వ్యవస్థ ‘దిశ’ దశ మార్చగల స్త్రీ..!

3 Dec, 2019 02:50 IST|Sakshi

రెండో మాట

దేశంలో మహిళలపై, చిన్నారులపై అనునిత్యం జరుగుతున్న అత్యాచారాలు కర్ణకఠోర సత్యాలుగా మారి మనల్ని వేధిస్తున్నాయి. అత్యాచార ఘటనలను ప్రసారం చేయడంలో మన మీడియా భావోద్వేగంతో కూడిన శీర్షికలతోనే సరిపెట్టుకుంటోంది తప్ప, ఈ అకృత్యాలకు వ్యవస్థాగతమైన పునాది ఎక్కడ ఉందో వివరించడంలో వెనుకాడుతోంది. మహిళను నిస్సహాయ స్థితి నుంచి బయటపడవేసి, సర్వ శక్తిమంతురాలైన చైతన్యమూర్తిగా తీర్చిదిద్దగలగడమే శాశ్వత పరిష్కారమన్న భావనను మీడియా పెంచగలగాలి. ఈ వ్యవస్థ దిశనూ, దశనూ సమూలంగా మార్చివేయగల ఆ పరిణామంవైపునకు సమాజం అడుగులు వేయడమే తదుపరి ఘట్టం కావాలని ఆశిద్దాం. ‘భారతదేశంలో దోపిడీ వ్యవస్థ కొనసాగినంత కాలం సంపన్న స్త్రీ కూడా దళితురాలేన’ని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చెప్పింది అక్షర సత్యం.


నేనీ మధ్య ఓ హాస్యాస్పదమైన మాట విన్నాను. స్త్రీ–పురుషుల మధ్య వివక్ష లేని సమానత వెలుగు చూడడానికి మరో 250 సంవత్సరాలు మనం కళ్లు కాయలు కాచేలా ఎదురు తెన్నులు చూడ వలసి వచ్చేలా ఉంది అని. నిజానికి ఇది ఓ వ్యంగ్యపూరితమైన చరుపు! వస్తుతహ ప్రజలు చెడ్డవారు కారు. వారు మరోలా మారడానికి కారణం వారి చుట్టూ ఉన్న సమాజ పరిస్థితులు. ఆ పరిస్థితుల్ని సమూ లంగా మార్చడమే సర్వత్రా మన నిరంతర ఎజెండాగా ఉండాలి. – కేన్స్‌ అంతర్జాతీయ చలనచిత్రోత్సవ సభలో ప్రసిద్ధ ఫ్రెంచ్‌ నటి ఇసాబెల్లి హ్యూపెర్ట్‌

సమాజంలో మానవ లంపటత్వానికి, లైంగికపరమైన హింసకు కారణమైన సంక్లిష్టమైన సాంఘిక సమస్యలను పరిష్కరించడానికి కఠిన   తరమైన శిక్షలు విధించడం, మరణశిక్ష విధించడం ఒక్కటే మార్గంగా చూడకూడదు. ఇందుకు క్రిమినల్‌ (నేర) చట్టం ఒక్కటే చాలదు. ప్రతి మహిళ నేను సహితం (మీ టూ) అంటూ స్వీయరక్షణార్థం తెగించి ప్రతిఘటనా శక్తిగా ముందుకు దూకాలి.
– ప్రభా కోటేశ్వరన్, లా అండ్‌ సోషల్‌ జస్టిస్‌ ప్రొఫెసర్, లండన్‌. ఢిల్లీలో ‘క్రిమినల్‌ లా 39–ఎ సెక్సువల్‌ వయొలెన్స్‌’ అనే అంశంపై జరిగిన సదస్సులో చేసిన ప్రసంగం

