ముసుగు కరోనాది–లొసుగు బాబుది

17 Mar, 2020 00:33 IST|Sakshi

రెండో మాట

‘కరోనా అంటువ్యాధి కారణంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు నిలిపివేస్తున్నాను. ఆరు వారాల తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత రాష్ట్రంలో తిరిగి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. అత్యున్నత స్థాయి అధి కారులతో చర్చించి పరిస్థితులను మదింపు వేసి ఈ నిర్ణయం తీసుకున్నాను’  – ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఆకస్మిక ప్రకటన

‘రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు ప్రతినిధిగా వర్ల రామయ్య ఎన్నికల కమిషనర్‌కు ఒక లేఖ అందచేశారు’ – మీడియా వార్తలు

2019 సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చరిత్రలో కనీవినీ ఎరుగని ఓటమిని పొందిన తర్వాత, ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్ర  బాబునాయుడు మనఃస్థిమితం కోల్పోయి ప్రవర్తిస్తున్నాడనడానికి స్థానిక ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ తన హయాంలో అధికార పదవులు వెలగబెట్టిన ఎన్నికల కమిషనర్‌ రమేష్‌ కుమార్‌ను ప్రభావితం చేస్తూ కోరడమే నిదర్శనం. పదవీచ్యుతుడైన పాలకుడు తిరిగి ఆ పదవిలోకి పునరావాసం చేయడానికి ఎన్ని సాకు లైనా వెతు  కుతాడు. ఆ పనిలోనే ఉన్న చంద్రబాబు చేతికి, నోటికి అంది వచ్చిన సరికొత్త ‘ఆయుధం’ కరోనా వ్యాధి.

చైనాలో ఒక రాష్ట్రంలోని ఒక నగరంలో పుట్టి పెరిగిన కరోనా వ్యాధి తీవ్రతను అదుపులోకి తెచ్చినందుకు ఒకవైపున ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతులు చైనాను ప్రశంసించింది. మరోవైపున ప్రపం చవ్యాపితంగా చైనా నుంచి ఇతరదేశాలకు, ఇతర దేశాల నుంచి చైనాకు ప్రయాణాలు నిలిపివేయడంతోసహా, పౌరులపై అనేక దేశాలు ఆంక్షలు విధించి, వ్యాధి వ్యాప్తిని అడ్డుకునే చర్యలు ముమ్మరం చేశాయి. భారతదేశంలో కూడా కరోనా వ్యాప్తి నిరోధానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ స్థాయిల్లో ప్రజారోగ్య రక్షణకు ముందస్తు చర్యలూ ముమ్మరం చేశాయి. అన్ని రాష్ట్రాల్లో కన్నా కరోనా వైరస్‌ వార్తలు వెల్ల డైన మరుక్షణం నుంచే దాని వ్యాప్తి నిరోధానికి ముమ్మరంగా జయ ప్రదంగా చర్యలు తీసుకుంటూనే అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నవారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి. 

పైగా స్థానిక సంస్థల ఎన్నికలను గతంలో చంద్రబాబు ప్రభుత్వం సాధా రణ పరిస్థితుల్లో కూడా సాకులపై సాకులు చూపెట్టి, వాయిదా వేసింది. ఆ సంగతిని ‘పరగడుపు’ చేసుకున్న బాబు, అడుగూడి చతి కిలబడిన అతని వర్గమూ, ఎన్టీఆర్‌ ప్రాణాలు తోడేయడంలో బాబుకు చేదోడువాదోడుగా నిలిచిన రెండు దిన పత్రికలూ, వాటి టీవీ చానళ్లూ, ఈరోజున కరోనాను రాజకీయ ప్రచారానికి వాడుకుంటూ.. సాధారణ ప్రభుత్వ కార్యకలాపాలకు, కరోనాతో సంబంధం లేని స్థానిక సంస్థల ఎన్నికలకూ స్వార్థ బుద్ధితో మోకాలడ్డుతున్నారు. స్థానిక సంస్థలకూ ప్రకటితమైన ఎన్నికల షెడ్యూల్‌నే మార్పించేందుకు తంత్రాలు, కుతం త్రాలు పన్నుతున్నారు.

నిజానికి ఎన్నికల షెడ్యూల్‌ మొదలై, జిల్లా పరిషత్, మున్సి పాలిటీ, గ్రామ పంచాయతీల స్థాయిలో వివిధ పార్టీల తరపున అభ్య ర్థుల నామినేషన్లు, ప్రచారాల ఆర్భాటం ప్రారంభం కావడమూ, కొన్ని చోట్ల అభ్యర్థుల నామినేషన్లు ఏకగ్రీవంగా ఖరారు కావటమూ జరిగి పోతున్నాయి. ఈ దశలో ఎన్నికల కమిషనర్‌ రమేష్‌ ఎన్నికలను ఆరు వారాలపాటు నిలిపివేస్తూ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం అప్రజా స్వామికం, నిరంకుశం, అసాధారణం కావడమే కాదు, ఒక తరహా రాచరికపు ధోరణి కూడా. ఈ ధోరణినే రాచరికాల రోజుల్లోనే లార్డ్‌ కోక్‌.. ‘అయ్యా, చట్టానికి రాజే కాదు, వాడబ్బ ఎవడైనా సరే అతీతు డుగా ఉండడానికి అర్హుడు కాడు’ అన్నాడు. 

