ఆశకు దీపం, ఆరోగ్యానికి సైన్స్‌

7 Apr, 2020 00:24 IST|Sakshi

రెండో మాట

‘ఢిల్లీ ఆధ్యాత్మిక సమావేశంలో జరిగిన దానికి మతాన్ని ఆపాదించవద్దు. ఇది ఐక్యంగా నిలబడాల్సిన సమయం. కరోనా వ్యాధి మనం దరికీ ప్రత్యర్థి మహమ్మారి. ఆ సమావేశంలో పాల్గొన్నవారిలో విదేశాలనుంచి వచ్చిన ఆధ్యా త్మిక ప్రతినిధులతో మన దేశంలోని పలు ప్రాంతాలనుంచి వెళ్లినవారూ ఉన్నారు. ఈ విష యంలో మనవాళ్లనే మనం వేరుగా చూడనక్క ర్లేదు. ఇందుకు పలానా మతం వారిమీద మన వారిమీద ముద్రవేయడానికి ఎవరూ ఒక మతాన్ని వాడుకోవద్దు. ఇది ఎవరికైనా సంభవించే సంఘటన. మన దేశంలోనే అనేకమంది ఆధ్యా త్మిక వేత్తలున్నారు. విదేశాల్లోనూ వేలు, లక్షల సంఖ్యలో భక్తులున్న అనేకమంది పెద్దలు అన్ని మతాల్లోనూ ఉన్నారు. ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఉద్యమ కర్త రవిశంకర్, జగ్గీవాసుదేవ్‌ ఈషా ఫౌండేషన్, జాన్‌ వెస్లీ దినకరన్‌ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో గానీ, మాతా అమృతానందమయ సభల్లో గానీ ఎవరైనా పాల్గొనవచ్చు, ఎవరికైనా ఈ పరిస్థితి రావొచ్చు. ఎక్కడైనా జరగవచ్చు. కరోనా కాటుకు మందులేదు, మతాల్లేవు, కరోనా కాటుకు ధనిక, పేద అనే తేడా కూడా లేదు. ఈ యుద్ధంలో మన ఏకైక ప్రత్యర్థి కంటికి కనిపించని కరోనా వైరస్‌’
– ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి (4–4–2020)

మానవజాతి ప్రగతిపథంవైపు సాగించిన ప్రతీ అడుగూ రక్తతర్పణ తోనే సాగింది. నర రక్తం ఇంతగా ప్రవహించడానికి అన్ని మతాల ధర్మా చార్యులే కారణం, వారే బాధ్యులు, ఏ ఒక్క మతమూ, మతాచార్యులు గర్వించవలసింది ఏమీ లేదు
– మహాపండిత రాహుల్‌ సాంకృత్యాయన్‌

మానవుడు ప్రస్తుత ఆశాజీవి.  ఆ ఆశతోనే అతని బతుకు, వ్యాప కాలు ఆధారపడి ఉంటాయి. అలాగే రోగాలూ, రొష్టులూ, నలతలు, కలతలూ ఉంటాయి. జీవితం కోసం జరిగే ఆరాటాలు, పోరాటాలు, దుష్టశక్తులను పరిమార్చడానికి కొట్లాటలు, కుమ్ములాటలు, ఇంటా బయటా సామ్రాజ్యవాద శక్తులనుంచి, దోపిడీ వర్గాల నుంచి ఎదు రయ్యే కష్టనష్టాలను యుద్ధాలను ఎదిరించి ప్రాణాలొడ్డి జీవశక్తిగా ప్రజలు మనుగడ సాగిస్తూ వచ్చారు. సామాజిక, రాజకీయ రంగాలలో నవచైతన్యం కోసం ప్రజలకు సంక్షేమ రాజ్య, సమసమాజ వ్యవస్థ స్థాపన కోసం జరిగే విప్లవాలూ మానవుడి చైతన్యం ఫలితమే. అలాంటి మానవుడు పూర్వయుగాలలోనూ, అపూర్వ శకాలలోనూ అంటువ్యాధికారకాలైన వైరస్‌ క్రిముల్ని, మహమ్మారిగా పరివ్యాప్తమ వుతూ వస్తున్న విషక్రిముల్ని ఎదుర్కొంటూ నష్టాలమధ్యనే గర్వించద గిన విజయాలు సాధిస్తూ వస్తున్నాడు మానవుడు.

