సంధ్యపై ఆరోపణలు సత్యదూరం

24 Apr, 2018 00:47 IST|Sakshi

సినిమా అంటే వినోదం, విజ్ఞానం అనే మాటకు ఎప్పుడో కాలం చెల్లింది. ఇప్పుడంతా కాసుల కోసం వేట మాత్రమే  ఇక్కడ నడుస్తోంది. ఈ రంగంలోకి రావాలనుకునే అతివలకు, ట్రాన్స్‌జెండర్‌లకు  గౌరవం, భద్రత, ఆదాయం, ఆరోగ్యం, హక్కులు ఎక్కడుంటాయి? అదే కదా శ్రీరెడ్డి అడిగింది. అదే కదా మిగతా ఆర్టిస్టులు కడుపుచించుకుని, కన్నీళ్లపర్యంతమవుతూ చెప్పింది. తమని కళాకారులుగా గుర్తించండి. తమకి కూడా వెండితెర మీద కనిపించే అవకాశాలివ్వండి. తమ కడుపులు కొట్టకండి. తమ శరీరాలను పశువాంఛలకు బలిచేయకండి. ఇదే కదా వారు అడిగింది. శ్రీరెడ్డి ప్రశ్న అనేక ముసుగుల్ని చించేసింది. ఒక మౌనాన్ని బద్దలు చేసింది. 

తెలుగు సినీ పరిశ్రమలో కొనసాగుతున్న ‘క్యాస్టింగ్‌ కౌచ్‌’ గురించి, ఇటీవల జరిగిన సంఘటనలపై చర్చల నేపథ్యంలో బాధిత మహిళలకు అండగా అనేక మహిళా సంఘాలు ముందుకొచ్చి నిలబడ్డాయి. వారి కన్నీటి ఘోష విన్నాయి. క్యాస్టింగ్‌ కౌచ్‌పై చర్చలు ఇంత తీవ్రమయ్యాకే, సమస్య తీవ్రత అర్థమయ్యాకే తెలుగు సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల నిరో«ధక కమిటీ (కాష్‌ కమిటీ)ని ఏర్పాటు చేయాలనే నిర్ణయం జరిగింది. ఇది ఆహ్వానించదగిన పరిణామమే. అయితే, అదే సమయంలో ఈ కమిటీకి ఛైర్‌పర్సన్‌గా జీవిత రాజశేఖర్‌ పేరు వినిపించింది. ఈ అంశంపై ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ కన్వీనర్‌ సంధ్య అభ్యంతరం వ్యక్తం చేసారు. అసలు సినిమారంగంలో క్యాస్టింగ్‌ కౌచ్‌ లేదని. కాష్‌ కమిటీ అవసరమే లేదన్న వ్యక్తిని చైర్‌పర్సన్‌గా ఎలా నియమిస్తారనే  ప్రశ్నని సంధ్య లేవనెత్తారు. 

ఇదే విషయంపై  ప్రెస్‌మీట్‌ పట్టిన జీవితా రాజశేఖర్, ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ నాయకురాలు సంధ్య మీద తీవ్రమైన పదజాలంతో పాటు, వ్యక్తిగతమైన అంశాలను కించపరిచేవిధంగా మాట్లాడటమే కాకుండా, విలేకరులు కనిపించినపుడల్లా సంధ్య మీద దూషణలకు దిగటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. సంధ్యపై జీవిత చేస్తున్న అసత్య ఆరోపణలను నిర్ద్వం దంగా ఖండిస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోని ప్రముఖ మహిళా ఉద్యమ నాయకురాళ్లలో సంధ్య పేరు ముందు వరుసలో ఉంటుంది.

ఇదే తెలుగు సినిమా రంగంలో, పెద్దమనుషులుగా చెప్పుకుంటున్న అనేక మంది తమ ఆడపిల్లలకి సమస్యలెదురైతే వచ్చి సలహా తీసుకునేది  కూడా సంధ్యని ఇతర మహిళా సంఘాల నేతలనే. నిజానికి ఈ రోజు ‘క్యాస్టింగ్‌ కౌచ్‌’ గురించి గొంతెత్తిన వారు కూడా తమ సమస్యల పరిష్కారానికి మహిళా సంఘాల దగ్గరికే వచ్చారు  కానీ, పరిశ్రమలో ఎప్పటినుంచో వున్న జీవిత దగ్గరకు ఎందుకు వెళ్ళలేదు? ఈ విషయాన్ని జీవిత ఇకనైనా అర్థం చేసుకుని తన ధోరణి మార్చుకోవాలి. 

పీవోడబ్ల్యూ సంధ్య మీద జీవితా రాజశేఖర్‌ చేసిన దుర్మార్గమైన ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజా ఉద్యమాలలో ముందుండి నాయకత్వం వహిస్తున్న సంధ్యకు మేమంతా ఏకగ్రీవంగా మద్దతు తెలియచేస్తున్నాం. సంధ్యపై చేసిన ఫిర్యాదులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాం. 
(పీవోడబ్ల్యూ నేత సంధ్యపై సినీ నటి జీవితా రాజశేఖర్‌ చేసిన ఆరోపణలను ఖండిస్తూ వందమంది మహిళా మేధావులు, రచయిత్రులు, కళాకారులు, కార్యకర్తలు పంపిన పత్రికా ప్రకటన ముఖ్యాంశాలు)

మరిన్ని వార్తలు