చంద్రబాబు హయాంలో ఒక్క రమేష్‌ కాదు, వారి కుటుంబ సభ్యులొకరు కూడా ఉద్యోగార్థులై కొలువుకూటంలో చేరి ఉన్నందువల్ల కూడా న్యాయ నిర్ణయంలో సమతుల్యతను కోల్పోవలసి వచ్చింది. కమిషనర్‌ అసలు ఎన్నికలను ఏకపక్షంగా వాయిదా వేసే ముందు కనీస బాధ్యతగా రాష్ట్ర గవర్నర్‌ను కలుసుకొని ఫలానా కారణంవల్ల వాయిదా వేస్తున్నాను అని చెప్పి ఉండాలి గదా? మొదటి కర్తవ్యంగా ఆ పని చేయకపోగా ఎన్నికల కమిషనర్‌ విధిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోనూ, ఆరోగ్య, వైద్య శాఖ కార్యదర్శితోనూ సంప్రదించాల్సిన అవసరం ఉందా లేదా? ఈ దారుణమైన తన లోపాన్ని ఎన్నికల కమిషనర్‌ రమేష్‌ ఎక్కడ కప్పిపుచ్చుకోవాలనుకున్నారు? ఈ బాధ్యతను ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ఎత్తిచూపేదాకా ఎన్నికల కమిషనర్‌ స్పృహకు రాకపో వటం యాదృచ్ఛికమా? ఎగవేతా? 

తీరా.. తాను తీసుకున్న నిరంకుశాధికార చర్యకు సమర్థనగా కమిషనర్‌ ఎరువు తెచ్చుకుని చెప్పిన సాకు ‘కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడి తాను నిర్ణయం తీసుకున్నాను’ అని మాత్రమే. కానీ, అప్పటికే చంద్రబాబు తాను కమిషనర్‌ను ‘వాయిదా వేయమని కోరాన’ని ప్రకటించడమూ జరిగిపోయింది. ఈ అర్ధంతరంగా జారీ చేసిన ఆకస్మిక నిర్ణయంలో బాబు పాత్రతో పాటు కమిషనర్‌ చెబు తున్నట్టు ‘కేంద్ర ఆరోగ్య శాఖాధికారుల’ పాత్ర ఎంత? బీజేపీ పాలకుల పాత్ర ఎంత? అన్న విషయాలు కూడా తేలాలి. ఎందుకంటే మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలదోయడానికి, తిరిగి ఎన్ని కలు జరపమని కోరడానికి బీజేపీ పాలకులకు మాత్రం ‘కరోనా’ వైరస్‌ అడ్డురావటం లేదు కాబట్టి, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి కూడా స్పష్టం కావాలి. 

అంతేగాదు, రాష్ట్రంలోని అన్ని పరిస్థితులను, అన్ని స్థాయిల లోనూ ఉన్నతాధికారులతోనూ సంప్రదింపులు జరిపి, అభిప్రాయాలు ప్రజాస్వామికంగా సేకరించిన తరువాతనే ఆరు నెలలపాటు ఎన్నికల నిర్వహణ బాధ్యతలకు సంబంధించిన నిర్ణయాలు సాధికారికంగా తీసుకున్న తరువాతనే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు బ్యాలెట్‌ పత్రాలు తదితర సరంజామా అంతా సిద్ధపరచుకున్న తరువాతనే ఎన్నికల ప్రక్రియకు దిగిందని బాబుకి, ఆయనకు ఆశ్రయం కల్పించిన కమిషనర్‌ రమేష్‌కు తెలిసి ఉండాలి. అసలు గుబులంతా ఎప్పుడైతే వివిధ పార్టీలు తమ అభ్యర్థులు నామినేషన్లు వేయటం ప్రారంభిం చాయో, అప్పటినుంచే పలుచోట్ల ఏకగ్రీవంగా ఆమోదం పొందిన ట్లుగా ప్రకటనలు వెలువడుతూ వచ్చాయి. కుంగి, కృశించిపోతున్న బాబుకు, ఆయన వర్గానికీ ఇదే కంటగింపు అయింది. 

జగన్‌ ‘నవ రత్నాలు’, మాటకు కట్టుబడి ఉండే మనసూ, తత్వమూ.. ఆచరణలో అవి అక్షరాలా అమలు జరుగుతున్న తీరూ, ప్రజలలో మెజారిటీ బడుగు, బలహీన వర్గాలలో ఇంతకాలం కొనసాగుతున్న నైరాశ్యం క్రమంగా తొలగి ఆశావహులుగా మారుతున్న పరిణామం రాష్ట్రంలో కనపడుతోంది. ఒక వైపున పేదసాదల్లో, మధ్య తరగతి ఉద్యోగ సద్యోగ జీవుల్లో కొత్త ఆశలు చిగురించి భవిష్యత్తు ఆశాజనకంగా ఉండ గలదన్న భావం మొలకెత్తుతున్న సమయంలో పాలకుండలో విషపు చుక్కలు కలిపి ఆనందించే దశలో బాబు వర్గమూ, ఆయని పంచన చేరిన కాంగ్రెస్‌ లోని ఒక వర్గమూ (అహ్మద్‌పటేల్‌) ఉంది. మరొకవైపు నుంచి జగన్‌ పాలనకు ఇబ్బందులు కలిగించే బాబు వర్గంలోని ‘కపట సన్యాసుల’ ముఠాకు బీజేపీ కేంద్ర నాయకత్వం ఆశ్రయం కల్పించి ‘రెండుగుళ్ల, మూడుగుళ్ల ఆటకు అలవాటుపడటమూ జరుగుతోంది. 

ఆంధ్రప్రదేశ్‌లో పట్టుమని రెండు ‘కరోనా’ కేసులు (ధ్రువపడ నివి) లేకపోయినా, స్థానిక ఎన్నికలు సహజంగా జరక్కుండా చేయా లన్న బాబు దుగ్ధ, అందుకు కమిషనర్‌ సహకరించడానికి బిడియంతో నైనా తలూపడమూ– ‘కరోనా’కు మించిన వైరస్‌గానే భావించాల్సి ఉంటుంది. అప్పులతో రాష్ట్రాన్ని, ప్రజలను ముంచి వెళ్లింది చాలక, తప్పనిసరిగా రాజ్యాంగ విహితంగా జరగవలసిన స్థానిక ఎన్నికలను ప్రభుత్వం నిర్వహించకుండా చేయడం.. తద్వారా లక్షలాదిమంది పేదలకు దక్కనున్న స్థలాల పంపిణీని ఎన్నికలను వాయిదా వేయిం చడంద్వారా వారి పొట్ట కొట్టడమూ చంద్రబాబుకీ, పక్షపాతంతో ఉన్న అతని పక్షానికే చెల్లు. 

‘కరోనా’ వల్ల ఎన్నికలను వాయిదా వేయాలన్న బ్యూరాక్రాట్‌ బుర్ర లక్షలాదిమంది విద్యార్థులు హాజరయ్యే పరీక్షల్ని, అధికారుల ట్రాన్స్‌ఫర్లను మాత్రం ఆపలేకపోయింది ఎందుకనో! చివ రికి ఈ దేశంలో న్యాయ వ్యవస్థపై విశ్వాసమున్న వారు కేవలం అవి నీతిపరులు (స్కామర్స్‌), స్మగ్లర్లు, బడాబాబులు, రాజకీయులు, పెద్ద పెద్ద కేసుల్లో ఇరుకున్న నిరంకుశాధికారులు (బ్యూరాక్రాట్స్‌) కావటం ఒక ఆనవాయితీగా మారినందుననే, సామాన్యులకు పెక్కు సంద ర్భాల్లో న్యాయం దూరమవుతోందని సుప్రసిద్ధ విశ్లేషకుడు సుధాంశు రంజన్‌ (జస్టిస్‌ వర్సెస్‌ జ్యుడీషియరీ రచన, ఆక్స్‌ఫర్డ్‌ ప్రెస్, 2019, పే.11) పేర్కొన్నారు.

ఇంతవరకు భారత రాష్ట్రాల ప్రభుత్వ స్థాయిలో సంస్థలతో ప్రపంచబ్యాంకు, దాని అనుబంధ సంస్థలు చర్చలు జరుపుతాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఒకే ఒక వ్యక్తితో, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే చర్చలు జరపాల్సి వస్తోంది. మిగతా అధికారులు ఉండరు. పైగా బాబు ప్రభుత్వం చూపే చిట్టా ఆవర్జా లెక్కలు విశ్వసనీయమైనవి కావు (డ్యూబియస్‌)’ అని ప్రపంచబ్యాంకు అను బంధ సంస్థ డీఎఫ్‌ఈడీ (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌ మెంట్‌) నిధులు సమకూర్చిన సంస్థ తరఫున సర్వే జరిపిన ప్రొఫెసర్‌ జేమ్స్‌ మానర్‌ వెల్లడించాడు. 

ఇంతటి ‘ఘన చరిత్ర’ కలిగిన చంద్ర బాబు విభజనానంతర ఏపీ తొలి ముఖ్యమంత్రిగా తన హయాంలో చేసిన నిర్వాకం ఇది. ఆనాటి దాగుడు మూతలకు కాలం చెల్లిపో యింది కాబట్టి తాజాగా వైసీపీ పాలనను జగన్‌ ధాటిని ఎదుర్కోవ డానికి బాబు ఆశ్రయించిన కొత్త క్రిమి ‘కరోనా వైరస్‌’. కానీ, బాబు మరిచిపోతున్న అసలు వాస్తవం– జీవ శాస్త్రవేత్తలు మానవుడే అసలు బ్యాక్టీరియా (మ్యాన్‌ ఈజ్‌ బ్యాక్టీరియా) అని నామకరణం చేశారని మరచిపోరాదు!
           
వ్యాసకర్త: ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

మరిన్ని వార్తలు