అణువునుంచి పరమాణువు నుంచి ప్రాణస్పందన పొందిన మానవుడు విశ్వాంత రాళాలకు, నక్షత్ర మండలాలకు ఎగబాకడమే కాదు, పసిగుడ్డుగా తల్లి ఒడిలో జాబిల్లి రావే, గోగుపూలు తేవే, అంటూ గోరుముద్దలు తిన్న దశనుదాటి.. మానవ చరిత్రలో తొలిసారిగా చంద్రమండలాధినేత కాగల్గిన దశకు ఎదిగి నిరంతరం ప్రకృతిని జయించే పరిశోధనలో మానవుడున్నాడు. ఈ పరిణామం అంతా మానవుడు ఆశాజీవి, తన ఉనికి సార్థకతను నిరంతరం నిరూపించుకుని విజయాలు సాధిస్తు న్నాడు. అలాంటి ఆశాజీవిలో వ్యాధి నిరోధక శక్తిని, మంచి చెడుల నిర్ణ యానికి, చెడును ఎదుర్కొని మంచిని పెంచే వైజ్ఞానిక దృష్టిని కలి గించేవి అంధయుగాలలో మానవుణ్ణి నడిపించిన గుడ్డి నమ్మకాలు కావు. కేవలం మానవ నిర్మిత పరిశోధనాగారాలలో శాస్త్ర సాంకేతిక పరిశోధనాలయాల నుంచి అందివస్తున్న నిగ్గుతేలిన ఔషధాలే, మందులూ, మాకులేనని మరవరాదు. ‘ఆత్మ అనే దీపం వెలిగేందుకు, ఆశ అనే తైలం ముఖ్యం’ అన్నాడొక క్రాంతదర్శి.
అందుకే ఉపనిషత్తు కూడా మనసులోని చీకటిని పారదోలే మార్గాన్ని ఉపమాలంకారంలో ‘జ్యోతి’తో పోల్చింది కాంతిని. అంతేగానీ ఉన్న కాంతినిగానీ, సహ జమైన వెలుగునుగానీ ఆర్పేసుకుని కొవ్వొత్తిని ఆశ్రయించమన్న దాఖ లాలెక్కడా లేవు. అందుకే బుద్ధిని, సంఘాన్ని, ధర్మాన్ని (త్రికరణాలు) మాత్రమే నమ్ముకోమన్న బౌద్ధాన్ని దేశంలోని మౌఢ్య శిఖామణులు భారతదేశం సరిహద్దులు దాటించినప్పుడే దేశం ఆత్మహత్య చేసు కొందని మహాకవి గురజాడ నేటికి వందేళ్లనాడు చాటవలసి వచ్చింది. 

మనం శాస్త్రవేత్తల పరిశోధనా ఫలితాల్ని మర్చిపోతున్నాం. అసలు వివిధ రంగాల్లో మానవుడు సాధించిన అగణితమైన విజయాలనే విస్మరిస్తున్నాం. ఆశను పోగొట్టుకోకూడదు. కానీ దాని వెలుగులోనే మూఢ విశ్వాసాల్ని పెంచి సైన్స్, సాంకేతిక పరిజ్ఞానం మానవాళి సుఖం కోరి పెంచుకు వస్తున్న విజయాలను తక్కువచేసి, మూఢ విశ్వా సాలకి ‘చాపకింద నీరులా’ కొందరు పరిచి పాకించే అశాస్త్రీయ మందుల్ని మాకుల్ని ప్రోత్సహించే అధికారిక, అనధికారిక ప్రయ త్నాల్ని అడ్డుకొనక తప్పదు.
 