సామాజిక మాధ్యమాల పేరిట నేడు సోషల్‌ మీడియా ముమ్మరించి నందున ఇప్పుడు భారీ స్థాయిలో సమాజంలో బహుముఖాలుగా జరుగుతున్న హింసాకాండ, అకృత్యాలు, హత్యలు, ఆత్మహత్యలు ప్రజల దృష్టికి, పాలకుల దృష్టికి వచ్చి కళ్లు తెరిపించడానికి ప్రయ త్నిస్తున్నాయి, అంతకు ముందు కూడా ఎన్నో అసాంఘిక అకృ త్యాలు జరిగినా మాధ్యమాల దృష్టికి ఈ స్థాయిలో వచ్చేవి కాదు.  కానీ సమాజంలో జరుగుతున్న అనేక అకృత్యాలు, అవకతవకలు వెల్ల డవుతున్నా, కొంతమంది రాజకీయనేతలు, అధికారులు కలిసి నేర గాళ్లతో మిలాఖత్‌ కావడం వల్ల దేశంలో నేరాల సంఖ్య అదుపు లేకుండా పెరుగుతోంది. 

ఈ వాస్తవాన్ని సుమారు ముప్పై ఏళ్ల నాడే కేంద్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శి ఓహ్రా నిశితంగా ఒక నివేదికలో బహిర్గతం చేశారు.  అయినా సరే, అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారు అన్న సామెతలాగా పాలకులు, నేరగాళ్ల పరిస్థితి తయారైంది. ఇందులో భాగంగానే గాంధీజీ ఎంత గానో మద్యాన్ని (తాగుడును) ప్రోత్సహించడం ద్వారా వచ్చే రెవెన్యూ ఆధారంగా ప్రభుత్వాలు పరిపాలన నిర్వహించడాన్ని వేనోళ్లా నిరసించి, హెచ్చరించినా పలువురు స్వతంత్ర భారత రాష్ట్రాల పాలకులు ఏదో ఒక రూపంలో మద్యపానాన్ని విచ్చలవిడిగా ప్రోత్సహిస్తూనే ఉన్నారు. 

వెరసి వీటన్నింటి ఫలితమే ఇటీవలి కాలంలో దేశంలోనూ, తెలంగాణా రాష్ట్రంలోనూ పోటెత్తిన స్త్రీల మానభంగాలు, హత్యలు, ఆత్మహత్యలు... ఇందులో భాగమే. పెట్టుబడిదారీ వ్యవస్థ దశనూ, దిశనూ మార్చగల స్త్రీ విమోచన ఉద్యమానికి, తద్వారా వ్యవస్థాగతమైన కుదుపునకూ, ఒక దశలో శ్రీకారం చుట్టాయి. నిర్భయ, అభయల హత్యా ఉదంతాలు. కాగా, ఆతర్వాత కొద్ది కాలంగానూ, నిన్నగాక మొన్న జరిగిన డాక్టర్‌ దిశ తదితర యువతులపై అత్యాచారాలు, అభంశుభం తెలియని చిన్నారు లపైనా గురిపెట్టిన మగమృగాలు ఉదాహరణలు. వినడానికి సైతం మనస్కరించని కర్ణకఠోర సత్యాలుగా మనల్ని వేధిస్తున్నాయి. 

‘ఇన్ని అఘాయిత్యాలు, మన చుట్టూ జరుగుతున్నా మన టీవీలూ,  ఇతర మాధ్యమాలూ ఘటనల ప్రసారంలో గానీ, విమర్శ లలో, వ్యాఖ్యానాలలో గానీ, ఎంతసేపూ ‘మృగాళ్ల అంతు చూద్దాం’, ఇంటి నుంచి బయటకు వెళ్తే చాలు మళ్లీ వచ్చేవరకు భయమే, ‘మన సంస్కృతి ఆడపిల్లల్ని గౌరవించడం’, ‘కామాంధుల వికృత చేష్టలకు ఇంకెంతమంది బలికావాలో’ అన్న శీర్షికలతోనే సరిపెట్టుకుంటు న్నాం. కానీ ఎక్కడా మన మాధ్యమాల ప్రసారాలలో, సమాజంలోని ఈ అకృత్యాలకు పునాది, లేదా పుట్టి పెరిగిన ‘పుండు’ ఎక్కడ ఉందో వివరించడంలో జంకుతున్నాయి. స్త్రీ అబల కాదు, సబల అని చెప్పు కోవడంలో పురాణ కథలతో, లేదా కట్టు కథలతో సరిపెట్టుకుం టున్నాం. అంతేగానీ–అమృతాన్ని, హాలాహలాన్ని సమానంగా ఇము డ్చుకోగల శక్తి కూడా స్త్రీకి ఉందన్న సత్యాన్ని గుర్తించి, ఆమెను శాశ్వ తంగా నిస్సహాయ స్థితి నుంచి, సర్వ శక్తిమంతురాలైన చేతనామూ ర్తిగా తీర్చగలిగేది పెట్టుబడిదారీ దోపిడీ సమాజ వ్యవస్థను సమూ లంగా మార్చడంవల్లనే సాధ్యమూ, శాశ్వత పరిష్కారమూనన్న అవ గాహనను వారిలో వ్యాఖ్యాతలు, విశ్లేషకులూ పెంచగలగాలి. 

