ఎన్‌కౌంటర్లే ఏకైక పరిష్కారమా?

11 Dec, 2019 00:35 IST|Sakshi

రెండో మాట 

‘‘చట్టాలను కఠినతరం చేసినా మహిళ లపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతు న్నాయి. ఇలాంటి నేరాలకు సంబంధించిన కేసుల్లో సత్వర తీర్పులు రాకపోవటం ఒక కారణం. సమాజంలో మార్పు కోసం కూలం కషమైన చర్చ జరగాలి’’
– సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ 

‘‘అత్యాచార కేసుల్లో నిందితులను వెంటనే కొట్టి చంపాలని, ఉరి తీయాలని కోరడం సరైన నిర్ణయం కాదు. హత్య కేసుల్లో మరణశిక్షలు ఉన్నా హత్యలు జరుగుతూనే ఉన్నాయి, అలాగే ‘రేప్‌’ కేసుల్లో మరణశిక్ష విధించినా ఆ కేసులూ ఆగడం లేదు. మొత్తం సమాజ వ్యవస్థలో మార్పు రావాలి, జెండర్‌ సెన్సిబిలిటీ, నైతికతను పాటించడంలో నిబద్ధత ఉండాలి’’
– ఐపీఎస్‌ (రిటైర్డ్‌) అధికారి సి. ఆంజనేయరెడ్డి 

స్త్రీలపై అత్యాచారాలు, హత్యలు, అవమానకర పురుష ప్రవర్తనలూ గత 72 ఏళ్ల దేశ స్వాతంత్య్ర చరిత్రలో కొత్తేమీ కాదు, హైదరాబాద్‌ చరిత్రలో డాక్టర్‌ దిశ దారుణ హత్య, ఆ దుర్ఘటన ఆధారంగా న్యాయ స్థానాలతో నిమిత్తం లేకుండా జ్యుడీషియరీ పాత్రను పోలీసులే తమ చేతుల్లోకి గుంజుకుని నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడమూ, ఇదే ఆఖరి ఉదంతంగా భావించడానికి వీల్లేదు. ఈ ఉదంతం ఇలా ఉండగానే ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో ఓ పోలీస్‌ జవాన్‌ తన సహచరుల పైననే కాల్పులు జరపగా ఆరుగురు జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

‘విశ్రాంతి కరువవడం, సెలవులు తక్కువ కావడం, మాన సిక ఒత్తిళ్లకు గురైన ఫలితమే సహచర జవాన్లను అలా కాల్చి చంపడానికి కారణం’ (6.12.2019 నాటి పత్రికా వార్తలు). ప్రస్తుతం మన దేశంలోని రాజకీయ, సామాజిక, ఆర్థిక వ్యవస్థ కొనసాగుతున్న తీరు తెన్నులకు ఇవి అద్దంపడుతున్నాయి. ఏడు దశాబ్దాలకుపైగా మన దేశంలో పేరుకుపోయి, రాజకీయనేతల, పాలక శక్తుల అండ దండలతో నానాటికీ విజృంభిస్తున్న ధనస్వామ్య వ్యవస్థ, దాని స్వప్రయోజనాల కోసం పెంచగా.. పెరిగిపోతున్న సామాజిక, ఆర్థిక అసమానతలు, కుల, మత, వర్గ, వర్ణ వివక్షతో జన జీవనం రోజు రోజుకీ కునారిల్లిపోతోంది.

చివరికి ఈ దుస్థితి ఎంతవరకు ఏ దశకు చేరుకుంటోందంటే– వ్యవస్థా నిర్వాహకులే కులాలమధ్య, మతాల మధ్య పొరపొచ్చాలు కల్పించి, ప్రజలమధ్య తగాదాలు, కొట్లాటలు సృష్టించడం ద్వారా ‘విదూషకులు’గా మారి ఆనందిస్తున్నారు. ఈ వికృత ‘ఆనంద తాండవం’లో భాగమే సామాజిక దౌష్ట్యాలకు అసలు కారకులెవరో తెలియనీయకుండా చేయడం. ‘పూటబత్తెమే పుల్ల వెలుగు’గా భావించే నిర్భాగ్యులూ పేద, మధ్య తరగతి, బడుగు బలహీన వర్గాల ప్రజలు, నిరక్షరాస్యులు, నిరుద్యోగులు దుర్ఘటనల మూలాలను తెలుసుకోకుండా వారిని పాలనా శక్తులు మైకంలోకి నెట్టి వేస్తున్నాయి.

తీరా ఈ ధనస్వామ్య పాలనా వ్యవస్థలు ఏ స్థాయికి దిగజారుతున్నాయంటే, ఘటనలపై సమగ్ర విచారణ జరిపి, అనం తరం నిందితులకు కఠిన శిక్షలను విధించే అవకాశాన్ని కోర్టులకు కల్పించకుండానే, వాటి పాత్రను పోలీసులకు అప్పగించి, సమగ్ర విచారణకు వీలులేని ‘ఎన్‌కౌంటర్ల’తో, న్యాయస్థానాల ఉనికినే ప్రశ్నా ర్థకంగా మార్చుతున్నాయి. అత్యాచారాలు, హత్యలవల్ల బాధితు లుగా మారిన వారు, వారి కుటుంబాలు క్రిమినల్‌ కేసుల్లో సత్వర న్యాయం కోసం ఎదురు చూడటాన్ని ఎవరూ తప్పుపట్టకూడదు.

పాశవిక ఘటనలలో సత్వర న్యాయం కోసం, తక్షణ తీర్పుల కోసం చట్టాల్ని సవరించి తీరాలని ప్రజాక్షేమాన్ని, సమాజ శాంతిని కోరేవారంతా– ముందు ఆర్థిక, సామాజిక అసమానతలను రద్దుచేసే ఒకే నీతి, ఒకే న్యాయం అమలుకు పట్టుబట్టాలి. ఇంతకాలం దగా పడుతూ వచ్చిన అట్టడుగు వర్గాల, బడుగు, నిరుపేద బహుజను లకు, సంపన్న వర్గాలకు మధ్య వివక్షను, వ్యత్యాసాన్ని రద్దు చేయగల పరిణామానికి నాంది పలకగల వ్యవస్థను మాత్రమే ప్రజా బాహుళ్యం కోరుకుంటోంది. 

మానవ హక్కుల కమిషన్‌గానీ, కేంద్ర ప్రెస్‌ కౌన్సిల్‌గానీ కోరలు పీకేసిన విచారణ సంస్థలుగానే మిగిలిపోతూ వచ్చాయి, వాటికి శిక్షలు ఖరాలు చేసి అమలుజరిపే శాసనాధికారం లేదు. ఇదే పరిస్థితి క్రిమినల్‌ చట్టాలలోని లోపాలకు వర్తిస్తుంది. ఈ దుస్థితికి కారణం– పాలనా వ్యవస్థలోని రాజకీయనేతలే నేరగాళ్లతో, కోటీశ్వరుల ప్రయో జనాలతో మిలాఖత్‌ కావడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహి స్తున్నవారు కొందరూ.. పార్లమెంట్, అసెంబ్లీ సభ్యులలో కొందరూ మహిళలపై అత్యాచారాలలో, హత్యలలో ప్రత్యక్షంగానో, పరోక్షం గానో పాత్ర వహించడమూ! ఉత్తరప్రదేశ్‌లో పేరుమోసిన పాలకపక్ష శాసనసభ్యుడే ఉన్నావ్‌లో పేద మహిళపైన అత్యాచారానికి పాల్పడి తుదకు ఆమె కుటుంబ సభ్యుల మరణానికీ కారకుడయ్యాడు.

ఢిల్లీలో సామాన్య పేద విద్యావంతురాలైన ‘నిర్భయ’ దారుణ హత్యోదం తంలో గత ఏడేళ్లుగా శిక్షలు ఖరారై కూడా అమలు జరక్కపోవడం, దేశంలో ఇంతవరకూ 35,000 మంది అత్యాచారాలకు, హత్యలకు గురి కావడం, వారి విచారణల, శిక్షల గతి ఏమైందో ఇంతవరకూ దేశ ప్రజలకు తెలియకపోవటం న్యాయ వ్యవస్థలో స్తబ్దతను వేనోళ్ల ప్రశ్నించడానికి ఆస్కారమైంది. అందుకే– హైదరాబాద్‌ దుర్ఘటన (దిశ) సందర్భంగా, ఆ ఘటన వెల్లడి కాకముందు బిడ్డ గతిని తెలు సుకునేందుకు ‘దిశ’ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి రెండు పోలీస్‌ ఠాణాలకు కాళ్లకు బలపాలు కట్టుకునిపోగా, మూడు కిలోమీటర్ల పర్యంతం రెండు ఠాణాల పోలీసు అధికారులు ఫిర్యాదు నమోదు చేయడానికి మాది బాధ్యత కాదంటే మాది కాదని వారిని తిప్పి పంపడం జరిగింది.

ఒక పోలీస్‌ స్టేషన్‌లో అయితే, ‘మీ పిల్ల ఎవడితోనైనా లేచిపోయిందేమో’ అని వెటకారం చేసి ‘దిశ’ తల్లి దండ్రులకు మనోవేదన కలిగించారంటే మన పోలీసుల శిక్షణా పద్ధ తులు ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయో తెలుస్తుంది. అంత నిర్ల క్ష్యంగా వ్యవహరించిన కింది అధికారులను తరువాత ఉన్నతాధికారి ‘సస్పెండ్‌’ చేసినా, ‘దిశ’ హత్యా నిందితుల్ని తక్షణం గాలించి అరెస్టు చేయడానికి గల అవకాశం ఉండేది. కానీ అవకాశం కోల్పోయిన ఉన్న తాధికారులు తేలికైన ‘ఎన్‌కౌంటర్‌’ బాట పట్టవలసి వచ్చింది.     

ఇలాంటి ఘటనలో సత్వర న్యాయాన్ని ప్రజలు ఆశించడం సహజం. అయితే అది జరగనప్పుడే, పోలీసు యంత్రాంగం తన ఉనికి కోసం ఇతర మార్గాలు అనుసరించాల్సి వస్తుంది. అయితే అంతమాత్రాన, ఇదే వ్యవస్థలో మరో భాగమైన న్యాయ వ్యవస్థ పాత్ర మాత్రం ముగిసిపోయినట్టు భావించి పోలీసు యంత్రాంగం యథేచ్ఛగా ‘ఎన్‌కౌంటర్ల’కు పాల్పడరాదు. అలా జరిగితే, ప్రజా బాహుళ్యంలో ఏ వర్గానికి ఆ వర్గం తామే ‘చట్టం’ అని భావించుకుని శాంతి భద్రతల సమస్యపై కోర్టులతోనూ, ఠాణాలతోనూ సంబంధం లేకుండా యథేచ్ఛగా వ్యవహరించే పెద్ద ప్రమాదం ఉంటుంది.

అందుకే సుప్రీంకోర్టు సహితం ‘పోలీసులే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని అధికారం దుర్వినియోగం చేయడం ప్రభుత్వ ఉగ్రవాద చర్య (స్టేట్‌ టెర్రరిజం) అవుతుందని చెబుతూ ‘పోలీసులు జరిపే ఎన్‌ కౌంటర్లపై విచారణకు వివరమైన మార్గదర్శకాలను’ ప్రకటించాల్సి వచ్చింది. ఆమధ్య ఛత్తీస్‌గఢ్‌లోని సర్కె గూడా గ్రామంలో ‘నక్సలైట్లు’ అనే పేరిట సంబంధంలేని 15మంది సామాన్య గ్రామీణుల్ని స్థానిక, కేంద్ర పోలీసులు హతమార్చారని ఆ ఘటనపై పూర్తి విచారణ జరి పిన మధ్యప్రదేశ్‌ హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి వి.కె. అగర్వాల్‌ కమిషన్‌ ప్రక టిస్తూ, ఎదురుకాల్పుల్లో పోలీసులకు జరిగినట్లుగా చూపిన గాయా లను మాత్రం స్నేహపూర్వక గాయాలని (ఫ్రెండ్లీ ఫైర్‌) పేర్కొంది. 

ఇక ‘దిశ’ దుర్ఘటన అలా ఉండగానే, అదే స్థాయిలో ఇంతకు ముందు, ఇటీవలికాలంలో బడుగు, బలహీన వర్గాల కుటుంబాలలో పేద ఆడపిల్లలపై సంపన్న కుటుంబీకులు జరిపిన అత్యాచారాలు, హత్యలు ఎలాంటి వాకబు, విచారణ లేకుండా, నమోదు కాకుండా, అరెస్టులు లేకుండా ముగిసిపోవడం దారుణమైన వివక్ష కాదా? అన్న ప్రశ్న తలెత్తింది. ‘మా బిడ్డలూ ఆడబిడ్డలేకదా?’ అన్న సూటి ప్రశ్నను దివంగత టేకు లక్ష్మి (ఆసిఫాబాద్‌), మానస (వరంగల్‌), సుద్దాల శైలజ (మంచిర్యాల), మనీషా (హాజీపూర్‌) తల్లిదండ్రులు, భర్తలూ సంధిస్తున్నారు.

