‘గోప్యత’పై ఎందుకీ విరగబాటు?

25 Dec, 2018 02:11 IST|Sakshi

దేశ పౌరుల పర్సనల్‌ కంప్యూటర్లలోకి, ఇతర సమాచార మాధ్యమాలలోకి చొరబyì , తనిఖీలను య«థేచ్ఛగా సాగించి వ్యక్తిగత సంభాషణలను, సందేశాలను, ఇతరత్రా వ్యక్తుల మధ్య బట్వాడా అవుతున్న సమాచారాన్ని సేకరించి పాలకులకు అందచేయడానికి కేంద్ర ప్రభుత్వం దేశంలోని 10 సాధికార కూపీ సంస్థలకు సంపూర్ణ అధికారాలను దఖలు పర్చింది. నెట్‌లోకి, ‘నట్టింటి’లోకీ, పర్సనల్‌ సెల్‌ ఫోన్లలోకి ‘దొంగల్లా’ తొంగిచూసే హక్కు నిఘా సంస్థలకు ధారాదత్తం చేసింది దారితప్పిన కేంద్రం. ఇది గతంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటన తర్వాత అంతటి స్థాయిలో తీసుకున్న ప్రమాదకర నిర్ణయం. ఇది అప్రకటిత అత్యవసర పరిస్థితి.

‘తీర్పరులైన న్యాయమూర్తులు (లా మెన్‌) నోరు విప్పకుండా మౌనంగా ఉండిపోతే ఆ పరి స్థితి – అమాయకులు పాల్పడే హింస కన్నా వీరి వల్ల సమాజానికి జరిగే హానీ, చెరుపే ఎక్కువ. న్యాయమూర్తులు రాజ్యాం గపరమైన కనికరం, దయార్ద్ర మనస్సుతో, మానవత్వంతో వ్యవహరిం చాలి. న్యాయస్థానం చూపాల్సిన కనికరం లేదా దయ అన్నది న్యాయ మూర్తి చూపే దాతృత్వమో లేదా భిక్షో కాదు సుమా! అది రాజ్యాంగ ధర్మాసనం (కాన్‌స్టిట్యూషనల్‌ కోర్టు) విధిగా నిర్వర్తించాల్సిన బాధ్యత అని మర్చిపోరాదు’
– ముగ్గురు సుప్రీం ప్రధాన న్యాయమూర్తులలో ఒకరుగా ఉండి ఇటీవలే రిటైరైన సుప్రసిద్ధ జస్టిస్‌ కురియన్‌ జోసఫ్‌ ఉవాచ (29–11–08)

ఈ మాటల్ని, హెచ్చరికను జస్టిస్‌ కురియన్‌ జోసఫ్‌ ఇప్పుడు ఎందుకు హెచ్చరికగా చెప్పవలసి వచ్చింది? నేడు దేశంలో న్యాయస్థానాలను, రాజ్యాంగ ధర్మాసనాన్ని, పలు రిపబ్లిక్‌ రాజ్యాంగ సంస్థలన్నీ, ప్రజా స్వామ్య విలువలను, స్థిరపడి పురోగమిస్తున్న పలు విద్యావిధానాలను, శాస్త్ర సాంకేతిక వ్యవస్థల నిర్ణయాలను నర్మగర్భంగానూ, బాహాటం గానూ, రాజకీయ పాలనా వ్యవస్థలోని ‘పెద్దలు’ ఉల్లంఘిస్తూ వస్తున్న సమయంలో దేశప్రజలకు ఈ రకంగా  విన్నవించవలసి వచ్చింది. కానీ జస్టిస్‌ జోసఫ్‌ ప్రకటన పట్టుమని నెలరోజులు కూడా ముగియకుండానే నేటి పాలకులు పార్లమెంటులో చర్చించి అనుమతి పొందకుండానే దేశ ప్రజల సమాచార స్వేచ్ఛను, పౌర స్వేచ్ఛను దెబ్బతీసే మరొక ప్రమా దకరమైన ఉత్తర్వును అకస్మాత్తుగా విడుదల చేశారు.

కురియన్‌ వీడ్కోలు సందర్భంగా నేటి ప్రధాన న్యాయమూర్తి, కొలది మాసాల క్రితం నాటి నలుగురు సీనియర్‌ న్యాయమూర్తులలో ఒకరుగా దేశంలో ప్రజాస్వామ్య వాదులకు హెచ్చరికగా న్యాయస్థానంలో కొన్ని సందర్భాల్లో పాలకుల ఒత్తిడి వల్ల కలత చెందుతూనే న్యాయవ్యవస్థకు, రాజ్యాంగ బద్ధతకు విరుద్ధంగా ఎలాంటి నిర్ణయాలు జరుగుతున్నాయో ప్రజల్ని జాగరూ కులను చేస్తూ చరిత్రాత్మక నిర్ణయాలు చేయడం అందరికీ తెలుసు. 

అయినా సరే ఏదో ఒక మిషతో ప్రజాశ్రేయస్సుకు విరుద్ధమైన నిర్ణయాలను స్వార్ధ ప్రయోజనాలతో చేస్తూ ఉండటం కాంగ్రెస్, బీజేపీ పాలనా వ్యవస్థలకు సమానమైన దురలవాటుగా పరిణమించడం దేశ ప్రజల అనుభవం కనుకనే ఈ రెండు రకాల పాలకవర్గాలు (కాంగ్రెస్, బీజేపీ) తాము తీసుకునే ప్రజావ్యతిరేక నిర్ణయాలకు ఆకస్మిక ఉత్తర్వు లకు, నిరంకుశ ఆర్డినెన్సులకూ ‘త్వం’ అంటే ‘త్వం’ అంటూ పరస్పరం నిందించుకుంటూ ప్రజల్ని వెర్రివెంగళప్పలుగా  చేస్తున్నారు. ఇందుకు తాజాగా బీజేపీ పాలకులు.. గతంలో ఇందిరాగాంధీ, ఎమర్జెన్సీ ప్రకటన తర్వాత అంతటి స్థాయిలో (21–12–2018) తీసుకున్న ప్రమాదకర నిర్ణయం.

ఇది అప్రకటిత అత్యవసర పరిస్థితి. దేశపౌరుల పర్సనల్‌ కంప్యూటర్లలోకి, ఇతర సమాచార మాధ్యమాలలోకి చొరబడి, (ఈ అవకాశం లేకుండా బంధించిన ఎన్‌క్రిప్షన్‌ని బద్దలు కొట్టి) తనిఖీలను యథేచ్ఛగా సాగించి వ్యక్తిగత సంభాషణలను, సందేశాలను, ఇతరత్రా వ్యక్తుల మధ్య బట్వాడా అవుతున్న సమాచారాన్ని సేకరించి పాలకులకు అందచేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని 10 సాధికార కూపీ సంస్థలకు (కేంద్ర గూఢచార సంస్థ, ఎన్‌సీబీ, ఈడీ, సీబీఐ తదితర కేంద్ర నిఘాసంస్థలు) సంపూర్ణ అధికారాలను వాటి హక్కుగా దఖలు పర్చింది. ప్రభుత్వంతో కూడా నిమిత్తం లేకుండా, నెట్‌లోకి, ‘నట్టింటి’ లోకీ, పర్సనల్‌ సెల్‌ ఫోన్లలోకి ‘దొంగల్లా’ తొంగిచూసే హక్కు నిఘా సంస్థలకు ధారాదత్తం చేసింది దారితప్పిన కేంద్రం. 

తన నిరంకుశ నిర్ణయానికి సమర్థనగా ఎవరిని ‘అరువు’ తెచ్చు కుంది? తనలాంటి కాంగ్రెస్‌ పాలకుల్నే– వారు 2009లో తెచ్చిన టెలి గ్రాఫ్‌ చట్టాన్ని, 2000 నాటి ఐటీ చట్టాన్ని. రెండు పాలక పక్షాలు, ‘దేశ భద్రతతో చెలగాటమాడుతోంద’ని పరస్పరం నిందించుకున్న పాలక పక్షాలే. అంటే భారత పౌర సమాజమే దేశ భద్రతా ప్రయోజనాల్ని ఉల్లం ఘిస్తున్నట్లుగా ‘ఊహ’కు నిచ్చెన వేసి ఎదురు బొంకుగా ‘ప్రతిపక్షాలే తమ పార్టీ భద్రత కోసం అధికార పాలకపక్షాన్ని నిందిస్తున్నద’ని ఆరో పించుకోవటం ఆనవాయితీ అయిపోయింది.

అయితే తాజాగా మోదీ ప్రభుత్వం ఆర్డినెన్సుతో చివరికి బీజేపీ పాలక సభ్యులైన పార్లమెంటు సభ్యులు కొందరు సహితం విభేదిస్తున్నారని వార్తలు వింటున్నాం. ఇంతకీ కేంద్ర నిఘా సంస్థలన్నీ మన దేశంలో అంత ‘స్వతంత్రం’గా నిష్పాక్షికంగా వ్యవహరించగల సంస్థలా అంటే అదీ అబద్ధమే అవు తుంది. అక్కడికీ పీవీ నరసింహారావు (కాంగ్రెస్‌) ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో అడ్వాణీ (బీజేపీ) ప్రభృతులకు సంబంధం ఉందన్న ‘జైన్‌ హవాలా’ కేసు దేశంలో సంచలన కేసుగా మారి, ఆ కేసు విచారణను నానా రకాలుగా తిప్పుతున్న సీబీఐ వ్యవహార శైలిని సుప్రీంకోర్టు అనేక మార్లు ప్రశ్నించవలసి వచ్చిందని మరచిపోరాదు. ఆ సమయంలో ఆ కేసు విచారణలో పొంతనలేని వాదనలు వింటూ వచ్చిన సుప్రీం న్యాయ స్థానం ‘సీబీఐ ప్రధానమంత్రి ఆదేశాలకే కట్టుబడి విచారణ జరుపు తున్నట్టు వ్యవహరిస్తోంది. దీనికి అంగీకరించబోము. సీబీఐ సుప్రీం కోర్టుకి సహితం బద్ధురాలుగా ఉండాల’ని కోర్టు హెచ్చరించి, ఆ కేసును కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌కి కూడా నివేదించాల్సి వచ్చింది. 

ఇలా, వలస పాలకుల కనుసన్నల్లో రూపొందిన నాటి ఢిల్లీ పోలీ సులు ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్టు ప్రకారం కాంగ్రెస్‌ పాలకులు ఏర్పాటు చేసిన సీబీఐ సంస్థను ఇప్పటి బీజేపీ పాలకుల మాదిరే తమ పలుకులనే పలికే ‘చిలక’గా అనేక సందర్భాల్లో ప్రతిపక్షాలపైన ప్రయోగించి లబ్ధి పొందుతూ రావటం నిత్యానుభవం. ఆ మార్గాన్నే బీజేపీ పాలకులూ ప్రజా వ్యతిరేక రాజకీయ ‘బ్రతుకుతెరువు’ కోసం వాటంగా వాడుకొం టున్నారు. బహుశా అందుకే సామాజిక మాధ్యమాల (సోషల్‌ మీడియా) నిర్వాహకులపైన చర్యలకు కాలు దువ్వడానికి ముందు ఈ ఆర్డినెన్స్‌ ఉత్తర్వు అనే అసాధారణ నిర్ణయానికి ప్రభుత్వం’ పూనుకుం దని కొందరు బీజేపీ నేతలే వాపోయారు.

నిజానికి ‘కూపీ’ చర్యల్లో భాగమైన ‘ఆధార్‌’ చట్టం (దీనికి పునాది రూ. 7,000 కోట్లకు పడగ లెత్తిన సమాచార సాంకేతిక నిపుణుడైన నీత్‌కాన్‌) చాటున దేశ పౌరుల వ్యక్తిగత గోప్యతకే చేటు తెచ్చింది కాబట్టి అది చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్న స్పృహను కూడా బీజేపీ పాలకులు కోల్పోయి, చివరి కిప్పుడు బాహాటంగా 10 రకాల నిఘా సంస్థలను పౌర స్వేచ్ఛకు, పలు ఎలెక్ట్రానిక్, మీడియా సమాచార మాధ్యమాలకు వ్యతిరేకంగా ఉపయో గించబోవటం– ఇక మనం ‘ప్రజాస్వామ్యం’ గురించి, పౌర స్వేచ్ఛ గురించి సామాజికులు చెప్పుకునే ‘గొప్ప’లు కట్టిపెట్టి క్రియాశీలమైన చైతన్యం వైపు ప్రయాణించడం అవసరమనిపించడం లేదా? 

అట్టే చూస్తే కేంద్ర పాలకులు సుప్రీంకోర్టు పౌరుల ‘గోప్యతా  హక్కు’ను పరిరక్షిస్తూ చేసిన చరిత్రాత్మకమైన నిర్ణయాన్ని తుంగలో తొక్కి దేశ సమున్నత న్యాయస్థానాన్ని సహితం అవమానించినట్టే అయింది. ఇటీవల కాలంలో కోర్టు పరిధుల్ని గుర్తు చేస్తూ, ‘రాజ్యాంగం పాలకమండలి, శాసన వేదిక, న్యాయస్థానాల పేరిట విభజించి ఉంది కాబట్టి, ఆ పరిధి దాటకుండా మూడు విభాగాలూ కట్టుబాటులో ఉండా లని పాలకులు భావిస్తున్నారు. కానీ మిగతా రెండు విభాగాలకు (పాలనా వ్యవస్థ, శాసనవేదికలు) లేని ప్రత్యేక హక్కును భాష్యం చెప్పి వ్యాఖ్యానించి పాలనా వ్యవస్థను, శాసన వేదికను శాసించి మార్గ నిర్దేశం చేసే హక్కును రాజ్యాంగం న్యాయవ్యవస్థకు కల్పించిందని మరవరాదు.

ఆ రాజ్యాంగ ఆదేశాన్ని ‘తూ.నా బొడ్డు’ అని కాంగ్రెస్, బీజేపీ పాలకులు తోసి వేయబట్టే ‘పిడుక్కి, బిచ్చానికీ’ ఒకే మంత్రంలాగా భావిస్తున్న కాంగ్రెస్, బీజేపీ పాలకులు సమాచార ధారాస్రవంతిపైన, ‘ప్రపంచం నలుమూలలనుంచి వచ్చే భావాలను భారతదేశం స్వీకరించి’ ఎంపిక చేసుకునే స్వేచ్ఛను దేశ పౌరులకు వదలాలన్న ఋగ్వేద, గీతా సందే శాన్ని పాలకులు మరవరాదు. బహుశా ఇంత గందరగోళానికి దేశ పాలకులు  కారకులు కావడానికి ఏది కారణం అయి ఉంటుంది? తమ నీడను తాము చూసుకుని భీతిల్లే విధంగా కళ్లముందే జరిగిన ‘ఎమర్జెన్సీ’ రోజులా? లేక గుజరాత్‌ ఊచకోతల ఫలితమా? ఢిల్లీలో పాతికేళ్లనాడు సిక్కులపై జరిగిన హరకిరా? పాలకులైనా, పాలితులైనా ‘యంబ్రహ్మ’గా అవతారమెత్తేదెప్పుడు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పుకోగల్గితే సమా     ధానం అందకపోదు? ‘అయ్యకు రెండు గుణాలు తక్కువట– తనకు తోచదు ఇంకొకరు హితవు చెబితే వినడ’ట. అధికారం అనే ‘కైపు’లో ఉన్నవాళ్లకి ‘మంచి’ చెడుగా కన్పిస్తుంది.

అసలివేమీ కాదు, నోట్ల రద్దువల్ల రైతులు, సామాన్య ప్రజలు, చిన్న, మధ్యతరగతి వర్తక వ్యాపార వర్గాలు బ్యాంకులతో నిత్య లావా దేవీలు జరుపుకునేవారు, విద్యాసంస్థలూ, విద్యార్థులూ డబ్బులు డ్రా చేసుకోవడానికి పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. బ్యాంకులతో పాటు ఏటీఎంలు కూడా ఖాళీ అయినందున తమ డబ్బుకోసం పడి గాపులు పడి 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయి, దేశ ఆర్థిక వ్యవస్థ లావాదేవీలే ఛిన్నాభిన్నమైనందున ఎదురైన తీవ్ర పరిస్థితివల్ల 2019 ఎన్నికల్లో పాలక పార్టీ ఓటమి అవకాశాన్ని ఊహించినందున ‘దింపు డుకళ్లం’ ఆశగా సోషల్‌ మీడియాపైన ఈ తాజా నిరంకుశ నిర్ణయానికి ఒడిగట్టిందా? రోగం పాలకులది, బాధ మాత్రం ప్రజలది!!

వ్యాసకర్త: ఏబీకే ప్రసాద్‌, సీనియర్‌ సంపాదకులు, abkprasad2006@yahoo.co.in

మరిన్ని వార్తలు