ఇందుకు తాజా ఉదాహరణగా– కేంద్ర ప్రభుత్వ ‘ఆయుష్‌’ మంత్రిత్వ శాఖ నేటి కరోనా వ్యాధి వ్యాప్తి సంద ర్భంగా విడుదల చేసిన ప్రకటన. ఆయుర్వేద, యోగ, ప్రకృతి వైద్యం, యునానీ, సిద్ధ, హోమియోపతి వైద్యం పేరిట ‘ఆయుష్‌’ శాఖ మంత్రి శ్రీపాదనాయక్‌ ‘ఆయుర్వేద, హోమియోపతి మందుల్ని కోవిడ్‌–19 వ్యాధికి గురైన బ్రిటిష్‌ రాకుమారుడు ప్రిన్స్‌ చార్లెస్‌ వాడినందువల్ల రాకుమారుడు వ్యాధి బారి నుంచి కోలుకున్నాడని ప్రకటించారు. అంతేగాదు, పైగా వేలకొలది సంవత్సరాలుగా ఆచరణలో ఉన్న ఈ వైద్యం వల్లనే రాకుమారుడు కోలుకున్నాడని రుజువైందన్న మంత్రి ప్రకటనను బ్రిటిష్‌ క్లియరెన్స్‌హౌస్‌ ప్రతినిధి అబద్ధంగా తోసిపుచ్చి ఖండించాల్సి వచ్చింది.

దీనికితోడు, భారతదేశంలోని ప్రెస్‌కౌన్సిల్‌ కూడా ఒక ప్రకటన చేస్తూ, ‘ఆయుష్‌ మంత్రిత్వ శాఖ కోవిడ్‌–19 కరోనా వ్యాధి నివార ణకు సంబంధించి విడుదల చేసే ప్రచారాన్నిగానీ, తప్పుదోవ పట్టించే ఆయుష్‌ ప్రకటనలనుగానీ దేశీయ పత్రికలు నిలుపు చేయాలని కోరింది. ఐక్యరాజ్యసమితి విద్యా, సాంస్కృతిక శాఖ కూడా ఏం చెబు తోంది? ‘పత్రికా స్వేచ్ఛ, సుపరిపాలనా వ్యవస్థ పరస్పర ఆధారా లు’గా ఉండాలనీ, దేశ ఆర్థిక, మానవ వికాసానికి దోహదం చేయ వలసిన బాధ్యత ఈ సంస్థలకు ఉందని ఆదేశిస్తోంది యునెస్కో. అందుచేత మానవుడి చేతనా శక్తిని కాపాడుకుంటూనే, ఇలాంటి మహమ్మారి వ్యాధులు వ్యాప్తిలోకి వచ్చినప్పుడు (రావన్న ఆశ కూడా తప్పే) దాని తాలూకు ప్రభావాన్ని మన మనస్సులపై బాధతో కూడిన ఒత్తిడిని తట్టుకోగల శక్తిని పుంజుకోవడం కోసం మనలోని ఆశకు ప్రతి రూపంగా ఆశాదీపం సర్వదా వెలుగుతూనే ఉండాలి. మంచి జరగా లన్న కోరికే మనసుకు ఒక వెలుగు. కానీ, ఆ వెలుగులో దేశంలోని 130 కోట్ల మంది ప్రజల్లో 80 కోట్లమంది పేదలకు ‘పొయ్యిలోని పిల్లి’ లేవ లేదు, నిలువ నీడకూ ముఖాలు వాసిపోతున్నాయన్న ఇంగితం, స్పృహ పాలకులకు, రాజకీయులకు అనవసరం.
 
