‘పోడు’ సమస్య ఇంకెన్నాళ్లు?

3 Jul, 2019 02:27 IST|Sakshi

కొమురం భీం అసిఫాబాద్‌ జిల్లాలో ఆదివారం అటవీ అధికారులపై స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కృష్ణ తన మనుషులతో సాగించిన దాడిలో ఎఫ్‌ఆర్‌ఓ అనిత తీవ్రంగా గాయపడటం పోడు భూముల సమస్యను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. కాగజ్‌నగర్‌ మండలం కొత్త సార్సాల శివారులోని 20 హెక్టార్ల భూమి విషయంలో కొంతకాలంగా స్థానిక రైతులకు, అటవీ అధికారులకు మధ్య వివాదం సాగుతోంది. తాము సాగుచేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ఆ భూములను ఖాళీచేయాలని అటవీశాఖ ఒత్తిడి చేస్తోంది. పోడుభూములంటే అటవీశాఖ స్వాధీనం చేసుకోదగిన భూములుగా, ప్రజలకు ఏ హక్కు లేని భూములుగా ప్రభుత్వం భావించాల్సిన అవసరం లేదు. వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్‌  జిల్లాలోని పోడు భూములపై ఆదివాసీలకు హక్కు లేకుండా అటవీహక్కుల చట్టం 2006 పేరుతో ఆదివాసీ గ్రామా లను ఖాళీ చేయిస్తున్నారు. భూములు హరితహారాలుగా మారుతాయేమో కాని పోడు చేసుకుంటున్న జీవితాలకు ఆధారం పోతుందని, వారికి తామే ప్రత్యామ్నాయం చూపెట్టవలసిన బాధ్యత ఉందని ప్రభుత్వం గుర్తించటం లేదు.

అటవీభూమిపై ఆదివాసీలకు హక్కు ఉంటుందని 1997లో సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేసింది. కానీ ఆదివాసీల భూములను పారిశ్రామికవేత్తలకు ఇవ్వాలనే ప్రభుత్వ విధానం వల్ల ఆదివాసీలు నిర్వాసితులవుతున్నారు. నెలరోజుల క్రితం ఇదే జిల్లాలో కొలాంగోంది గ్రామ ఆదివాసీలపై పోలీసుల అండదండలతో అటవీశాఖ సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారు. అప్పుడు ఎవరూ ఆదివాసీలను రక్షించడానికి రాలేదు. అదే సిబ్బందిపై సార్సాలలో దాడిచేస్తే దానికి నాయకత్వం వహించింది అధికారపక్ష ప్రజాప్రతినిధి కనుక పోలీసు సిబ్బంది, ఇతర అధికారులు ప్రేక్షకపాత్ర వహించారు. ప్రభుత్వాల ‘చట్టబద్ధ పాలన’లో అధికారుల పాత్ర ఎలా ఉందో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. ప్రజాప్రతినిధులు తమను దుర్భాషలాడినా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో అధికారులు ఉండిపోవడం ఇది మొదటి సారి కాదు. గతంలో టీఆర్‌ఎస్‌ నేతలు హరీష్‌రావు, దానం నాగేందర్‌లు కూడా ఇలాగే వ్యవహరించారు. స్థానిక ఎస్‌ఐ మొదలుకొని జిల్లా ఎస్‌పీ వరకూ అందరి బదిలీలనూ ప్రజాప్రతినిధులే నిర్దేశిస్తున్నారు. కనుకనే వారిని ప్రశ్నించడం, ఎదిరిం చడం అధికారులకు సాధ్యం కావడం లేదు. ఏం జరిగినా వారు నిస్సహాయంగా ఉండిపోతున్నారు. సార్సాల దాడిని ఈ నేపథ్యంలోనే చూడాలి.

సార్సాల ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ మొదలుకొని అందరూ స్పందించారు. ఖండించారు. కానీ కొలాంగోంది ఆదివాసీ గ్రామాన్ని టైగర్‌ ప్రాజెక్టు పేరుతో అటవీ శాఖ సిబ్బంది దగ్గరుండి ఖాళీ చేయించినప్పుడు ఎవరూ ఎందుకు ప్రశ్నించలేదు? ఒక ఆదివాసీ గ్రామాన్ని ధ్వంసం చేస్తుంటే వీరెవరికీ పట్టదా? ఆ గ్రామం 40 ఏళ్లనుంచి అక్కడ ఉంది. స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఈ గ్రామాన్ని కుట్రపూరితంగా టైగర్‌ ప్రాజెక్టులో విలీనం చేయించారు. తమ రేషన్‌ కార్డులతోసహా అన్ని పత్రాలూ ఆయన దగ్గరే పెట్టుకున్నారని ఆదివాసీలు ఆరోపిస్తున్నారు. కానీ ఎలాంటి పత్రాలూ లేవనే సాకుతో అటవీ శాఖ ఆ ఆదివాసీలను నిర్దాక్షిణ్యంగా బయటకు వెళ్లగొ ట్టింది. అంతేగాక ఆ సమస్య గురించి న్యాయస్థానా నికి తప్పుడు నివేదిక ఇచ్చింది. ఇది నేరం కాదా?  

ఈ జిల్లా పరిధిలోని పలు గ్రామాల్లో గిరిజనేతరుల ఆధిపత్యం అమలవుతోంది. అక్కడ 1/70 చట్టం ఉన్నా ఈ కబ్జాలు ఆగడం లేదు. గిరిజనులకు దక్కాల్సిన ఎన్నో సారవంతమైన భూములు గిరిజనేతరుల వద్ద ఉన్నాయి. తమ ఓటు బ్యాంకును కాపాడుకోవడం కోసం కోనేరు సోదరులు వీటిని ప్రోత్సహిస్తున్నారు. కొలాంగోంది గ్రామాన్ని ధ్వంసం చేయడంలోనైనా, మొన్న అటవీ సిబ్బందిపై దాడి వెనకైనా ఈ కబ్జాల బాగోతమే ఉంది. కొలాంగోంది గ్రామానికి తిరిగి వెళ్లాలని ఆదివాసీలు ప్రయత్నిస్తున్నా అటవీశాఖ అనేక ఆటంకాలు కల్పిస్తోంది. ఇప్పటికీ ఆ జిల్లాలోని పలు గ్రామాలపై అటవీ సిబ్బంది దాడులు చేస్తున్నారు. వీటన్నిటినీ ఆపాలని పౌరహక్కుల సంఘం కోరుతోంది. కొలాంగోంది గ్రామస్తులపై అటవీ సిబ్బంది జరిపిన దాడినైనా, అటవీ సిబ్బందిపై కోనేరు కృష్ణ నేతృత్వంలో సాగిన దాడినైనా పౌరహక్కుల సంఘం ఖండిస్తోంది. ఈ రెండు రకాల దాడుల వెనకా కబ్జాలే ఉన్నాయి. కబ్జారాయుళ్లను నిరోధించి ఆదివాసీ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. అదే సమయంలో అటు ఆదివాసీలపైన, ఇటు అటవీ సిబ్బందిపైన దాడులు జరగకుండా నియంత్రించవలసిన బాధ్యత కూడా ప్రభుత్వంపైనే ఉంది. పోడు భూములపై ఆదివాసీలకు హక్కులు కల్పించి, వారిపై అటవీ సిబ్బంది జులుం చేయకుండా తగిన ఆదేశాలివ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. 

 ఎన్‌. నారాయణరావు, ప్రధాన కార్యదర్శి, పౌర హక్కుల సంఘం, తెలంగాణ 
మొబైల్‌ : 98667 34867 

మరిన్ని వార్తలు