పెళ్ళి పిల్లలని కనడం కోసమేనా?

16 Jun, 2020 02:00 IST|Sakshi

సందర్భం ​​​​​​

మహిళలు సమాజంలో సగం ఐనప్పటికీ మహిళలు ఎలా వుండాలి, ఎవర్ని పెళ్ళి చేసుకోవాలి, ఉద్యోగం చేయవచ్చా లేదా, ఎంతమంది పిల్లలని కనాలి, ఎప్పుడు పెళ్ళి చేసుకోవాలి వంటి విషయాలు పురుషులే నిర్ణయిస్తున్నారు. మన పురాణాలు పరిశీలించినా, ఆ పురాణాలు ప్రవచనాలు వుటంకించినా ఆ పురాణ పురుషులే స్త్రీల తలరాత రాస్తున్నారు. ఉదాహరణకి అమ్మాయిలు ఎప్పుడు పెళ్ళి చేసుకోవాలి అనే విషయంపై వ్యాఖ్యానిస్తూ ఎనిమిది సంవత్సరాల బాలికను కన్యగా పరిగణించాలన్నారు. పురుషాధిక్య పెద్దలు ఇంకా ఓ అడుగు ముందుకేసి గర్భాష్టకాలు అంటే తల్లి కడుపులో పడ్డప్పటినుంచే వయసు ఎనిమిదేళ్ళుగా లెక్కించి కన్యగా ఎంచమన్నారు. నలభై యేళ్ళ క్రితం వరకు ఏడు, ఎనిమిది యేళ్ళకు పెళ్ళిళ్ళు జరగడం సర్వసాధారణం.

ఇలా ఉండగా 1927లో లార్డ్‌ ఇర్విన్‌ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన రాయివిలాస్‌ హరిబచన్‌ శారద ఓ ప్రతిపాదన చేస్తూ అమ్మాయికి పద్నాలుగు, అబ్బాయికి పద్దెనిమిదేళ్ల వయసు వచ్చేదాక పెళ్ళిళ్ళు జరగకుండా చట్టం తేవాలని యోచించగా ఆ ప్రతిపాదన 1930లో చట్టరూపం దాల్చింది. కానీ ఈ చట్టం గ్రామీణ ప్రాంతాల్లో ఎటువంటి ప్రచారానికి నోచుకోలేదని ఫలితంగా ఆ చట్టం అమలు కాలేదనీ, పైగా కొన్ని వర్గాల మనోభావాలు దెబ్బతీసిందనీ భారత తొలి ప్రధాని జవహార్‌లాల్‌ నెహ్రూ 1950లో పార్లమెంటులో ఈ చట్టంపై మాట్లాడుతూ తన అసంతృప్తిని వ్యక్తం చేసి చిన్న మార్పులు చేస్తూ అమ్మాయిల కనీస వివాహ వయస్సు పదహారుగా మార్చి ఆ చట్టాన్ని అలాగే కొనసాగించి కొంత ప్రచారం కల్పించడంతో 1978 వరకు దాన్ని శారదా చట్టంగానే సంబోధిస్తూ వచ్చారు.

ఇక 1978లో బాలికల కనీస వివాహ వయస్సు పద్దెనిమిదేళ్లకు మారుస్తూ బాలురకు మాత్రం ఇరవై ఒక్క సంవత్సరాలకు పెంచారు ఈ  పరిణామాలు చూస్తే ఎప్పుడూ బాలికల వయస్సు కంటే అబ్బాయిల వయస్సు ఎక్కువ వుండేలా చూశారు కానీ దాంట్లో శాస్త్రీయత ఎంత అన్నది కనీసం పరిశీలించిన పాపాన పోలేదు. బాల్య వివాహాలు జరిగితే నష్టపోయేది బాలికలేననీ, అబ్బాయిలకు, అమ్మాయిలకు వయసులో తేడావుండాలన్నది.. పురుషాధిక్య సమాజం మహిళలపై పురుషులు పెత్తనం చేయడానికి చెబుతున్న కుయుక్తనీ, దానిలో ఏమాత్రం శాస్త్రీయత లేదని ఇప్పుడున్న పద్దెనిమిదేళ్ల షరతు బాలికలకు అన్యాయం చేసేదని ఆ వయసులో అమ్మాయిలు కనీసం పట్టభద్రులు కూడా కాలేరని బాలల హక్కుల సంఘం అభిప్రాయపడుతోంది. పిల్లలను కనడానికి ఈ వయసు సరైనది కాదని, ఈ వయసులో పిల్లలను కంటున్నదునే దేశంలో మాతాశిశు మరణాల రేటు ఎక్కువగా వుందని బాలికకు పద్దెనిమిది,బాలురకు ఇరవైఒక్కయేళ్ళు అనే నిబంధన లింగ వివక్ష అనీ సమన్యాయం కాదని అనేక ర్యాలీలు ,సమావేశాలు, నివేదనలు బాలల హక్కుల సంఘం చేపట్టింది.

పైగా కేంద్ర సర్కారు సమన్యాయం కోసం అబ్బాయిల వివాహ వయస్సు పద్దెనిమిదికి చేస్తామనడంతో ఇదెక్కడి నీతి అని పలువురు ప్రశ్నించడంతో వెనక్కి తగ్గింది. కానీ ఇటీవల ఈ విషయంపై ఢిల్లీ హైకోర్టు ప్రస్తుత పద్దెనిమిది, ఇరవై ఒకటి అనే విధానం రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ పద్నాలుగు, పదిహేను,ఇరవై ఒకటికి విరుద్ధంగా వున్నాయని చెప్పటంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ విషయాన్ని పరిశీలించడానికి ఓ టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.  అమ్మాయిల కనీస వివాహ వయస్సు పెంచడానికి, అమ్మాయిలు గర్భధారణ చేయడానికి అనుకూల వయసుపై పరిశీలన జరపాలని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్‌ ఫోర్స్‌కి చెప్పడం మళ్ళీ మనుధర్మ శాస్త్రాన్నే ప్రవచించినట్లు కాదా? అమ్మాయిలు కేవలం పిల్లల్ని కనడానికే వున్నట్లు, అమ్మాయిల పెళ్లి కూడ పిల్లల కనడానికే అన్నట్టు, పిల్లలని కనడం జీవితంలో ఓ భాగం కాకుండా అదే జీవితమన్నట్లుగా మళ్ళీ పురుషుడికే పట్టం కడుతున్న కేంద్ర ప్రభుత్వ ధోరణిని ప్రజాస్వామ్య వాదులందరూ ఖండించాలి.


అచ్యుత రావు
వ్యాసకర్త గౌరవ అధ్యక్షుడు,బాలల హక్కుల సంఘం
9391024242

మరిన్ని వార్తలు