మనది ‘సెక్యులర్‌ భారతం’ అని మురిసిపోతున్న దశ అంతరించి ‘పెక్యులియర్‌’ (వింత) భారతాన్ని ‘జంతరపెట్టె’లో మాత్రమే చూడ గలుగుతున్నాం. మౌలిక సౌకర్యాల కల్పనకు, వాటి పటిష్టతకు మారుగా చిట్కాలకు దిగుతున్నారు. అశాస్త్రీయ మౌఢ్య ధోరణుల్ని (సూడో సైన్స్‌) ప్రసిద్ధ అంతర్జాతీయ సంబంధాల పరిశోధకుడు, శివ నాడార్‌ యునివర్సిటీ ప్రొఫెసర్‌ అతుల్‌ మిశ్రా ఖండిస్తూ ప్రకటన చేశారు. ప్రజలంతా కలిసి మూకుమ్మడిగా ‘కరోనా గో బ్యాక్‌’ అంటూ నినదిస్తే అది ‘క్వాంటమ్‌ సూత్రం’ (మూక సూత్రం/సంఖ్యాబలం) అవుతుందిగానీ అది తోక ముడవదని చెప్పారు. మూకసూత్రానికి సైన్స్‌కి సంబంధం ఏమిటో ‘గోబ్యాక్‌’ సూత్రకారులు వివరించి ప్రజల జ్ఞాన తృష్ణను తీర్చలేకపోయారు. ఇలాంటి అశాస్త్రీయ మూఢ విశ్వా సాలు ‘ఈ క్లిష్ట కాలంలో భారతదేశ ప్రజారోగ్య విధానానికి అత్యంత ప్రమాదకర పరిణామం’గా ప్రొఫెసర్‌ మిశ్రా పేర్కొన్నారు. అంతే గాదు, ‘దేశ ప్రధానమంత్రి అనే వ్యక్తి జాతీయ సమస్యలపై మాట్లాడి నప్పుడు ఆ మాటలకు విలువుండాలి. వైరస్‌ మహమ్మారిని ఎదుర్కో డానికి సైన్స్‌ పరిజ్ఞానానికి మించిన విశ్వసనీయమైన ఆయుధం లేదని ప్రధాని ప్రజలకు చెప్పి జ్ఞానోదయం కలిగించాల్సిన సమయంలో మనం పక్కదారులు తొక్కకూడదని’ మిశ్రా బోధ. ఈ పక్కదారులు పట్టినందుకే రాజ్యాంగంలోని ‘పౌర బాధ్యతల’ అధ్యాయానికి కూడా ‘కరోనా’అంటుకుంది.
 
ఈ మానసిక కరోనా వల్లనే ‘లోకాస్సమస్తా సుఖినోభవంతు’ (సర్వదా సుఖంగా ఉండాలి) అన్న సార్వజనీన లక్ష్యం కూడా మనకు దూరమవుతోందని గుర్తించాలి. కనుకనే దీపాలు దీపాలుగానే ఉన్నాయి. పాలనా వ్యవస్థల కానరాని దుర్మార్గాలే దీపాలను కొడి గట్టించే శాపాలుగా రూపాంతరం చెందాయి. మన ఆర్థిక వ్యవస్థ దీపమూ కొడిగట్టిపోయింది. దాని సరసనే నూటికి 80 మంది సామాన్య ప్రజల జీవితాలూ ఆరోగ్యభాగ్యానికి దూరమై కొడిగట్టి పోతున్నాయి.
 
ప్రస్తుత దేశ పరిస్థితుల్లో ఆర్థిక, పారిశ్రామిక రంగం బడా బాబులకు వాళ్ల ప్రయోజనాల రక్షణ కోసం జాతీయ బ్యాంకుల గోళ్లు ఊడగొట్టి వాటి విలీనం పేరిట తిరిగి అలవికాని బడా వర్గాల ప్రయోజనాల కోసమే పనిచేయబోతున్నాయి. ఇదంతా కల్తీ ఎరగని దీపకాంతిలోనే సుమా! రుగ్వేదకాలంలోనే 23 రోగాలు పేర్కొని శ్రద్ధతో నివారణమందులు కనిపెట్టి వాడారు. రోగాన్ని రుగ్వేదార్యులు ‘యక్ష్మ’ అన్నారు. క్షయను ‘రాజయక్ష్మ’ (రాచపుండు) అన్నారు ప్రాచీ నులు. శక్తివంతమైన మందుల్ని వాడితేనే రోగాలు నయమవుతాయని అధర్వణ వేద రుషి వాక్కు. పైగా ఎలాంటి జ్వరంగానీ, రోగంగానీ లేకుండానే గుండె ఆగి ఆకస్మికంగా చనిపోవడాన్ని ‘శ్లాఘనీయ మరణం’ (మంచి చావు)గా భావించారేగానీ ఉన్న దీపాలు కాసేపు ఆపి, మళ్లీ అవే దీపాల్ని వెలిగించుకోమనలేదు. జీవించాలన్న మనిషి ఆశాదీప కాంతితోనే ప్రజారోగ్యానికి బలమైన అసలు సిసలు దీపశిఖ!!


ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in 

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా