అమ్మ ఒడి దేశంలోనే సరికొత్త ఒరవడి

16 Feb, 2020 04:21 IST|Sakshi

సందర్భం

అమ్మ ఒడి అనగానే భద్రత, బాధ్యతల మేలు కలయిక అనిపించకమానదు. చిన్నారులు అమ్మవొడిలో ఉన్నప్పుడు పొందే భద్రత మరెక్కడా దొరకదు. అలాగే అమ్మలు ఆ బిడ్డను అత్యంత భద్రతగా ఉంచే స్థానం అమ్మవొడి ఈ అమ్మఒడి కేవలం అమ్మల వద్దనే తప్ప బిడ్డకు మరెక్కడా ఉండదని, దొరకదని కూడా అందరికీ తెలుసు. ఇలా రాష్ట్రంలోని ప్రతి బిడ్డకూ అమ్మఒడి లాంటి స్థానం కల్పించాలని ఏ ప్రభుత్వమైనా భావిస్తే ఇక ఆ రాష్ట్రంలోని పిల్లలకు ఇంతకన్నా మరో భాగ్యం ఉండదు. ఆంధ్రప్రదేశ్‌లో సరిగ్గా ఇదే జరిగింది. ఆంధ్రరాష్ట్రంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇతర ప్రభుత్వాల లాగా పిల్లలను ఓటర్లు కాదు కదా అని పక్కన పెట్టలేదు. పైగా, పిల్లలే భవి ష్యత్తు.. వారు అన్ని రకాలుగా అభివృద్ధి చెందితే చాలు రానున్న రోజుల్లో వందశాతం అక్షరాస్యతతోపాటు పెరిగి పెద్దదైన బిడ్డకు ఉపాధి గురించి ఎవరి కాళ్లావేళ్లా పడకుండా ప్రపంచంలో ఎక్కడైనా బతికేయగలరనే ఆశాభావంతో ఈ అమ్మవొడి పథకాన్ని తీసుకువచ్చారు. కేవలం తల్లులకు ప్రతి సంవత్సరం పది హేను వేలు ఇచ్చేసి మీరు మీ పిల్లలకు ఖర్చుపెడతారో లేక వృధా చేస్తారో అని వదిలేసే ప్రభుత్వ పథకాల్లో కాకుండా నేరుగా పిల్లలున్న తల్లికే డబ్బు చేరేలా ఏపీలో వైఎస్‌ ప్రభుత్వం జాగ్రత్త వహిం చింది.  ఆ తల్లులు సహితం డబ్బు వృథా చేయకుండా బాధ్యతగా పిల్లలను బడికి పంపించి చది వించేలా రూపొందిన ఈ పథకం కేవలం తల్లులకు డబ్బులు పంచి పెట్టే కార్యక్రమం అనుకుంటే అక్షరాల తప్పే.

అమ్మఒడి లబ్ధిదారులు వారి బిడ్డల చదువుకోసం ఇంగ్లిష్‌ మీడియం కావాలని ప్రైవేటు పాఠశాలల కోసం పక్కదారి పట్టకుండా ప్రభుత్వమే ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి దఫా ఒకటి నుంచి ఆరవతరగతి  వరకు ఆంగ్ల మాధ్యమంతో పాఠశాలలు నడపుతోంది.  ఆ పాఠశాలలకు వచ్చే బడుగు, బలహీన వర్గాల పిల్లలు సరైన పోషకాహారం లేక బలహీనంగా ఉండకూడదనే నిశ్చయంతో గోరుముద్ద ద్వారా సమతుల పౌష్టికాహారం అంది స్తోంది. అది కూడా కేవలం రోజూ పెట్టిన కూరలే పెట్టకుండా వారానికి సరిపడ భోజన మెనూ తయారు చేసి రుచీ, పౌష్టికాహారం రెండూ ఉండేలా తమ బిడ్డలకు కొసరి, కొసరి అమ్మ ఎలా తిననిస్తుందో అలానే రోజువారీ భోజన పట్టిక తయారు చేసి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేయాలనే ఆలోచనకు ఇంతకు మించిన దాఖలా మరొకటి ఉండదు.  అలాగే అమ్మకు డబ్బులివ్వడం, భోజనం పెడితే సరిపోతుందా అని ప్రశ్నించే వారికి అవకాశం ఇవ్వకుండా విద్యార్థినీ, విద్యార్థులందరికీ దుస్తులూ, పుస్తకాలు ఎప్పుడు అందుతాయని ఎదురు చూడకుండా, దుస్తులు, పుస్తకాలతోబాటు పిల్లలు చెప్పులు లేకుండా నడవరాదని ఏపీ ప్రభుత్వం సంకల్పంచింది. పక్కింటి బాబు దొరబాబులా బూట్లు వేసుకుని ప్రైవేటు పాఠశాలకు వెళుతుంటే పేద పిల్లలు బిక్కమొహం వేసుకుని చూడకుండా తామూ వారి లాగానే తయారయి బడికి వెళుతున్నామని గర్వంగా ఫీలయ్యేలా పిల్లలకు బూట్ల జతలు సహితం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 
అయితే కొందరు రానున్న తరాలు సైతం జగన్‌ ప్రభుత్వాన్ని మరిచిపోవేమో అని భయపడుతున్నారో లేదా పేదపిల్లలూ పెద్దింటివారి పిల్లలు సమానమంటే మనసు ఒప్పుకోవడం లేదేమో.. అదీ కాక ఇంతకాలం తాము పెంచి పోషిస్తున్న తిరిగి తమను పోషిస్తున్న కార్పొరేటర్‌ విద్యా సంస్థలకు ప్రభుత్వ బడులలో ఇంగ్లిష్‌ చెబితే ఆ కార్పొరేట్‌ బడులకు కాలం చెల్లిపోతుందేమో అన్న వేదన పీడిస్తుందేమో గానీ తెలుగు భాషపై ఎనలేని మమకారం తెచ్చిపెట్టుకుని తెలుగు భాష తెల్లారిపోతుందని నానాయాగీ చేస్తున్నారు. కానీ గురివిందచందమైన వారి విధానం వారు కొమ్ముకాసే కార్పొరేట్‌ విద్యాసంస్థలు ఏనాడైనా తెలుగు వెలగబెట్టాయో, ఆ పాఠశాలల్లో తెలుగు పంతుళ్లైనా ఉన్నారా? అన్న సంగతి మరిచి ఎలాగైనా పేదింటి బిడ్డలు ఈ అమ్మఒడి నుంచి జారిపడాలని నక్కల్లా కాచుకు కూర్చున్నారు.
ఇంగ్లిష్‌ వద్ద నివారించి, వారించాలనుకుం టున్న పెద్ద మనుషులు దేవుడా రేపటి నుంచి నా ఇంటి ముందు కాపలాదారుడి బిడ్డ, నా బిడ్డా ఒకలా చదివితే, ఆ బడికి ఆ పేరింటి బిడ్డ సహితం సూటూ బూటూ వేసుకుని తమ బిడ్డలా వెళితే మొహం ఎక్కడ పెట్టుకోవాలన్న వారి మానసికస్థితి, వారు పెంచి పోషించిన కార్పొరేట్‌ విద్యాసంస్థలు నిలువునా కూలిపోనున్నాయనే ఆవేదన కలగలిపి తెలుగు భాషను భుజాన వేసుకుని వీరావేశంతో చర్చలు చేస్తున్నారు. కానీ నిజాయితీగా ఒక్కసారి ఆలోచిస్తే ఈ ఆంధ్రదేశం అమ్మఒడి దేశంలోనే సరికొత్త ఒరవడి అని చెప్పక తప్పదు. అన్ని రాష్ట్రాల్లో ఈ విధానాన్ని అమలు చేసేలా మాట్లాడుదామనే ధ్యాస లేకుండా పోయింది. కానీ, ఎవరేమి చెప్పినా, ఎవరెంత చెప్పినా ఈ అమ్మఒడి భారతదేశంలోనే సరికొత్త వరవడి అని అనక తప్పదు

అచ్యుతరావు 
వ్యాసకర్త గౌరవ అధ్యక్షులు, బాలల హక్కుల సంఘం
‘ మొబైల్‌ : 93910 24242 

మరిన్ని వార్తలు