సంపూర్ణ విప్లవం నేటి అవసరం

8 Nov, 2017 02:23 IST|Sakshi

విశ్లేషణ

1917 రష్యా విప్లవ ఘటనను సైతం బేషరతుగా సంస్మరించలేను. అయితే, దానికి సంబం ధించి కీర్తించదగినదీ ఉంది. అది విప్లవం అనే భావం. విప్లవం ఎలా జరిగిందనే దానితో నిమిత్తం లేకుండా, రష్యా విప్లవం ఒక భావం. మానవులు మునుపెన్నడూ ఎరుగని రీతుల్లో తమ సొంత భవితవ్యాన్ని మలచుకోగలరనే భావం సాధించిన విజయానికి అది మైలురాయి. ఆ స్ఫూర్తితో, 20వ శతాబ్దపు చరిత్ర వెలుగులో విప్లవం అనే భావనను తిరిగి మలచు కోవాల్సిన సందర్భంగానైతే రష్యా విప్లవ శత వార్షికోత్సవాన్ని జరుపుకోవాల్సిందే.

అసత్యాలతో సంస్మరణ వ్యాసాన్ని రాసేదెలా? నవంబర్‌ 7 రష్యా విప్లవ శత వార్షికోత్సవం సందర్భంగా నన్ను ఇబ్బంది పెట్టిన ప్రశ్న ఇది. ఆ విప్లవ శిశు వైన యూఎస్‌ఎస్‌ఆర్‌ (యూనియన్‌ ఆఫ్‌ సోవియట్‌ సోషలిస్ట్‌ రిపబ్లిక్స్‌) 70 ఏళ్ల తర్వాత మరణించడం వల్ల తలెత్తిన సమస్య కాదిది. మరణానికి ఎవరూ అతీతులు కారు. చివరకు ఆ సోషలిస్టు ప్రయోగం విఫలం కావడం వల్ల మాత్రమే తలెత్తిన సమస్యా కాదిది. విజయమే ప్రతిదానికీ కొలబద్ధ కాజా లదు. ఆ విప్లవం, విప్లవానంతర రాజ్యం బతికున్న కాలంనాటి, దాన్ని విజ యవంతమైనదిగా పరిగణిస్తున్న కాలం నాటిæహేయమైన వాస్తవమే నిజమైన సమస్య.
ఒక వికృత రాక్షసిని సృష్టించిన విప్లవ సందర్భాన్ని ఎలా ఉత్సవంగా జరుపుకోగలం? 1917–1921 మధ్య జరిగిన ఘటనలు తెలిసివచ్చాక కూడా లెనిన్‌ సహా ఆ విప్లవ నాయకులను ఆదర్శమూర్తులుగా ఎలా కీర్తించగలం? సోవియట్‌ ప్రభుత్వ పాలనలో కార్మికులను నిర్లక్ష్యం చేసి, రైతాంగాన్ని ఊచ కోత కోశారని తెలిశాక కూడా దాన్ని కార్మికవర్గ విజయంగా ఎలా వర్ణించ గలం? సోల్జినిత్సిన్‌ రచనలను చదివాక రష్యా విప్లవం ప్రత్యామ్నాయ ప్రజా స్వామ్యాన్ని ఆవిష్కరించిందని చెప్పుకోవడాన్ని మనం ఎలా నమ్మగలం? యూఎస్‌ఎస్‌ఆర్‌కు చెందిన తూర్పు యూరప్‌ ‘వలసల’ను సందర్శించాక కూడా ఆ విప్లవ వలసవాద వ్యతిరేకతకు ఎలా నీరాజనాలు అర్పించగలం? ఆ వ్యవస్థ నిరంకుశ ప్రభుత్వాధికారాన్ని, అది పాశ్చాత్య అభివృద్ధి నమూ నాను వెర్రిగా అనుకరించడాన్ని చూసిన మనం... ఆ ఆర్థిక నమూనా నుంచి ఎలా

ఉత్తేజాన్ని పొందగలం?
అందువల్లనే, బహుశా నేను ఆ వ్యవస్థను, సోవియట్‌ కమ్యూనిజాన్ని కీర్తించలేకపోవచ్చు. 1917 రష్యా విప్లవ ఘటనను సైతం నేను బేషరతుగా సంస్మరించలేను. అయితే, ఆ ఘటనకు సంబంధించి కీర్తించదగినది కూడా ఉంది. అది విప్లవం అనే భావం. విప్లవం ఎలా జరిగిందనే దానితో నిమిత్తం లేకుండా, రష్యా విప్లవం ఒక భావం, మానవులు మునుపెన్నడూ ఎరుగని రీతుల్లో తమ సొంత భవితవ్యాన్ని మలచుకోగలరనే భావం సాధించిన విజ యానికి అది మైలురాయి. ఆ స్ఫూర్తితో, 20వ శతాబ్దపు చరిత్ర వెలుగులో విప్లవం అనే భావనను తిరిగి మలచుకోవాల్సిన సందర్భంగానైతే రష్యా విప్లవ శత వార్షికోత్సవాన్ని జరుపుకోవాల్సిందే.

చేదు అనుభవాల విప్లవం
ఆశ్చర్యకరంగా, విప్లవం అనే భావన పుట్టుకొచ్చినది రాజకీయాల్లోంచి కాదు, భౌతికశాస్త్రం నుంచి. 18వ శతాబ్దిలో ఒక విచిత్రమైన పరివర్తన జరిగింది. అది భూమి తన కక్ష్యలో పరిభ్రమిస్తుండటమనే విప్లవాత్మక ఆలోచన నుంచి మానవులు తాము కోరుకున్న గమ్యానికి చేరుకోవడమనే విప్లవ భావన వరకు జరిగిన పరివర్తన. మొట్టమొదటిసారిగా 1789 ఫ్రెంచ్‌ విప్లవం నేప థ్యంలో ప్రయోగించిన విప్లవం అనే ఈ నూతన భావనలో నాలుగు విభి న్నమైన భావాలు ఇమిడి ఉన్నాయి. మొదటిది అస్తిత్వంలో ఉన్న సామాజిక ఆర్థిక క్రమం ఇలాగే శాశ్వతంగా నిలిచిపోబోవడం లేదు. మౌలికంగా భిన్న మైన వివిధ రీతుల్లో దాన్ని మార్చగలం, మార్చాలి. ఈ మార్పు హఠాత్తుగా బద్దలు కావడంగా సంభవించగల అవకాశం ఉంది. పాత వ్యవస్థ ఏదో ఒక రోజుకు పతనంగాక తప్పదు. సరికొత్త జీవన విధానానికి ప్రాతిపదికను సమకూర్చే కొత్త వ్యవస్థను నిర్మించాల్సి ఉంటుంది. అలాంటి నాటకీయమైన మార్పు తనంతట తానుగా వచ్చేది కాదు. ఆ మార్పును తేగలిగేది, తేవా ల్సినది మనుషులే. అందుకు ప్రజలను సమీకరించడం, సమష్టి కార్యాచరణ అవసరం. అంతేకాదు, ఈ మార్పునకు అవసరమైన రాజ్యాధికారాన్ని స్వాధీనం చేసుకోవడానికి సాధారణంగా హింసాత్మక కార్యాచరణ అవసరం. ఇకపై ప్రతి మనిషి, ఎవరైనాగానీ ఈ మార్పును తెచ్చే కర్తలు కావచ్చు. విప్లవానికి అగ్రగామిదళం అవసరం. అది, ఒక విప్లవ రాజకీయ పార్టీ ప్రాతి నిధ్యం వహించే కార్మికవర్గమే.

నేర్పిన గుణపాఠాలు
విప్లవం గురించిన ఈ అవగాహనే రష్యా విప్లవంలో ఇమిడి ఉంది. అది, యూరప్‌ ఖండపు 18 వ శతాబ్దపు చరిత్ర నుంచి స్వీకరించగా, 19 వ శతాబ్దపు చరిత్ర నుంచి వృద్ధి చెందినది. 20వ శతాబ్దపు విప్లవాల నిజ జీవిత అను భవం.. రష్యా, క్యూబా, వియత్నాం, కంబోడియా విప్లవాల అనుభవం ఉత్సా హాన్ని రేకెత్తించడం నుంచి భయకంపితులను చేయడం వరకు రకరకాలుగా ఉంది. ఈ 20వ శతాబ్దపు అనుభవం రష్యా విప్లవ భావన గురించి కొన్ని గుణ పాఠాలను నేర్పింది.ఒకటి, విప్లవాత్మక పరివర్తన గమ్యం ఒకే దిశగా సాగే మార్పు కాదు. విప్లవ పరివర్తన ప్రధాన లక్ష్యం ఆర్థికపరమైనది మాత్రమే అనేది మార్క్సిస్టు సైద్ధాంతిక ఆలోచన. 20వ శతాబ్దం ఈ ఆదర్శాన్ని విశాల ప్రాతిపదికగలదిగా మార్చింది. రాజకీయ, సామాజిక, సాంస్కృతిక మార్పును అందులో భాగం చేసింది. జైప్రకాష్‌ నారాయణ్, మానవ జీవితంలోని అన్ని రంగాలకు చెందిన ఈ సంపూర్ణ విప్లవం అనే భావనను ఆవిష్కరించారు.

