సంక్రాంతి శోభ..

15 Jan, 2020 00:41 IST|Sakshi

ఏ పండగైనా ఊరూరా, ఇంటింటా కళాకాంతులు తీసుకొస్తుంది. కానీ సంక్రాంతి ప్రత్యేకతే వేరు. ఎటుచూసినా ప్రకృతి పచ్చగా, హాయిగా, ఆహ్లాదంగా కన బడే కాలమిది. ఈ పండగ సమయానికల్లా పంటలు రైతు లోగిళ్లకు చేరతాయి. గ్రామ సీమలన్నీ పాడిపంటలతో తుల తూగుతాయి. పొలం పనులన్నీ పూర్తి కావ డంతో రైతులు, వ్యవసాయ కూలీలకు కాస్తంత తీరిక లభిస్తుంది. అందుకే అం దరూ తమ బంధుమిత్రులతో, ఇరు గుపొరుగుతో  పండగ సంబరాలను పంచు కుంటారు. ఈ శోభనంతటినీ తిలకిం చడానికి, తమ మూలాలను ప్రేమగా స్పృశించడానికి  చదువు కోసం, ఉద్యోగం కోసం నగరాలకు చేరినవారంతా సంక్రాంతి వచ్చేసరికి పల్లెటూళ్లకు తరలివెడతారు. వీధులన్నీ రకరకాల రంగవల్లికలతో కళ కళలాడటం సంక్రాంతినాడు కనబడే ప్రత్యే కత. రోజూ కళ్లాపి జల్లడం, ముగ్గు పెట్టడం ఏడాది పొడవునా పాటించే సంప్రదాయమే. కానీ సంక్రాంతి ముగ్గులు విలక్షణమైనవి. వాటికోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఎంతో సాధన చేసి, మెలకువలు నేర్చుకుని, ఊహలకు పదునుపెట్టి ఈ రంగవల్లికలను అల్లుతారు. చెప్పాలంటే ఇదొక చిత్రలిపి. వేకువజాములో నేల మీద పరుచుకునే రంగ వల్లికలు వాటిని అందంగా తీర్చిదిద్దే మగు వల అభివ్యక్తికి, అభిరుచికి అద్దం పడ తాయి. కళ్లాపి జల్లి, ముందుగా దానిపై చుక్కలు వేసి, వాటిని అలవోకగా కలుపుతూ ముగ్ధమనోహరమైన ఆకారాలను వారు సృజిస్తుంటే, ఆ కళను చూసి తరించాల్సిందే.

వారి వేలికొసల నుంచి ఒక పద్ధతి ప్రకారం నేలపై వాలే ముగ్గు పిండి కాసేపట్లోనే ఒక రూపం సంతరించుకుని అందరినీ మంత్ర ముగ్ధుల్ని చేస్తుంటుంది. ఇలా ఒకరోజు కాదు...ప్రతిరోజూ ప్రతి ముంగిటా రక రకాల వర్ణచిత్రాలు ఆవిష్కారమవుతుంటాయి. ఇతర పండగలన్నీ చాంద్రమానాన్ని అనుసరించి జరుపుకునేవికాగా, సంక్రాంతి సూర్యమానాన్ని అనుసరించి జరుపుకుంటాం. ఈ పండగతో మొదలుపెట్టి సూర్యుడి గమన దిశ మారుతుంది. అప్పటివరకూ దక్షిణ దిశగా ఉన్న సూర్యుడి రథగమనం, సంక్రాంతి మొదలుకొని ఉత్తర దిక్కువైపు మొదలవుతుందంటారు. అందుకే ఈ పండగతో మొదలై ఆరునెలలనూ ఉత్తరాయనం అంటారు. ఈ ఉత్తరాయనం మొదలయ్యే రోజును పుణ్యకాలంగా భావించి పితృదేవతలకు తృప్తి కలిగించేందుకు వారికి తర్పణాలు వదులుతారు.  సంక్రాంతిని తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు...తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలతోసహా దేశవ్యాప్తంగా వేరు వేరు పేర్లతో జరుపుకుంటారు. పొరుగునున్న నేపాల్‌లోనూ ఈ పండగ సందడి ఉంటుంది. పంజాబ్, హర్యానాల్లో దీన్ని లోహ్రి పండగ అని, ఉత్తరప్రదేశ్, బీహార్‌లలో ఖిచిడి అని, తమిళనాడులో పొంగల్‌గా, మహారాష్ట్రలో సంక్రాంత్‌గా ఈ పండగ వేడుకను జరుపుకుంటారు.
– అద్దంకి మహాలక్ష్మి
 

మరిన్ని వార్తలు