అనాథల పట్ల ముందు జాగ్రత్త అవసరం

26 Mar, 2020 00:36 IST|Sakshi

సందర్భం

లాటిన్‌ భాషలో కరోనా అంటే కిరీటం అని అర్థం. ప్రపంచాన్ని ఇప్పుడు గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ మైక్రోస్కోప్‌లో చూస్తే కిరీటం ఆకారంలో కనిపిస్తుంది. కావున దానికి కరోనా అని నామకరణం చేశారు. ఇప్పుడు ఇది కిరీటధారియై  మహారాజు వలె ప్రపంచాన్ని ఏలుతున్నది. ధనిక, గొప్ప తేడా లేకుండా అందరినీ సంహరిస్తున్నది.

ప్రపంచ యుద్ధాలకంటే అధికంగా కరోనా భయోత్పాతం సృష్టిస్తున్నది. చైనాలోని వుహాన్లో పుట్టి, చంఘిస్‌ఖాన్‌కి పదింతలు ప్రపంచాన్ని వణికిస్తున్నది. కోవిడ్‌ 19 వ్యాధితో ఇటలీ, ఇరాన్,  స్పెయిన్, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్, బెల్జియం లాంటి ఎన్నో దేశాల్లో ఇప్పటికే వేలాది మంది చనిపోయారు. ఇంకా కొత్త కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఎప్పుడూ ప్రపంచానికి పెద్దన్నను నేనే, నా మాటే శాసనం, నా చేతలే అందరూ పాటించాలి అనే అమెరికా సైతం కరోనా ముందు మోకరిల్లక తప్పలేదు. 

విశ్వవ్యాప్తంగా విజృంభిస్తూ, పౌరుల ప్రాణాలను తీస్తూ, ప్రభుత్వాలను ఆర్థికంగా దెబ్బకొడుతూవున్న కరోనాను కట్టడి చేయలేమా? దీనికి తల పండిన వైద్య శిఖామణుల దగ్గర నుండి, అక్షర జ్ఞానం లేని సామాన్యులు సైతం చెబుతున్నది ఒకటే. ఒకరి నుండి ఇంకొకరికి సంక్రమించకుండా వుండాలంటే మనం బయటికి వెళ్లకుండా ఇంట్లోనే బందీ కావడం, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడం. ఈ సూచనలు ఇల్లు, ఉద్యోగం వున్న వారికి సరిపోతాయి. కానీ ఏ ఇల్లు, ఏ దిక్కూ దిశా లేని, రెక్కాడితే కాని డొక్కాడని పేద జనానికి ఈ సలహా మాత్రమే చాలదు. అందుకని ప్రభుత్వాలు వస్తు, ఆర్థిక సహాయం అందిస్తున్నాయి. ముందు ముందు ఎన్నో పనులు ఆగిపోయి సంస్థలే మూసివేయాల్సిన దుస్థితి. రాబోయే కాలంలో లఘు పరిశ్రమలూ, సంస్థలూ ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడి నిరుద్యోగుల సంఖ్య పెరగవచ్చు.

ఈ మహమ్మారితో పెద్దల పరిస్థితి ఇలా వుంటే పిల్లల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. వారికి ఏమి జరుగుతుందో తెలియదు. తమ పాఠశాలలు ఎందుకు మూతపడ్డాయో తెలియదు. చదువే కాదు, ఇంటి పక్కనే ఉన్న ఆటస్థలాల్లో కూడా ఆడుకోలేని పరిస్థితి. ఎనిమిది, పదేళ్ల వయసు నుండీ తెలిసీ తెలియని  పిల్లలకు  ఏమీ చెప్పకుండా తోటివారితో కలవవద్దని కట్టడి చేస్తే వారు మానసికంగా దెబ్బతినే ప్రమాదం వుంటుంది. పిల్లలు సున్నితమైన మనసు కలిగి వుంటారు కావున వారికి ఒకటికి రెండు సార్లు విడమర్చి చెప్పాలి. వారికి వారే స్వీయ నియంత్రణ పాటించేలా చేయాలి. అలాగే బయట ఆడటానికి వెళ్లే అవకాశం లేనందున, కేవలం వారిని టీవీలకు పరిమితం చేయకుండా, వారి మేధస్సును పెంచే చదరంగం లాంటి ఆటలు ఆడించటం, బొమ్మలు వేయడంలో అభిరుచి వుంటే ఆ మేరకు బొమ్మలు వేయిం చడం, కథలు, కవిత్వం రాసేలా ప్రోత్సహించడం ద్వారా వారిని సహితం మానవ సమాజం కరోనాపై చేస్తున్న పోరాటంలో భాగస్వాములను చేయవచ్చు. ఇదంతా తల్లిదండ్రులు వున్న పిల్లల పరిస్థితి. ఎవరూ లేని వారి కష్టాలు మరీ ఘోరం.

అనాథలుగా శిశుగృహాల్లో, అనాథ శరణాలయాల్లో, చట్టంతో విభేదించి బాలల, బాలికల గృహాల్లో మగ్గుతున్న పిల్లల క్షోభ  కడు దయనీయం. జైళ్లలో వుండే ఖైదీలను పెరోల్‌ పైన వదిలేస్తే తమవారి వద్దకి చేరే అవకాశమైనా వుంది. కానీ ఈ అనాథ చిన్నారులు ఎక్కడికని పోతారు? ఏది ఏమైనా వారు ఆ గృహా ల్లోనే వుండాలి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు, కొందరు దాతలు అనా«థాశ్రమాలను నడిపిస్తున్న వారి వద్ద వుండే పిల్లలకు ఏరోజుకు ఆరోజు ఆహారాన్ని అందిస్తూ ఉండేవారు. వారే కాదు, అప్పుడప్పుడు వచ్చి అనాథల మధ్య పుట్టిన రోజులు, పుణ్య దినాలు జరుపుకునే వారు సైతం రాలేని సందర్భం.

అన్నం పెట్టే దాతలు లేక పిల్లలు పస్తులుండే పరిస్థితులు రాకుండా వుండాలంటే చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ ద్వారా అన్ని అనాథ ఆశ్రమాలను, శిశు గృహాలను వెంటనే తనిఖీ చేయించాలి. కావాల్సిన ఆహారం, వసతి కల్పించాలి. అలాగే ఒక్కో గదిలో పదుల సంఖ్యలో ఉండకుండా విడివిడిగా వుండే ఏర్పాట్లు చేయాలి.  ఎవ్వరికీ పట్టని పిల్లల గురించి ప్రభుత్వాలు పట్టించుకోవాలి, యుద్ధ ప్రాతిపదికన వారి స్థితిగతులను సమీక్షించాలి. ఆ పిల్లలని వెంటనే ఆదుకోవాలి. ఈ మహమ్మారికి ముందు జాగ్రత్తనే మందు కాబట్టి, అనా«థ పిల్లలపట్ల కూడా ఆ ముందు జాగ్రత్త అనే మందును తప్పనిసరిగా ప్రయోగించాలి.

వ్యాసకర్త : అచ్యుతరావు
బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు
మొబైల్‌ : 93910 24242 

మరిన్ని వార్తలు