పాలకుల నుంచి, అంతరాల దొంతర్ల సమాజం నుంచి వీరు సమాధానాలు కోరుకుంటున్నారు. చివరికి అంతటి గుండెకోత మధ్య కూడా ‘దిశ’ తండ్రి, వీర సైనికుడైన శ్రీధర్‌రెడ్డి సహితం నిందితుల్ని ‘చట్ట ప్రకారమే శిక్షించాలని’ ఆ దిశగా చట్టాలను బలోపేతం చేయాలనీ కోరారు. అందుకే, ధనస్వామ్య వ్యవస్థలో ఉన్న ఇన్ని ప్రజా వ్యతిరేక అవలక్షణాల వల్లనే ప్రపంచ ప్రసిద్ధ సామా జిక శాస్త్రవేత్తలు ఒక చిరంతన సత్యాన్ని మన తలకెక్కించడానికి ఏనాడో ప్రయత్నించారు: ‘సంపన్న వర్గ నాగరికతలో నేర చరిత్ర’ ఎలా ఉంటుంది? ఆ వ్యవస్థలో ఓ తత్వవేత్త, భావాలను అందిస్తాడు, ఓ కవి కవితలు అల్లుకుంటూ పోతాడు, ఓ మతాచారి ప్రవచనాలు వల్లిస్తాడు, ఓ ప్రొఫెసర్‌ గ్రంథ రాజాల సారాంశాన్ని అందజేస్తాడు, ఓ నేరగాడు నేరాలు చేస్తూ పోతాడు.

ఈ వ్యవస్థలో నేరానికి పాల్ప డటం కూడా వస్తూత్పత్తి క్రమంలో సమాజంలో ఒక భాగంగానే సాగి పోతూ ఉంటుంది. ఇలా అటు సరుకుల ఉత్పత్తి క్రమానికి, సమాజా నికి మధ్య ఏర్పడే అవినాభావ సంబంధాన్ని దగ్గరగా పరిశీలిస్తే– మనలో పేరుకున్న అనేక భ్రమలు, దురభిప్రాయాలు పటాపంచలై పోతాయి. ఎందుకంటే నేరస్తుడనేవాడు ఒక్క నేరాలు చేయడంతోనే ఆగిపోడు, ఆ నేరాలతో పాటు ఆ నేర చట్టాన్ని (క్రిమినల్‌లా) రూపొందించడానికి తోడ్పడతాడు. కథ అంతటితో ఆగదు, నేర చట్టం ఆధారంగా మన ప్రొఫెసర్‌ ఆపైన ఉపన్యాసాలు దంచుతాడు. ఆపైన వాటన్నింటినీ క్రోడీకరించి అదే ఆచార్యుడు ఓ ఉద్గ్రంథం రాసేసి ఆ సంకలనాన్ని మార్కెట్‌లోకి ‘అమ్మకపు సరుకు’గా జనం లోకి తోసేస్తాడు. 

అలా ఈ నేర వ్యవస్థ మొత్తం పోలీసు వ్యవస్థను సృష్టిస్తుంది, నేర న్యాయ వ్యవస్థ, కానిస్టేబుల్స్, జడ్జీలు, ఉరితీసే తలారులు, తీర్పరులూ ఏర్పడతారు. సామాజిక శ్రమ విభజన, మానవుడిలో విభిన్న కోణాలలో శక్తి యుక్తులు పెరగడానికి దోహద పడుతుంది. తద్వారా కొత్త అవసరాల్ని, వాటిని తీర్చుకునేందుకు కొత్త మార్గాల్ని వెతుకుతుంది. ఈ అన్వేషణలో భాగంగా నేర చట్టాన్ని, శిక్షాస్మృతి, పీనల్‌కోడ్స్‌ని, వాటి తోపాటు లెజిస్లేటర్లనూ ఉత్పత్తి చేస్తుంది.

ఈ విధంగా నేరగాడు సమాజపు రొడ్డకొట్టుడు స్తబ్దతను చెదరగొట్టి, నిత్యం అభద్రతలో గడిపే ‘భద్ర పురుషుల’ జీవితాలకు భరోసాగా ఉంటాడు’’! ఈ వ్యవస్థలోనే కొనసాగుతున్నవి మన జీవితాలు! నేరగాళ్లను ఉత్పత్తి చేసే దోపిడీ వ్యవస్థ స్థానంలో నవ్య సమాజ సృష్టిని స్ఫురింపజేసే పుడమితల్లికి పురుటి నొప్పులు ఎప్పటివో?!


వ్యాసకర్త, 
ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు 

abkprasad2006@yahoo.co.in

మరిన్ని వార్తలు