మాధ్యమాలు దోపిడీ వ్యవస్థకు వాహకాలుగా వ్యవహరించ కూడదు. దోషాలు సోషలిస్టు వ్యవస్థల్లో మాత్రం ఉండవా అంటే, ఉండవచ్చు గానీ, పెట్టుబడిదారీ వ్యవస్థలో సాగే దోపిడీలో కానవచ్చే నామమాత్రపు ‘సుగుణం’ దాని నూరు దోషాలలో ఒకటిగా మాత్రమే గణనలోకి వస్తుంది. ఇదీ నిరంతర దోపిడీపై ఆధారపడితేగానీ తన ఉనికిని కాపాడుకోలేని పెట్టుబడి వ్యవస్థకూ, దాని రద్దుపై ఆధార పడిన సమసమాజ వ్యవస్థకూ మధ్య మౌలికమైన వాస్తవ వ్యత్యాస మని ప్రసార మాధ్యమాలకు స్పృహ ఉండాలి. ఈ స్పృహకు స్వార్థ చింతనలేని చైతన్యం అవసరం. బహుశా అందుకనే భారత రాజ్యాంగ అగ్రశ్రేణి నిర్మాత, దళిత వెలుగు దివ్వె డాక్టర్‌ అంబేడ్కర్‌ ‘భారతదేశంలో దోపిడీ వ్యవస్థ కొనసాగినంత కాలం సంపన్న స్త్రీ కూడా దళితురాలేన’ని స్పష్టం చేశారు. 

గాంధీజీ ‘దేశంలో ఆఖరి నిరుపేద కూడా బానిసత్వం నుంచి, దోపిడీనుంచి విముక్తి అయ్యే దాకా దేశానికి స్వాతంత్య్రం రానట్టే’నని చాటడంతోపాటు ‘అర్ధరాత్రి కూడా స్త్రీ నిర్భయంగా వీధులలో స్వేచ్ఛగా నడిచి వెళ్లగలిగినప్పుడే’ దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు భావించాలన్నాడు. ఈ వరసలోని వారే ఫ్రెంచి విప్లవకాలంనాటి బ్రిటిష్‌ వనిత ఉద్యమ సారథి ఊల్‌స్టోన్‌క్రాఫ్డ్, ఆ తరువాత ఫ్రెంచి మహిళా విమోచనోద్యమ నాయకురాలైన సిమన్‌ దిబోవెర్, భారతదేశంలో అనీబిసెంట్, దుర్గా బాయి దేశ్‌ముఖ్, రాజారామ్మోహన్‌రాయ్, వీరేశలింగం, చిలకమర్తి ప్రభృతులు విద్యలో, వివాహంలో, మానవ పురోగతికి చెందిన సకల శాస్త్ర, సాంకేతిక రంగాలలో మహిళల నిరంతర పురోగతిని, ఉన్నతిని ఆశించి అందుకు కృషి చేసిన మహోదయులు. 

