టీల పేరిటనో పార్టీలు ఎన్ని మారినా, రాజీబేరాలతో సిద్ధాంత పదును ఎంతగా కోల్పోయి నిర్వీర్యమౌ తున్నా, రెండు రెళ్లు నాలుగన్న సూత్రం మాత్రం మారదు గాక మారదు, మార్చడం కుదరదు. సర్వమానవ ప్రగతికి ఆ మేనిఫెస్టోనే దిక్సూచి. మరో మార్గమేదీ లేదు. 

పోగుపడటమే పెట్టుబడి లక్షణం
ఎందుకంటే మహాశాస్త్రవేత్త, ప్రపంచ అణుశాస్త్రవేత్త, మానవతావాది అల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ చెప్పినట్లు ప్రైవేట్‌ పెట్టుబడి అనేది బహుకొలది మంది చేతుల్లోనే పోగుబడుతూ ఉంటుంది. పెట్టుబడిదారుల మధ్య పోటాపోటీల వల్ల కొంత, సాంకేతిక అభివృద్ధి వల్ల కొంత, శ్రమ విభజన పెరగడం వల్ల కొంత.. చిన్నపరిశ్రమలను మార్చి భారీ పరి శ్రమల ఏర్పాటును ప్రోత్సహించడం వల్లనూ నానాటికీ ప్రైవేట్‌ పెట్టుబడి కొలదిమంది చేతుల్లో పోగుబడటం ప్రారంభించింది. ఈ పరిణామాలతో ప్రైవేట్‌ పెట్టుబడి గుత్తేదార్ల సంఖ్య పెరిగింది. ఈ విప రిణామాల ఫలితంగా ప్రైవేట్‌ పెట్టుబడిని పకడ్బందీగా అదుపు చేయడమన్నది చివరికి ప్రజాస్వామికంగా సమీకృతంగా ఏర్పడిన రాజకీయ సామాజిక వ్యవస్థకు కూడా అదుపు చేయడం సాధ్యం కాకుండా పోయింది.

శాసనకర్తల్ని రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లి లేదా ప్రలోభాలకు గురిచేయడం జరుగుతోంది. ఈ పార్టీలను ప్రైవేట్‌ పెట్టుబడిదారులు సాకుతున్నారు. తద్వారా ప్రజలు ఎన్నుకున్న శాసనవేదికల నుంచి ప్రజలనే విడదీస్తు న్నారు. ఫలితంగా అట్టడుగు వర్గాల ప్రజాబాహుళ్యాన్ని అలా దూరం చేస్తున్నారు. కను కనే సమాచార వ్యవస్థలైన పత్రికలు, రేడియో, విద్యా రంగాలను ప్రైవేట్‌ పెట్టుబడిదారులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావితం చేయడం జరుగుతోంది.
(‘కమ్యూనిస్టు మేనిఫెస్టో’ రచన కు 172 ఏళ్లు అయిన సందర్భంగా)
abkprasad2006@yahoo.co.in

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు