ఆదివాసీ బాంధవుడు బి.డి. శర్మ

7 Dec, 2017 01:42 IST|Sakshi
డాక్టర్‌ బ్రహ్మదేవ్‌ శర్మ అలియాస్‌ బీడీ శర్మ (ఫైల్‌ ఫొటో)

నివాళి

ఆదివాసీ హక్కుల కోసం నిరంతరం తపనపడ్డ బ్రహ్మదేవ్‌ శర్మ మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ పట్టణంలో 1930 సంవత్సరంలో జన్మించారు. గణితశాస్త్రంలో డాక్టరేట్‌ డిగ్రీ (పిహెచ్‌ డి) పొందారు. 1952–53 సంవత్సరంలోనె సివిల్‌ సర్వీసులో చేరారు. అయన ఉన్నత కుటుం బంలో జన్మించి కూడా హజ్రత్‌ నిజమోద్దిన్‌ రైల్వే స్టేషన్‌ దగ్గర ఒక మురికివాడలో నివసించారు. ఆయన ఉంటున్న చిన్న గది గది నిండా పుస్తకాలు తప్ప ఇక ఏ సౌకర్యాలూ లేవంటే నమ్మశాక్యం కాదు. తలుపులు తాళాలు లేని ఇల్లు ఎవరిదంటే ఆయనదే అని చెప్పవచ్చు.

ఒక జాతీయ ఎలక్రానిక్‌ చానెల్‌ మహిళా రిపోర్టర్‌ ఆయనను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన సందర్బంలో, బి.డి శర్మ జీవించే పద్ధతి చూసి చలించిపోయి ఏడవడం మొదలుపెట్టింది. ఈరోజుల్లో ఒక చిన్న పదవి ఉందంటే చాలు.. విలాసవంతమైన జీవితాలు గడిపే రోజులివి. మరి ఈయన అంత సంపన్నుడైనప్పటికీ కూడా ఇంతటి సాదాసీదా జీవితం గడుపుతున్నాడంటే ఎంతటి నిరాడంబరుడో, మాన్య మహనీయుడో అర్థమవుతున్నది.

భారత రాజ్యాంగాన్ని 26 నవంబర్‌ 1949 రాజ్యాంగ సభ ఆమోదించడంతో భారత ప్రజలకు స్వాతంత్రం, రాజ్యాంగ పరమైన హక్కులు లభించాయని అందరూ భావించారు. కానీ  ఆ రోజే ఈ దేశంలోని సమస్త ఆదివాసులు తమ స్వేచ్చను, తమ సహజమైన హక్కులను కోల్పోయారని కరాఖండిగా అన్ని వేదికల మీద గొంతెత్తిన పోరాటాయోదుడు బి.డి.శర్మ.  

దేశ వ్యాప్తంగా 5వ, 6వ షెడ్యుల్డ్‌ ప్రాంతాలలో నివసిస్తున్న ఆదివాసులకు ‘‘మా ఉళ్లో మా రాజ్యం’’ నినాదం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ అందించిన అమూల్యమైన, విలువైన కానుక. శక్తిమంతమైన రక్షక కవచాల లాంటి 1917, 1919, 1935 భారత ఆదివాసీ చట్టాలను అవగాహన పరిచి 170 చట్టం ,పిసా1996, ఎల్‌టిఆర్‌ 1959, ఎస్‌సి, ఎస్‌టి నిరోధకచట్టం 1998 ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ ప్లాన్, ఐటీడీఏల ఏర్పాటు ప్రక్రియలో ఒక రూపకర్తగా, ఒక ప్రముఖుడిగా శర్మ నిలిచిపోయారు. దీన్ని బట్టే ఆదివాసీలకు ఆయనకు ఉన్న సంబంధం ఏపాటిదో అర్థమౌతుంది.

చివరికి ఆదివాసీలఫై ప్రభుత్వం వైఖరికి నిరసనగా తన ఐఏఎస్‌ ఉద్యోగానికే రాజీనామా చేసిన గొప్ప త్యాగధనుడు. చివరి క్షణం వరకూ ఆదివాసీల ప్రయోజనాల కోసమే జీవించారు. ఆదివాసీ ప్రాంతాల్లో అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసాన్ని ఒక ఉన్నత అధికారిగా ఉంటూ వ్యతిరేకించిన ధైర్యశాలి. అలాంటి మహా నుభావుడిని ఆదివాసులు ఏ విధంగా మరచిపోగలరు?

‘‘జీవితం ఒక తరం పాటే ఉంటుంది /మంచి పేరు చిరకాలం ఉంటుంది’’ అన్నట్లుగా ఆదివాసీలు బి.డి. శర్మను చిరకాలం గుర్తుంచుకోగలుగుతారు. ఆదివాసీ హక్కులు, చట్టాలు ఏ రోజైతే పరిపూర్ణంగా అమలవుతాయో అదే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి!
(నేడు డా. బి.డి. శర్మ 2వ వర్ధంతి సందర్భంగా)

- పెనుక ప్రభాకర్, ఆదివాసీ రచయితల సంఘం, తెలంగాణ ‘ మొబైల్‌ 94942 83038

మరిన్ని వార్తలు