బాల్యాన్ని సంరక్షిస్తేనే భవిష్యత్తు

19 Oct, 2017 01:24 IST|Sakshi

రెండు తెలుగు రాష్ట్రాల్లో బాల్యానికి భద్రత లేకుండా పోతోంది. వివిధ కారణాలతో పురిటి బిడ్డను వద్దనుకుని తల్లిదండ్రులు వదిలేసిన సందర్భాలకు సంబంధించి హైదరాబాద్‌ పరిసరాల్లో కేవలం మూడునెలల కాలంలో 68 ఘటనలు నమోదయ్యాయి. మరోవైపు ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల్లోని ప్రభుత్వ వైద్యశాలలు కళ్లు తెరవకముందే పసిపిల్లలను యమపురికి పంపిస్తున్నాయి. ఏపీలో పసిపిల్లల్ని ఎలుకలకూ, పందులకూ బలి చేసిన ఘనతను అక్కడి ప్రభుత్వాసుపత్రులు దక్కించుకున్నాయి. రెండు వారాల క్రితం గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 4 ఏళ్ల బాలుణ్ణి అందరూ చూస్తుండగా ఏకంగా కుక్కలన్నీ చుట్టుముట్టి పీక్కుతిన్నాయి. ఈ ఘోరంపై అంతర్జాతీయ మీడియా సహితం ముక్కున వేలేసుకున్నా,  మానవ హక్కుల కమిషన్‌ శ్రీముఖం జారీ చేసినా ఏపీ మున్సిపల్‌ శాఖ మంత్రికి చీమ కుట్టినట్లయినా లేదు. అలాగే హైదరాబాద్‌లో వీధికుక్కలు స్వైర విహారం చేస్తూ పిల్లల్ని పీక్కుతింటుంటే పట్టించుకున్న నాథుడే లేడు.

ఒకవైపు జంతువుల బారిన పడి పిల్లలు ప్రాణాలు కోల్పోతుంటే, మరోవైపు పిల్లల్ని అపహరించడం, బిచ్చగాళ్ల మాఫియా ముఠాలకు తరలిం చడం, అక్రమంగా అమ్ముకోవడం యధేచ్ఛగా జరిగిపోతోంది. తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలను అక్కున చేర్చుకోవడానికి అనే మిషతో ప్రవేశపెట్టిన ఊయల పథకాన్ని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు నీరుగార్చడంతో ఆ చిన్నారులు కుక్కలు, పందుల పాలై ప్రాణాలు కోల్పోతున్నారు. కాగా ప్రి స్కూల్, బేబీ కేర్‌ సెంటర్లలో చేరిన పిల్లలను నిర్వాహకులు జంతువులకన్నా హీనంగా చూస్తూ వారి ఆరోగ్యం, ఎదుగుదల, ఆహారం, నిద్ర వంటి ముఖ్యావసరాలను గాలికి వదిలేస్తున్నారు.

పిల్లలు కాస్త పెరిగి పాఠశాలలకు వెళితే అక్కడి గురువులు అభినవ రాక్షసుల్లా మారి నిత్యం దండిం  చడం, చచ్చే పరిస్థితి తీçసుకురావడంతో 2017లో దసరా సెలవులకంటే ముందే తెలంగాణలో 28 మంది ఏపీలో 31 మంది ప్రైమరీ, హైస్కూల్‌ స్థాయి విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. తల్లి కడుపులో నుంచి భూమిపై పడి పెద్దవారయ్యేవరకు పిల్లలు ఇలా రకరకాల దాడులకు గురవుతూ బతుకీడుస్తుంటే ప్రభుత్వ పెద్దలు మాత్రం జైహింద్‌ అనండి, వందేమాతరం పాడండి, హరితహారంలో రోడ్లపై బారులు తీరండి అంటూ సెలవిస్తున్నారు. కాగా, సమస్త ప్రపంచాన్నీ తానే తీర్చిదిద్దాననే స్థాయిలో మాట్లాడే ఓ నాయకాగ్రేసరుడు ఇటీవల కొత్త గళమెత్తి, ఎక్కువమంది పిల్లల్ని కనండి లేకపోతే రోబోలు రాజ్యమేలుతాయని ఉపదేశిస్తున్నారు.

ఇప్పుడున్న పిల్లలకు కనీసం రక్షిత మంచి నీరు అందించడంలో ఘోరవైఫల్యం చెందిన తమరు, ఏపీలోని తల్లులు ఇంకా పిల్లల్ని కంటే వారిని మీ దవాఖానాల్లో నెలవైన ఎలుకలకూ, పందికొక్కులకూ ఆహారంగా వేద్దామనుకుంటున్నారా స్వామీ! చివరగా, పిల్లల భవితవ్యం గురించి ఆలోచించ కుంటే బాల్యం కరువైన ఈ పిల్లలు సమాజంలో భద్రత లేక చనిపోవడమో, సంఘ వ్యతిరేక శక్తులుగా తయారవ్వడమో జరిగి తీరుతుంది. బాల్యాన్ని కాపాడండి... లేకుంటే భవిష్యత్తు లేదని పాలకులు గ్రహించాలి.

అచ్యుతరావు, గౌరవాధ్యక్షుడు, బాలల హక్కుల సంఘం
‘ మొబైల్‌ : 93910 24242

మరిన్ని వార్తలు