ద్రవ్యలోటు లోగుట్టు కీలకం!

2 Feb, 2020 00:28 IST|Sakshi

సందర్భం 

పెట్టుబడుల ఉపసంహరణ పట్ల అత్యాశ, పన్నేతర రాబడుల వృద్ధి, రక్షణరంగంతో సహా సబ్సిడీలపై గట్టి నియంత్రణ వంటి అంశాలపై స్వారీ చేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. ఆర్థికరంగ పటిషీ్టకరణ పథకాన్ని మళ్లీ పట్టాలమీదికి ఎక్కిస్తానంటూ శనివారం పార్లమెంటులో హామీ ఇచ్చారు. 2020–21 కేంద్ర బడ్జెట్‌ను సమర్పిస్తూ, స్థూల దేశీయోత్పత్తిలో ప్రస్తుత సంవత్సరం ద్రవ్యలోటు 3.8కి దిగజారిపోయిందని అంగీకరించారు. వచ్చే సంవత్సరానికి ద్రవ్యలోటును జీడీపీలో 3.5 శాతానికి తగ్గిస్తానని ఆర్థికమంత్రి హామీ ఇచ్చారు. అలాగే ద్రవ్యలోటును 3.3 శాతానికి తగ్గించడానికి సవరించిన ద్రవ్యపటిషీ్టకరణ పథకం అమలు చేస్తామని కూడా మంత్రి చెప్పారు. ద్రవ్యలోటు 2021–22లో 3.3 శాతానికి 2022–23లో 3.1కి పడిపోతుందని సెలవిచ్చారు.

అయితే ఇవి ద్రవ్యలోటుకు సంబంధించి పైకి కనిపించే లెక్కలు మాత్రమే కానీ ప్రభుత్వం చేస్తున్న అదనపు బడ్జెట్‌ రుణాల పూర్తి ప్రభావాన్ని ఇది బయటపెట్టడం లేదు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో మొత్తం అదనపు బడ్జెట్‌ రుణాలు (ప్రభుత్వం బాధ్యతపడే బాండ్ల జారీ ద్వారా కూడగట్టినవి, జాతీయ చిన్నమొత్తాల పొదుపుల నిధి నుంచి తీసుకున్న రుణాలకు కూడా ఆర్థిక మద్దతు లభించినవి) మొత్తం రూ. 1.73 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఈ తరహా రుణాలు 8 శాతం పెరిగి రూ. 1.86 లక్షల కోట్లకు చేరుకుంటాయని అంచనా. ఈ బడ్జెట్‌కు అవతల చేసే రుణాలు కేంద్రం మొత్తం రుణాల్లో కలిపేటట్లయితే, జీడీపీలో వాస్తవ ద్రవ్య లోటు 2019–20లో 4.5 శాతానికి, 2020–21లో 4.36 శాతానికి చేరుతుంది.

 ఆర్థికమంత్రి ఇలాంటి అద్భుతాన్ని సాధిస్తానని ఎలా సూచించారు అనేది ప్రశ్న. అయితే మొదటగా, 2019–20లో ద్రవ్యలోటును 3.3 శాతంకి తగ్గిస్తామని వాగ్దానం చేసిన ఆర్థిక మంత్రి కేవలం 0.5 శాతం తేడాతో దాన్ని 3.8 శాతానికి ఎలా నిర్వహించారు? ఈ క్రమంలో నికర పన్ను రాబడిలో రూ. 1.45 లక్షల కోట్లు తగ్గిందనీ, పెట్టుబడుల ఉపసంహరణ అంచనాలు దాదాపు రూ. 40 వేల కోట్లమేరకు తగ్గిపోయాయన్న విషయాన్ని ఆమె అంగీకరించాల్సి వచ్చింది. దీంతో బడ్జెట్‌ ముందస్తు అంచనాలో ఆమె ప్రతిపాదించిన మొత్తంలో రూ. 1.85 లక్షల కోట్ల రాబడి తగ్గిపోయింది. అదేక్రమంలో ఆర్థిక మంత్రి ప్రభుత్వ వ్యయాన్ని రూ. 88,000 కోట్ల మేరకు కుదించేశారు. దీంట్లో నాలుగింట ఒకవంతు ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకాన్ని కుదించడం ద్వారా వచ్చిందేనని గుర్తుంచుకోవాలి. అలాగే ఆర్బీఐ నుంచి అదనపు మూలధనం బదిలీ కూడా ప్రభుత్వానికి కాస్త దోహదపడింది. ప్రభుత్వానికి డివిడెండ్‌ రూపంలో రూ. 36,000 కోట్లు వచ్చింది. దీంతో మొత్తం ప్రభుత్వ వ్యయంలో తగ్గుదల రూ. 61,000కు పరిమితం అయింది.

బడ్జెట్‌ లోటుకు సంబంధించి 2020–21 సంవత్సరంలో అతిపెద్ద అద్భుతం చోటు చేసుకుందనే చెప్పాలి. తాజా బడ్జెట్‌లో రూ. 1,20,000 కోట్ల మేరకు పెట్టుబడుల ఉపసంహరణను ప్రతిపాదించారు. అయితే గత సంవత్సరం బడ్జెట్‌లో అంచనా వేసుకున్న రూ.1,05,000 కోట్లనే ప్రభుత్వం సేకరించలేకపోయింది. తాజా బడ్జెట్‌లో రూ. 1,20,000 కోట్ల విలువైన పెట్టుబడుల ఉపసంహరణ చేపడుతున్నట్లు మంత్రి ప్రకటించడం అత్యాశే కావచ్చు. ప్రభుత్వ రంగంలోని భారీ సంస్థలలో ప్రైవేటీకరణను పూర్తి చేయడంలో వైఫల్యం కారణంగానే పెట్టుబడుల ఉపసంహరణలో అంచనాలు తప్పాయి.

దీనికి మించి ప్రభుత్వరంగ బ్యాంకులు, ద్రవ్య సంస్థలలో కేంద్రప్రభుత్వానికి ఉన్న ఈక్విటీ మొత్తంలో అదనంగా రూ. 90,000 కోట్ల పెట్టుబడులను ఉపసంహరిస్తానంటూ ప్రభుత్వం మరొక అత్యాశతో కూడిన ప్రకటన చేసింది. ఇక వ్యయం విషయానికి వస్తే 2020–21 బడ్జెట్‌లో ఆహారం, ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తులపై వ్యయాన్ని భారీగా అంటే రూ. 2.28 ట్రిలియన్ల మేరకు తగ్గించనున్నట్లు ఆర్థికమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత సంవత్సరంలో ఈ విభాగాలకింద రూ. 2.27 లక్షల కోట్ల మేరకు సబ్సిడీలను అందిస్తున్నారు. అయితే ఈ సబ్సిడీలను ఎలా ఎంతమేరకు కుదిస్తారన్నది బడ్జెట్‌ స్పష్టం చేయలేదు. ఎరువులపై సబ్సిడీలు నిజానికి తగ్గుముఖం పట్టాయి. సబ్సిడీల హేతుబద్ధీకరణ పథకం ఏదైనా ఉంటే వచ్చే సంవత్సరం దాన్ని అమలు పర్చవచ్చు.


రక్షణరంగ వ్యయంలో రెండు శాతం పెంచడంద్వారా రక్షణ బడ్జెట్‌ రూ.3.23 లక్షల కోట్లకు చేరుతుంది. ఇది ద్రవ్యలోటును అడ్డుకోవడంలో తోడ్పడుతుంది కానీ పెరుగుతున్న దేశ రక్షణ అవసరాలను ఇది తీర్చలేదు. చాలా సంవత్సరాలుగా రక్షణ రంగ వ్యయాన్ని అతి తక్కువగా మాత్రమే పెంచుతూ వస్తున్నారు. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కింద దేశంలోని ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ. 6,000 కోట్లు ఇస్తున్నారు. 2019–20లో ఈ పథకంలో భాగంగా రూ. 57,370 కోట్లు వెచ్చించగా ఈ సంవత్సరం దీన్ని రూ. 75,000లకు పెంచుతున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటించారు.
 (‘ది వైర్‌’ సౌజన్యంతో)

                 
ఎ.కె. భట్టాచార్య
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు

     

 


 

మరిన్ని వార్తలు