రెండు, విప్లవం, హఠాత్తుగా, నాటకీయంగా బద్దలై జరుగుతుందనే భావన నుంచి దాన్ని వేరు చేయాల్సిన అవసరం ఉంది. మౌలికమైన మార్పు రాత్రికి రాత్రే జరగాల్సిన అవసరం ఏమీ లేదు. నిలకడగా నిలవగలిగిన మార్పు ఏదైనా సాధారణంగా క్రమక్రమంగానే జరుగుతుంది. ఈ వ్యవస్థను ఒక్కొక్క ఇటుకగా మారుస్తూ రావాలి.మూడు, విప్లవం హింసాత్మకమైనదే కావాల్సిన అవసరమేమీ లేదు. విప్లవాత్మకమైన మార్పు సాఫీగా జరిగిపోయేదేమీ కాదని 20వ శతాబ్దపు అనుభవం చెబుతుంది. స్వీయ ప్రయోజనాలుగల శక్తుల ప్రతిఘటనను విప్లవకారులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే, ఆ సంఘర్షణ హింసాత్మక మైతే... ప్రజల పేరిట జరిగే విప్లవం ఆ ప్రజలకే వ్యతిరేకమైనదిగా మారే అవకాశం ఉంది.నాలుగు, విప్లవ అగ్రగామిదళం అనే భావనను విyì చిపెట్టాల్సిన అవ సరమేమీ లేదు. కాకపోతే ఏ ఒక్క వర్గమో చరిత్ర ఎంచుకున్న సాధనం కాదు. ఒక పార్టీయే విప్లవానికి పరిరక్షణ వహించేదిగా మారడం అంటే అది వినా శనానికి బీజం వేయడమే.చివరగా, విప్లవ కార్యాచరణకు రంగస్థలిగా యూరప్‌ మీది నుంచి మన దృష్టిని మరల్చుకోవాలంటూ 20వ శతాబ్దం మనకు ఆహ్వానం పలికింది. విప్లవం అనే ఆధునిక భావన పుట్టింది యూరప్‌లోనే. కాబట్టి విప్లవం ముందుగా యూరప్‌లో జరుగుతుందని, ఆ తర్వాత మిగతా చోట్ల పునరా వృతమౌతుందని అనుకోవడం సహజమే. 20వ శతాబ్దపు రెండో భాగం ఈ ఊహాత్మక ప్రమేయాన్ని తలకిందులు చేసింది. రెండవ ప్రపంచ యుద్ధానంతర యూరప్‌... విప్లవాలు జరగడానికి అతి తక్కువ అవకాశం ఉన్న ప్రాంతంగా మారింది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా మొదలైన ప్రపం చంలోని ఇతర ప్రాంతాలపైకి ఇప్పుడు దృష్టి మళ్లింది.

మరో ప్రపంచం సాధ్యమే
20వ శతాబ్దంలో విప్లవం అనే భావనలో వచ్చిన మార్పుల తర్వాత విప్లవం అనే ఆ భావంలో ఇంకా ఏమైనా మిగిలే ఉందా? ఉందనే అనుకుంటున్నా. రాజకీయ మౌఢ్యాన్ని కోల్పోయినా విప్లవం అనే భావంలోని మూల సారం ఇంకా మిగిలే ఉంది. మరో ప్రపంచం సాధ్యమే, దాన్ని మనం నిర్మించగలం అనేదే అది. రష్యా విప్లవం నుంచి 21వ శతాబ్దానికి వారసత్వంగా సంక్ర మించిన మౌలిక సారాంశ భావం అదే. ఈ సవరించిన విప్లవం అనే భావ నకు మనం స్వయంగా చేయాల్సిన దోహదం ఏమిటి? విప్లవం అనే భావాన్ని 21వ శతాబ్దం మూడు దిశలకు తీసుకుపోవచ్చని అనుకుంటున్నా.మొదటగా మనం, విప్లవానికి ముందుగా నిర్దేశితమైన లక్ష్యం ఉంటుం దనే భావంతో తెగతెంపులు చేసుకోవాలి. విప్లవాన్ని, అది సాగే క్రమంలో తన గమ్యాన్ని తాను అన్వేషించుకునేదిగా, పరివర్తన చెందించుకునేదిగా చూసి తీరాలి. రెండు, విప్లవం అనే భావన రాజకీయాలలోకి ప్రవేశించడంపై ఆధార పడినదిగా చూడటం. ఈ దృష్టి, రాజకీయ పార్టీ పట్ల, ఆధునిక రాజ్యం విప్ల వాత్మక మార్పునకు సాధనంగా చూడటం పట్ల వ్యామోహాన్ని పెంచింది. మార్పునకు ఇతర సాధనాలను గుర్తించే దిశగా మనం సాగాలి లేదా రాజ కీయాల పట్ల మన అవగాహననే మార్చుకోవాలి.చివరగా, విప్లవం గురించిన యూరోపియన్‌ భావన కేవలం బాహ్య మైన మార్పుపైనే దృష్టిని కేంద్రీకరించింది. మనిషి, మనిషి అంతరాత్మ కూడా విప్లవానికి సంబంధించి అంతే ముఖ్యమైన లక్షణంగా మనం జోడించాలి. ఇవన్నీ కలసి నా ప్రతిపాదనను చాలా తీవ్రమైనది, కలవరపరిచేది అనిపిం చేలా చేయవచ్చునేమో. కానీ, విప్లవమే అలాంటిది. విప్లవం అనే భావనలో విప్లవాన్ని తీసుకురావడమే రష్యా విప్లవానికి అత్యుత్తమ సంస్మరణ.
- వ్యాసకర్త స్వరాజ్‌ అభియాన్, జైకిసాన్‌ సంస్థల్లో సభ్యులు మొబైల్‌ : 98688 88986

- యోగేంద్ర యాదవ్‌

మరిన్ని వార్తలు