ఇక ప్రపంచ శాస్త్రీయ సోషలిజం సిద్ధాంతకర్తలు మార్క్స్‌–ఎంగె ల్స్‌లు... ఫ్యూడల్, పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థల్లో పాలక స్థానాల్లో ఉన్నవారు నేరగాళ్లు, బేరగాళ్లతో చేతులు కలిపి తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం క్రిమినల్స్‌పైన, నేరస్థుల ఆధారంగా ఏర్పడే న్యాయవ్యవస్థలూ, న్యాయవాదులు, న్యాయ మూర్తులూ, పోలీసు యంత్రాంగం, దళారీ వ్యవస్థతోపాటు తలారులు, వీరందరి పరస్పర ఆధారంతో వెలువడే తీర్పు సారాంశం– స్థూలంగా అమలులో ఉన్న దోపిడీ వ్యవస్థను ఏదో విధంగా కొనసాగేలా చేదోడువాదోడు కావడ మేనని మార్క్స్‌ ‘ధనికవర్గ నాగరికత–నేరాలు’ అన్న రచనలో పేర్కొ న్నాడు. 150 సంవత్సరాల నాటిదే అయినా, ఎంతటి దార్శనికత. 

కాకపోతే ఏమిటి చెప్పండి తానింకా తల్లిగర్భంనుంచి పూర్తిగా లోకంలోకి వచ్చి కళ్లు తెరవనేలేదు/ నా ప్రార్థన మనసులో ఉంచండి/ పశుప్రాయుడైనవాడు/ భగవంతుడ్ననేవాడు/ నాకు ఈ ఇరువురి సంపర్కం వదిలించండి/ బయటికి రాబోతున్న నాకు ఇవ్వండి– నాలో గల మానవత్వం ఎవరైతే రేపు అపహరించబోతారో /ఎవరైతే నన్నొక యంత్రంగా మార్చాలని ప్రయత్నిస్తారో/ బజారులో నన్నొక సరుకుగా మొఖానికొక ఖరీదు తగిలించి/ నా ఆస్తిపాస్తుల్ని ఎవరైతే చీల్చాలనీ చూస్తారో/ అటూ ఇటూ బంతిలాగా తంతారో/ ఎవరైతే నన్నొక జీవంలేని శిలను చేసి వేధిస్తారో/ అలాంటివారందరినీ ప్రతి ఘటించగల శక్తిని నాకివ్వండి/ ఈ షరతుల మీదనే నన్ను బయటికి రానివ్వండి’! రేపో మాపో, ఈవేళో లోకంలోకి అడుగుపెట్టడానికి ఉవ్విళ్లూరుతూ భీతిభీతిగా ఆక్రోశిస్తున్న శిశు ఘోష, పుట్టిన, పుట్ట బోయే బిడ్డల, తల్లులందరి మనస్సుల్లో నిప్పుకణాలుగా మారి ‘మేము సహితం’ అంటూ నేటి నుంచే ముందడుగై సాగాలి. 

నికృష్టపు మన దోపిడీ వ్యవస్థకు, ఆర్థిక, మానసిక, వివక్షాపూరిత దోపిడీ వ్యవస్థలో బందీలైపోయి కునారిల్లుతున్న వివాహిత, అవివా హిత మహిళలందరూ ఒక్కొక్కరూ ఒక– ‘‘అగ్నికాళిగా/ ఒక భద్ర కాళిగా/ ఒక మంత్ర కాళిగా/ ఒక నాట్యకాళిగా/ ఓ ఘటనకాళిగా/ ఓ ఉగ్రకాళిగా, ఓ రుద్రకాళిగా మారాలి’ అప్పుడే ఆ క్షణమే సామాజిక అజ్ఞాత విదూషకుల ఆత్మహత్యకు ప్రారంభోత్సవమూ జరగాలి. అప్పుడే–పెట్టుబడి దోపిడీపై ఆధారపడిన ఈ వ్యవస్థ దిశనూ, దశనూ మన మహిళా లోకం సత్యభామలై మార్చగలరు. ఆ ముహూ ర్తంవైపే ఇక అడుగులు పడబోవటమే తరువాయి ఘట్టం కావాలని ఆశిద్దాం!

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా